గ్రూప్-2 ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా?


Wed,June 26, 2019 02:39 AM

రాష్ట్రంలో కీలకమైన గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరింది. గత మూడేండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. 1032 పోస్టుల భర్తీకి సంబంధించి 2132 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచారు. రాత పరీక్ష (600 మార్కులు)లో ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులు అతి విశ్వాసంతో, తక్కువ మార్కులు పొందినవారు ఆత్మ న్యూనతా భావంతో ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పొందే ప్రమాదం ఉంది. కాబట్టి రాతపరీక్ష మార్కులతో సంబంధం లేకుండా ఇంటర్వ్యూలో (75 మార్కులు) గరిష్ట మార్కులు సంపాదించి అనుకున్న ఉద్యోగాన్ని పొందడానికి కృషి చేయాలి. సమయం తక్కువగా ఉండటంతో ఇంటర్వూ ప్రిపరేషన్‌లో శాస్త్రీయ పద్ధతిని అవలంబిస్తూ మెళకువలు నేర్చుకోవాలి.

ఇంటర్వ్యూ లక్ష్యం..

నిజానికి అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని రాతపరీక్షలో పరీక్షించారు. కాబట్టి ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని (పర్సనాలిటీ) ప్రధానంగా పరిశీలిస్తారు. ఒక ప్రభుత్వ అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేవా? అనే అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా ఒక ప్రభుత్వ అధికారిని నియమించిన తరువాత తొలగించడం అంత సులువైన అంశంకాదు. అందువల్ల ముందుగానే వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూ ద్వారా పరీక్షించడం తప్పనిసరి. ఎందుకంటే ఈ అధికారులు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల కొనసాగింపులో ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉంటారు. వీరికి సామర్థ్యం, నిజాయితీ, వ్యక్తిత్వం చాలా కీలకం కాబట్టి ఎంపిక సమయంలోనే సరైన జాగ్రత్తలు తీసుకుంటారు.
Interview

పరిగణించే అంశాలు

-వ్యక్తిత్వ పరీక్ష (ఇంటర్వ్యూ)లో ప్రధానంగా అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, స్థితప్రజ్ఞత, పరిస్థితులకు తగ్గట్టు స్పందించే తత్వం, సవాళ్లను ఎదుర్కొనే తీరు, సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ప్రయ త్నం, సమయస్ఫూర్తి, మానవతాదృక్పథం, తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అవగాహన, ప్రభుత్వ పనితీరుపై స్పష్టమైన అభిప్రాయం, ఆశావాద దృక్పథం, భవిష్యత్‌పై దృఢమైన విశ్వాసం, ముఖ్యంగా బలహీన వర్గాలపై ఉన్న సానుకూల దృక్పథం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తూ వాటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
-అభ్యర్థి ప్రశ్నకు సమాధానం చెప్పినా, చెప్పకపోయినా నిజాయితీ, విషయ స్పష్టతకు అధిక ప్రాధ్యానం ఇస్తారు. అంశాన్ని వివరించే తీరు, ఆత్మవిశ్వాసం స్థాయి ఏ మేరకు ఉన్నాయనే అంశాలను అత్యంత కీలకంగా పరిగణిస్తారు.

ఏ అంశాలపై దృష్టిపెట్టాలి

-ఇంటర్వ్యూకి నిర్థిష్టమైన సిలబస్ అంటూ ఏదీలేదు. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటారు. అందువల్ల ప్రతి అభ్యర్థి కొన్ని అంశాలపై తప్పనిసరిగా అవగాన కలిగి ఉండాలి. అవి..
1. అభ్యర్థి పేరు (ఇంటిపేరుతో సహా)- ఏదైనా ప్రత్యేకత ఉంటే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి
2. ఏ జిల్లా- జిల్లా ప్రాముఖ్యత
3. చదువు- ఆయా విద్యాసంస్థల విశిష్టత
4. గతంలో లేదా ఇప్పటివరకు చేస్తున్న ఉద్యోగం గురించి స్పష్టమైన అభిప్రాయం
5. వర్తమాన అంశాలపై ముఖ్యంగా తెలంగాణలో గత రెండేండ్లుగా జరిగిన పరిణామాలపై అవగాహన
6. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాలు
7. అంతర్జాతీయంగా ప్రాముఖ్యం గల కీలక అంశాలు, సంఘటనల గురించి ప్రాథమిక సమాచారం
8. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలపై లోతైన అవగాహన
9. సామాజిక సమస్యలపై అవగాహన
10. అణగారిన వర్గాల స్థితిగతులపై అవగాహన
11. మహిళల సమస్యలు
12. ఉగ్రవాదం
13. భారత విదేశాంగ విధానం
14. శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ సాధించిన విజయాలు
15. నీతి ఆయోగ్ అవసరం, ప్రభావం
-ఇలాంటి అత్యంత కీలకమైన అంశాలపై మౌలిక అవగాహన ఉంటే ఇంటర్వ్యూలో ఏదో ఒకరకంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు.
-అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం... ఇంటర్వ్యూలో అభ్యర్థి మానసిక పరిపక్వత, ఆత్మవిశ్వాసం, నిజాయితీ కీలకమైన అంశాలుగా బోర్డు పరిగణిస్తుంది. సమాధానం తెలియకపోతే నిజాయితీగా తెలియదని చెప్పడం తప్పుకాదు. కాని అలాకాకుండా తెలిసినట్లు నటించడం, తప్పుడు సమాచారం చెబితే అభ్యర్థికి నిజాయితీ లేదని భావించి తక్కువ మార్కులు వేస్తారు.
-ఇంటర్వ్యూ అనేది మన ప్రవర్తనను అంచనావేసే ప్రక్రియ కాబట్టి ప్రవర్తనలో చిన్న చిన్న లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవాలి. ఇంటర్వ్యూ రోజు వేసుకునే దుస్తులు మొదలు, ఇంటర్వ్యూ హాల్‌లోకి ఎలా వెళ్లాలి, విష్ చేయాలి, కుర్చీలో ఎలా కూర్చోవాలి, ప్రశ్నలు వినేటప్పుడు వాటికి సమాధానాలు చెప్పేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాయిస్‌ను ఎలా నియంత్రించుకోవాలి వంటి అంశాల గురించి నిపుణుల వద్ద సలహాలు తీసుకోవడం మంచిది. ఒక మంచి ప్రభుత్వ అధికారి ప్రవర్తనను నమూనాగా తీసుకుని ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థులను పరీక్షిస్తారు. కాబట్టి కృత్రిమంగా ప్రవర్తించకుండా సహజంగా ఉండటానికి ప్రయత్నిస్తూ చిన్న చిన్న లోపాలను సవరించుకోగలిగితే ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు పొందడంతోపాటు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు.

Venkat

1202
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles