మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 13, 2020 , 00:41:04

బల్దియాల్లో కాసుల గలగల

బల్దియాల్లో కాసుల గలగల


నిర్మల్‌ టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తప్పనిసరిగా పోటీ చేసే అభ్యర్థులు పన్ను చెల్లించాలని నిబంధన ఉండడంతో మున్సిపల్‌ పన్నుల వసూలు భారీగా వసూలయ్యాయి. జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీలుండగా.. ఇప్పటివరకు రూ. 28లక్షల పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు. పన్నుల వసూళ్ల కోసం ప్రతి సంవత్సరం మార్చి నెలలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండగా.. ఈసారి జనవరిలోనే ఎన్నికలు రావడంతో బకాయిలు భారీగా వసూలయ్యాయి. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారికి ప్రతిపాదనలు చేసే అభ్యర్థులు కూడా మున్సిపాలిటీలో ఎలాంటి బకాయిలు లేన్నట్లు ధ్రువీకరణపత్రం ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల పుణ్యామని భారీగా పన్నులు వసూలయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీలో గతంలో 36వార్డులుండగా.. ప్రస్తుతం 42వార్డులకు పెరిగాయి. ఆయా వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువగా పోటీలో నిలబడేందుకు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు.నామినేషన్‌ వేసే అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీలో ఎలాంటి పన్నులు పెండింగ్‌లో ఉన్న పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొనడంతో భారీగా పన్నులను తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించారు. ఇందులో ఇంటి పన్నుతో పాటు కుళాయి పన్ను, ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 7న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. 10 వరకు నామినేషన్లను స్వీకరించారు. 42 వార్డుల్లోని ఒక్కో వార్డు నుంచి అన్ని పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 8 నుంచి 10 మంది పోటీ చేస్తున్నారు.

పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారికి ఆ వార్డులో ఉన్న ఓటరు ప్రతిపాదన తప్పనిసరి. ప్రతిపాదించే ఓటరు కూడా పన్ను చెల్లిస్తేనే నామినేషన్‌పై ప్రతిపాదించడానికి అవకాశం ఉండటంతో పోటీ చేసే అభ్యర్థులే వారి పన్నులను ముందే చెల్లించుకున్నారు. ఇలా నిర్మల్‌ మున్సిపాలిటీలో మూడు రోజుల్లోనే రూ.15.50 లక్షలు వసూలయ్యాయి.  ఖానాపూర్‌లో 12వార్డులున్నాయి. ఒక్కో వార్డు నుంచి రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలుపుకొని 3 నుంచి 8 మంది వరకు పోటీ చేసేందుకు నామినేషన్లను దాఖలు చేశారు. వీరికి ప్రతిపాదించే అభ్యర్థులు కూడా పన్నులను చెల్లించారు. అభ్యర్థులందరూ కూడా మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిలను చెల్లించారు. మూడు రోజుల్లోనే రూ. 2లక్షల 16వేలు వసూలైనట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. భైంసా పట్టణానికి వస్తే గతంలో 23వార్డులుండగా.. మూడు వార్డులను పెంచారు. మొ త్తం 26 వార్డులకు పెరిగాయి. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు నుంచి ఎనిమిది మంది వరకు ఆయా వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేశారు. వీరంతా కూడా మున్సిపాలిటీకి చెల్లించడంతో మొత్తం రూ. 10లక్షల 50వేలు వసూలైనట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల పుణ్యామని నిర్మల్‌ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను కలిపి నాలుగు రోజుల్లోనే రూ.28లక్షల వసూలైంది.

సిబ్బంది స్పెషల్‌ డ్రైవ్‌

పన్నుల వసూళ్లకు మున్సిపల్‌సిబ్బంది స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రతి సంవత్సరం మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో జనవరి ఒకటి నుంచే అన్ని మున్సిపాలిటీల్లో పన్నులను వసూలు చేసేందుకు మూడు నెలల కార్యాచరణ రూపొందించుకొని ఆచరించేవారు. ఈసారి మున్సిపల్‌ ఎన్నికలు కలిసి రావడంతో మూడు మున్సిపాలిటీల్లో రూ. 28లక్షలు వసూలయ్యాయి.


logo
>>>>>>