e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ఏ సంఘటన 70 ఏండ్లు పూర్తి చేసుకుంది?

ఏ సంఘటన 70 ఏండ్లు పూర్తి చేసుకుంది?

ఏ సంఘటన 70 ఏండ్లు పూర్తి చేసుకుంది?
 1. ప్రతిపాదన (ఏ): ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తన బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని అమెరికా నిర్ణయించింది (బి)
  కారణం (ఆర్‌): రష్యాకు చెందిన పదిమంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది
  ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏ ను ఆర్‌ సరిగ్గా వివరిస్తుంది
  బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు
  సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు
  డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది
  వివరణ: ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తన బలగాలను వెనక్కి పిలిపించుకోనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 11లోగా ఈ ప్రక్రియ పూర్తికావాలని నిర్ణయించారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న కారణంతో రష్యాకు చెందిన పదిమంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. ఫెడరల్‌ సంస్థల కంప్యూటర్లను హ్యాక్‌ చేశారన్న ఆరోపణలను కూడా వారిపై చేసింది.
 2. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి (డి)
  1. అంతర్జాల సమ్మిళిత సూచీ (ఇన్‌క్లూజివ్‌ ఇంటర్నెట్‌ ఇండెక్స్‌)లో భారత్‌ 49వ స్థానంలో ఉంది
  2. వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో భారత్‌ 142వ స్థానంలో ఉంది
   ఎ) 1 బి) 2
   సి) 1, 2 సరికావు డి) 1, 2 సరైనవి
   వివరణ: ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌, ఫేస్‌బుక్‌లు సంయుక్తంగా సమ్మిళిత అంతర్జాల సూచీని విడుదల చేశాయి. మొత్తం 120 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్‌ 49వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో స్వీడన్‌ నిలిచింది. అలాగే రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌ సంస్థ వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ను విడుదల చేసింది. 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్‌ 142వ స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో నార్వే ఉంది.
 3. ఆర్థిక సంస్థలను కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం చేస్తూ చట్టం చేసిన తొలి దేశం ఏది? (సి)
  ఎ) నార్వే బి) స్వీడన్‌
  సి) న్యూజిలాండ్‌ డి) క్యూబా
  వివరణ: ఆర్థిక రంగంలో భాగంగా ఉండే బ్యాంకులు, బీమా సంస్థలతో పాటు అన్ని రకాల సంస్థలను భాగస్వామ్యం చేస్తూ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని న్యూజిలాండ్‌ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం ఇదే. పర్యావరణానికి సంబంధించిన ప్రమాదాలు, అవకాశాలను ఏ విధంగా నిర్వహిస్తాయో కచ్చితంగా ఆయా సంస్థలు వెల్లడి చేయాల్సి ఉంటుంది. 2050 నాటికి నికర కార్బన్‌ ఉద్గారాలు శూన్యంగా ఉండాలని న్యూజిలాండ్‌ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
 4. కింద పేర్కొన్న ఏ సంస్థలో భారత్‌ ఎన్నికయ్యింది? (డి)
  ఎ) కమిషన్‌ ఆన్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ అండ్‌
  క్రిమినల్‌ జస్టిస్‌
  బి) ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ది యూఎన్‌ ఎంటైటీ జెండర్‌ ఈక్వాలిటీ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌
  సి) ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌
  ఫుడ్‌ ప్రోగ్రాం
  డి) పైవన్నీ
  వివరణ: ఐక్యరాజ్య సమితి ఆర్థిక సాంఘిక మండలికి చెందిన మూడు వ్యవస్థలకు భారత్‌ ఎన్నికయ్యింది. జనవరి 1, 2022 నుంచి సభ్యత్వం ప్రారంభమవుతుంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆరు ప్రధాన అంగాల్లో ఆర్థిక సాంఘిక మండలి కూడా ఒకటి. 1945, జూన్‌ 26న దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు తొలిసారిగా నేతృత్వం వహించింది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జన్మించిన ఆర్కట్‌ రామస్వామి ముదలియార్‌.
 5. సీయూ సెట్‌ పరీక్ష దేనికి సంబంధించింది? (ఎ)
  ఎ) అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు
  ఉమ్మడి ప్రవేశ పరీక్ష
  బి) దేశంలోని అన్ని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
  సి) అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష డి) ఏదీ కాదు
  వివరణ: దేశంలో మొత్తం 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 41 వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దానిపేరే సీయూ సెట్‌. మిగతా 13 వర్సిటీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఎంబీఏ ప్రవేశ పరీక్షగా క్యాట్‌, ఇంజినీరింగ్‌కు గేట్‌ ఉన్న తరహాలోనే ఇది కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశపరీక్ష. రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది.
 6. గగన్‌యాన్‌కుగాను భారత్‌ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? (సి)
  ఎ) రష్యా బి) చైనా
  సి) ఫ్రాన్స్‌ డి) అమెరికా
  వివరణ: భారత్‌లో తొలిసారిగా చేపట్టబోతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ కోసం ఫ్రాన్స్‌ సాయం చేయనుంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. భారత ఫ్లైట్‌ వైద్యులు, కమ్యూనికేషన్‌ బృందాలు ఫ్రాన్స్‌లోని పలు సంస్థల్లో శిక్షణ పొందుతారు. మానవ సహిత ప్రయోగంలో వ్యోమగాముల ఆరోగ్యం అన్ని సందర్భాల్లోనూ పరీక్షించాల్సి ఉంటుంది. ఇందుకుగాను వైద్యుల అవసరం తప్పనిసరి
 7. ఎన్ని దేశాలకు ఈ-వీసా సౌకర్యాన్ని ఇటీవల భారత్‌ పునరుద్ధరించింది? (డి)
  ఎ) 171 బి) 120 సి) 136 డి) 156
  వివరణ: 156 దేశాలకు చెందిన పౌరులకు ఎలక్ట్రానిక్‌ వీసాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పునరుద్ధరించింది. ఈ-వీసా పద్ధతిని 2014లో ప్రారంభించారు. ఇందులో అయిదు కేటగిరీలకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వీసాలు ఇస్తారు. ఆ విభాగాలు.. పర్యాటకం, వ్యాపారం, సమావేశాలు, వైద్యం, మెడికల్‌ అటెండెంట్‌. విదేశీయుడు తన ప్రయాణ రోజుకు నాలుగు రోజుల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు పరిశీలించిన అనంతరం ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌ వస్తుంది. ఈ-వీసాల ద్వారా కేవలం 28 అంతర్జాతీయ విమానాశ్రయాలు, అయిదు ప్రధాన నౌకాశ్రయాల వద్దకు వచ్చేందుకే అనుమతి ఇస్తారు.
 8. ఖంజర్‌ అనే సైనిక విన్యాసాన్ని భారత్‌ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? (బి)
  ఎ) ఇండోనేషియా బి) కిర్గిజ్‌స్థాన్‌
  సి) తజికిస్థాన్‌ డి) ఉజ్బెకిస్థాన్‌
  వివరణ: భారత్‌, అలాగే మధ్య ఆసియా దేశం అయిన కిర్గిజ్‌స్థాన్‌ల మధ్య జరిగే ప్రత్యేక దళాల విన్యాసమే ఖంజర్‌. ఏప్రిల్‌ 16న బిష్కేక్‌లో ఇవి ప్రారంభమయ్యాయి. రెండు వారాల పాటు ఇవి కొనసాగుతాయి. ఇరుదేశాల మధ్య ఈ విన్యాసాలు 2011 నుంచి జరుగుతూ ఉన్నాయి. కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కేక్‌.
 9. అడ్‌హాక్‌ జడ్జిల నియామకానికి సంబంధించిన ఆర్టికల్‌? (సి)
  ఎ) 212ఎ బి) 123
  సి) 224ఎ డి) 236బి
  వివరణ: రాజ్యాంగంలోని 224ఎ ఆర్టికల్‌ ప్రకారం అడ్‌హాక్‌ జడ్జిలను నియమిస్తారు. ప్రస్తుతం హైకోర్టుల్లో దాదాపు 57 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తులను తాత్కాలిక ప్రాతిపదికన 2-3 సంవత్సరాల పాటు అడ్‌హాక్‌ జడ్జిలను నియమించనున్నారు. పెండింగ్‌ కేసులను తగ్గించడానికి అడ్‌హాక్‌ న్యాయమూర్తులను నియమించాలని లోక్‌ ప్రహరి అనే సంస్థ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఒక్కో హైకోర్టులో ఇద్దరి నుంచి అయిదుగురు వరకు అడ్‌హాక్‌ జడ్జిలను నియమించుకోవచ్చు.
 10. ప్రతిపాదన (ఏ): డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడుతూ ఉంది (బి)
  కారణం(ఆర్‌): రెమిటెన్స్‌లు పొందుతున్న వాళ్లకు ఇది ప్రయోజనం
  ఎ) ఏ, ఆర్‌ సరైనవే.
  ఏ ను ఆర్‌ సరిగ్గా వివరిస్తుంది
  బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు
  సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు
  డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది
  వివరణ: మార్చి 22, 2021 నుంచి రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 4.2% మేర పడిపోయింది. ఒకానొక సమయంలో తొమ్మిది నెలల కనిష్టానికి ఇది చేరింది. పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో చాలా రాష్ర్టాలు కఠిన నిబంధనలను విధిస్తున్నాయి. మరోవైపు డాలర్‌ బలోపేతం అవుతూ ఉంది. అమెరికాలో మెరుగైన వృద్ధి రేటు ఉండటం కూడా రూపాయిపై ప్రభావం చూపింది. ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం ద్వారా మార్కెట్‌లోకి ద్రవ్యాన్ని సరఫరా చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించడం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది.
 11. ఏఆర్‌సీ సమీక్షకు నియమించిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? (డి)
  ఎ) రాజేశ్వర్‌ రావు బి) రంగరాజన్‌
  సి) బిమల్‌ జలాన్‌ డి) సుదర్శన్‌ సేన్‌
  వివరణ: అస్సెట్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)ల పనితీరు సమీక్షకు ఆర్‌బీఐ ఆరుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుదర్శన్‌ సేన్‌ నేతృత్వం వహిస్తారు. కమిటీ తన తొలి సమావేశం రోజు నుంచి మూడు నెలల్లో తన నివేదికను ఇస్తుంది. ఏఆర్‌సీలకు వర్తించే వివిధ చట్ట, ఇతర నియంత్రణ నిబంధనలను కూడా ఇది సమీక్షిస్తుంది. అలాగే వాటి పనితీరు మెరుగుకు తగిన సూచనలు కూడా చేస్తుంది.
 12. ఐఐటీ (గువాహటి) ఇటీవల ఆవిష్కరించిన ‘మైక్రో ఫిల్టరేషన్‌ ప్రాసెస్‌’ దేనికి సంబంధించింది? (సి)
  ఎ) కొవిడ్‌ పరీక్షల ఫలితం వేగంగా ఇవ్వడానికి బి) కొవిడ్‌ వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేయడానికి
  సి) సరికొత్త వడపోత విధానం డి) ఏదీకాదు
  వివరణ: ఉప్పు తయారీకి ఉపయోగించే సముద్ర జలాల నుంచి అతి సూక్ష్మ ప్లాస్టిక్‌ అవశేషాలను తొలగించే సరికొత్త వడపోత విధానాన్ని ఐఐటీ (గువాహటి) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జలవనరుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఉప్పు తయారు చేసే క్రమంలో ఇవి ఉండిపోతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. దీనిని పరిష్కరించేందుకు మైక్రో ఫిల్టరేషన్‌ ప్రాసెస్‌ను అభివృద్ధి చేశారు. తూర్పు ఆసియాలోని 90% ఉప్పు బ్రాండ్ల తయారీలో మైక్రో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉండటం వల్ల వంధ్యత్వం, క్యాన్సర్‌, నాడీలోపాలు సంభవిస్తున్నాయి
 13. ఎంత శాతం సేద్య యోగ్య భూమికి కరవు ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ఒక అధ్యయనంలో పేర్కొంది? (డి)
  ఎ) 21% బి) 26% సి)78% డి) 68%
  వివరణ: మానవ చర్యల వల్ల పర్యావరణం మార్పులు జరగడంతో భిన్న వాతావరణ జోన్‌లో ఉన్న భారత్‌లోని 68% సేద్య యోగ్య భూమికి కరవు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం తాజాగా ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది. భారత్‌లో అయిదు కోట్ల హెక్టార్ల విస్తీర్ణానికి వరద ప్రమాదం ఉందని నివేదికలో వెల్లడించింది. జార్ఖండ్‌, మిజోరం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాలు వాతావరణ మార్పుల దుష్ప్రభావానికి అత్యధికంగా గురవుతున్నాయి. 1901-2018 సంవత్సరాల నడుమ భారత్‌లో సగటు ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల మేర పెరిగిందని నివేదిక వెల్లడించింది.
 14. ఇటీవల తెలంగాణలో దిలావర్‌పూర్‌లో వర్ధమాన మహావీరుడి ప్రతిమను గుర్తించారు, దిలావర్‌పూర్‌ ఏ జిల్లాలో ఉంది? (బి)
  ఎ) కామారెడ్డి బి) నిర్మల్‌
  సి) కరీంనగర్‌ డి) సూర్యాపేట
  వివరణ: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 24వ జైన తీర్థంకరుడు అయిన వర్ధమాన మహావీరుడి ప్రతిమను గుర్తించారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న అనేక శిల్పాలు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. అలాగే ఇదే జిల్లా కుంటాల మండలంలోని ఓల గ్రామంలో అరుదైన నటరాజ విగ్రహాన్ని గుర్తించారు. 10 నుంచి 11వ శతాబ్దంలో పాలించిన చోళ రాజుల కాలంలో ఈ నటరాజ విగ్రహాలు రూపొందినట్లు భావిస్తున్నారు. అభయ హస్తం రూపంలో ఉన్న ఈ విగ్రహం స్థానిక గోవిందరాయుని చెరువు తూమువద్ద లభించింది.
 15. ఏప్రిల్‌ 18, 2021 నాటికి కింద పేర్కొన్న ఏ సంఘటన 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? (సి)
  ఎ) ఎన్నికల సంఘం ఏర్పాటు
  బి) రిజర్వ్‌ బ్యాంక్‌ జాతీయం
  సి) భూదానోద్యమం ప్రారంభం
  డి) ఏదీకాదు
  వివరణ: 1951 ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌కు సమీపంలోని పోచంపల్లిలో భూదానోద్యమాన్ని ఆచార్య వినోబాభావే ప్రారంభించారు. స్థానికుడైన వెదిరే రామచంద్రారెడ్డి వంద ఎకరాలను దానం చేశారు. ఇదే ఈ ఉద్యమానికి శ్రీకారంగా మారింది. హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఏప్రిల్‌ నెలలో సర్వోదయ సమావేశానికి వినోబాభావే హాజరయ్యారు. అది ముగిసిన తర్వాత పాదయాత్ర చేసుకుంటూ పోచంపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత దేశమంతా 64 వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి 48.67 లక్షల ఎకరాల భూమిని స్వీకరించారు. సమకూరిన భూమిలో 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారు.

వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్‌
9849212411

Advertisement
ఏ సంఘటన 70 ఏండ్లు పూర్తి చేసుకుంది?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement