e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ‘పాండ్యగజకేసరి’ బిరుదు పొందినవారు?

‘పాండ్యగజకేసరి’ బిరుదు పొందినవారు?

‘పాండ్యగజకేసరి’ బిరుదు పొందినవారు?

రాచకొండ-దేవరకొండ వెలమలు (క్రీ.శ.1324-1475)

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం నేటి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వెలసిన రాజ్యమే రేచర్ల వెలమ రాజ్యం. కాపయనాయుడి మరణానంతరం తెలంగాణలోని ముసునూరు రాజ్యాన్ని ఆక్రమించి మొత్తం తెలంగాణకు పరిపాలనాధిపతులయ్యారు. సుమారు 150 ఏండ్లు రాచకొండ, దేవరకొండలను రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తూ నాటి తెలుగుదేశ లేదా ఆంధ్రదేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. వీరినే వెలమలు లేదా పద్మనాయకులు అని కూడా అంటారు. వీరిది రేచర్ల గోత్రం. వీరి పరిపాలన కాలంలో నిరంతరం యుద్ధాలు జరిగినప్పటికీ వీరి సమర్థవంతమైన పరిపాలన ఫలితంగా రాజ్యం ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా సాంస్కృతిక రంగంలో కూడా ముందంజ వేసింది. కళా, సారస్వత పోషణలో వీరు కాకతీయ వారసులనిపించుకున్నారు.

ఆధారాలు
వీరి చరిత్ర తెలుసుకోవడానికి అనేక ఆధారాలున్నాయి. అవి వీరి పరిపాలన కాలంలో వేయించిన రాచకొండ, దేవరకొండ, భువనగిరి, ఐనవోలు, గార్ల, దేవులమ్మ నాగారం, బెల్లంకొండ, ఉమామహేశ్వరం, ఓరుగల్లు, సింహాచలం, శ్రీకూర్మం మొదలైన ప్రదేశాల్లో లభించిన శాసనాలు.
వారి కాలం నాటి సాహిత్య రచనలైన సంగీత రత్నాకరం, రసార్ణవ సుధాకరం, మదన విలాస బాణం, భోగినీ దండకం, హరిశ్చంద్రోపాఖ్యానం, సింహాసన ద్వాత్రింశిక, వెలుగోటి వారి వంశావళి, చాటువులు, సురభి వంశ చరిత్ర, పెరిస్టా వంటి విదేశీ రచనలు కూడా తెలియజేస్తున్నాయి. అంతేగాకుండా సమకాలీన గజపతులు, రెడ్డి రాజులు, విజయనగర రాజుల శాసనాలు, సాహిత్యం మొదలైనవి ఉపయోగపడుతున్నాయి.

రాజకీయ చరిత్ర
రేచర్ల వెలమ రాజులు మొదట కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. ఆ నాటి రైతు బృందాల్లో ప్రబలమైన వెలమ కులానికి చెందిన బేతాళనాయుడు అనే వ్యక్తి రేచర్ల వంశ స్థాపకుడు. బేతాళనాయుడు నిక్షిప్త నిధిని కనుక్కోవడంతో అతడి ఎదుగుదల ప్రారంభమైందని వెలుగోటి వారి వంశావళి చెబుతుంది. ఇతడి జన్మస్థలం నేటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం ప్రాంతంలోని ఆమనగల్లు.

ఆ కాలంలో రేచర్ల వెలమలు కాకతీయ సామంతులుగా ఆమనగల్లు, పిల్లలమర్రిని పాలించేవారు. క్రీ.శ. 1225-53 ప్రాంతంలో కాకతీయ గణపతిదేవుడు బేతాళనాయుడిని ఆమనగల్‌ ప్రాంతానికి స్థానిక పాలకుడిగా నియమించాడు. ఈవిధంగా రేచర్ల వెలమలు గణపతిదేవుడి పాలనాకాలంలో, తరువాత అతడి కుమార్తె రుద్రమదేవి పరిపాలనా కాలంలోనూ ప్రముఖ స్థానాలను ఆక్రమించారు.
గణపతిదేవుడి కాలం నుంచి ప్రతాపరుద్రుడి వరకు కాకతీయుల పాలన వ్యవహారాల్లో ప్రముఖపాత్ర పోషించారు. ఢిల్లీ సుల్తానుల చేతిలో కాకతీయ వంశం అంతమయ్యాక స్వతంత్ర శక్తిగా ఎదిగి సమర్థవంత పరిపాలనను ప్రజలకు అందించారు.

బేతాళనాయుడికి దామానాయుడు, ప్రసాదిత్య నాయుడు, రుద్ర నాయకుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రేచర్ల వెలమ రాజులు లేదా పద్మనాయకుల చరిత్ర వీరితోనే ప్రారంభమయ్యింది. వీరు ముగ్గురూ కాకతీయుల కొలువులో సేనాధిపతులు. కాకతీయ రుద్రదేవుడు ఆ తరువాత గణపతిదేవుడి పరిపాలన కాలంలో ప్రముఖ పాత్ర పోషించిన మల్యాల, రేచర్ల రెడ్డి నాయకులు రాజ్య నిర్వహణలో క్రియాశీలంగా పాలుపంచుకోకుండా ఆ సమయానికి కనుమరుగయ్యారు. ఈ ఖాళీని రేచర్ల వెలమ బేతాళనాయుడి ముగ్గురు కుమారులు పూరించారు.
బేతాళనాయుడి ముగ్గురు కుమారుల్లో కుటుంబ పెద్ద అయిన రుద్రుడు గణపతిదేవుడి పరిపాలనా ప్రారంభ రోజుల్లో రాజ్య సిరిసంపదలను, వైభోగాన్ని తిరిగి స్థాపించడంలో ప్రముఖపాత్ర పోషించాడు. కాకతీయ రాజు రుద్రదేవుడు, అతడి సోదరుడు మహాదేవుడు యాదవ రాజులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత గణపతిదేవుడిని యాదవ రాజులు దేవగిరిలో బంధించారు.ఆ సమయంలో ఓరుగల్లుపై సర్దారులు తిరుగుబాటు చేసినా రేచర్ల రుద్రుడు విశ్వాసపాత్రంగా విదేశీ దురాక్రమణదారులను పారదోలాడు. దేవగిరి కారాగారవాసం నుంచి గణపతిదేవుడు విముక్తమయ్యే వరకు రాజ్యాన్ని పాలించి గణపతిదేవుడి మెప్పు పొందాడు. ‘కాకతీయ రాజ్యస్థాపన భారధౌరేయుడు’ అని బిరుదు పొందాడు.

బేతాళనాయుడి కుమారుల్లో రెండోవాడైన ప్రసాదిత్యుడు రుద్రమదేవి పరిపాలన ప్రారంభ దశల్లో ఆమెపై కొంతమంది రాచకుటుంబ సభ్యులు తిరుగుబాటు చేయగా ఆ తిరుగుబాట్లను అణచి రాణి పక్షం వహించాడు. తన విశ్వసనీయతకు గుర్తింపుగా ‘కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయపితామహాంక’ అనే బిరుదులను రుద్రమదేవి నుంచి పొందాడు. రేచర్ల సోదరుల్లో మూడోవాడు ‘దామానాయుడు’. రుద్రమదేవి తండ్రి గణపతిదేవుడు తమ తండ్రి బేతాళనాయుడికి ఇచ్చిన ఆమనగల్లు వ్యవహారాలను చక్కదిద్దడంలో కాలం గడిపాడు. అతడు ‘ఖడ్గ నారాయణ, రాయగోయగాహళ, భుజబలభీమ, ప్రతిగండ భైరవ’ అనే బిరుదులను పొందినట్లు వెలుగోటి వారి వంశావళి పేర్కొంటుంది.

దామానాయుడి కుమారుడు వెన్నమ నాయుడు అల్లాఉద్దీన్‌ కాలంలో వచ్చిన ముస్లిం దండయాత్రలను ఎదిరించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. వెన్నమ నాయుని కుమారుడు ‘ఎరదాచనాయుడు’ ప్రతాపరుద్రుని కాలంలో సేనాధిపతి. 1316లో ప్రతాపరుద్రుడు పాండ్యులపై దండయాత్ర చేసినప్పుడు ఎరదాచనాయుడు కాకతీయ ప్రతాపరుద్రుడి పక్షాన పోరాడి కాకతీయ ప్రభువులపై తన విశ్వసనీయత చాటుకున్నాడు. అందుకు గుర్తింపుగా ప్రతాపరుద్రుడు ఎరదాచయ్యను ‘పంచపాండ్యదళ విభాళ, కంచి కవాటా చూరకార, పాండ్యగజకేసరి’ అనే బిరుదులతో సత్కరించాడు. ఎరదాచనాయుని పెద్ద కుమారుడైన ‘మొదటి సింగమనాయుడు’ రేచర్ల వెలమ రాజ్య స్థాపకుడు.

మొదటి సింగమ నాయుడు (1325-61)
రేచర్ల వెలమ రాజ్య స్థాపకుడు మొదటి సింగమ నాయుడు. ఇతడు ఆమనగల్లును రాజధానిగా చేసుకొని పాలించాడు.తన తండ్రి ఎరదాచనాయునితో పాటు ఇతడు కూడా కంచి దండయాత్రలో పాల్గొన్నాడు.తరువాత ప్రతాపరుద్రుని ఆజ్ఞపై 1320లో కంపిలి దండయాత్రలో పాల్గొన్నాడు. 1323లో కాకతీయులకు జునాఖాన్‌తో జరిగిన చివరి యుద్ధంలో కూడా పాల్గొన్నాడు.
ఈ యుద్ధంలో కొంతమంది కాకతీయ సేనానులు మరణించగా సింగమనాయుడు బతికిబయటపడ్డాడు.ఇతడు కృష్ణా, తుంగభద్ర అంతర్వేది, ఏలేశ్వరం మొదలైన ప్రాంతాలను జయించాడు. ఇతడు సోమవంశ క్షత్రియుల ప్రాంతాలను జయించే క్రమంలో అతడి బావమరిది ‘చింతపల్లి సింగమనాయుడు’ జల్లిపల్లి (ఖమ్మం సమీపంలో ఉన్న ప్రాంతం) కోటలో బందీగా చిక్కాడు.తన బావమరిదిని విడిపించుకోవడానికి రేచర్ల సింగమనాయుడు పెద్ద సైన్యంతో జల్లిపల్లి కోటను ముట్టడించాడు.దీంతో సోమ వంశస్థులు ‘తంబళడియ్య’ అనే వ్యక్తిని మొదటి సింగమనాయుని వద్దకు రాయబారిగా పంపారు.అతడితో సింగమనాయుడు మంతనాలు చేసే సమయంలో తంబళడియ్య సింగమనాయుడిని పొడిచి చంపాడు. ఈ విధంగా మొదటి సింగమనాయుడు మరణించాడు.అతడు మరణించే నాటికి కందూరు చోళులు పాలించిన ప్రాంతం అంతా రేచర్ల వెలమ రాజ్య ఆధీనంలోకి వచ్చింది. రేచర్ల రాజ్యం స్థిరపడింది.

మొదటి అనపోతానాయుడు (1361-83)
మొదటి సింగమ నాయుడి మరణానంతరం అతడి పెద్ద కుమారుడైన అనపోతానాయుడు సింహాసనం అధిష్టించాడు.ఇతడు తన సోదరుడు మాదానాయకుని సహాయంతో జల్లిపల్లిపై దండెత్తి తన తండ్రి మరణానికి కారకులైన సోమ వంశస్థులను, వారికి సహాయంగా వచ్చిన రెడ్డి నాయకులను హతమార్చి ‘సోమకుల పరశురామ’ అనే బిరుదు పొందాడు.ఈ దండయాత్ర తరువాత అనపోతానాయుడు తన కోట రాచకొండను అభేద్యంగా చేయడానికి ఒక రాతికోటను, అనపోత సముద్రం అనే జలాశయాన్ని నిర్మించి, బావులను తవ్వించి శత్రువుల దాడి నుంచి రక్షించుకునేందుకు దుర్భేద్యమైన దుర్గంగా మార్చినట్లు 1365లో అతడు రాచకొండలో వేయించిన మూడు శాసనాలు ధృవీకరిస్తున్నాయి.ఇతడు రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు. ఇతడి కాలంలోనే రెడ్లకు, వెలమలకు సంఘర్షణ ప్రారంభమైంది.అనపోత, మాదా నాయుడులు రెడ్డి రాజ్యంపై దండెత్తి ధరణికోట వద్ద కొండవీటి అనవేమారెడ్డిని జయించి శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించారని ‘వెలుగోటి వారి వంశావళి’ చెబుతుంది.

తదుపరి ముసునూరి కాపయనాయునిపై దండెత్తి 1367-68 మధ్యకాలంలో ఓరుగల్లు సమీపంలో భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో కాపనాయుని హతమార్చి ఓరుగల్లును వశం చేసుకున్నాడు. ఈ యుద్ధాన్నే ‘భీమవరం’ యుద్ధం అంటారు.ఆ తరువాత అనపోతానాయుడు భువనగిరి, శనిగరం మొదలైన కోటలను ఆక్రమించి ‘ఐనవోలు’ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ తన విజయాలకు చిహ్నంగా శాసనం వేయించాడు.ఈ కోటలను జయించిన అనంతరం ఇతడు ‘ఆంధ్రదేశాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.ఈ విజయాల వల్ల రేచర్ల వెలమ రాజ్యం తెలంగాణలో ఉత్తరాన గోదావరి నుంచి దక్షిణాన శ్రీశైలం వరకు విస్తరించింది. తూర్పున కొండవీటి రాజ్యం, పశ్చిమాన బహమనీ రాజ్యం సరిహద్దులుగా మారాయి.ఇతడి కాలంలో వెలమలు బహమనీ సుల్తానులతో మైత్రి వహించి తమ రాజ్య విస్తరణను కొనసాగించారు. 1356, 58 సంవత్సరాల్లో అనపోతానాయుడు కళింగపై దండెత్తినట్లు అతడి సింహాచల శాసనం తెలియజేస్తుంది.

శ్రీపర్వతంపైకి యాత్రికులు తేలికగా వెళ్లేందుకు అనపోతానాయుడు మెట్లు కట్టించాడని ‘రసార్ణవ సుధాకరం’ తెలుపుతుంది.ఈ విషయానికి మాదానాయుడు శ్రీశైలం సమీపంలోని జాతర రేవు వద్ద వేయించిన శాసనం వల్ల సమర్థన లభిస్తుంది. తెలంగాణ నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆ మెట్లు కట్టించినట్లు కూడా ఆ శాసనం తెలుపుతుంది.అనపోతానాయుడు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యపు ఆగ్నేయ సరిహద్దు దృష్ట్యా దేవరకొండ రాజ్యాన్ని స్థాపించి తన సోదరుడైన మొదటి మాదానాయుడిని దేవరకొండ రాజ్యపాలకునిగా నియమించాడు.ఇలా వెలమ రాజ్యం రెండుగా రాచకొండ, దేవవరకొండ రాజ్యాలుగా విభజించబడ్డాయి. రాజధానులు వేరైనా వారి వంశీయులు వేర్వేరుగా పాలిస్తూ ఉభయులు కలిసిమెలసి వెలమ రాజ్య రక్షణ కోసం పాటుపడ్డారు.

సాసాల మల్లికార్జున్‌
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘పాండ్యగజకేసరి’ బిరుదు పొందినవారు?

ట్రెండింగ్‌

Advertisement