శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 14, 2020 , 00:19:07

భైంసాలో కర్ఫ్యూ

భైంసాలో కర్ఫ్యూ


భైంసా,నమస్తే తెలంగాణ/భైంసా రూరల్: ఆదివారం రాత్రి కొర్వగల్లీలో చిలికి చిలికి గాలి వానగా మారిన ఇరువర్గాల ఘర్షణలో రెండో రోజు సోమవారం సద్దుమణిగింది. ఒక వర్గానికి చెందిన 14 గృహాలు ధ్వంసం కాగా,  ఒక ఇల్లు, 24 వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పట్టణానికి చేరుకోవడంతో తెల్లవారుజామున పరిస్థితులు అదుపులోకి వచ్చా యి. పట్టణంలోని కిసాన్ గల్లీ, కొర్వ గల్లీ, బోయిగల్లీ, కతిగాం ఏరియాల్లో రాళ్లు, కర్రలతో దాడులు జరిగాయి. పోలీసులు ఒకే ప్రాంతంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే లోపే మరో ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి. ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్ కుమార్, రామగుండం సీపీ సత్యనారాయణ, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, ఆదిలాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల ఎస్పీలు భైంసాలోనే మకాం వేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను బందోబస్తు కోసం భైంసాకు రప్పించారు. ఎస్పీలు శశిధర్ విష్ణు వారియర్, శ్వేతారెడ్డి తదితర పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. వదంతులు వ్యాపిస్తుండ డంతో పట్టణంలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. ప్రధాన కూడళ్లలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు.

శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అన్ని చర్యలు: ఎస్పీ శశిధర్

ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి ఈ సంఘటనలకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భైంసా పట్టణంలో  ఈ నెల 15వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఘర్షణ కారకులపై చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ ప్రశాంతి

భైంసా పట్టణంలో జరిగిన ఘర్షణ కారకులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. సోమవారం ఘర్షణ జరిగిన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, అనంతరం మాట్లాడుతూ బాధితులకు ఆత్మవిశ్వాసం కల్పించారు. ఘర్షణలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జేసీ భాస్కర్ ఎస్పీ శశిధర్ ఉన్నారు.


logo