ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Jan 20, 2020 , 03:02:17

ఖానాపూర్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఖానాపూర్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • - ప్రతీ వార్డులో రూ. కోటితో ప్రగతి
  • - ట్యాంక్‌ బండ్‌గా బొడ్డోనుకుంట
  • - మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిఖానాపూర్‌: నూతనంగా ఏర్పాటైన ఖానాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మంత్రికి అన్ని వార్డుల్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖానాపూర్‌ కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇది వరకే రూ. 20 కోట్లు మంజూరుచేశారన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే సెంట్రల్‌ లైటింగ్‌, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త వార్డుల అభివృద్ధి కోసం ఒక్కో వార్డుకు రూ. కోటి మంజూరీ చేయిస్తామన్నారు. ప్రతీ వార్డుకు వంద డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కూడా మంజూరు చేయిస్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని హామీలను నెరవేర్చే ప్రభుత్వమన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ఖానాపూర్‌, కడెం మండలాల రైతులకు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పొన్‌కల్‌ వద్ద పెద్ద బ్యారేజీ నిర్మిస్తున్నామని, అది పూర్తి అయితే ఇక సాగు, తాగు నీటికి ఢోకా ఉండబోదన్నారు.
శాంతినగర్‌ శివారులో ఉన్న బొడ్డోనికుంటను తప్పకుండా అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌ను ఏర్పాటుచేస్తామన్నారు.

కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలోని వృద్ధులకు, బీడీకార్మికులకు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రతి నెలా వెలాది రూపాయల ఆసరా పింఛన్‌లు ఇస్తున్న ఘనత దేశంలో ఒక్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ప్రజల మేలు కోరే టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఖానాపూర్‌ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే రేఖానాయక్‌ తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. మంత్రి వెంట కడెం ఎంపీపీ అలెగ్జాండర్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు రఫీక్‌ అహ్మద్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాంకిషన్‌రెడ్డి, శ్యాంసుందర్‌, సక్కారాం శ్రీనివాస్‌, రాథోడ్‌ రామూనాయక్‌, అఫీస్‌అలీ, పుప్పాల గజేందర్‌, గొర్రె గంగాధర్‌, అశోక్‌రావు, కౌన్సిలర్‌ అభ్యర్థులు జన్నారపు శంకర్‌, సల్ల చంద్రహాస్‌, పరిమి సురేశ్‌, లోకిని జూని కుమార్‌, అబ్దుల్‌ ఖలీల్‌, బండి ప్రకాశ్‌, ఎనగందుల నారాయణ, అంకం రాజేందర్‌, కావలి సంతోష్‌, షోయబ్‌, బక్కశెట్టి కిషోర్‌, మంత్రరాజం సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఇన్‌చార్జి ప్రచారం

ఖానాపూర్‌లోని ఇంద్రానగర్‌ కాలనీలో ఖానాపూర్‌ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి డీడీసీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి ప్రచారం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే రేఖానాయక్‌, మాజీ ఎంపీ గొడాం నగేశ్‌  కూడా  ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, అప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుందని భూమారెడ్డి అన్నారు.logo