శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 10, 2020 , 11:12:16

ఉద్యమంలా పల్లె ప్రగతి

ఉద్యమంలా పల్లె ప్రగతి

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో రెండో విడుత పల్లెప్రగతి ఉద్యమంగా కొనసాగుతున్నది. ఈ నెల 2న జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభంకాగా అన్ని గ్రామాల్లో అధికారులు ప్రజల సహాయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. శ్రమదానం, ఇతర కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతుండడంతో పల్లెప్రగతి కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగుతున్నది. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తూ ర్యాలీలు, ఇతర కార్యక్రమాల ద్వారా పల్లె ప్రగతి లక్ష్యాలను తెలియజేస్తున్నారు. స్థానికులు తమ పల్లెలను శుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనం పెంపొందించడంతోపాటు మరుగుదొడ్ల వినియోగం ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 467 గ్రామ పంచాయతీల్లో రెండో విడత పల్లెప్రగతి జోరుగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామాల పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్ సమస్యలు, డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, మరుగుదొడ్ల వినియోగం, నిరక్షరాస్యుల వివరాల సేకరణ లాంటి ఇతర అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమ ఉద్దేశాలను తెలియజేసేందుకు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. తమ గ్రామాల అభివృద్ధికి తాము సైతం అంటూ స్థానికులు ముందుకు వస్తున్నారు. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. జిల్లాలో చేపట్టిన పల్లెప్రగతి పనుల పురోగతి విషయంలో కలెక్టర్ అధికారులతో క్రమంగా సమావేశాలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.

ప్రధానంగా పరిశుభ్రత, పచ్చదనంతోపాటు అధికారులు డంపిగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, కంపోస్ట్ షెడ్‌లను నిర్మిస్తున్నారు. జిల్లాలో వీటి నిర్మాణ పనులో జోరుగా సాగుతున్నాయి. విద్యుత్ నష్టాన్ని నివారించేందుకు గ్రామాల్లో మూడో వైరును ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు కేవలం రాత్రి సమయాల్లో వెలిగించేలా ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు లేని ఇండ్ల వివరాలను సేకరించడంతోపాటు మల్టీ పర్పస్ కార్మికులను నియమించుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇప్పటికే 60కి పైగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. మిగతా వాటికి గ్రామ పంచాయతీల తీర్మానాల ప్రకారం ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీలకు అధికారులు అందజేసిన ట్రాక్టర్లు పరిశుభ్రత ఇతర పనుల కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ నెల 2న ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.


logo