గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 23, 2020 , 03:11:08

నాగోబాకు సిరికొండ కుండలు

నాగోబాకు సిరికొండ  కుండలు

రేపే నాగోబాకు మహాపూజ
ఇంద్రవెల్లి : నదీజలంతో జనవరి 20న రాత్రి కెస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు మర్రిచెట్ల ప్రాంతంలో కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మర్రిచెట్ల ప్రాంతంలో సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులను తీర్చుకుంటున్నారు. బుధవారం ఉదయం మెస్రం వంశీయుల పెద్దలు, మహిళలు, పురుషులు వేర్వేరుగా కచేరి నిర్వహించి, నాగోబా పూజలపై చర్చించారు. సిరికొండలో తయారు చేసిన మట్టి కుండలను తీసుకురావడానికి మర్రిచెట్ల వద్ద నుంచి బయలుదేరి వెళ్లారు.

తీసుకవచ్చిన మట్టి కుండలను నాగోబా ఆలయం వెనుకభాగంలో భద్రంగా ఉంచారు. మర్రిచెట్ల ప్రాంతంలోని నీటి కోనేరుతో పాటు గంగాజలం ఝరి భద్రపర్చిన ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సంప్రదాయ వాయిద్యాలు, కిక్రి వాయిస్తూ నాగోబా చరిత్రపై తుకోడోజీ మెస్రం వంశీయులకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. నాగోబా చరిత్రతోపాటు మెస్రం వంశీయుల్లోని 22 కితల గురించి క్లుప్తంగా వివరించారు. నాగోబాకు 24న నిర్వహించే మహాపూజలతోపాటు పెద్దల పేరిట అర్ధరాత్రి నిర్వహించే తుమ్ చర్చించారు.  మెస్రం వంశీయుల్లోని కితల వారీగా మహిళలు సామూహిక వంటలు చేస్తూ, నైవేద్యాలను వండుతున్నారు. సహప్తంకి భోజనాలు చేస్తున్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు


సిరికొండ : మండల కేంద్రంలోని గుగ్గిల్ల వంశీయులు  తయారు  చేసిన కుండలను  సిరికొండ నుంచి  నాగోబా జాతర కోసం  మెస్రం వంశీయులు  బుధవారం  ప్రత్యేక వాహనంలో కెస్లాపూర్ తరలించారు.  ఈసందర్భంగా మెస్రం వెంకట్ మాట్లాడారు ... ప్రతి సంవత్సరం సిరికొండ నుంచి కెస్లాపూర్ జాతర పండుగ కు ఇక్కడి కుండలను తీసుకువెళ్తామని అన్నారు. గుగ్గిల్ల వంశీయులు చేసిన కుండలను మాత్రమే పూజలకు వినియోగిస్తామని అన్నారు. గుగ్గిల్ల వంశీయులను  అతిథులుగా చూస్తామని అన్నారు. కుండలు తయారు చేసిన వారికి నాగోబా ఆలయంలో ఘనంగా సన్మానించి, జాతర అనంతరం కొంత నగదు అందిస్తామని తెలిపారు.  గుగ్గిల్ల స్వామి, రాజేశ్వర్, మెస్రం వంశీయులు ఉన్నారు.

దర్బార్ సీసీ నిర్మాణం పూర్తి

ఇంద్రవెల్లి : మండలంలోని కెస్లాపూర్ నాగోబా జాతరను పురస్కరించుకొని వివిధ రకాల దుకాణాలతోపాటు హోటళ్లు వెలిశాయి. నాగోబా జాతరలో ఇప్పటికే భక్తుల సందడి కనిపిస్తుంది. నాగోబా జాతరలో తైబజార్ ఏర్పాటుకు టెండర్ యజమాని ప్లాటింగ్ ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు స్థలాలు కేటాయిస్తున్నారు. దర్బార్ భాగంలో సీసీ నిర్మాణ పనులను అధికారులు పూర్తి చేశారు. దర్బార్ గోడలపై పెయింటింగ్ చేస్తున్న ఛాయాచిత్రాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎస్సై గంగారామ్, ఈవో మహేశ్, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.logo