e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం

సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం

సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం

పరిచయం
ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది- జీన్‌ పియాజే (స్విట్జర్లాండ్‌), (1896-1980)
ఈయన జెనీవా యూనివర్సిటీలో శిశు మనస్తత్వ శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు.
22 ఏండ్లకే జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు.ఆల్ఫ్రెడ్‌ బినె మానసిక ప్రయోగశాలలో అనేక ప్రయోగాలు చేశారు.తన ముగ్గురు పిల్లల్లో వికాసం జరిగే విధానాన్ని అధ్యయనం చేసి ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.పిల్లల మనోవైజ్ఞానానికి సంబంధించి 25 రచనలు చేశారు.

కీలక పదాలు
ఈ సిద్ధాంతంలో అతి ముఖ్యమైన అంశం- స్కీమాటాలు
పరిసరాల్లో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు, పెద్దలు ఉపయోగించుకునే సంజ్ఞానాత్మక నిర్మితులు లేదా ప్రవర్తనా నమూనాలను స్కీమాటాలు అంటారు.
ప్రతి శిశువు పుట్టుకతోనే కొన్ని స్కీమాటాలను పొంది ఉంటాడు.
స్కీమాటాలకు ఉదా: శిశువు చనుబాలను తాగడం, చూడటం, తన్నడం, పట్టుకోవడం, కొట్టడం, శిశువు తన పెదవులకు తాకిన వస్తువును పీల్చడం మొదలైనవి.
శిశువు పుట్టినప్పటి నుంచి తన పరిసరాలతో ప్రతిచర్యలు జరపడంవల్ల ఈ స్కీమాటాల్లో మార్పు వస్తుంది. కాబట్టి వయస్సు పెరిగేకొద్ది స్కీమాటాలు మారుతాయి.
ఈ స్కీమాటాలు మొదట ఇంద్రియ చాలక నమూనాలో ఉంటాయి.
పీల్చడం, పట్టుకోవడం వంటి ఇంద్రియ చాలక కృత్యాలు బాహ్య ప్రవర్తనగాను, ప్రణాళికలు, సమస్యా పరిష్కార నియమాలు, వర్గీకరణ వంటి మానసిక చర్యలు శిశువు ఎదిగేకొద్ది మార్పుచెందుతాయి. వీటినే పియాజే ప్రచాలకాలు (ఆపరేషన్స్‌) అన్నాడు.
ప్రచాలకాలకు ఉదాహరణలు- సంజ్ఞానం, స్మృతి, ఏకకేంద్ర ఆలోచన, విభిన్న ఆలోచన, మూల్యాంకనం మొదలైనవి.
వయసుతో లేదా అనుభవాలతో, స్కీమాటాల్లో మార్పులు రావడానికి కారణమయ్యే సహజ సిద్ధమైన కార్యాచరణ నియమాలు 2 అవి.. 1) అనుకూలత (అడాప్టేషన్‌)
2) వ్యవస్థీకరణ (ఆర్గనైజేషన్‌)
అనుకూలత
పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్యవల్ల ఏర్పడే స్కీమాటాలతో కూడుకున్నదే అనుకూలత. దీనిలో 2 ప్రక్రియలు ఉంటాయి. అవి..
1) సాంశీకరణం (అసిమిలేషన్‌)
2) అనుగుణ్యం (అకామిడేషన్‌)
సాంశీకరణం/సంశ్లేషణం
శిశువులు తమలో ముందే కలిగి ఉన్న స్కీమాటాలను (పాత అనుభవాలను), ప్రస్తుతం ఏర్పడే అనుభవాలతో (కొత్త అనుభవాలు) పోల్చుకోవడాన్ని ‘సాంశీకరణం’ అంటారు.
ఉదా: 1) తనకు తెలిసిన పెద్దదైన తెల్లని పక్షిని చూసిన బాలుడు కొత్తగా విమానం చూసినప్పుడు విమానాన్ని పక్షిగా భావించడం
2) కుక్కను చూసిన అనుభవంగల బాలుడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్లు ఉన్నందువల్ల కుక్క అని పిలవడం
నోట్‌: కొత్త విషయాలను పాత విషయాలతో పోల్చడమే సాంశీకరణం
అనుగుణ్యం
పరిసరాలతో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు.
ప్రస్తుత ఆలోచనా విధానం పరిసరాలను పూర్తిగా గ్రహించడానికి సరిపోదని తెలుసుకొని పాత స్కీమాటాలను మార్పు చేసుకుంటారు.
అనుగుణ్యంలో వ్యక్తులు కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారు. ఉదా: 1) గాడిదను చూసి కుక్క అని అనుకున్న పిల్లవాడు దాని ఆకారం, రంగు, పరిమాణం, ధ్వని వంటి వాటిలోని భేదాలను గుర్తించి గాడిదను వేరొక జంతువుగా గుర్తించడం జరుగుతుంది.
నోట్‌: శిశువులు ఎక్కువగా మార్పు చెందకపోతే వారు అనుగుణ్యం కంటే సాంశీకరణం చేసుకుంటాడు. పియాజే దీనినే సంజ్ఞానాత్మక సమతుల్యత అన్నారు.
వేగవంతమైన మార్పు సంభవిస్తే పిల్లల్లో అసమతుల్యత స్థితి కలుగుతుంది.
కొత్త సమాచారం వారి ప్రస్తుత స్కీమాటాలకు సరిపోదని గుర్తిస్తే వారు సాంశీకరణం నుంచి అనుగుణ్యం వైపు మళ్లుతారు.
సమతుల్యత, అసమతుల్యత మధ్య ముందుకు-వెనుకకు వెళ్లే ప్రక్రియలను వివరించడానికి పియాజే సమతాస్థితి (ఈక్విలిబ్రేషన్‌) అనే పదాన్ని ఉపయోగించారు.
ఇలా జరగడంవల్ల ప్రభావవంతమైన స్కీమాటాలు ఏర్పడుతాయి.
వెరీ ఇంపార్టెంట్‌ నోట్‌:
1) శిశువు కొత్త పరిస్థితులను అవగాహన చేసుకోవడం- సాంశీకరణం
2) శిశువు కొత్త పరిస్థితులల్లో సర్దుబాటు చేసుకోవడం- అనుగుణ్యం
వ్యవస్థీకరణ
పిల్లలు కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కీమాటాలతో జతచేసి, తిరిగి దృఢమైన పరస్పర సంబంధంగల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకోవడమే వ్యవస్థీకరణ
ఉదా: పుట్టిన శిశువులో ప్రారంభంలో దేనికది స్వతంత్రంగా పనిచేసే పీల్చడం, చూడటం, పట్టుకోవడం అనే ప్రతిస్పందనలు ఉంటాయి. కొంతకాలానికి ఇవి విడివిడి సరళ ప్రవర్తనలుగా సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థగా సంఘటితమవుతాయి.
కాబట్టి భౌతిక లేదా మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరచే సిద్ధతే వ్యవస్థీకరణ
వ్యవస్థీకరణ పరిసరాలతో ప్రత్యక్ష సంబంధంగానే కాకుండా అంతర్గతంగా కూడా జరుగుతుంది.
నోట్‌
సంజ్ఞానాత్మక వికాస దశల్లో పిల్లలు ఇంద్రియ, చలనాత్మక చర్యలపై ఆధారపడే స్థితి నుంచి అమూర్త విచక్షణ చేయగల స్థితికి మారతారని పియాజే తెలిపారు.
సంజ్ఞానాత్మక వికాసం దశల క్రమంపై ఆధారపడుతుంది. కానీ వయస్సుపై ఆధారపడదు.
ఇది పిల్లలందరిలో జరిగే ప్రక్రియ అయినప్పటికీ వారిలో వైయక్తిక భేదాలు ఉంటాయి.
శిశువులో సంజ్ఞానాత్మక వికాసం 16 ఏండ్లకు పూర్తవుతుంది.

సంజ్ఞానాత్మక వికాస దశలు
జ్ఞానేంద్రియ చాలక దశ/ఇంద్రియ ప్రచాలక దశ/సంవేదన ప్రచాలక దశ
ఈ దశ శిశువు పుట్టిన నాటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది.
శిశువుకు భాష తెలియకపోవడంవల్ల పరిసరాలతో ఇంద్రియ, చాలక (చూడటం, నవ్వడం, కాళ్లు, చేతులు కదిలించడం) పరస్పర చర్యలకే పరిమితమవుతాడు.
ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి (రిఫ్లెక్సివ్‌ ఆర్గానిజం) నుంచి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచక జీవి (రిఫ్లెక్టివ్‌ ఆర్గానిజం)గా మారతాడు.

శిశువుకి పుట్టుకతోనే వచ్చిన ప్రతిక్రియలను బాగా మెరుగుపరచుకొని, అనుకరణను అధికంగా ప్రదర్శిస్తాడు.
1-4 నెలల కాలంలో 1) తనకు ఆనందాన్ని, తృప్తిని కలిగించే పనిని మళ్లీ మళ్లీ చేస్తాడు.
2) శిశువులో ఊహించే సామర్థ్యం మొదలైనవి.
ఉదా: తల్లి తనను దగ్గరకు తీసుకోగానే పాలిస్తుందని భావిస్తాడు.
4-8 నెలల కాలంలో 1) శిశువు తన దృష్టిని సొంత శరీరం నుంచి వస్తువులపైకి మళ్లిస్తాడు.
2) ఆటవస్తువులను, బొమ్మలను ఆడించి ఆనందాన్ని పొందుతాడు.
3) 8 నెలల వయస్సులో వస్తువులను చూసి ప్రతిస్పందిస్తాడు.
8-12 నెలల కాలంలో 1) శిశువు ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా, సమస్యాపరిష్కారం దిశవైపు సాగుతుంది.
2) తన ఎదుటలేని వస్తువు శాశ్వతంగా ఎక్కడో ఒకచోట ఉంటుందనే
వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు.
ఉదా: 1) తల్లి కనపించకపోతే వెదకడం
2) బొమ్మను దుప్పటి కింద దాచిపెడితే దుప్పటి తీసే ప్రయత్నం చేయడం
3) టాటా చెప్పడం ద్వారా ఇతరుల (తల్లి) ప్రవర్తనను అనుకరిస్తాడు.
12-18 నెలల కాలంలో 1) శిశువు వివిధ వస్తువుల మధ్య ఉన్న లక్షణాలను తెలుసుకోవడానికి
యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు.
2) వివిధ రకాల వస్తువులను కిందపడేసి వాటి నుంచి వచ్చే వివిధ శబ్దాలను
గమనించి ఆనందిస్తాడు.
18-24 నెలల కాలంలో 1) అంతరదృష్టి పద్ధతిని ఉపయోగించి ‘పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యా పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు.
ఉదా: అందని వస్తువులను అందుకోవడానికి, రకరకాల వస్తువులను ఉపయోగిస్తాడు (స్టూలు, కర్ర లాంటివి)

2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి కేంద్రీయ నాడీ వ్యవస్థ అభివృద్ధి చెంది, పిల్లల స్కీమాటాలు మానసిక స్వభావంగా మారుతాయి.
శిశువుకు 10 నెలల వయస్సులో అహం కేంద్రీకృత భావన ఏర్పడుతుంది.
పూర్వ ప్రచాలక దశ/ప్రాక్‌ ప్రచాలక దశ
ఈ దశ 2-7 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ దశలో శిశువు అసాధారణ మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు.
శిశువు భాషను ఉపయోగించడం నేర్చుకొని, ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు.
శిశువు ఆలోచన చేయడానికి భాషను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు.

ముఖ్యాంశాలు
వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ- పియాజే
బహుమతులు, పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుందనే వాదాన్ని పియాజే వ్యతిరేకించారు.
ఈ సిద్ధాంతం సార్వజనీనంగా ఆమోదం పొందింది.
తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం.
ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే ‘సంజ్ఞానం (కాగ్నిషన్‌)’.
ఆలోచన లేదా భావాన్ని ప్రత్యక్షం చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, వివేచించడం, నిర్ణయించడం లాంటి అనేక విధాల గురించి తెలుసుకోవడాన్ని చెప్పే పదమే- సంజ్ఞానం
పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి, నేర్పుతో నిర్వహించుకొని, అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు.
మెదడు అంతర్గత ప్రక్రియలు, ఉత్పాదకాలు జ్ఞానం పొందడానికి తోడ్పడటమే ‘సంజ్ఞానం’.
వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే ‘అభ్యసనం, ప్రత్యక్షం, స్మృతి, ఆలోచన’ మొదలైన వాటితో కూడుకున్న ప్రవర్తనే సంజ్ఞానం.
ప్రజ్ఞలో వికాసం జరగడాన్ని సంజ్ఞానాత్మక వికాసం అంటారు.
సంజ్ఞానాత్మక వికాసం అనేది మానసిక వికాసానికి సంబంధించినది.
lప్రతి శిశువు తన జీవనాన్ని సంజ్ఞానాత్మకతతో మొదలుపెట్టడు, స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు.
కాబట్టి ఈ సిద్ధాంతం నిర్మాణాత్మక ఉపగమంగా చెప్పబడింది.
శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుకూలంగా తనను తాను ఎలా మలుచుకుంటాడో, అలాగే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని (వస్తువు/సంఘటనం) ఎలా అర్థం చేసుకుంటాడో అనే దానికి ఇచ్చిన విరణే ‘సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం’.
ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే కింది పదాల అర్థాన్ని తెలుసుకోవాలి

శివపల్లి
టీఎస్‌& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం

ట్రెండింగ్‌

Advertisement