బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 19, 2020 , 01:41:33

మున్సి‘పోల్స్‌'కు సర్వం సిద్ధం..!

మున్సి‘పోల్స్‌'కు సర్వం సిద్ధం..!


నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పుర ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీలు ఉండగా.. వీటిలో ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 48గంటల ముందే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు బహిరంగ ప్రచారాన్ని ముగించాల్సి ఉండగా.. సోమవారం సాయంత్రం (రేపు) 5గంటలతో ప్రచారానికి గడువు విధించారు. రేపు సాయంత్రం 5గంటల తర్వాత ప్రచారం ముగుస్తుండగా.. వారం రోజులుగా విస్తృతంగా సాగిన ప్రచారానికి తెర పడనుంది. వారం, పది రోజులుగా మారుమోగిన వాహనాలు, మైకులు ఇక మూగబోనున్నాయి. ఈ నెల 22న నిర్వహించే పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 80వార్డులు ఉండగా.. వీటిలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్‌లో రెండు వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా దక్కించుకోగా.. భైంసాలో మూడు వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. దీంతో జిల్లాలో 75వార్డులకే ఎన్నికలు నిర్వహిస్తుండగా.. నిర్మల్‌లో 42వార్డులకుగాను 40వార్డుల్లో, భైంసాలో 26వార్డులకుగాను 23వార్డుల్లో మాత్రమే పోలింగ్‌ ఉంటుంది. ఖానాపూర్‌లో 12వార్డులకుగాను.. పూర్తిగా పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సాధారణ పరిశీలకులతో పాటు అకౌంటింగ్‌ కోసం మరో పరిశీలకులను కూడా నియమించారు.

సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 1,47,052 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 72,163మంది పురుషులు, 74,879మంది మహిళలు, 10మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. నిర్మల్‌లో 89,590మంది ఓటర్లు, భైంసాలో 41,728మంది ఓటర్లు, ఖానాపూర్‌లో 15,734 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 217పోలింగ్‌ కేంద్రాలను 88ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నిర్మల్‌లో 127పోలింగ్‌ కేంద్రాలను 52ప్రాంతాల్లో, భైంసాలో 66కేంద్రాలను 25ప్రాంతాల్లో, ఖానాపూర్‌లో 24కేంద్రాలను 11ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 85సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 33ప్రాంతాల్లో ఉండగా.. నిర్మల్‌లో 77కేంద్రాలు 29ప్రాంతాల్లో, ఖానాపూర్‌లో 8కేంద్రాలు 4ప్రాంతాల్లో ఉన్నాయి. 132సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 55ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నిర్మల్‌లో 50కేంద్రాలు 23చోట్ల ఉండగా.. ఖానాపూర్‌లో 16కేంద్రాలు ఏడు చోట్ల, భైంసాలో 66పోలింగ్‌ కేంద్రాలు 25చోట్ల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో 8ఎస్‌ఎస్‌టీలు ఏర్పాటు చేయగా.. నిర్మల్‌, భైంసాలో మూడు చొప్పున, ఖానాపూర్‌లో 2చొప్పున ఏర్పాటు చేశారు. ఆరు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు ఏర్పాటు చేయగా.. నిర్మల్‌లో మూడు, భైంసాలో రెండు, ఖానాపూర్‌లో ఒకటి చొప్పున పెట్టారు. నాలుగు ఎంసీసీలను ఏర్పాటు చేయగా.. నిర్మల్‌లో రెండు, భైంసా, ఖానాపూర్‌లో ఒక్కోటి ఏర్పాటు చేశారు.

బందోబస్తుకు కేంద్ర బలగాలు

మున్సిపల్‌ ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటంతో పాటు.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూట్‌ మోబైల్‌ వాహనాలను ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బులు, వస్తు రూపంలో ఓటర్లకు పంపిణీ చేయకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. జిల్లాలో 10 ్రైస్టెకింగ్‌ ఫోర్సులను ఏర్పాటు చేయగా.. నిర్మల్‌లో మూడు, ఖానాపూర్‌లో ఒకటి, భైంసాలో ఆరు చొప్పున పెట్టారు. జిల్లాలో నాలుగు ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేయగా.. నిర్మల్‌, ఖానాపూర్‌లో ఒక్కోటి, భైంసాలో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. పుర ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా.. అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక, కేంద్ర బలగాలను రప్పించారు. జిల్లాలో లైసెన్సు పొందిన ఆయుధాలు కలిగిన 16మంది నుంచి తిరిగి డిపాజిట్‌ చేయించారు. నిర్మల్‌లో 9, భైంసాలో 6, ఖానాపూర్‌లో ఒక ఆయుధాన్ని డిపాజిట్‌ చేసుకున్నారు. జిల్లాలో 35కేసుల్లో ఉన్న 111 మందిని బైండోవర్‌ చేశారు. నిర్మల్‌ పట్టణంలో 8కేసుల్లో 34మంది, భైంసా పట్టణంలో 14కేసుల్లో 61మంది, ఖానాపూర్‌ పట్టణంలో 13కేసుల్లో 16మందిని బైండోవర్‌ చేశారు. జిల్లాలో 55ప్రాంతాల్లోని 132సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. భైంసాలో అన్ని పోలింగ్‌ కేంద్రాలు, ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా పేర్కొంటున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సూక్ష్మ పరిశీలకులతో పాటు.. వెబ్‌ కాస్టింగ్‌ కూడా చేస్తున్నారు.logo
>>>>>>