శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Jan 13, 2020 , 00:39:40

పురపోరుకు పటిష్ట బందోబస్తు..

పురపోరుకు పటిష్ట బందోబస్తు..


నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల 22న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగా, అలాగే నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాల్టీల్లో ఎన్నికలను జరుగనున్నాయి. గతంలో జిల్లాలో రెండు చోట్ల మున్సిపల్‌ ఎన్నికలు జరుగనుండగా తొలి సారిగా ఖానాపూర్‌ మున్సిపాల్టీలో జరుగనున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఎస్పీ శశిధర్‌ రాజు ఖానాపూర్‌, భైంసా, నిర్మల్‌ పోలీసు అధికారులతో పాటు అభ్యర్థులకు, పోలీసు సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. వరుస ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంతో జిల్లా పోలీసు అధికారులు ఇటీవల రాష్ట్ర స్థాయి అవార్డును స్వీకరించడంతో పోలీసు శాఖ అధికారులు ఉత్సాహంగా ఉన్నారు.

అప్రమత్తమైన పోలీసులు

మూడు మున్సిపాల్టీల్లో ఎన్నికలకు పోలీసు శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నిల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచే పటిష్ట బందోబస్తును చేస్తున్నారు. నామినేషన్‌ ప్రక్రియ నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఎవరు ఏ విధులు నిర్వహించాలో ఎస్పీ శశిధర్‌ రాజ్‌ ఆదేశించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు జిల్లాలో తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఎన్నికల్లో మద్యం,డబ్బు పంపిణీ  జరిగితే ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని చేతులోకి తీసుకుని దాడులు చేస్తే చర్యలు తీసుకునేందుకు సైతం సిద్ధమయ్యారు. 24 గంటల పాటు మూడు మున్సిపాల్టీల్లో  పోలీసులు నిత్యం అందుబాటులో ఉండనున్నారు. ఎన్నిల నిర్వహణకు ఇబ్బంది కలిగించే వారిపై డయల్‌ 100కు సమాచారం అందించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

జిల్లాలో రౌడీ షీటర్లపై నిఘా

మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే పనిలో భాగంగా పోలీసులు రౌడీ షీటర్ల చిట్టా తెరుస్తున్నారు.  కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడి కేసులు నమోదైన వారితో పాటు రౌడీ షీటర్లపై నిఘాను పటిష్టం చేస్తున్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ ప్రాంతాల్లో రౌడీ షీటర్లు ఎంత మంది ఉన్నారు..ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు..ఇందులో సత్ప్రవర్తన కలిగిన వారు ఎంత మంది ఉన్నారు.. అల్లర్లకు పాల్పడే వారు ఎంత మంది ఉన్నారో సమాచారం సేకరిస్తున్నారు. వీరితో పాటు ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడే వారి జాబితాను సైతం సిద్ధం చేసి వారిపై నిఘాను పటిష్టం చేశారు.

ముందస్తు బైండోవర్లు.. బెల్ట్‌షాప్‌లపై దాడులు

జిల్లాలోని మూడు మున్సిపాల్టీల్లో జరిగే ఎన్నికల్లో నిర్వహణకు ఇబ్బందులు కలిగించకుండా సత్ప్రవర్తనతో ఉండాలని సూచిస్తున్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మందస్తు బైండోవర్లు చేస్తున్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాల్టీల్లోని పరిధిలోని వార్డుల్లో ఇప్పటికీ 200 మందిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. అలాగే ఎన్నికల్లో మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే బెల్ట్‌ షాపులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.ఇప్పటికే నిర్మల్‌ పట్టణంలోని పలు బెల్ట్‌ షాపులపై పోలీసులు దాడి చేసి బెల్ట్‌ షాపులను సీజ్‌ చేశారు. జిల్లాలో ఎన్నికల దృష్ట్యా 22మంది వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌లను డిపాజిట్‌ చేసుకున్నారు.


24 గంటలూ పెట్రోలింగ్‌ నిర్వహిస్తాం..

జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. రూట్‌ మోబైల్‌, నార్మల్‌ పోలీసింగ్‌, ఆర్మ్‌డ్‌ పోలీస్‌,రిజర్వు పోలీసులను ఎన్నికల విధులకు వినియోగించుకోనున్నారు. ఎన్నికలలో మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు 24 గంటల పాలు పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బును పంపిణీ చేసినట్లయితే పోలీసులకు సమాచారం అందించండి.
-శశిధర్‌రాజు, ఎస్పీ


logo