e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ సీఏతో మంచి భవిత

సీఏతో మంచి భవిత

ఇంటర్‌ తరువాత ఎంచుకునే కోర్సు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎంత చదివినా ఆ చదువు జీవితంలో స్థిరపడటానికి పనికిరాకపోతే అది వ్యర్థమే కదా!. కాబట్టి ఇంటర్‌ తరువాత ఏం చదవాలి, ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ దేశ అభివృద్ధిలో అయినా సైన్స్‌, టెక్నాలజీ రంగాలతో పాటు ఆర్థిక రంగం కూడా ప్రాముఖ్యం కలిగింది. ఈ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే సీఏ ప్రొఫెషనల్స్‌ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో సీఏ కోర్సు

గురించి ప్రత్యేక కథనం..

సీఏ ఇంటర్‌లో కామర్స్‌ గ్రూపులు చదివినవారు మాత్రమే చదవాలి మిగతా గ్రూపుల వారికి సీఏ కష్టమని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. కొన్నేండ్లుగా వెలువడుతున్న సీఏ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఎంపీసీ/బైపీసీ చదివినవారు కూడా సీఏలో రాణిస్తున్నారు.
ప్రస్తుత వాణిజ్య ప్రపంచంలో కామర్స్‌ కోర్సుల ప్రాముఖ్యం పెరిగింది. కానీ సీఏ గురించి సరైన అవగాహన లేక చాలామంది ఇంటర్‌లో ఎంపీసీ తీసుకొని ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరువాత మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఎంబీఏ లాంటి కామర్స్‌ కోర్సులు చేస్తున్నారు. అంటే ఎంపీసీ చదివినవారికి కామర్స్‌ కోర్సులు కొత్తేమీ కాదని అర్థం చేసుకోవచ్చు.
ఇంటర్‌లో ఎంఈసీ/సీఈసీ చదివినవారు సాధారణంగా సీఏ/సీఎంఏ కోర్సులు చదువుతారు. కానీ సీఏ ఎంపీసీ, బైపీసీ చదివినవారికి వరం. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌లో ఎంఈసీ లేదా సీఈసీ లాంటి కామర్స్‌ గ్రూపులు తీసుకొని సీఏకి రావడం చాలా తెలివైన నిర్ణయం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా వారు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం పదో తరగతి పూర్తయిన వెంటనే సీఏకు ప్రొవిజినల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఇంటర్‌ ఎంఈసీ/సీఈసీతో పాటు సీఏ ఫౌండేషన్‌ పూర్తిచేయవచ్చు.

 • నిర్వహణ సంస్థ: ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)
 • వెబ్‌సైట్‌: icai.org
 • కామర్స్‌ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రంగం చార్టెర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ). సీఏ అంటే తొమ్మిది, పదేండ్లు పడుతుందని చాలామంది భయపడుతుంటారు. ఇటీవల ఫలితాలు చూస్తే 21-22 ఏండ్లకే చాలామంది సీఏ పూర్తిచేస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు సీఏ వైపు వస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. ఇంటర్‌ తరువాత ఫౌండేషన్‌ కోర్సు చేసి ప్రవేశించడం ద్వారా సీఏ త్వరగా పూర్తిచేయవచ్చు. వృత్తిరీత్యా లభించే గౌరవం, సామాజిక హోదా, ఆదాయ వనరులు బాగా ఉండటం వల్ల సీఏ చేయడానికి చాలామంది ఇష్టపుడుతున్నారు. అమ్మాయిలు కూడా సీఏ పాసవుతున్నారు.

ఎవరు చదవవచ్చు

 • సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తరువాత గాని అవకాశం ఉండేది. ప్రస్తుతం ఇంటర్‌ తరువాత సీఏ చదవవచ్చు.
 • ఇంటర్‌ ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇలా ఏ గ్రూపువారైనా సీఏ చదవవచ్చు. సీఏ చేయాలనుకునే చాలామంది ఇంటర్‌లో ఎంఈసీతో పాటు సీఏ కూడా ఏకకాలంలో చదవడానికి సుముఖత చూపుతున్నారు.

అవకాశాలు

 • పన్ను గణన, అకౌంటింగ్‌, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
 • జీఎస్‌టీ తీసుకురావడం వల్ల పరిశ్రమ లావాదేవీలు పెరిగి చార్టెర్డ్‌ అకౌంటెంట్‌లకు డిమాండ్‌ పెరిగింది.
 • దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సీఏలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీలకు ఎండీలుగా, ఫైనాన్స్‌ కంట్రోలర్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ప్లాంట్‌ అకౌంటెంట్స్‌, సిస్టమ్‌ ఇంప్లిమెంటార్స్‌, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు.
 • ట్రస్టీగా, అడ్మినిస్ట్రేటర్‌గా, వాల్యూయర్‌గా, మేనేజ్‌మెంట్స్‌ కన్సల్టెంట్‌గా, ట్యాక్స్‌ కన్సల్టెంట్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. నిరుద్యోగం మచ్చుకైనా లేని ఏకైకై కోర్సు సీఏ.

సీఏలోని దశలు

 • మొదటి దశ: సీఏ ఫౌండేషన్‌
 • ఇంటర్‌, 10+2 లేదా తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 4 నెలలకు సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయవచ్చు.
 • ప్రతి ప్రవేశ పరీక్ష మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. గతంలో ఇప్పటి సీఏ ఫౌండేషన్‌ స్థానంలో నిర్వహించిన సీపీటీ పరీక్ష కూడా మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల రూపంలోనే నిర్వహించేవారు. కానీ సీఏ ఫౌండేషన్‌ పరీక్షలో 50 శాతం మార్కులు డిస్క్రిప్టివ్‌ పరీక్షగా, మరో 50 శాతం మార్కులు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుగా
 • నిర్వహిస్తున్నారు.
 • సీఏ ఫౌండేషన్‌లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉండటంవల్ల విశ్లేషణాత్మకత పెరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు ఉండటంవల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెరుగుతాయి.
 • ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా సీఏ విద్యార్థికి అన్ని రకాల నైపుణ్యాలు ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్‌ను ఇలా రూపొందించారు.
 • సీఏ ఫౌండేషన్‌ 4 పేపర్లుగా, ఒక్కో పేపర్‌ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు నిర్వహిస్తారు.
 • పేపర్‌-1, 2 డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో, పేపర్‌-3, 4 ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో జరుగుతాయి. సీఏ ఫౌండేషన్‌ ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. 4 పేపర్లు కలిపి 400 మార్కులకు గాను 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు సాధించాలి.
 • సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు ప్రతి ఏడాది జూన్‌, డిసెంబర్‌ నెలల్లో ఉంటాయి.
 • రిజిస్ట్రేషన్‌: సీఏ ఫౌండేషన్‌ పరీక్ష డిసెంబర్‌లో రాయాలంటే అదే ఏడాది జూన్‌ 30లోగా రిజిస్ట్రేషన్‌
 • చేయించుకోవాలి.
 • రెండో దశ: సీఏ ఇంటర్మీడియట్‌
 • దీనిని గతంలో సీఏ-ఐపీసీసీ అని పిలిచేవారు.
 • సీఏ ఫౌండేషన్‌ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్మీడియట్‌ చదవడానికి అర్హులు.
 • సీఏ ఇంటర్‌ గ్రూపు-1, గ్రూపు-2లలో 4 పేపర్ల చొప్పున మొత్తం 8 పేపర్లుగా సిలబస్‌ రూపొందించారు.
 • నూతన విధానంలో కూడా విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.
 • పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్‌ నెలల్లో నిర్వహిస్తారు. రెండు గ్రూపులుగా (గ్రూపునకు 4 పేపర్లు) ఒక్కో పేపర్‌ 100 మార్కులకు మొత్తం 8 పేపర్లకు పరీక్ష ఉంటుంది.
 • ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులు సాధించాలి. సీఏ ఇంటర్‌ పూర్తిచేసినవారు 3 సంవత్సరాల ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఆర్టికల్‌షిప్‌) పూర్తిచేయాలి.
- Advertisement -
మూడో దశ: సీఏ ఫైనల్‌
 • సీఏ ఇంటర్‌ పూర్తయి, రెండున్నరేండ్ల ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేయించుకొని పరీక్ష రాయాలి.
 • సీఏ ఫైనల్‌ పరీక్ష 8 పేపర్లు రెండు గ్రూపులుగా (గ్రూపునకు 4 పేపర్లు) ఒక్కో పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది.
 • సీఏ ఫైనల్‌ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్‌ నెలలో నిర్వహిస్తారు. విద్యార్థి వీలును బట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాయవచ్చు.
 • ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి.
 • గ్రూపు-2లో 6వ పేపర్‌ను ఎలక్టివ్‌ పేపర్‌గా నిర్ణయించారు. ఈ ఎలక్టివ్‌ పేపర్‌లో భాగంగా 6 సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకొని చదవవచ్చు.
 • ఇలాంటి ఎలక్టివ్‌ పేపర్‌ విధానంవల్ల ఇష్టమైన పేపర్‌ను ఎంచుకొని దానిని బాగా చదివి ఆ సబ్జెక్టులో నైపుణ్యం సాధించడానికి వీలు కలుగుతుంది.

పేరు: కే సాయి శ్రీకర్‌
ఊరు: శ్రీకాకుళం
పదో తరగతి: 9.8 గ్రేడ్‌ పాయింట్లు
ఇంటర్‌: ఎంపీసీ, 982 మార్కులు
సీఏ ఫౌండేషన్‌: ఆలిండియా 2వ ర్యాంక్‌

 • మా నాన్న అప్పారావు అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. అమ్మ నాగరత్నం గృహిణి. జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలన్నది నాన్న కల. వీలైనంత త్వరగా జీవితంలో స్థిరపడి అమ్మానాన్నలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నాను. 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచే నాన్న సీఏ గురించి వివరించేవారు. ఇంటర్‌ తరువాత నీట్‌లో సీటు వచ్చింది. అయినప్పటికీ సీఏ మీద ఉన్న ఆసక్తితో దీనిలో చేరాను.
 • సీఏ ఫౌండేషన్‌లో 400 మార్కులకు 344 మార్కులు పొంది ఆలిండియా 2వ ర్యాంకు సాధించాను.
 • ఇందుకు ఐసీఏఐ, ఇన్‌స్టిట్యూట్‌వారు ఇచ్చిన మెటీరియల్‌ను లైన్‌ బై లైన్‌ చదివాను. కష్టంగా ఫీల్‌ అయిన సబ్జెక్టును బాగా ప్రాక్టీస్‌ చేశాను. రోజుకు 14 గంటలు చదివాను.
 • సీఏ చదవాలనుకునే ప్రతి విద్యార్థికి మొదటగా ఉండాల్సింది హార్డ్‌వర్క్‌. వీలైంత వరకు స్మార్ట్‌ ఫోన్లకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుంటూ చదివితే ఎవరైనా సీఏలో సులువుగా విజయం సాధించవచ్చు.

ప్రశ్నలు సమాధానాలు

ప్ర: ఎంపీసీ, బైపీసీ వారికి కోర్సు కష్టమా?
జ: ఎంతమాత్రం కష్టం కాదు. ఎంపీసీ, బైపీసీ వారు కూడా సీఏలో సులభంగా రాణించవచ్చు.
ప్ర: ఖర్చు ఎక్కువ అవుతుందా?
జ: ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఐఐటీ కోర్సులతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు.
ప్ర: ఈ కోర్సు ఇంగ్లిష్‌ మీడియం వారికే పరిమితమా?
జ: కోర్సు ఇంగ్లిష్‌లో ఉంటుంది. అయినా ఇంగ్లిష్‌, తెలుగు మీడియం వారు ఎవరైనా చదవవచ్చు.
ప్ర: ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
జ: వ్యాపారసంస్థలు, పరిశ్రమల్లో సీఈవో, ఎండీ, డైరెక్టర్‌ ఫైనాన్స్‌, చీఫ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడవచ్చు. అంతేగాకుండా ఆర్థిక లావాదేవీల నిపుణులుగా ప్రాక్టీస్‌ ప్రారంభించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగిగా, కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
ప్ర: ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఆర్టికల్‌షిప్‌) ఎవరి వద్దతీసుకోవాలి?
జ: ప్రాక్టీస్‌లో ఉన్న సీఏ వద్ద ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోవాలి. మంచి పేరున్న ఆడిట్‌ సంస్థల్లో, ప్రఖ్యాతిగాంచిన సీఏల వద్ద కూడా తీసుకోవచ్చు.

ఇతర వివరాల కోసం
9885125001/03
నంబర్లకు ఫోన్‌ చేయండి.

మట్టుపల్లి ప్రకాశ్‌
అకడమిక్‌ అడ్వైజర్‌
మాస్టర్‌ మైండ్స్‌, 9248733323

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana