బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Jan 15, 2020 , 00:33:44

పోరుకు సై

పోరుకు సై

పురపోరులో కీలకమైన నామిషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉండగా పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జిల్లాలోని నిర్మల్‌, బైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 80 వార్డులు ఉండగా 544 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 421 మంది నామినేషన్లు వేయగా 125 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది పోరులో 296 మంది మిగిలారు. 80 వార్డులకు గాను ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. భైంసాలో 3, నిర్మల్‌లో రెండు చొప్పున వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ పూర్తవ్వడంతో నేటి నుంచి ప్రచారం జోరందుకోనున్నది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. నిర్మల్‌ మున్సిపాల్టీలోని 42 వార్డులకు 222 మంది నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం 74 మంది ఉపసంహరించు కున్నారు. బరిలో148 నిలిచారు.

నిర్మల్‌/నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల్లో మరో ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం వరకు గడువు ఉండగా పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తుది పోరులో 296 మంది మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తికావడంతో నేటి నుంచి ప్రచారం జోరందుకోనున్నది.  జిల్లాలో మూడు మున్సిపాలిటీలుండగా.. వీటికి ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించనున్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 80 వార్డులున్నాయి. వీటికి మొత్తం 544 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యా హ్నం వరకు గడువు ఉండగా ఇందులో 296 మంది మాత్రమే తుది బరిలో నిలుస్తున్నారు.


మొత్తం 421 మందికి గాను 125 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో తుది పోటీలో 296 మంది తలపడుతున్నారు. నిర్మల్‌ మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 222 మంది నామినేషన్లు వేశారు. 74 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతం 148 మంది పోటీలో ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. బైంసా మున్సిపాలిటీలో 26 వార్డులుండగా 114 మంది నామినేషన్లలో మిగలగా మంగళవారం 26 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 88 మంది మాత్రమే తుది పోరులో ఉన్నారు. ఇక్కడ కూడా సగటున వార్డుకు ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. ఖానాపూర్‌ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 85 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 25 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో తుది పోరులో 60 మంది బరిలో నిలిచారు. సగటున ఒక్కో వార్డుకు ఐదుగురు చొప్పున పోటీ పడుతున్నారు. 


ఐదు వార్డులు ఏకగ్రీవం

జిల్లాలో 280 వార్డులకు గాను 5 వార్డులు ఏకగ్రీవం కాగా 75 వార్డులకు ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించనున్నారు. 75 వార్డులకు 296 మంది పోటీ పడుతుండగా.. నిర్మల్‌లో 148, బైంసాలో 88, ఖానాపూర్‌లో 60 మంది తుదిబరిలో ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 75 వార్డులకు 75 మంది, కాంగ్రెస్‌ నుంచి 66 మంది, బీజేపీ నుంచి 47 మంది, ఎంఐఎం నుంచి 39 మంది, స్వతంత్రులు 77 మంది, సీపీఎం నుంచి ఒకరు, టీజేఎస్‌ నుంచి ఒకరు చొప్పున పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ మినహా వేరే ఏ పార్టీ కూడా అన్ని వార్డుల్లో పోటీ చేయడం లేదు. కాంగ్రెస్‌ ఖానాపూర్‌ మినహా మిగతా రెండు చోట్ల పూర్తి స్థాయిలో అభ్యర్థులను బరిలోకి దించలేదు. బీజేపీ మూడు మున్సిపాలిటీల్లోనూ పూర్తి స్థాయిలో అభ్యర్థులు లేకపోగా కొన్ని స్థానాలకే పోటీలో నిలిపింది. ఎంఐఎం బైంసా, నిర్మల్‌లో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా ఖానాపూర్‌లో ఒకే చోట అభ్యర్థిని బరిలో నిలిపింది. నిర్మల్‌లో టీఆర్‌ఎస్‌ 40 స్థానాల్లో పోటీ చేస్తుండగా రెండు వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుంది. 10, 33 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకోగా.. మిగతా చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ 38 చోట్ల మాత్రమే పోటీ చేస్తుండగా బీజేపీ 25, ఎంఐఎం 17, సీపీఎం 1, స్వతంత్రులు 27 చోట్ల పోటీ చేస్తున్నారు. బైంసాలో టీఆర్‌ఎస్‌ 23 చోట్ల, కాంగ్రెస్‌ 16 చోట్ల, ఎంఐఎం 21 చోట్ల, బీజేపీ 13 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం మూడు వార్డులను ఏకగ్రీవంగా దక్కించుకున్నది. 16,17,20 వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా దక్కించుకున్నది. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ 12 చోట్ల, కాంగ్రెస్‌ 12 చోట్ల, బీజేపీ 9 చోట్ల పోటీ చేస్తుండగా 25 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. టీజేఎస్‌ ఒక చోటు నుంచి పోటీలో ఉంది. ఖానాపూర్‌లో పలువురు అభ్యర్థులకు పార్టీ బీ - ఫారాలు రాకపోవడంతో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులుగా బరిలో దిగారు.  జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నేటి నుంచి ప్రచారం జోరు జోరందుకోనుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించగా నేటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నారు. logo