e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ‘ఫర్జాద్‌ బి’ గ్యాస్‌ ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది?

‘ఫర్జాద్‌ బి’ గ్యాస్‌ ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది?

‘ఫర్జాద్‌ బి’ గ్యాస్‌ ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది?
 1. ఇటీవల భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్‌లు ఒప్పందం చేసుకున్నాయి. దీని లక్ష్యం ఏంటి? (డి)
  ఎ) గిరిజనులకు కొవిడ్‌ సోకకుండా
  జాగ్రత్తలు తీసుకోవడం
  బి) గిరిజనులకు సంబంధించిన
  సమాచారాలను డిజిటలైజ్‌ చేయడం
  సి) గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించడం
  డి) గిరిజన పాఠశాలలను డిజిటల్‌ దిశగా తీసుకెళ్లడం
  వివరణ: గిరిజన పాఠశాలలను డిజిటల్‌ దిశగా తీసుకెళ్లేందుకు భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఆశ్రమ్‌ పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మరిన్ని ఏర్పాటు చేస్తారు. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో కృత్రిమ మేధ అంశాలను మైక్రోసాఫ్ట్‌ రూపొందిస్తుంది. 500 మంది ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు.
 2. కృత్రిమ గంజాయి పదార్థాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి దేశం? (బి)
  ఎ) సింగపూర్‌ బి) చైనా
  సి) ఇరాన్‌ డి) మలేషియా
  వివరణ: అన్ని రకాల కృత్రిమ గంజాయి పదార్థాలను చైనా నిషేధించింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి దేశం అదే. రసాయనాలతో తయారుచేసే గంజాయినే కృత్రిమంగా పేర్కొంటారు. ఇవి తీసుకున్నవారిలో ఆరోగ్యంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుంది.
 3. ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్‌ తొలి ప్రాజెక్టును ఏ నగరంలో పూర్తిచేశారు? (సి)
  ఎ) భోపాల్‌ బి) వారణాసి
  సి) ముంబయి డి) సూరత్‌
  వివరణ: ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్‌ అనేది సంక్షిప్త రూపం. దీని విస్తరణ రూపం-స్పెషల్‌ విండో ఫర్‌ ఆఫర్డబుల్‌ అండ్‌ మిడ్‌ ఇన్‌కం హౌజింగ్‌. ఇందులో భాగంగా ముంబయి సబర్బన్‌లో రివాలి పార్క్‌ వద్ద తొలి గృహ సముదాయ ప్రాజెక్టును పూర్తిచేశారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల నిధిలో కేటగిరీ-2లో భాగంగా ఏర్పాటు చేసిన నిధిలో ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్‌ భాగం.
 4. సిమోర్గ్‌ అనే పేరుతో సూపర్‌ కంప్యూటర్‌ను రూపొందించిన దేశం? (డి)
  ఎ) సింగపూర్‌ బి) జపాన్‌
  సి) దక్షిణ కొరియా డి) ఇరాన్‌
  వివరణ: సిమోర్గ్‌ అనే సూపర్‌ కంప్యూటర్‌ను ఇరాన్‌ దేశం ఇటీవల రూపొందించింది. ఆ దేశంలో గతంలోని సూపర్‌ కంప్యూటర్‌ కంటే ఇది 100 రెట్లు వేగవంతమైనది. సిముర్గ్‌ అనే పక్షి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. ఇది పర్షియన్‌ పురాణాల్లో కనిపించే ఒక ఊహాజనితమైన పక్షి. ఆ భాషా సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉంది. టెహ్రాన్‌లోని అమీర్‌కబీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ దీనిని తయారుచేసింది. దీని వేగం 0.56 పెటాఫ్లాప్స్‌, రెండు నెలల్లో ఇది 1 పెటాఫ్లాప్‌, ఆ తర్వాత కాలంలో 10 పెటాఫ్లాప్స్‌కు చేరుతుంది. ఈ సూపర్‌ కంప్యూటర్‌ తయారీకి 9 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లను ఇరాన్‌ వెచ్చించింది.
 5. డూమ్స్‌ డే స్క్రోలింగ్‌ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (ఎ)
  ఎ) కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తలు తరచూ చదవడం
  బి) రోజంతా ఏ పనిలేకుండా ఉండటం
  సి) తుఫాను తీరం దాటే రోజు
  డి) ఏదీకాదు
  వివరణ: కొవిడ్‌-19 మహమ్మారి వల్ల వచ్చిన పదాల్లో డూమ్స్‌ డే స్క్రోలింగ్‌ కూడా ఒకటి. కరోనాకు సంబంధించిన వార్తలను ప్రజలు నిరంతరాయంగా చదువుతూ ఉన్నారు. ఈ క్రమంలో తమ విధులను కూడా పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో నిద్ర కూడా పోవడం లేదు. ఈ తరహా స్థితినే డూమ్స్‌ డే స్క్రోలింగ్‌ అంటారు. 15 నుంచి 30 ఏండ్ల్ల వయస్సున్న యువత ఈ తరహా వార్తలను ఎక్కువగా చదవడం లేదా టీవీల్లో చూడటం చేస్తున్నారు.
 6. భారత దేశపు తొలి వ్యవసాయ ఎగుమతి సౌకర్య కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? (సి)
  ఎ) పాటియాల బి) లక్నో
  సి) పుణె డి) విజయవాడ
  వివరణ: మహారాష్ట్ర చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ అండ్‌ అగ్రికల్చర్‌, నాబార్డ్‌లు సంయుక్తంగా భారత దేశపు తొలి వ్యవసాయ ఎగుమతి సౌకర్య కేంద్రాన్ని పుణెలో ప్రారంభించాయి. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు ఇది ఉపయోగపడుతుంది. 2018లో భారత్‌ వ్యవసాయ ఎగుమతి విధానాన్ని ప్రకటించింది. రైతుల ఆదాయంతో పాటు వారి ఎగుమతులను కూడా రెండింతలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
 7. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తి భారత్‌ లక్ష్యం. ఇందులో గరిష్టంగా ఏ తరహా విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం? (ఎ)
  ఎ) సౌర విద్యుత్‌ బి) జీవ ఇంధనం
  సి) పవన విద్యుత్‌ డి) హైడ్రోపవర్‌
  వివరణ: 2015లో భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం 2022 నాటికి 175 గిగావాట్లు పునరుత్పాదక శక్తి ద్వారా సాధించాలి. ఇందులో సౌర విద్యుత్‌ 100 గిగావాట్లు, పవన్‌ విద్యుత్‌ 60, బయోపవర్‌ (జీవ ఇంధనం) 10 గిగావాట్లు కాగా మిగిలిన అయిదు హైడ్రోపవర్‌. అయితే దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సగానికి సగం తగ్గింది. కరోనా ఉధృతి కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020, డిసెంబర్‌ నాటికి 562 గిగావాట్లు మాత్రమే సాధ్యమైందని పేర్కొంది.
 8. కింది వాటిలో సరైనదానిని గుర్తించండి? (డి)
  1. తౌక్టే తుఫాన్‌కు ఆ పేరు పెట్టింది బంగ్లాదేశ్‌
  2. ఆ పేరు పెట్టింది మయన్మార్‌
  3. ఇది ఈ ఏడాది వచ్చిన రెండో తుఫాన్‌
  4. ఇది ఈ ఏడాది వచ్చిన తొలి తుఫాన్‌
   ఎ) 1, 4 బి) 1, 3 సి) 2, 3 డి) 2, 4
   వివరణ: దేశ పశ్చిమ తీరంలో అతి తీవ్ర తుఫాన్‌ గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ రాష్ర్టాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాదిలో ఇదే తొలి తుఫాన్‌. బర్మా భాషలో తౌక్టే అంటే పెద్దగా శబ్దం చేసే బల్లి అని అర్థం. చీకట్లోనూ చూడగలదు. ఈ పేరును సూచించిన దేశం మయన్మార్‌. భారత్‌కు పశ్చిమాన అరేబియా, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. బంగాళాఖాతంలో తుఫానుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఆ తుఫానులతో సమానంగా అరేబియా సముద్రంలోనూ తుఫానులు విరుచుకుపడుతున్నాయి. పెరుగుతున్న భూతాపమే దీనికి కారణమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
 9. ఎస్‌పీవోటీ (స్పాట్‌) పద్ధతిని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దేనికి సంబంధించింది? (సి)
  ఎ) తుఫానుల ఆవిర్భావ ప్రదేశాన్ని గుర్తించేది
  బి) భూకంపాలు ఎక్కడ సంభవిస్తాయో తెలిపే ప్రదేశం
  సి) కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష
  డి) వ్యాక్సిన్‌ల సమూహం
  వివరణ: స్పాట్‌ అనేది కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష. ఇది సంక్షిప్త రూపం. విస్తరిస్తే-స్కేలబుల్‌ అండ్‌ పోర్టబుల్‌ టెస్టింగ్‌. 30 నిమిషాల్లో పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. అమెరికా శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. లాలాజలం ద్వారా దీనిని పరీక్షిస్తారు. స్వల్ప శిక్షణతో ఎవరైనా దీనిని నిర్వహించవచ్చు. ఇది రివర్స్‌ ట్రాన్‌స్క్రిప్టేజ్‌ లూప్‌-మిడియేటెడ్‌ ఐసో థర్మల్‌ యాంప్లిఫికేషన్‌ అనే పద్ధతిని వినియోగిస్తుంది.
 10. ఇటీవల పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 10 సంవత్సరాల్లో 186 ఏనుగులు మృతిచెందాయి. కారణం? (బి)
  ఎ) అడవుల నరికివేత
  బి) రైలు ప్రమాదాలు సి) భూతాపం
  డి) నీటి లభ్యత లేకపోవడం
  వివరణ: 2009-10 నుంచి 2020-21 మధ్య రైలు ప్రమాదాల వల్ల 186 ఏనుగులు చనిపోయినట్లు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అతి ఎక్కువగా అస్సాం రాష్ట్రంలో 62 ఏనుగులు మృతిచెందాయి. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో 57 ఏనుగులు రైలు ప్రమాదం బారిన పడి చనిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో అతి తక్కువగా కేవలం ఒక ఏనుగు మృతిచెందింది. ఈ తరహా ప్రమాదాలు నివారించడానికి రైల్వే, పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
 11. ‘మోమా (ఎంవోఎంఏ) మార్కెట్‌’ అనే యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం? (సి)
  ఎ) ఢిల్లీ బి) తెలంగాణ
  సి) మణిపూర్‌ డి) ఏదీకాదు
  వివరణ: ఎంవోఎంఏ అనేది సంక్షిప్త రూపం. దీనిని విస్తరిస్తే మణిపూర్‌ ఆర్గానిక్‌ మిషన్‌ ఏజెన్సీ. ఇళ్లలోకే కూరగాయలను ఇవ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ ఇది. మణిపూర్‌ ఆర్గానిక్‌ మిషన్‌ ఏజెన్సీ ఈ విధులను నిర్వహిస్తుంది. అలాగే కొవిడ్‌ వేళ పలు రాష్ర్టాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా విద్యను అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ‘మెడిసిన్‌ ఫ్రం స్కై (ఆకాశ మార్గాన ఔషధాలు)’ అనే సరికొత్త ప్రాజెక్ట్‌ను తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. ఈ తరహా ప్రాజెక్ట్‌ దేశంలోనే మొదటిది. ఇందుకు 16 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఎంపిక చేశారు. వికారాబాద్‌ ఆస్పత్రిని కేంద్రంగా గుర్తించారు.
 12. ‘ఫర్జాద్‌ బి’ గ్యాస్‌ ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది? (సి)
  ఎ) ఇజ్రాయెల్‌ బి) లెబనాన్‌
  సి) ఇరాన్‌ డి) సౌదీ అరేబియా
  వివరణ: ఫర్జాద్‌ బి గ్యాస్‌ ఫీల్డ్‌ ఇరాన్‌ దేశంలో ఉంది. ఇది ఒక ఆఫ్‌షోర్‌ గ్యాస్‌ క్షేత్రం. ఇరాన్‌లో ఫార్సీ దీవికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్‌కు చెందిన మూడు సంస్థలు 2008లో దీనిని కనుగొన్నాయి. అవి.. ఓఎన్‌జీసీ విదేశీ లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఆయిల్‌ ఇండియా. మూడు సంస్థలతో పాటు నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేయాలని భావించాయి. అయితే ఇరాన్‌పై 2010లో అమెరికాతో పాటు యూరోపియన్‌ యూనియన్లు ఆంక్షలు విధించాయి. 2015లో ఒక ఒప్పందం కుదరడంతో ఆంక్షలు ఎత్తి వేశారు. దీని అబివృద్ధికి 5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు వ్యయం చేసేందుకు కన్సార్టియం సిద్ధమయ్యింది. అయితే మే 2018లో ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించారు. దీంతో చర్చలు నిలిచాయి. ప్రస్తుత ఈ గ్యాస్‌ ఫీల్డ్‌ను ఇరాన్‌ తన దేశంలోని స్థానిక ఉత్పత్తిదారుకు అప్పగించింది. ఇది భారత్‌కు ఇబ్బందికర పరిణామం అని చెప్పొచ్చు.
 13. మే 16న ఏ రోజుగా నిర్వహిస్తారు? (డి)
  1. ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ లైట్‌
  2. ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ లివింగ్‌ టుగెదర్‌ ఇన్‌ పీస్‌
   ఎ) 1 బి) 2
   సి) రెండూ కాదు డి) 1, 2
   వివరణ: ఏటా మే 16న ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ లైట్‌, ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ లివింగ్‌ టుగెదర్‌ ఇన్‌ పీస్‌గా నిర్వహిస్తారు. 1960లో తొలిసారిగా లేజర్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఘనత సాధించిన భౌతిక శాస్త్రవేత్త థియోడోర్‌ మైమన్‌. శాస్త్ర-విజ్ఞానం, సంస్కృతి, కళలు, విద్య, సుస్థిరాభివృద్ధి.. ఇలా ఏ రంగం తీసుకున్నా కాంతి అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే 2021 ఈ రోజు ఇతివృత్తం ట్రస్ట్‌ సైన్స్‌ (విజ్ఞానంపై విశ్వాసం). అలాగే ప్రపంచ వ్యాప్తంగా సోదర భావం, శాంతి సహనాలను పెంపొందించడానికి శాంతియుతంగా కలిసిమెలసి జీవించేందుకు ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ నిర్ణయించింది. అప్పటి నుంచి మే 16న దీనిని నిర్వహిస్తున్నారు.
 14. ఫార్చూన్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలో 50 మంది గొప్ప నాయకుల జాబితాలో టాప్‌-10లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయుడు? (బి)
  ఎ) నరేంద్రమోదీ బి) అదర్‌ పూనావాలా
  సి) రఘురాం రాజన్‌ డి) అజిత్‌ ధోవల్‌
  వివరణ: కొవిడ్‌-19 సమయంలో భిన్నంగా పనిచేసి ప్రశంసలు పొందిన టాప్‌ 50 ప్రపంచ స్థాయి నాయకుల జాబితాను ఫార్చూన్‌ మ్యాగజైన్‌ ప్రచురించింది. ఇందులో 10వ స్థానంలో భారత్‌కు చెందిన అదర్‌ పూనావాలా ఉన్నారు. అతను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు సీఈవో. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్‌ అగ్రస్థానంలో ఉన్నారు.
 15. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థను భారత్‌ కేంద్రంగా చేపడుతున్న సంస్థ ఏది? (సి)
  ఎ) భారతి ఎయిర్‌టెల్‌ బి) గూగుల్‌
  సి) రిలయన్స్‌ జియో డి) వొడాఫోన్‌
  వివరణ: భారత్‌ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద సబ్‌మెరైన్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను రిలయన్స్‌ జియో చేపడుతుంది. ఇందులో రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి భారత్‌ను సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేషియా తదితర ఆసియా పసిఫిక్‌ మార్కెట్లతో అనుసంధానం చేస్తుంది. మరొకటి ఇటలీ, ఆఫ్రికాలతో అనుసంధానం చేస్తుంది. అధిక సామర్థ్యం, అధిక వేగం ఉన్న ఈ వ్యవస్థలు 200 టీబీపీఎస్‌ (టెరాబైట్స్‌ పర్‌ సెకండ్‌) సామర్థ్యాన్ని కలిగి 16,000 కిలోమీటర్ల మేర విస్తరిస్తాయి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘ఫర్జాద్‌ బి’ గ్యాస్‌ ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది?

ట్రెండింగ్‌

Advertisement