సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Jan 14, 2020 , 00:23:30

బరిలో నిలిచేదెవరో!

 బరిలో నిలిచేదెవరో!


నిర్మల్/నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరొక కీలక ఘట్టానికి నేటితో తెర పడనుంది. పురపోరులో బరిలో ఉండేదెవరో.. పోటీ నుంచి తప్పుకునేదెవరో నేటితో తేలిపోనున్నది. బల్దియా ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులకు ఉపసంహరణ గడువు నేటి మధ్యాహ్నంతో ముగియనున్నది. దీంతో తుది పోరులో ఎవరూ తలపడనున్నారనేది నేడు స్పష్టత రానున్నది. నిర్మల్ మున్సిపాలిటీలో ఓ వార్డులో ఏకగ్రీవం కాగా టీఆర్ బోణి చేసింది. నిర్మల్ మున్సిపల్ టీఆర్ చైర్మన్ అభ్యర్థి గండ్రత్ ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు 3గంటల తర్వాత ఈ ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి ఈ నెల 22న పోలింగ్ నిర్వహిస్తుండగా ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పర్వంలో నేడు మరో కీలక ఘట్టానికి తెర పడనున్నది. మూడు మున్సిపాలిటీల్లోని వివిధ వార్డులకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణ కోసం నేడు (మంగళవారం) మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఇచ్చారు.

జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల్లోని 80 వార్డులకు 544 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఇప్పటికే 97 నామినేషన్లు తగ్గిపోయాయి. కొందరి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా మరికొందరు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలన తర్వాత ఒక్క సెట్టు మాత్రమే ఉంచి మిగతావి ఉపసంహరించుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి నేడు మధ్యాహ్నం 3గంటల వరకు తుది గడువు ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల్లోని 80 వార్డులకు 447 నామినేషన్లు వెళ్లాయి. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 207, భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 160 నామినేషన్లు, ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 80 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి నేడు తుది గడువు కాగా మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనున్నది.

మధ్యాహ్నం 3గంటల తర్వాత తుది బరిలో ఉండేదెవరో.. పోటీ నుంచి తప్పుకునేదెవరో తేలిపోనున్నది. ఇప్పటికే జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో, మూడు వార్డుల్లో ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ అందరూ నామినేషన్లు వెనక్కి తీసుకోగా.. ఒక్కోక్కరు మాత్రమే మిగలడంతో ఏకగ్రీవం అయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీలో టీఆర్ బోణి చేసింది. నిర్మల్ మున్సిపల్ టీఆర్ చైర్మన్ అభ్యర్థి గండ్రత్ ఈశ్వర్ 33వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా మిగతా వారంతా తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో ఆయన ఒక్కరే పోటీలో మిగిలారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాగా అధికారికంగా నేడు మధ్యాహ్నం 3గంటల తర్వాత ప్రకటించనున్నారు. 33వ వార్డుకు మొత్తం 6 నామినేషన్లు దాఖలు కాగా గండ్రత్ ఈశ్వర్ రెండు సెట్లు, శివభూపతి కాంగ్రెస్ నుంచి ఒకటి, స్వతంత్రంగా ఒకటి, అయ్యన్నగారి మధు బీజేపీ నుంచి, అన్వేష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. నలుగురు అభ్యర్థులు ఆరు నామినేషన్లు వేయగా వీటిలో ఈశ్వర్ మినహా మిగతా వారంతా తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో పోటీ లేకుండా పోయింది. దీంతో ఈశ్వర్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఇప్పటికే భైంసాలో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 17, 20 వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా దక్కిం చుకున్నది. జిల్లాలోని బైంసా, నిర్మల్, ఖానాపూర్ మున్సి పాలిటీల్లో, మరికొన్ని వార్డుల్లో ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తుండగా నేటి మధ్యాహ్నం 3గంటల వరకు స్పష్టత రానున్నది. తుది పోరులో ఉండేదెవరో.. తప్పుకునేదెవరో నేటి మధ్యాహ్నం తర్వాత తేలిపోనున్నది.logo