ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Jan 22, 2020 , 04:36:33

మున్సిపోలింగ్ నేడే!

 మున్సిపోలింగ్ నేడే!నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలుండగా.. వీటికి బుధవారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో 80వార్డులు ఉండగా.. వీటిలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్ రెండు వార్డులను టీఆర్ ఏకగ్రీవంగా దక్కించుకోగా.. భైంసాలో మూడు వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. జిల్లాలో 75వార్డులకే ఎన్నికలు నిర్వహిస్తుండగా.. మొత్తం 296 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భైంసాలో 26వార్డులకుగాను మూడు వార్డులు ఏకగ్రీవం కాగా.. 23 వార్డుల్లో 88 మంది, నిర్మల్ 42వార్డులకుగాను రెండు వార్డులు ఏకగ్రీవం కాగా.. 40వార్డులకు 148మంది, ఖానాపూర్ 12వార్డులకు 60 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

ఓటర్ల వివరాలు..

మూడు మున్సిపాలిటీల పరిధిలో 1,47,052 మంది ఓటర్లుండగా.. ఇందులో 72,163మంది పురుషులు, 74,879 మంది మహిళలు, 10మంది ఇతరులు ఓటర్లున్నారు. నిర్మల్ 89,590మంది ఓటర్లు, భైంసాలో 41,728మంది ఓటర్లు, ఖానాపూర్ 15,734మంది ఓటర్లున్నారు. జిల్లాలో 217పోలింగ్ కేంద్రాలను 88 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నిర్మల్ 127పోలింగ్ కేంద్రాలను 52 ప్రాంతాల్లో, భైంసాలో 66కేంద్రాలను 25 ప్రాం తాల్లో, ఖానాపూర్ 24కేంద్రాలను 11ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం అవసరమైన బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పత్రాలు మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు పంపించారు.

సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు

ఎన్నికల సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించారు. నిర్మల్ మున్సిపాలిటీకి 168 మంది పీఓలు, 168మంది ఏపీఓలు, 503మంది ఓపీఓలు, భైంసా మున్సిపాలిటీకి 85మంది పీఓలు, 85మంది ఏపీఓలు, 254మంది ఓపీఓలు, ఖానాపూర్ మున్సిపాలిటీకి 31మంది పీఓలు, 31ఏపీఓ లు, 94మంది ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బందిని నియమించగా.. ఇందులో ఒక మహిళ సిబ్బంది కూడా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఐదుగురుతో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించారు.

జిల్లాలో ఓటింగ్ పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా పోలింగ్ పెంచేందుకుగాను అవగాహనతో పాటు మైకుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో పోలింగ్ ఎక్కువగా నమోదు కావడం లేదు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలో 70శాతం మించి నమోదు కాలేదు. నిర్మల్ మున్సిపాలిటీలో 68.42శాతం, భైంసా మున్సిపాలిటీలో 63.54 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 80 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం అవసరమైన అవగాహన, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్డుల్లో నడవలేని వారి కోసం వీల్ ర్యాంప్ ఏర్పాటు చేశారు. వీరికి ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వార్డుల్లో ఆటోలను పెట్టి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. పోలింగ్ కేంద్రాల్లోనూ  ఓటర్ల కోసం అవసరమైన కనీస వసతులు కల్పిస్తున్నారు. నీరు, నీడ కోసం టెంట్, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపట్టారు.logo