గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 20, 2020 , 03:03:19

బలం లేని కమలం

బలం లేని కమలం
  • - కొన్ని స్థానాలకే పరిమితమైన బీజేపీ
  • - 80వార్డులకుగాను..48 స్థానాల్లోనే పోటీ
  • - భైంసాలో ఆరుగురు సిట్టింగ్‌లకు మొండిచేయి
  • -నిర్మల్‌, ఖానాపూర్‌లో కనీసం బోణీ చేసేనా..?
  • - భైంసాలో పాత స్థానాలను కాపాడుకునేనా..!నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం దక్కించుకున్నప్పటికీ.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశించిన మేర పోటీని ప్రదర్శించలేకపోతున్నది. జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడం లేదు. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపకపోగా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నరేంద్రమోది ఛరిష్మాతో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేర బలోపేతం కాకపోగా.. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం మినహా అన్ని వరుస ఎన్నికల్లోనూ ఏమాత్రం ప్రదర్శన కనబరచలేదు. తాజాగా నిర్వహిస్తున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగైనట్లు లేదు. అసలు పోటీ చేయడంలోనే వెనుకబడింది. జిల్లాలో నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మూడు మున్సిపాలిటీలుండగా.. మొత్తం 80వార్డులు ఉన్నాయి. వీటిలో ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా.. 75చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 80వార్డులకుగాను బీజేపీ అభ్యర్థులు 48 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు. ఐదింటా రెండొంతుల స్థానాల్లో అసలు పోటీయే చేయడం లేదు. దీంతో ఆ పార్టీ పరిస్థితి ఏమిటనేది తెలుస్తున్నది. భైంసాలో 26వార్డులకుగాను 13వార్డుల్లోనే పోటీ చేస్తోంది. సగం వార్డుల్లో అసలు పోటీయే చేయడం లేదు. నిర్మల్‌లో 42వార్డులకుగాను 25 వార్డుల్లోనే పోటీ చేస్తోంది. ఇక్కడ ఐదింటా రెండొంతుల వార్డుల్లో అసలు అభ్యర్థులు బరిలోనే లేరు. ఖానాపూర్‌లో మాత్రం 12వార్డులకుగాను పది వార్డుల్లో పోటీ చేస్తుండగా.. రెండు వార్డుల్లో పోటీ చేయడం లేదు.

పోటీకి అభ్యర్థులు కరువు

జిల్లాలో బీజేపీ ఒక లోక్‌సభ స్థానం మినహా మిగతా అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కకపోగా.. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పనితీరు పెద్దగా మెరుగుపడ్డట్లు లేదు. పోటీ చేసేందుకే అభ్యర్థులు లేకపోగా.. ఏ మేరకు గెలుస్తారనేది వేచి చూడాలి. నిర్మల్‌లో గత మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి ఒక కౌన్సిలర్‌ లేకపోగా.. ఈసారి బోణీ చేస్తుందో లేదో చూడాలి. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీలో బోణీ చేస్తుందో లేదో వేచి చూడాలి. భైంసాలో గత ఎన్నికల్లో ఆరుగురు కౌన్సిలర్లు గెలువగా.. ఈసారి ఆరుగురు సిట్టింగ్‌ల్లో ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వలేదు. పూర్తిగా కొత్త వారికి టికెట్లు ఇవ్వగా.. వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరు ప్రచారానికి కూడా దూరంగా ఉండడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. భైంసాలో పాత స్థానాలను నిలుపుకుంటుందా లేదో చూడాలి. జిల్లాలో సంస్థాగతంగా బలోపేతం లేకపోగా.. సరైన ఎజెండా కూడా లేకుండా ఈ ఎన్నికల్లోనూ ముందుకెళ్తున్నది. అన్ని వార్డుల్లో బలమైన క్యాడర్‌, నాయకులు లేకపోవడంతో ఆ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. క్యాడర్‌ను సమన్వయం చేసే నాయకత్వం కూడా లేకపోవడం సమస్యగా మారింది. ప్రచారంలో కూడా జోష్‌ కన్పించకపోగా.. ఏదో మొక్కుబడిగా ముందుకెళ్తున్నది.logo