శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 20, 2020 , 23:52:30

ముగిసిన ప్రచార పర్వం

 ముగిసిన ప్రచార పర్వం
  • -విస్తృతంగా పర్యటించిన వివిధ పార్టీల నాయకులు
  • -పుర ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు
  • -మూడు మున్సిపాలిటీల్లో రేపే పోలింగ్‌
నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో మరో ప్రధాన ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో ఎంతో కీలకమైన ప్రచారపర్వం సోమవారం సాయంత్రం 5 గంటలతో పూర్తయింది. గత వారం, పది రోజులుగా నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీలో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవగా.. ప్రచారంలో మరింత వేగం పెంచారు. జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీలు ఉండగా.. వీటిలో రేపు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 48గంటల ముందే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు బహిరంగ ప్రచారాన్ని ముగించాల్సి ఉండగా.. సోమవారం సాయంత్రం 5గంటలతో ప్రచారం ముగించారు. జిల్లాలో ప్రచారం జోరుగా సాగగా.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.రేఖనాయక్‌, జి.విఠల్‌రెడ్డి పాల్గొన్నారు. వారం, పది రోజులుగా మారుమోగిన మైకులు ఇక మూగబోయాయి. బహిరంగ ప్రచారానికి గడువు మూయగా.. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వం మొదలైంది.

పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో పోలింగ్‌ నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 80వార్డులుండగా.. వీటిలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్‌లో రెండు వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా దక్కించుకోగా.. భైంసాలో మూడు వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. జిల్లాలో 75వార్డులకే ఎన్నికలు నిర్వహిస్తుండగా.. నిర్మల్‌లో 42వార్డులకుగాను 40వార్డుల్లో, భైంసాలో 26వార్డులకుగాను 23వార్డుల్లో మాత్రమే పోలింగ్‌ ఉంది. ఖానాపూర్‌లో 12వార్డులకుగాను.. పూర్తిగా పోలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో 1,47,052మంది ఓటర్లుండగా.. ఇందులో 72,163మంది పురుషులు, 74,879 మంది మహిళలు, 10మంది ఇతరులు ఓటర్లున్నారు. నిర్మల్‌లో 89,590మంది ఓటర్లు, భైంసాలో 41,728మంది ఓటర్లు, ఖానాపూర్‌లో 15,734మంది ఓటర్లున్నారు. ఇందుకోసం 217పోలింగ్‌ కేంద్రాలను 88ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నిర్మల్‌లో 127పోలింగ్‌ కేంద్రాలను 52ప్రాంతాల్లో, భైంసాలో 66కేంద్రాలను 25ప్రాంతాల్లో, ఖానాపూర్‌లో 24కేంద్రాలను 11ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సామగ్రి, సిబ్బందిని మంగళవారం సాయంత్రం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు పంపించనున్నారు.

పోలీసుల తనిఖీలు

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత నిర్మల్‌ జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశాలున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. లాడ్జీలు, ఫంక్షన్‌హాళ్లలో ఉండకుండా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలను పారదర్శకంగా,ల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 85సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 33ప్రాంతాల్లో ఉండగా.. నిర్మల్‌లో 77కేంద్రాలు 29ప్రాంతాల్లో, ఖానాపూర్‌లో 8కేంద్రాలు 4ప్రాంతాల్లో ఉన్నాయి. 132సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 55ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నిర్మల్‌లో 50కేంద్రాలు 23చోట్ల ఉండగా.. ఖానాపూర్‌లో 16కేంద్రాలు ఏడు చోట్ల, భైంసాలో 66పోలింగ్‌ కేంద్రాలు 25చోట్ల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో 8ఎస్‌ఎస్‌టీలు, ఆరు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు, నాలుగు ఎంసీసీలను ఏర్పాటు చేశారు. 111 మందిని బైండోవర్‌ చేయగా.. 16లైసెన్స్‌డ్‌ ఆయుధాలను తిరిగి డిపాజిట్‌ చేయించారు. 


logo