ఇంజినీరింగ్‌లో బ్రాంచీనా.. కాలేజా ?


Wed,June 26, 2019 02:49 AM

జాతీయ, రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మంచి ర్యాంకు వచ్చి కోరుకున్న బ్రాంచీ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఓకే. కానీ కొంచెం పెద్ద ర్యాంకు వచ్చి ఏ కాలేజీలో చేరాలి? ఏ బ్రాంచీ తీసుకోవాలి అన్న సందిగ్ధంలో ఉన్నవారికి నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు సంక్షిప్తంగా...

ఏ కాలేజీలో చేరాలి?

-చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎదురయ్యే సమస్యే ఇది. కాలేజీ ఎంపిక అనే దానికి కొన్ని ప్రమాణాలను తీసుకుంటే ఎంపిక చేసుకోవడం సులువు.
-కాలేజీలో ప్రధానంగా ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, ప్లేస్‌మెంట్స్‌పై క్షుణ్ణంగా ఆరా తీసి తెలుసుకోవాలి. తప్పనిసరిగా కాలేజీకి వెళ్లి ఆ కాలేజీని పరిశీలించాలి. అక్కడ చదువుతున్న పూర్వ విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి.
-రెండో అంశం సాంకేతికంగా, ఏఐసీటీఈ, ఎన్‌బీఏ, న్యాక్ గుర్తింపులను పరిశీలించాలి. ఆయా సంస్థలు ఇచ్చిన రేటింగ్‌లు, ఆయా సర్వేల్లో ఆ కాలేజీలకు వచ్చిన ర్యాంకింగ్‌లను ఆధారం చేసుకుని తుది నిర్ణయం తీసుకోవాలి.
-కాలేజీలో చేరేటప్పుడు సరైన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి కాలేజీలో చేరితే నాలుగేండ్లు అక్కడే చదువుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కాలేజీ మారే అవకాశం ఉండదు. విద్యార్థి దశలో ఈ నాలుగేండ్లు అత్యంత కీలకం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Engeneering

బ్రాంచీ ఎంపిక...?

-బ్రాంచీ అనేది పూర్తిగా అభ్యర్థి ఆసక్తి మీద ఆధారపడే విషయం. అదే సందర్భంలో ఆయా బ్రాంచీలు తీసుకుంటే భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు పరిశీలించాలి.
-ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ బ్రాంచీలను కోర్ బ్రాంచీలుగా పిలుస్తారు. ప్రస్తుతం బీఈ/బీటెక్‌లో ఉన్న అనేక ఇతర బ్రాంచీలకు ఈ కోర్ బ్రాంచీలే మూలాధారం.
-సాఫ్ట్‌వేర్ బూమ్‌తో ఎక్కువ శాతం విద్యార్థులు సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీలవైపు ఆకర్షితులవుతున్నారు. కానీ వాస్తవంగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోవడమే కాకుండా నిదానంగా ఉన్నత స్థానాలకు చేర్చేవి ఈ కోర్ బ్రాంచీలే. అంతేకాకుండా ప్రభుత్వ, పీఎస్‌యూలలో అధిక శాతం ఉద్యోగాలకు అవకాశం ఉన్న బ్రాంచీలు కోర్ బ్రాంచీలే.
-ప్రభుత్వ ఉద్యోగాలు, ఆయా బ్రాంచీలపై ఆసక్తి, పరిశోధన చేయాలనే తపన ఉన్నవారు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలను తీసుకుంటే మంచిది.
-సాఫ్ట్‌వేర్.. రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందికి ఉపాధి అవకాశాలే కాకుండా అత్యధిక వేతనాలను అందిస్తూ అందరినీ ఊరించే బ్రాంచీ సీఎస్‌ఈ, ఐటీలు. అయితే వీటిలో ఆకర్షణతోపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌లో హై ఎండ్‌లో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కేవలం బీటెక్, కొన్ని అవసరమైన కోర్సులతో సాఫ్ట్‌వేర్ కెరీర్ ప్రారంభించినవారిలో అధిక శాతం సాఫ్ట్‌వేర్లకు తరుచుగా అప్ అండ్ డౌన్స్, పింక్ స్లిప్‌లు, బెంచీల సమస్య సాధారణంగా మారింది. కాబట్టి ఆసక్తి, ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడానికి సిద్ధంగా ఉండేవారే సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లాలి. మరో విషయం వారంలో ఐదురోజులు అత్యధిక మానసిక శ్రమకు సిద్ధంగా ఉండాలి.
-ఐఐటీ, నిట్, ఎంసెట్‌లు రాసి మధ్యస్థంగా ర్యాంకులు వచ్చిన విద్యార్థులు పై విషయాలను బేరీజు వేసుకుని కాలేజీ, కోర్సులను ఎంపిక చేసుకుంటే తప్పక మంచి భవిష్యత్ ఉంటుంది.

-ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్ నిర్ణయించే ఈ కీలక తరుణంలో ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ కాలేజీలో చదివినా, ఏ బ్రాంచీ చదివినా ప్రస్తుతం ఉన్న ఆధునిక సాంకేతికతతో బాగా చదవవచ్చు. కాలేజీలు, ఫ్యాకల్టీలు పెద్ద సమస్య కావు. ఇంజినీరింగ్ అనేది ప్రొఫెషనల్ కోర్సు.. దీన్ని ప్రొఫెషనల్‌గా చదివితే తప్పక జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే వేలాదిమంది చేసి చూపించారు.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1969
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles