e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్‌' దేనికి సంబంధించింది?

‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్‌’ దేనికి సంబంధించింది?

‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్‌' దేనికి సంబంధించింది?
 1. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో జరిగే మార్పు ఏమిటి? (ఎ)
  ఎ) ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా మారుతుంది
  బి) లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సూచించిన వ్యక్తులనే మంత్రులుగా నియమిస్తారు
  సి) కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే ఢిల్లీ శాసన సభ శాసనాలు చేయాల్సి ఉంటుంది
  డి) ఢిల్లీ హైకోర్ట్‌ న్యాయాధికారాలు కేంద్రానికి బదిలీ అవుతాయి
  వివరణ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాధికారాలకు సంబంధించి కేంద్రం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఏప్రిల్‌ 27, 2021న ఇది అమలులోకి వచ్చింది. దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ (సవరణ) చట్టం ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే. రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు చెప్పాలి. ఎన్నికయిన ప్రభుత్వ బాధ్యతలను స్పష్టంగా నిర్వచించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఘర్షణ కలగకుండా చూడటంతో పాటు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికే సవరణ చేశామని కేంద్రం పేర్కొంది.
 2. స్వయం చోదిత వాహనాల విధానాన్ని ప్రకటించిన తొలి దేశం ఏది? (డి)
  ఎ) దక్షిణ కొరియా బి) జపాన్‌
  సి) ఆస్ట్రేలియా డి) యూకే
  వివరణ: స్వయం చోదిత వాహనాల విధానాన్ని యూకే ప్రకటించింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం యూకేనే. ఈ వాహనాల భద్రత కోసం హైవే కోడ్‌ను రూపొందించారు. డ్రైవర్‌ లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వాహనాలనే స్వయం చోదిత వాహనాలు అంటారు. వీటి కోసం ఆటోమేటెడ్‌ లేన్‌ కీపింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తారు. ఇందులో సెన్సార్లు, ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వాహనాలన్నీ ఒకే వరుసలో ఉండేలా చూస్తారు.
 3. మే ఫ్లవర్‌ 400 ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
  ఎ) కొత్త రకం కరోనా వైరస్‌
  బి) అధిక దిగుబడినిచ్చే కొత్త పుష్పాల వంగడం
  సి) తొలి కృత్రిమ మేధ నౌక
  డి) తొలి కృత్రిమ మేధ ఉపగ్రహం
  వివరణ: మే ఫ్లవర్‌ 400 అనేది ప్రపంచంలోనే తొలి కృత్రిమ మేధ నౌక. దీనిని మెరైన్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ప్రొమేర్‌కు చెందిన పరిశోధకులు తయారు చేశారు. ఐబీఎం సంస్థ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించింది. 15 మీటర్ల పొడవు, తొమ్మిది టన్నుల బరువు ఉండే ఈ నౌక సముద్రపు కాలుష్యాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించింది. ప్రమాదాలను లేదా ఢీకొట్టడం ఎలా నివారించాలో ఇందులో ప్రోగ్రామింగ్‌ చేసి ఉంది. సముద్రాల్లో జంతువుల జాడను కూడా తెలుపుతుంది. దీనివల్ల సముద్రంలో జంతు విస్తరణను అవగాహన చేసుకోవచ్చు. ప్రయాణం పూర్తయితే అట్లాంటిక్‌ సముద్రాన్ని దాటిన తొలి మానవ రహిత వాహనంగా గుర్తింపు పొందుతుంది.
 4. సీవోవో-జీఈఈటీ ఏంటి? (బి)
  ఎ) సరిహద్దు పరిరక్షణకు భద్రత దళాలు
  చేపట్టిన ఆపరేషన్‌
  బి) కొవిడ్‌ కట్టడికి భద్రత దళాలు నిర్వహించే ఆపరేషన్‌
  సి) ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌ డి) ఏదీకాదు
  వివరణ: కొవిడ్‌-19 కట్టడికి భద్రత దళాలు సీవోవో-జేఈఈటీ అనే ఒక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. సైన్యంలోని త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేస్తూ ఆక్సిజన్‌ సరఫరా మెరుగ్గా ఉండేట్లు చేస్తారు. అలాగే పౌర పాలనకు సాయం చేయడానికి కొవిడ్‌ బెడ్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తారు. డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డాక్టర్‌ మాధురి కనిత్కర్‌ సమన్వయం చేస్తారు. భద్రత దళాల్లో ‘త్రీ స్టార్‌’ను పొందిన మూడో మహిళ మాధురి.
 5. మరాఠాల రిజర్వేషన్‌ల సందర్భంగా సుప్రీంకోర్ట్‌ కింది వాటిలో ఏం చెప్పింది? (డి)
  1) రిజర్వేషన్ల పరిమితిపై సమీక్షకు నిరాకరణ
  2) మరాఠాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడలేదు
  ఎ) 1 సరైంది బి) 2 సరైంది
  సి) 1, 2 సరికాదు డి) 1, 2 సరైనవి
  వివరణ: యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగరీత్యా చెల్లుబాటు కాదని మరాఠాల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్ట్‌ తీర్పు చెప్పింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ 1992లో ఇచ్చిన మండల్‌ తీర్పుకు ఇది విరుద్ధం అని, దీనిని సమీక్షించలేమని చెప్పింది. ఈ కేసునే ఇందిరా సాహ్ని కేసు అని కూడా అంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైన, అసాధారణ పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడలేదని సుప్రీంకోర్ట్‌ తన తీర్పులో వెల్లడించింది.
 6. ఇటీవల కాలంలో బయోబబుల్‌ వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (సి)
  ఎ) కృత్రిమంగా రూపొందించిన జీవ బుడగ
  బి) వీధుల్లో మందులను పిచికారి చేయడానికి రూపొందించిన బుడగ
  సి) కనిపించని తెర, కొవిడ్‌-19 నెగెటివ్‌ వచ్చినవాళ్లతో పరిమితంగా ఉంటారు
  డి) ఏదీకాదు
  వివరణ: బయోబబుల్‌ అంటే కనిపించని తెరగా చెప్పొచ్చు. క్రీడా పోటీల నిర్వహణకు వినియోగిస్తున్నారు. యూఏఈలో గతేడాది ఐపీఎల్‌ నిర్వహణలో ఈ విధానాన్ని ఉపయోగించారు. భారత్‌లోనూ 2021లో నిర్వహించిన ఐపీఎల్‌లో కూడా ఇదే పద్ధతి ఉంది. అయితే కొందరు ఆటగాళ్లకు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో నిరవధికంగా ఐపీఎల్‌ను వాయిదా వేశారు. బబుల్‌లో ఉన్న వాళ్లు బయటవారిని కలవరు. అందులోకి బయటివాళ్లు రారు. బబుల్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చాకే అనుమతి ఇస్తారు.
 7. భారీ రాకాసిబల్లి శిలాజాన్ని ఇటీవల భారత్‌లోని ఏ రాష్ట్రంలో గుర్తించారు? (ఎ)
  ఎ) మేఘాలయ బి) రాజస్థాన్‌
  సి) గుజరాత్‌ డి) అరుణాచల్‌ ప్రదేశ్‌
  వివరణ: సుమారు 10 కోట్ల ఏళ్ల నాటి రాకాసిబల్లి ఎముక శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మేఘాలయాలోని పశ్చిమ ఖాసీ హిల్స్‌ జిల్లాలో లభించిన ఈ శిలాజంలో టైటానోసారస్‌ అనే రాకాసిబల్లి జాతి మూలాలు ఉన్నాయి. ఈ తరహా జాతికి చెందిన అవశేషాలు ఈ ప్రాంతంలో దొరకడం ఇదే ప్రథమం. భూమిమీద సంచరించిన అతిపెద్ద జంతువుల్లో ఇవి కూడా ఉన్నాయి. 2001లో కూడా మేఘాలయాలో డైనోసార్‌ ఎముకల శిలాజాలు దొరికాయి. అయితే అవి చిన్న తునకల రూపంలో ఉండటంతో జాతిని గుర్తించడం కష్టమయ్యింది. తాజాగా 55 సెంటీమీటర్ల పొడవైన కాలి ఎముక కూడా ఉంది. దీంతో వివరాలను గుర్తించడం తేలికైంది.
 8. భారత్‌ నుంచి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి హోదాను పొందనున్న తొలి యూరప్‌ దేశం ఏది? (డి)
  ఎ) స్విట్జర్లాండ్‌ బి) నార్వే
  సి) ఫ్రాన్స్‌ డి) బ్రిటన్‌
  వివరణ: పరస్పర సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లు నిర్ణయించారు. వర్చువల్‌ పద్ధతిలో ఇరువురు అగ్రనేతలు పలు అంశాలపై చర్చించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి హోదాను బ్రిటన్‌కు ఇవ్వడానికి భారత్‌ నిర్ణయించింది. యూరప్‌లో ఈ హోదాను పొందనున్న తొలి దేశం ఇదే. ఆరోగ్యం, వాతావరణ మార్పులు, వాణిజ్యం, విద్య, శాస్త్ర-సాంకేతిక, రక్షణ రంగాల్లో బంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
 9. ఇటీవల వచ్చిన అయిదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల్లో, ఏ రాష్ట్రంలో అధికారం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారింది? (సి)
  ఎ) పశ్చిమబెంగాల్‌ బి) కేరళ
  సి) తమిళనాడు డి) అసోం
  వివరణ: నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడినాయి. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ గత ఎన్నికల్లో దక్కిన విజయాన్ని నిలబెట్టుకుంది. మూడోసారి ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా కేరళలోనూ వామపక్ష కూటమే మళ్లీ అధికారంలోకి వచ్చింది. అసోంలోనూ ఎన్‌డీఏ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే తమిళనాడులో మాత్రం గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పార్టీని ప్రజలు తిరస్కరించారు. డీఎంకేను విజయం వరించింది. పుదుచ్చేరిలో కూడా అధికారం మారింది. ఎన్‌డీఏనూ విజయం వరించింది. తెలంగాణలో నాగార్జునసాగర్‌కు జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నోముల భగత్‌ విజయం సాధించారు.
 10. ఎంఏసీఎస్‌ 1407 ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (ఎ)
  ఎ) అధిక దిగుబడినిచ్చే కొత్త సోయాబీన్‌ వంగడం
  బి) కరోనా ఫలితాలు త్వరగా రావడానికి ఆవిష్కరించిన కొత్త పరీక్ష విధానం
  సి) ఆక్సిజన్‌ కొరత ఉన్న ప్రాంతాల్లో ఉపయోగపడే సాధనం
  డి) అధిక దిగుబడికి ఉపయోగపడే
  ఒక ఎరువు
  వివరణ: అధిక దిగుబడిని ఇచ్చే కొత్త సోయాబీన్‌ వంగడాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని పేరు ఎంఏఐసీఎస్‌ 1407. అసోం, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు ఈశాన్య రాష్ర్టాల్లో పండించేందుకు అనువుగా ఇది ఉంటుంది. అగార్కర్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఐసీఏఆర్‌లతో కలిసి దీనిని అభివృద్ధి చేసింది.
 11. భారత సైన్యం తన తొలి హరిత సౌర శక్తి ప్లాంట్‌ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? (డి)
  ఎ) గుజరాత్‌ బి) రాజస్థాన్‌
  సి) పంజాబ్‌ డి) సిక్కిం
  వివరణ: హరిత సౌరశక్తి ప్లాంట్‌ను ఉత్తర సిక్కింలో ఏప్రిల్‌ 30న భారత సైన్యం ప్రారంభించింది. ఈ తరహా ప్రాజెక్ట్‌ భారత సైన్యానికి ఇదే మొదటిది. ఆ ప్లాంట్‌లో వెనడియం ఆధారిత బ్యాటరీ సాంకేతికతను ఉపయోగిస్తారు. సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ప్లాంట్‌ సామర్థ్యం 56 కేవీఏ. ఐఐటీ ముంబయి సాయంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. వెనడియం అనేది ఒక రసాయన మూలకం. భారతదేశంలో కూడా ఈ మూలకపు నిల్వలు ఉన్నాయి. తొలిసారిగా 2021 జనవరిలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఈ మూలక నిల్వలను గుర్తించారు.
 12. ‘క్రాసిడ్యురా నార్కొండామికా’ వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (సి)
  ఎ) ఇటీవల కనుగొన్న కొత్త దీవి
  బి) నార్కొండం అధ్యయనానికి చేపట్టిన ప్రాజెక్ట్‌
  సి) ఇటీవల గుర్తించిన కొత్త క్షీరదానికి పెట్టిన పేరు డి) ఏదీకాదు
  వివరణ: కీటకాలను తినే ఒక కొత్త క్షీరదాన్ని జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీనికి క్రాసిడ్యురా నార్కొండామికా అని పేరు పెట్టారు. దాదాపు ఇంట్లో ఉండే ఎలుక పరిమాణంలో ఈ క్షీరద జంతువులు ఉంటాయి. అండమాన్‌, నికోబార్‌ దీవిలోని నార్కొండంలో దీనిని గుర్తించారు. దీంతో భారత్‌లో క్షీరదాల సంఖ్య 422కు చేరింది.
 13. భూ అక్షం నుంచి వచ్చే మార్పు 1990 దశకం నుంచి భారీగా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు, దీనికి కారణం ఏంటని పేర్కొన్నారు? (ఎ)
  ఎ) భారీగా హిమానీ నదాలు కరగడం
  బి) అన్ని దేశాలు భారీ ఎత్తున చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగాలు
  సి) సెల్‌ఫోన్‌ వాడకం విపరీతంగా పెరగడం
  డి) ఏదీకాదు
  వివరణ: భారీ ఎత్తున హిమానీనదాలు కరుగుతూ ఉన్నందున భూ అక్షంలో వచ్చే మార్పు 1990 దశకం నుంచి పెరుగుతూ ఉందని అమెరికాలోని జియోఫిజికల్‌ రిసెర్చ్‌ లెటర్స్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌ పేర్కొంది. భూమి తన చుట్టూ తాను ఒక అక్షం ఆధారంగా చేసుకొని తిరుగుతుంది. దీనినే భూ అక్షం అంటారు. 1990 నుంచి వస్తున్న పర్యావరణ మార్పులతో భూతాపం పెరిగి, భారీ ఎత్తున మంచు కరిగి సముద్రాల్లో చేరుతున్నాయి. దీనివల్ల భూ ధ్రువాలు కొంత తూర్పు దిశగా వెళుతున్నాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
 14. ‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌’ దేనికి సంబంధించింది? (బి)
  ఎ) క్రీడలతోనే మానసికోల్లాసం అని చెప్పే కార్యక్రమం
  బి) పోటీల్లో అవకతవకలపై అవగాహన
  కల్పించేది
  సి) క్రీడలతో రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రక్రియ
  డి) ఏదీ కాదు
  వివరణ: బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ అనేది ఒక ప్రచారం. పోటీల్లో అవకతవకలపై అథ్లెట్లు, కోచ్‌లు, అధికార ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు 2018లో దీనిని ప్రారంభించారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ చేపట్టిన ఈ ప్రచారానికి భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఎంపికయ్యారు. కెనడాకు చెందిన షట్లర్‌ మిచెల్లే లీ తో కలిసి ఆమె పనిచేస్తారు. 2020 ఏప్రిల్‌ నుంచి వీరు ‘ఐ యామ్‌ బ్మాడ్మింటన్‌’ అనే ప్రచారానికి కూడా అంబాసిడర్లుగా ఉన్నారు.
 15. డ్రోన్ల ద్వారా కరోనా టీకాలను పంపిణీ చేయడానికి అనుమతి పొందిన తొలి రాష్ట్రం ఏది? (సి)
  ఎ) మహారాష్ట్ర బి) కేరళ
  సి) తెలంగాణ డి) ఆంధ్రప్రదేశ్‌
  వివరణ: రాష్ట్రంలో రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు కరోనా టీకాల పంపిణీ కోసం డ్రోన్లను వినియోగించనున్నారు. ఇందుకుగాను రాష్ట్రం చేసిన అభ్యర్థనకు కేంద్ర పౌర విమానయాన శాఖకు అనుమతి ఇచ్చింది. ఈ విధంగా అనుమతి పొందిన తొలి రాష్ట్రం తెలంగాణ. వాహనాలు వెళ్లడానికి వీలులేని ప్రాంతాలకు అలాగే నదులు, కాల్వల తీరంలోని గ్రామాలకు ఔషధాలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తారు.

వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్‌
9849212411

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్‌' దేనికి సంబంధించింది?

ట్రెండింగ్‌

Advertisement