e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ వ్యక్తిలో న్యాయ భావన వికాసమే?

వ్యక్తిలో న్యాయ భావన వికాసమే?

వ్యక్తిలో న్యాయ భావన వికాసమే?

నైతిక వికాసం పరిచయం

ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది- లారెన్స్‌ కోల్‌బర్గ్‌ (హార్వర్డ్‌ యూనివర్సిటీ-యూఎస్‌ఏ)
తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న తన భార్యను బతికించుకోవడానికి మందులు కొనలేని పేద భర్త వాటిని దొంగతనం చేయవచ్చా? లాంటి నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించారు.
వీటిని 10-16 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ఇచ్చి వారి తీర్పు ఆధారంగా సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ముఖ్యాంశాలు
వ్యక్తిలో న్యాయ భావన వికాసమే నైతిక వికాసం.
తప్పు, ఒప్పు, మంచి, చెడులను తెలుసుకోవడమంటే నైతిక వికాసంలో మార్పు వచ్చినట్లే.
చిన్నపిల్లలు, జంతువుల్లో నైతిక వికాసం ఉండదు.
మిగతా వికాసాల కంటే నైతిక వికాసం క్లిష్టమైనది.
నైతిక వికాసం మిగతా వికాసాలతో పోల్చితే మందకొడిగా సాగుతుంది.
ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
పియాజే సిద్ధాంతంలోని దశలు లాగే నైతిక వికాసంలోని దశలు కూడా సార్వత్రికమైనవి, స్థిరమైనవి.
ఈయన ప్రకారం ప్రతి వ్యక్తిలో దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి. కానీ అందరి వ్యక్తుల్లో ఒకే వయస్సులో ఈ దశలు సంభవించవు.
వ్యక్తిలో నైతిక వికాసం అనేది ఒక స్థిరమైన క్రమంలో సాగుతుందని కోల్‌బర్గ్‌ తెలిపారు.
కోల్‌బర్గ్‌ తన సిద్ధాంతంలో 3 నైతిక వికాస స్థాయులను, ప్రతి స్థాయిలో 2 దశలను గుర్తించారు.

అవి..
1) పూర్వ సంప్రదాయ నైతికత
ఈ స్థాయి 4-10 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ స్థాయిలోని పిల్లలు తప్పు/ఒప్పు, మంచి/చెడు అనే అంశాలను వాటి పరిమాణం లేదా పర్యవసానాలను బట్టి ఆలోచిస్తారు.
శిశువు తనకు ఇబ్బందిని కలుగజేసేది తప్పుగాను, అవసరాలు తీర్చేదానిని ఒప్పుగాను, బహుమతులు ఇచ్చేది మంచిగాను, శిక్షించేది చెడుగాను భావిస్తాడు.
ఈ దశలో నైతికతను శారీరక శిక్షణాపరంగా అంచనావేస్తారు.
ఈ దశలో శిశువు ప్రవర్తనపై బాహ్య నియంత్రణ ఉంటుంది.
ఈ స్థాయిలోని పిల్లలు శిక్షను తప్పించుకోవడానికి పెద్దలు, తల్లిదండ్రులు, అధికారులు అంగీకరించే నియమాలను పాటిస్తారు.
ఈ స్థాయిలోని 2 దశలు 1) విధేయత, శిక్షా ఓరియంటేషన్‌ 2) సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్‌
విధేయత ఓరియంటేషన్‌ (Obedience and Punishment Orientation)
తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి వారి మాటలను గౌరవించి, పాటించి వారి పట్ల విధేయతగా ఉంటారు.
శిశువు తల్లిదండ్రుల కండబలానికి పూర్తిగా దాసోహమైపోతాడు.
శిక్ష గురించిన భయంవల్ల వీరిలో నైతికత నియంత్రించబడుతుంది.
ఉదా: 1) భవాని అనే విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోతే తండ్రి శిక్షిస్తాడనే కారణంతో క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం.
2) ఈశ్వర్‌ అనే విద్యార్థి హోమ్‌వర్క్‌ చేయకపోతే టీచర్‌ శిక్షిస్తాడేమోనని భయపడి హోమ్‌వర్క్‌ చేయడం.
సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ (Native Orientation)
ఈ దశలోని పిల్లలు బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తారు.
వీరిలో పరస్పరత కనిపించినప్పటికీ అది నిజమైన న్యాయభావనతో కాకుండా వస్తుమార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవడం ఆధారంగా ఉంటుంది.
సానుభూతి, జాలి, దయ, కరుణ, ఉదారత, నీతి కోసం కాకుండా వారి ‘స్వయంతృప్తి’ కోసం పరస్పరంగా ప్రవర్తిస్తారు.
ఉదా: 1) నీ బొమ్మ ఆడుకోవడానికి ఇస్తే ప్రతిఫలంగా చాక్లెట్‌ ఇస్తానని చెప్పడం
2) సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోమ్‌వర్క్‌ చేస్తానని చెప్పడం
3) నీ వీడియోగేమ్‌ నాకు ఆడుకోవడానికి ఇస్తే నువ్వు రాయడానికి పెన్‌ ఇస్తానని చెప్పడం
4) ఈశ్వర్‌ అనే విద్యార్థి మధ్యాహ్నం పాఠశాలలో భోజనం పెడతారనే కారణంతో పాఠశాలకు ప్రతిరోజూ వెళ్లడం సంప్రదాయ నైతికత ఈ స్థాయి 11-13 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ స్థాయి, పిల్లలు కౌమారదశలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది.
ఈ దశలో కుటుంబ సభ్యులు, సమాజ సభ్యులు దేనిని ఆశిస్తారో అనేది మంచి, చెడులను నిర్ణయిస్తుంది.
ఇతరులకు సంతోషాన్ని కలుగజేసేది సరైనవిగాను, ఇతరులకు ఇబ్బందిపెట్టేవి సరైనవి కాదని అనుకుంటారు.
ఈ స్థాయిలోని వ్యక్తులు సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని భావిస్తారు.
ఈ స్థాయిలోని రెండు దశలు 1) మంచి బాలుడి నీతి 2) అధికారం, సాంఘిక క్రమనిర్వహణ నీతి.

మంచి బాలుడి నీతి/మంచి ప్రవర్తన
ఈ దశలో ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావిస్తారు.
పిల్లలు విషయాన్ని మంచి, చెడుల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు.
ఇతరుల అధిక శారీరక శక్తి కంటే వారి సమ్మతి, అసమ్మతి/ఆమోదన, నిరాకరణకు ఈ దశలోని వారు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు.
ఇతరులతో మంచి అబ్బాయి/మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసం ప్రయత్నిస్తారు.
ఇక్కడ మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోషపెట్టేది, ఇతరులకు సహాయపడేది.
ఉదా: 1) భవాని అనే విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషిస్తారనే కారణంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లడం.2) ఈశ్వర్‌ అనే విద్యార్థి మంచి అబ్బాయి అనిపించుకోవడం కోసం తల్లి చెప్పే పనులన్నీ చేయడంఅధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి/సరైన ప్రవర్తన
ఈ దశలో నిందను తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సాంఘిక రివాజు, నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు.
వ్యక్తుల ఆమోదాన్ని మాత్రమే కాకుండా, సంఘం ఆమోదాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు.
ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడం, అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం వంటి వాటిని సరైన ప్రవర్తనగా భావిస్తారు.
ఉదా: 1) భవాని అనే విద్యార్థిని తన బాధ్యతను గుర్తించి ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లడం
2) ఈశ్వర్‌ అనే విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన హోమ్‌వర్క్‌ని ఎప్పటికప్పుడు పూర్తిచేయడం.
కోల్‌బర్గ్‌ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు.

ఉత్తర సంప్రదాయ నైతికత
ఈ స్థాయి 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉంటుంది.
ఈ స్థాయిని ‘స్వయం-అంగీకార సూత్రాల నైతికత’గా పిలుస్తారు.
ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయి.
ఈ దశలో వ్యక్తులు ఇతరుల అభిరుచులు, ఇష్టాలు, సంప్రదాయాల కోసం నడుచుకోకుండా కేవలం తాము నిర్ధారించుకున్న తమదైన నియమాల ప్రకారమే నడుచుకుంటారు.
ఈ దశలో వ్యక్తులు పరిపక్వత కలిగి ఉండటంవల్ల నీతి, న్యాయం, ధర్మం, నిజాయితీ, సమానత్వం, మానవులను గౌరవించడం లాంటి అంశాలు కనిపిస్తాయి.
ఈ స్థాయిలోని 2 దశలు 1) ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి 2) వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి.
ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి
ఈ దశలో వ్యక్తి, సమాజం, సంక్షేమం, మానవ హక్కులకు విలువనిచ్చి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించి తదనుగుణంగా ప్రవర్తిస్తాడు.
ఉదా: మానవ హక్కులను గౌరవించి మెర్సీకిల్లింగ్‌ నిర్ణయాన్ని, బాధపడుతున్న వ్యక్తికి వదిలేయాలని భావిస్తాడు.
మానవ ప్రయోజనాల కోసం చట్టాలు, నియమాలను సరళమైన ఉపకరణలుగా భావిస్తాడు.
ఇంతకుముందు లేనటువంటి నైతిక నియమాల్లో సారళ్యత (Flexibility) ఈ దశలో ఉంటుంది.
అవసరమైతే సమాజ సంక్షేమం కోసం చట్టాలను సవరింపచేయాలని భావిస్తాడు.
ఉదా: మానవ అవసరాల దృష్ట్యా రాజ్యాంగంలో సవరణలు కూడా చేయవచ్చని భావిస్తాడు.

వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి
ఈ దశలోని వ్యక్తుల్లో నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనంగా ఉంటుంది.
ఈ దశలోని వ్యక్తి ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మ నిందను తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలకు, తనలో భాగమైనటువంటి ఆదర్శాలకు రెండింటికీ అనుగుణంగా ప్రవర్తిస్తాడు.
వ్యక్తి సొంత కోరికల కంటే ఇతరుల గౌరవంపై నైతికత ఆధారపడి ఉటుంది.
ఈ దశలో వ్యక్తి అంతరాత్మ, గౌరవం, న్యాయం, సమానత్వం అనే సార్వత్రిక సూత్రాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటాడు.
స్వీయ దండన లేదా సిగ్గు, అపరాధ భావనల్లో కాకుండా వారి అంతర్గతం, అంతరాత్మ చెప్పినట్లు నడుచుకుంటారు.
ఉదా: వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, తప్పదనిపిస్తే అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం తప్పు కాదని భావిస్తాడు.

నోట్‌
మానవునిలో నైతిక వికాసం అనేది అతని సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది.
ఈ సిద్ధాంతంలో ఏ దశను ఏ వయస్సులో చేరుకుంటారో చెప్పకపోయినా 1) చిన్నపిల్లలు అధికంగా పూర్వ సంప్రదాయ స్థాయికి చెంది ఉంటారని, 2) పెద్దవారు ఉత్తర సంప్రదాయ స్థాయికి చెంది, ఆ స్థాయికి చెందిన ప్రతిస్పందనలను కలిగి ఉంటారని కోల్‌బర్గ్‌ వివరించారు.
ఎక్కువమంది వ్యక్తులు నైతికంగా ‘అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి’ లాంటి 4వ దశకు మించి పెరగరని కోల్‌బర్గ్‌ తెలిపారు.
ఒక వ్యక్తిలో మంచి నైతిక వికాసం 3వ స్థాయిలో, 6వ దశలో జరుగుతుంది.
6వ దశకు చేరుకున్న వ్యక్తి మళ్లీ వెనుకకు తిరోగమనం ఉండదు.
ఏ సంస్కృతుల్లోనైనా నైతిక వికాస క్రమం ఒకేలా ఉంటుంది.

పూర్వ సంప్రదాయ స్థాయి
ఈశ్వర్‌ అనే విద్యార్థి శారీరక దండనకు తల్లిదండ్రులు గురిచేస్తారనే భయంతో ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకోవడం విద్యార్థి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారని భావించి ట్రాఫిక్‌ నియమాలు పాటించడం విద్యార్థి అవసరం కోసం నైతికత పాటిస్తాడు

సంప్రదాయ స్థాయి
ఈశ్వర్‌ సమాజంలో మంచి పేరుకోసం తన బాధ్యతగా ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకోవడం
ట్రాఫిక్‌ నియమాలు సక్రమంగా పాటించడం తన బాధ్యతగా విద్యార్థి భావించడం
విద్యార్థి ఇతరుల సంతృప్తి కోసం నైతికత పాటిస్తాడు.

ఉత్తర సంప్రదాయ స్థాయి
ఈశ్వర్‌ తన ఆత్మ సంతృప్తి కోసం ఎల్లప్పుడూ ప్రతి తరగతిలో ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకోవడం
తన అంతరాత్మను అనుసరించి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే భావనతో సక్రమంగా ట్రాఫిక్‌ నియమాలు పాటించడం విద్యార్థి స్వీయ సంతృప్తి కోసం నైతికత పాటిస్తాడు

నోట్‌
అన్ని వికాస దశల్లో మందకొడిగా జరిగే వికాసం- నైతిక వికాసం
సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ తన మూర్తిమత్వ సిద్ధాంతాల్లో సూపర్‌ ఈగో (అధ్యహం) అనేది నైతికత సూత్రంపై పనిచేస్తుందని తెలిపారు.
నైతిక వికాసాన్ని పిల్లల్లో పెంపొందించడానికి కింది కార్యక్రమాలను నిర్వహించాలి.
1) నీతి కథలు, దేశ భక్తుల గాథలు చెప్పడం
2) పాఠశాలలో ప్రతిరోజూ ప్రార్థన నిర్వహించడం
3) వివిధ మతాల సారాంశాన్ని తెలియజేయడం
4) జాతీయ పండుగలు, జాతీయ దినోత్సవాలు నిర్వహించడం
5) SUPW, NCC, NSS వంటి కార్యక్రమాలు నిర్వహించడం మొదలైనవి.

శివపల్లి
టీఎస్‌& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యక్తిలో న్యాయ భావన వికాసమే?

ట్రెండింగ్‌

Advertisement