బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Jan 24, 2020 , 02:01:29

నిఘా నీడన ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నిఘా నీడన ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
  • -ప్రైవేట్‌ కళాశాలల అక్రమాలకు చెక్‌
  • -అన్ని కళాశాలల్లో ఫ్లయింగ్‌ స్కాడ్‌ తనిఖీలు
  • -ఫిబ్రవరి నుంచి పరీక్షలు షురూ
  • -ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నాపత్రం
  • -ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • -సీసీ కెమెరాలు ఉన్నకళాశాలలకు పరీక్షా కేంద్రాలుగా అనుమతి


నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: ఇంటర్‌ విద్యా విధానంలో ప్రభుత్వం పలు సంస్కరణకు శ్రీకారం చుట్టింది. విద్యాప్రమాణాలు పెంచే దిశగా పలు చర్య లు తీసుకుంటున్నది. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో అక్రమాల కు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సీసీ కెమెరాల నిఘా నీడల ప్రాక్టికల్స్‌ కొనసాగుతాయి. గతంలో  ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాకున్నా అధ్యాపకులు మార్కులు వేస్తారన్న దీమా విద్యార్థుల్లో ఉండేది.ఇక అలాంటి పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పెట్టింది. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నాయి. గతేడాది సీసీ కెమెరాలు లేని కళాశాలలకు ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాలను తొలగించారు.

ప్రైవేటు కళాశాలల అక్రమాలకు అడ్డుకట్ట..

 రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విధానంలో పలు సంస్కరణలు తీసుకురావడంతో ప్రైవేటు కళాశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. జిల్లాలోని చాలా కళాశాలల్లో సరైన ల్యాబ్‌లు లేవు. ల్యాబ్‌లు ఉన్నా వాటిలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. దీంతో చాలా ప్రైవేటు కళాశాలల్లో ల్యాబ్‌లలో ప్రయోగాలు చేసిన దాఖలాలు కన్పించడం లేదు. కేవలం విద్యార్థులతో రికార్డులను రాయించి ప్రాక్టికల్స్‌కు మంగళం పాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షకు హాజరుకాక పోయినా విద్యార్థులకు అత్యధికంగా మార్కులు వేసిన సంఘటనలూ ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలకు మాత్రమే ప్రాక్టికల్‌ సెంటర్లను మంజూరు చేసింది. ప్రాక్టికల్స్‌ పకడ్బందీగా నిర్వహించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి

వచ్చే నెలలో జరుగనున్న ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు మధ్యామిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, కళాశాలలకు సెంటర్లను మంజూరు చేసి పరీక్ష నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఇప్పటికే జిల్లా ఎగ్జామినేషన్‌ కమిటీ సభ్యులను నియమించారు. ప్లయింగ్‌ స్కాడ్‌ బృందం అన్ని పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేలా చర్యలు చేపడుతున్నారు.

ఆన్‌లైన్‌లోనే పరీక్షా పత్రం

ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన పరీక్షా పత్రాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే అందిస్తారు. గతంలో అందించిన మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌ ద్వారానే ప్రశ్నాపత్రం అందిస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ సహాయంతో కళాశాల ప్రిన్సిపాళ్ళు ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్ష ముగియగానే ప్రాక్టికల్‌ పరీక్షల జవాబులను మూల్యాంకనం చేసి విద్యార్థులకు వచ్చిన మార్కులను అదే రోజు బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు.

ఏర్పాట్లు చేస్తున్నాం..

ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను కేటాయించాం. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగే ఆస్కారం ఉండదు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తాం. ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ ద్వారా అందజేసే  ప్రశ్నా పత్రంతో పరీక్షలను నిర్వహిస్తాం.       -అలెగ్జాండర్‌, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అఫీసర్‌logo