సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Jan 10, 2020 , 11:14:15

అడవులను నరికితే కఠిన చర్యలు

అడవులను నరికితే కఠిన చర్యలు

సిరికొండ : అడవులను నరికితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కవ్వాల్ టైగర్‌జోన్ అటవీశాఖ రేంజ్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడారు. మండలంలో అటవీ శాఖ కార్యాలయం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇబ్బందులను అధిగమించడానికి కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. కార్యాలయం ఏర్పాటు తో అక్రమ కలప రవాణాను నివారించవచ్చని అన్నారు. సిరికొండలో అటవీ క్షేత్రాధికారి కార్యాలయంతో పాటు సెక్షన్ బీట్ అధికారుల కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న సిరిచెల్మ టైగర్‌జోన్ కార్యాలయాన్ని సిరికొండకు మారుస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి రూ.27లక్షలు కేటాయిస్తున్నామన్నారు. త్వరలోనే మరికొన్ని కార్యాలయాలను నిర్మిస్తామన్నారు. భీంపూర్ అటవీ ప్రాంతంలో రూ.10లక్షలతో ఒక వాచ్‌మెన్ టవర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిరికొండలో అటవీ క్షేత్రాధికారి కార్యాలయ నిర్మాణం కోసం స్థలం విరాళంగా ఇచ్చిన జింక మల్లేశ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిరిచెల్మ టైగర్‌జోన్ అటవీశాఖ అధికారి అహ్మద్, ఎంపీపీ పెందూర్ అమృత్‌రావు, మాజీ సర్పంచ్ పెంటన్న, బస్‌వీర్, మాజీ ఎంపీటీసీ బాలాజీ, ఉప సర్పంచ్ చిన్న రాజన్న, నాయకులు రాజన్న, లస్మన్న పాల్గొన్నారు.

పకడ్బందీగా నిర్వహిస్తాం
భైంసా, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్ కేంద్రం పరిశీలించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. జేసీ భాస్కర్‌రావు, డీఎస్పీ నర్సింగ్‌రావు, పట్టణ సీఐ వేణుగోపాల్‌రావు తదితరులున్నారు.

హత్యకేసులో నలుగురికి జీవితఖైదు
తానూర్ : భూ తగాదాలతో ఒక వ్యక్తిని హత్యచేసిన నలుగురికి జీవితఖైదుతో పాటు రూ 2వేలు జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి జె. జీవన్‌కుమార్ గురువారం తీర్పునిచ్చారు. కోర్టు లైజన్ అధికారి సక్రియ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం తానూర్ మండలంలోని ఝరిబి గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య భూతగాదాలు నెలకొనగా ముకుంద్‌దాస్ అనే వ్యక్తిపై ప్రత్యర్థి వర్గం వారు దాడి చేశారు. అతడు తీవ్ర గాయాలపాలై మరణించాడు. కేసులో నేరం రుజువు కావడంతో బొడ్డొల్లా గంగాధర్, బొడ్డొల్లా సురేశ్, బొడ్డొల్లా పోతన్న, బొడ్డొల్లా బాశెట్టి అలియాస్ జంగు నలుగురికి జీవితఖైదుతో పాటు 2 వేల జరిమానా విధిస్తూ నిర్మల్ జిల్లా అదనపు న్యాయమూర్తి జీవన్‌కుమార్ తీర్పునిచ్చినట్లు ఎస్సై గుడిపెల్లి రాజన్న తెలిపారు.

ఇసుక డంపుల స్వాధీనం
కడెం : అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే చర్యలు తప్పవని కడెం ఎస్సై మహేశ్, ఆర్‌ఐ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని బెల్లాల్, నర్సింగపూర్ గ్రామాలతో పాటు, గోదావరి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగపూర్‌తో పాటు, గోదావరి ప్రాంతంలో 8 చోట్లలో సుమారు 200 పైగా ఇసుక డంపులను నిల్వ ఉంచినట్లు చెప్పారు. డంపులు చేస్తున్నారనే సమాచారం మేరకు గురువారం తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గోదావరి నుంచి ఇసుకను అక్రమ రవాణ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బెల్లాల్ వీఆర్వో రాజమల్లు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ఏఎస్పీని సన్మానించిన ఆదివాసీ నాయకులు
ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఉట్నూర్ ఏఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శబరీష్‌ను గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆదివాసీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ఆదివాసీ పరిస్థితులపై చర్చించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పెందూర్ ప్రభాకర్, తుడుందెబ్బ జిల్లా నాయకుడు పుర్క బాపురావు, తుడుందెబ్బ మహిళా నాయకురాలు పుష్పరాణి, నాయకులు ఉన్నారు.

క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు
ఇంద్రవెల్లి : క్షయపై సమాజంలో అపోహలను ప్రజలు నమ్మి ఆందోళన చెందవద్దని ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉందని ఇంద్రవెల్లి దవాఖాన వైద్యుడు శ్రీకాంత్ అన్నారు. గురువారం మండలంలోని దనోరా(బి) గ్రామపంచాయతీ పరిధిలోని ఆరోగ్యఉపకేంద్రం ఆధ్వర్యంలో గ్రామస్తులకు క్షయవ్యాధి నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాథోడ్ బాబులాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

521 ఎకరాల్లో పంటనష్టం
తాంసి : అకాల వర్షంతో జిల్లాలోని రైతులు నష్టపోయారు. బుధవారం రాత్రి తాంసి, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. 521 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గురువారం వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు తాంసి, భీంపూర్ మండలాల్లో పంటపొలాలను పరిశీలించి వివరాలు సేకరించారు. జిల్లా మానిటరింగ్ అధికారి కే. శివకుమార్, ఏవో రవీందర్, తాంసి మండల జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, సర్పంచులు రైతులు పాల్గొన్నారు.


logo