శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Jan 16, 2020 , 23:53:09

అమ్మవారి దర్శనానికి అడవిబిడ్డలు..

అమ్మవారి దర్శనానికి అడవిబిడ్డలు..కెరమెరి: జంగుబాయి దర్శనానికి ఆదివాసులు తరలివెళ్తున్నారు. అత్యంత విశ్వాసంగా కొలిచే జంగుబాయి దేవతకు భక్తులు జనహారతి పడుతున్నారు. తమ ఆరాధ్యదేవతను దర్శించుకునేందుకూ గుర్రాలు, ఎడ్లబండ్లతో పాటు పూజసామగ్రి నెత్తిన ఎత్తుకొని కాలినడకన భక్తులు పయనమయ్యారు. అమావాస్య సమీపిస్తుండడంతో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నది. అడవిదారిన కొండలు, గుట్టలు ఎక్కుతూ సంప్రదాయరీతిలో తరలివెళ్తున్నారు. ఒకవైపు తెలంగాణ, మరోవైపు మహారాష్ట్రకు చెందిన ఆదివాసులు అమ్మవారికీ మొక్కులు చెల్లించుకునేందుకు వస్తుండడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. సిర్పూర్(యు) మండలం శెట్టిహడప్నూర్ నుంచి దేవుని దర్శనం కోసం సుదూరప్రాంతం నుంచి వస్తున్నా ఏ మాత్రం అలసట చెందకుండా ఉల్లాసంగా ఉత్సాహంతో పిల్లపాపలతో రావడం గమనార్హం. పూజా సామగ్రి గల గంపను నెత్తిన ఎత్తుకొని, దేవతలను భుజాన మోసుకొని కాలినడకతో పయనమయ్యారు.

డోలు, తుడుం, సన్నాయి, కాలికోం సంగీతపర్వంలో అటవీప్రాంతం మార్మోగింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం.. వాయిద్యాల చప్పుళ్ల మధ్య దారులన్ని అమ్మవారు కొలువైన సహ్యాద్రి పర్వతంవైపే కనిపించింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆదివాసులు టొప్లకస, బుర్స్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో దేవుని ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడే తయారు చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పించిన అనంతరం మైసమ్మ, రావుడ్క్ పోచమ్మతల్లి వద్ద మేకలు, కోళ్లు బలిచ్చి వంటలు వండుకొని సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాత్రి అక్కడే బసచేసి సంప్రదాయ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. మరుసటి రోజు అక్కడి నుంచి ఇంటికి తిరుగు ప్రయాణం చేశారు.   


logo