శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 16, 2020 , 23:56:03

పాతాళగంగ పైపైకి..

పాతాళగంగ పైపైకి..


నిర్మల్ టౌన్: ఈ ఏడు వర్షాకాలంలో కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా అంతకుముందు ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాల నీటి మట్టం 2.25 మీటర్ల పెరిగినట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్ జిల్లాలో సరాసరి భూగర్భ జలాల నీటి మట్టం 9.26 ఉండగా గత డిసెంబర్ 31 (2019)న 7.01 మీటర్లకు  పెరిగింది. దీంతో ఈఏడాది వేసవి కాలంలో  నీటి ఇబ్బందులు ఉండకపోవచ్చని  అధికారులు  పేర్కొంటున్నారు. భూగర్భ  జలాలు  పెరగడానికి  ప్రధాన కారణం జిల్లాలో ఈ  ఏడాది  విస్తారంగా  వర్షాలు కురవడం,  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటిన  మిషన్  కాకతీయలో  చెరువుల  పునరుద్ధరణ, చెక్ డ్యాంలు, గ్రామాల్లో  ఇంకుడు గుంతల నిర్మాణం, హరితహారంలో మొక్కల పెంపకం వంటి పనులు అని  భావిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా పెరుగుదల

గత జూన్ మొదలుకొని అక్టోబర్ చివరి వారం వరకు పుష్కలంగా వర్షాలు  కురవడంతో జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, కడెం, స్వర్ణవాగు, పల్సి రంగరావుకర్ వాగు, సీరాల ప్రాజెక్టు, సదర్మాట్ పాటు నీటి పారుదల శాఖ కింద  నిర్మించిన 800 చెరువులు నిండుకుండల్లా మారాయి. వాగులపై నిర్మించిన చెక్ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కుంటల నిర్మాణం కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. దిలావార్ కడెం, ఖానాపూర్, కుభీర్, కుంటాల, లక్ష్మణచాంద, మామడ, లోకేశ్వరం, ముథోల్, నర్సాపూర్ జి , నిర్మల్, పెంబి, బీరవెల్లి, స్వర్ణా, తానూర్ మండలంలోని బోసిలో ఫిజియోమీటర్లను ఏర్పాటు చేసి  భూగర్భ జలాలను లెక్కిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఫిజియోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన్నట్లు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తానూర్ మండలంలో 21.30 మీటర్లు పెరుగగా , లోకేశ్వరంలో 6.40మీటర్లు పెరిగాయి. దీంతో జిల్లా అధికారులు భూగర్భ జలాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. వాల్టా చట్టం అమలుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణపై ఫిబ్రవరి నుంచి మే చివరి వరకు ప్రజల్లో చైతన్యం చేసేందుకు కళారూపాలు , కరపత్రాల ద్వారా ప్రచారం  చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలోని లక్ష్మణచాంద, కుంటాల, ముథోల్  మాత్రమే భూగర్భజలాలు తగ్గగా, మిగతా ప్రాంతంలో గణనీయంగా పెరిగాయి.

భూగర్భ జలాలు సంరక్షించుకోవాలి

భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి. జిల్లాలో గత ఏడాదికన్నా డిసెంబర్ సీజన్ భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో సగటున 2.25 మీటర్ల వృద్ధి రేటు ఉంది. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి నీటి పొదుపు పాటించేలా చర్యలు తీసుకుంటాం.
  -శ్రీనివాస్ జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్


logo