సోమవారం 18 జనవరి 2021
Nipuna-education - Nov 24, 2020 , 14:25:57

ఈసారి ఫిబ్ర‌వ‌రిలో జేఈఈ మెయిన్‌!

ఈసారి ఫిబ్ర‌వ‌రిలో జేఈఈ మెయిన్‌!

న్యూఢిల్లీ: ఈఏడాది జేఈఈ మెయిన్‌ మొద‌టి సెష‌న్ ప‌రీక్ష కొంత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఏటా జ‌న‌వ‌రిలో జ‌రిగే జేఈఈ మెయిన్ ఈసారి ఫిబ్ర‌వ‌రికి వాయిదాప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆన‌వాయితీ ప్ర‌కారం జేఈఈ మెయిన్ నోటిఫికేష‌న్‌ ఇప్ప‌టికే వెలువడాలి. రిజిస్ట్రేష‌న్ ప్రక్రి‌య కూడా ఆరంభమ‌వ్వాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టంతో ప‌రీక్ష‌ కొంత ఆల‌స్య‌మ‌వుతుంద‌ని అధికారులు తెలిపారు. నోటిఫికేష‌న్ ఈ నెల‌లో వెలువ‌డుతుంద‌ని, అప్లికేషన్లు వ‌చ్చే నెలలో ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించారు. ఇంజినీరింగ్ అడ్మిష‌న్లు ఇంకా ముగియ‌క‌పోవ‌డం కూడా జేఈఈ మెయిన్ నోటిఫికేష‌న్ ఆల‌స్యానికి మ‌రో కార‌ణ‌మ‌ని అధికారులు తెలిపారు. ‌గ‌తేడాది జేఈఈ మెయిన్ జ‌న‌వ‌రి సెష‌న్ నోటిఫికేష‌న్‌ను ఎన్‌టీఏ ఆగ‌స్టు నెల‌లో విడుద‌ల చేసింది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 2న ప్రారంభ‌మ‌య్యింది. 

జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌ను ఎన్‌టీఏ ప్ర‌తి సంవ‌త్సరం రెండు సెష‌న్ల‌లో అంటే జ‌న‌వ‌రి, ఏప్రిల్ నెల‌ల్లో నిర్వ‌హిస్తున్న‌ది. అయితే ఈసారి క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల జ‌న‌వ‌రి, ఏప్రిల్ సెష‌న్లు కొంత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి జ‌న‌వ‌రి ప‌రీక్ష‌ షెడ్యూల్ ప్ర‌కారమే జ‌రిగిన‌ప్ప‌టికీ, ఏప్రిల్‌లో జ‌రగాల్సిన ప‌రీక్ష మాత్రం ప‌లుమార్లు వాయిదా ప‌డింది. చివ‌రికి సెప్టెంబ‌ర్‌లో క‌రోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. మొత్తం 8.58 ల‌క్షల మంది రిజిస్ట్రేష‌న్ చేసుకోగా, 74 శాతం మంది విద్యార్థులు మాత్ర‌మే ప‌రీక్ష రాశారు.