మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 18, 2020 , 00:35:57

కాంగ్రెస్‌ కకావికలం

కాంగ్రెస్‌ కకావికలం
  • -మూడు మున్సిపాలిటీల్లో మొదలైన ముచ్చెమటలు
  • -ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన ముఖ్య నాయకులు
  • -తమ దారి తాము చూసుకుంటున్న గణేశ్‌ అనుచరులు
  • -భైంసా, నిర్మల్‌లో పుర పోరులో పోటీకి వెనుకడుగు
  • -ఖానాపూర్‌లో పలు వార్డుల్లో తప్పని రెబల్స్‌ గొడవ

మున్సిపల్‌ ఎన్నికల రేసులో కాంగ్రెస్‌ వెనుకడుగు వేస్తున్నది. పురపోరులో హస్తం పార్టీకి కష్టకాలం మొదలైంది. వరుస పరాజయాలతో తీవ్ర నిరాశ, నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్‌కు.. మూడు మున్సిపాలిటీల్లో తాజాగా ముచ్చెమటలు పడుతున్నాయి. పుర ఎన్నికలకు ముందే ముఖ్య నాయకులంతా ‘చేతు’లెత్తేశారు. నిర్మల్‌లో మున్సిపల్‌ మాజీ  చైర్మన్‌ అప్పాల గణేశ్‌ అనుచరులంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. చాలా మంది సొంత గూటికి చేరుకుంటుండగా.. అప్పాల ఏకాకిగా మారిపోతున్నారు. భైంసా, నిర్మల్‌లో పూర్తిస్థాయిలో పోటీకి దిగకపోగా.. ఖానాపూర్‌లో పలు వార్డుల్లో రెబల్స్‌ ముప్పు పొంచి ఉంది. మొత్తానికి  కాంగ్రెస్‌లో బల్దియా ఎన్నికలు  కలకలం సృష్టించాయి.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం పార్టీ వెనుకడుగు వేస్తోంది. పురపోరులో ఆ పార్టీలో అయోమయం నెలకొంది. వరుస ఎన్నికల్లో పరాజయం, కీలక నాయకులంతా ఎవరి దారి వారు చూసుకోవడం.. సమన్వయం చేసి ముందుకు నడిపే నాయకత్వం కొరవడడం, టీఆర్‌ఎస్‌ దూకుడు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో దూసుకెళ్లడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టకాలం మొదలైంది. రోజురోజుకు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి జిల్లాలో దిగజారిపోతున్నది.గత ఏడాది కాలంగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. వరుస పరాజయాలు పార్టీని మరింత కిందికి పడేసింది. పార్టీలోని నాయకులంతా ఎవరి దారి వారు చూసుకోగా.. క్యాడర్‌ కూడా కకలావికలమైంది. పార్టీ శ్రేణులను, నాయకులను సమన్వయం చేసే సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడడం లేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుగా వెళ్లడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లడంతో.. కాంగ్రెస్‌ అందుకోలేకపోతున్నది. మున్సిపల్‌, జిల్లా, రాష్ట్ర నాయకత్వం సరైన దిశా నిర్దేశం చేసే పరిస్థితి లేకపోవడంతో.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో మూడుచోట్ల ముచ్చెమటలు పట్టుకున్నాయి.
 

ఎవరిదారి వారిదే!

నిర్మల్‌ మున్సిపాలిటీలో 42వార్డులుండగా.. కాంగ్రెస్‌ పార్టీ 38వార్డుల్లోనే పోటీ చేస్తోంది. ఇప్పటికే రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసిన ఈ ఇద్దరు కూడా తమ నామపత్రాలను వెనక్కి తీసుకున్నారు. పదో వార్డులో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు జుట్టు దినేశ్‌ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకొని టీఆర్‌ఎస్‌లో చేరారు. 33వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన శివభూపతి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని గులాబీ పార్టీలో చేరారు. 1, 34 వార్డులో అసలు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే వారే లేకుండాపోయారు. దీంతో కాంగ్రెస్‌ 38 వార్డులకే పరిమితమైంది. మిగతా వార్డుల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే పోటీలో ఉండగా.. ముఖ్య నాయకులంతా పోటీకి దూరంగా ఉన్నారు. భైంసాలో 26వార్డులుండగా.. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 19 వార్డుల్లోనే పోటీ చేస్తోంది. మిగతా ఏడు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరూ కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఖానాపూర్‌లో 12వార్డులకు గాను నాలుగైదు చోట్ల కాంగ్రెస్‌కు రెబల్స్‌ ముప్పు పొంచి ఉంది.  చైర్మన్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆకుల శ్రీనివాస్‌ పోటీ చేసే పదో వార్డులో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా తొంటి శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు.
అసలే ములిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తయారైంది కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి.

వరుస ఎన్నికల్లో పరాభవం, క్యాడర్‌ను సమన్వయం చేసే నాయకత్వం లేకపోవడం, ముఖ్య నాయకులంతా ఎవరి దారి వారు చూసుకోవడంతో.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు మరింత ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన నాయకులతో పాటు పాత నాయకులు కూడా పార్టీని వీడుతున్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అప్పాల గణేశ్‌, కౌన్సిలర్ల రాకతో పార్టీ బలోపేతమైందని భావించగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. తాజాగా అప్పాల గణేశ్‌ అనుచరులంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పటికే గణేశ్‌ ముఖ్య అనుచరులు, మాజీ కౌన్సిలర్లు ఎలుగు సుధాకర్‌, పతికె శ్రీనివాస్‌, నూతుల భూపతిరెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరగా.. సాదం స్వప్న- అరవింద్‌, తోట లత-నర్సయ్య బీజేపీలో చేరారు. తాజాగా అప్పాల గణేశ్‌ సమీప బంధువు, ముఖ్య అనుచరుడుగా ఉన్న అప్పాల వంశీ మంత్రి అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనుచరులంతా కాంగ్రెస్‌ను వీడుతుండడంతో అప్పాల గణేశ్‌ ఏకాకిగా మారుతున్నాడు. మున్సిపల్‌ ఎన్నికల వేళ పట్టణంపై పట్టు కోల్పోతుండగా.. భవిష్యత్‌ రాజకీయంపై అయోమయం నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన నాయకులు టీపీసీసీ కార్యదర్శి రామలింగం, మాజీ కౌన్సిలర్లు లక్కకుల నరహరి, అడ్ప పోశెట్టి, అంజద్‌ఖాన్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో కోలుకోలేని షాక్‌లు తగిలినట్లయింది. మున్సిపల్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగలడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. logo
>>>>>>