బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 12, 2020 , 01:50:30

కారెక్కుతున్నారు

కారెక్కుతున్నారు
  • -పురపోరులో టీఆర్‌ఎస్‌కు జై.. కాంగ్రెస్‌కు నై..!
  • -కాంగ్రెస్‌, బీజేపీలను వీడుతున్న పలువురు నేతలు
  • -టీఆర్‌ఎస్‌లోకి జోరుగా కొనసాగుతున్న వలసలు
  • -పుర పోరులో పోటీకి ‘చేయి’స్తున్న నాయకులు
  • -టీఆర్‌ఎస్‌ దూకుడుతో కుదేలవుతున్న ప్రతిపక్షాలునిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: వరుస పరాజయాలతో తీవ్ర నిస్తేజం, నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల వేళ గట్టి షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామపంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర పరాభావాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. ఇప్పటికే వరుస పరాజయాలతో అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్‌ పార్టీకి తాజాగా వలసల బెడద మొదలైంది. ఇంతకాలం పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేరిన నాయకులంతా కాంగ్రెస్‌కు చెయ్యిస్తున్నారు. ఎవరికి వారు తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో భాగంగా అంతా కారెక్కుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో పాటు జిల్లాలోని మూడు స్థానాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్నది. వీటికి తోడు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌ నియోజకవర్గంతో పాటు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు.

టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున్న వలసలు

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో ఇంతకాలం ఉన్న సీనియర్‌ నాయకులతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన తాజా మాజీ కౌన్సిలర్లంతా తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు టీపీసీసీ కార్యదర్శి రామలింగంతో పాటు మాజీ కౌన్సిలర్లు అడ్ప పోశెట్టి, లక్కాకుల నరహరి, అంజద్‌ఖాన్‌, కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిన పద్మకర్‌, మత్స్య కార్మిక సంఘ నాయకులు భవానిలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు తిరిగి కారెక్కుతున్నారు. తాజా మాజీ కౌన్సిలర్లు పతికె శ్రీనివాస్‌, ఎలుగు సుధాకర్‌ ఇప్పటికే గులాబీ కండువా కప్పుకోగా.. నూతుల భూపతిరెడ్డి మంత్రి అల్లోలను మర్యాద పూర్వకంగా కలిశారు. నేడో, రేపో ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఎంఐఎం నుంచి మాజీ కౌన్సిలర్‌ ఎం.డి.అన్వర్‌, బీజేపీ నుంచి భజరంగ్‌దళ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎడిపెల్లి నరేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.

2014లో తెలంగాణ రాష్ట్ర సమితి మొట్టమొదటిసారిగా అధికారంలోకి రాగా.. 2018లోనూ మరోసారి అధికారంలోకి వచ్చింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 2014, 18లో వరుసగా రెండుసార్లు మంత్రిగా పని చేస్తున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంతో పాటు జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేశారు. నిర్మల్‌ నియోజకవర్గంలో అభివృద్దే ఎజెండాగా అనేక నిధులను తీసుకొచ్చి పట్టణాభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడంతో.. మున్సిపల్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌, బీజేపీ నుంచి నాయకులు టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వలసల పర్వం కొనసాగుతుండగా.. మరికొందరు చేరేందుకు సిద్దమయ్యారు. భైంసాలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు చేరగా.. ఖానాపూర్‌లోనూ కాంగ్రెస్‌ నుంచి పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. భైంసా, నిర్మల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు అయ్యారు. తాజా మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి ఈసారి నామినేషన్‌ కూడా దాఖలు చేయకపోగా.. మరికొందరు సీనియర్‌ నాయకులు పోటీకి దూరంగా ఉన్నారు. ఏ మాత్రం పలుకుబడి లేని నాయకులు ఎన్నికల బరిలో నిల్చున్నారు. భైంసాలో 19 వార్డులకే నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ విషయానికొస్తే ఖానాపూర్‌, నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీలో మూడో వంతు వార్డులకే పరిమితమైంది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌, బీజేపీలకు వలసల భయం పట్టుకుంది.


logo
>>>>>>