అగ్నిపర్వతాలు అధికంగా ఉన్న మహాసముద్ర మేఖల?


Wed,June 26, 2019 01:06 AM

అవక్షేప శిలలు

-అవక్షేపం వల్ల ఏర్పడే శిలలను అవక్షేప శిలలు (సెడిమెంటరీ రాక్స్) అంటారు.
-ఇవి వాతావరణ ప్రభావం, గాలి, నీరు, హిమానీ నదాలు మొదలైన వాటి క్రమక్షయ చర్యలవల్ల ఏర్పడుతాయి.
-ఈ అవక్షేపం ఉష్ణోగ్రత, పీడనం మొదలైన వాటి ప్రభావం వల్ల భౌతిక, రసాయన మార్పులు జరిగి సిమెంట్ చేసినట్లుగా తయారై గట్టిపడి స్థరిత రూపం (Stratification) దాల్చడం వల్ల అవక్షేప శిలలు ఏర్పడతాయి. అవక్షేపం సిమెంట్ చేసినట్లుగా తయారై, గట్టిపడి అవక్షేప శిలగా మారే ప్రక్రియను లితిఫికేషన్ అంటారు.
-అవక్షేప శిల ఏర్పడటానికి ఐదు ముఖ్యమైన ప్రక్రియలు సహకరిస్తాయి. అవి.. శిలాశైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ, స్థరితరూపం.
-భౌతిక ప్రక్రియ వల్ల ఏర్పడిన అవక్షేప శిలలు (రసాయనికంగా శిథిలం కావు)
ఉదా: శిలలు శిథిలమవడం లేదా క్రమక్షయం చెందడం
-వీటిని క్లాస్టిక్ అవక్షేప శిలలు అనికూడా అంటారు.
ఉదా: ఇసుకరాయి, షేల్, క్లే, లోయస్, బ్రిక్షియా, టిలైట్, కంగ్లామరేట్
-అధిక వర్షపాతం, అధిక వర్షాభావం ఉష్ణోగ్రత పీడనం మొదలైన ప్రకృతి శక్తులతోపాటు శిలల్లో ఉండే ఖనిజాలు కూడా ఈ రసాయన చర్యకు సహకరిస్తాయి. ఇది కొంతకాలానికి స్థరితరూపం దాల్చి శిలగా మారితే ఆ శిలలను నాన్ క్లాసికల్ అవక్షేప శిలలు అంటారు.
ఉదా: జిప్సం, రాతి ఉప్పు, సున్నపురాయి, ప్లింట్, కాల్సైట్
-భూమి మీదగానీ, భూమి లోపలగానీ సముద్రాలు ఇతర జలాశయాల్లో పెరిగే వృక్షాలు, జంతువులు మొదలైనవి పెద్దఎత్తున శిథిలమైనప్పుడు అవక్షేపం ఏర్పడుతుంది (ఇది జీవుల అవక్షేపం). వీటిని జీవప్రక్రియ అవక్షేప శిలలు అంటారు.
ఉదా: నేలబొగ్గు, పెట్రోలియం (ముడి చమురు), డోలమైట్, సున్నపురాయి, పీట్, కోరల్స్ (ఆభరణాలు).
-అవక్షేపం నీటివల్ల రవాణా చేయబడి, అనుకూల ప్రదేశంలో నిక్షేపించబడగా ఈ రకమైన శిలలు ఏర్పడుతాయి.
ఉదా: క్లే (మంచినీటి వల్ల), డోలమైట్ (సముద్ర నీటివల్ల), లాకుస్ట్రయిన్ శిలలు (సరస్సుల్లో)
-శిలా శైథిల్యపదార్థమైన ఇసుక, మట్టి, దుమ్ము, ధూళి మొదలైన అవక్షేపమంతా గాలివల్ల రవాణా చేయబడి అనుకూల ప్రదేశంలో నిక్షేపించడం వల్ల ఈ రకమైన శిలలు ఏర్పడుతాయి.
ఉదా: లోయస్ మట్టి దిబ్బలు, ఇలాంటివి చైనాలో ఎక్కువగా ఉన్నాయి.
-హిమానీ నదాలవల్ల క్రమక్షయం చేయబడిన పదార్థాన్ని టిల్ అంటారు. ఇందులో ఇసుక, మట్టి, దుమ్ము, గాజుపెయ్య, గవ్వ పెంకులు మొదలైనవి ఉంటాయి.
ఉదా: మెరైన్స్

రూపాంతర శిలలు

-భూమి మీద, భూమిలోపల ఉన్న అగ్ని శిలలు, అవక్షేప శిలలు మొదలైనవి రూపాంతరం చెందడం ద్వారా రూపాంతర శిలలు ఏర్పడుతాయి.
-వీటిని పరివర్తన శిలలు అనికూడా అంటారు.
-రూపాంతర శిలలు ఉష్ణోగ్రత, పీడనం వల్ల ప్రధానంగా ఆవిర్భవించాయి. (మాగ్మా ఉష్ణోగ్రత - 60000C నుంచి 120000C )
-ఉష్ణోగ్రత వల్ల ప్రధానంగా ఆవిర్భవించిన రూపాంతర శిలలు. వాటికి ఉదాహరణలు..
1. సున్నపురాయి (అవక్షేప శిలలు)- పాలరాయిగా మారడం (రూపాంతర శిల)
2. ఇసుక రాయి (అవక్షేప శిలలు)- క్వార్ట్‌జైట్‌గా మారడం (రూపాంతర శిల)
3. బంకమట్టి (అవక్షేప శిలలు)- పలకలుగా మారడం (రూపాంతర శిల)
4. బొగ్గు (అవక్షేప శిలలు)- గ్రాఫైట్‌గా మారడం (రూపాంతర శిల)

పీడనం వల్ల ప్రధానంగా ఆవిర్భవించిన రూపాంతర శిలలు

-భూమిలోపల ఉన్న అధికపీడనం వల్ల రూపాంతర శిలలు ఏర్పడతాయి.
ఉదా:
1. గ్రానైట్ (అగ్నిశిల)- నీస్‌గా మారడం
2. షేల్ (అవక్షేప శిల)- సిష్టు/పలకగా మారడం
3. అగైట్ (అగ్నిశిల)- హార్న్‌బ్లెండ్‌గా మారడం
గమనిక
-అగ్నిశిలలు రూపాంతరం చెందడాన్ని ఆర్థోమెటమార్ఫిజం అంటారు.
-అవక్షేప శిలలు రూపాంతరం చెందడాన్ని పారామెటమార్ఫిజం అంటారు.
-ఒక్కొక్కసారి రూపాంతరం చెందిన శిల కొన్నేండ్ల తర్వాత మళ్లీ రూపాంతరం చెందడాన్ని పాలీ మెటమార్ఫిజం అంటారు.

అగ్ని పర్వతాలు

-భూమి ఉపరితలం నుంచి లోతుకు పోయేకొద్దీ ఉష్ణోగ్రత, పీడనాలు పెరుగుతాయి.
-లోతుకు పోయే కొద్ది పెరగడంవల్ల శిలలు కరిగి శిలాద్రవ జలాశయాలు ఏర్పడుతాయి.
-భూమి ఉపరితలానికి దిగువన ఏర్పడిన శిలాద్రవాన్ని మాగ్మా అని, ఉపరితలానికి చేరిన శిలాద్రవాన్ని లావా అని అంటారు.
-అగ్నిపర్వతం: భూగర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితుల్లో భూపటలంలోని రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. బయటకు ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీన్నే అగ్నిపర్వతం అంటారు. లేదా భూగర్భంలో ఉన్న శిలాద్రవం ఉపరితలం చేరడానికి ఉపయోగపడే మార్గం అగ్నిపర్వతం.
-భూ పటలం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఈ శిలాద్రవం పగుళ్లు, రంధ్రాల ద్వారా భూమి ఉపరితలం చేరి చల్లారి ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియవల్ల అగ్నిపర్వతాలు ఏర్పడుతాయి.
-అగ్నిపర్వత ఉద్భేదనం (విస్ఫోటనం) సంభవించినప్పుడు ఈ రంధ్రం ద్వారానే శిలా శకలాలు, లావా, ధూళి, బూడి ద, పొగ, నీటిఆవిరి, Co2, H2S, So2, అమ్మోనియం క్లోరైడ్ వంటి వాయువులు బయటకు విడుదలవుతాయి.
-లావాలో కొంతభాగం పైకి రాకుండానే కింది పొరల్లో చల్లబడి, శిలలుగా గట్టిపడుతుంది. వీటిని అంతర్గమ భూస్వరూపాలు అంటారు.
-భూమి ఉపరితలంపైకి వచ్చిన లావాలో కొంతభాగాన్ని బహిర్గమ భూస్వరూపాలు అంటారు.
-ఇవన్నీ అగ్నిపర్వతాల నుంచి వచ్చినవే కానవసరం లేదు.

అగ్నిపర్వత ఉద్భేదనం (విస్ఫోటనం)

-ఇది రెండు రకాలు.. కేంద్రీయ ఉద్భేదనం, భ్రంశోద్భేదనం

కేంద్రీయ ఉద్భేదనం

-ఉద్భేదనం జరిగినప్పుడు మాత్రమే ఉద్భేదన ప్రదేశం నుంచి అన్నివైపులకు అగ్నివపర్వత పదార్థాలు విడుదలవుతాయి.
-ఈ విధానంలో సాధారణంగా భూమి ఉపరితలంపై గల ఒకే రంధ్రం (V (శంఖు)-ఆకారపు పర్వతం) వద్ద ఉద్భేదనం జరుగుతుంది.
ఉదా: సిసిలీ- ఎట్నా, ఈక్వెడార్- కోటోపాక్సీ, ఇటలీ- వెసూవియస్, జపాన్- ప్యూజియామా, అండమాన్- బారెన్ ద్వీపం

భ్రంశోద్భేదనం

-ఈ రకపు ఉద్భేదనం భూపటలంలోని ఒక భ్రంశ రేఖ వెంబడే ఉన్న అనేక రంధ్రాల నుంచి అతిపెద్ద పరిమాణంలో లావా విడుదలవుతుంది. దీనివల్ల లావాపీఠభూములు, లావా మైదానాలు కొన్ని వేల చ.కి.మీ.ల వరకు ఏర్పడుతాయి.
ఉదా: కొలంబియా పీఠభూమి, స్నేక్ నదీలోయ, భారత ద్వీపకల్పంలోని దక్కన్ పీఠభూమి
-అగ్నిపర్వతాలు ఎంత తరచుగా ఉద్భేదనం చెందుతున్నాయనే విషయ ప్రవణత (ఫ్రీక్వెన్సీ) ఆధారంగా క్రియాశీల అగ్నిపర్వతాలు, నిద్రాణ అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు అని మూడు రకాలు.

క్రియాశీల అగ్నిపర్వతాలు

-తరచుగా ఉద్భేదనం చెందే అగ్నిపర్వతాలు క్రియాశీల అగ్నిపర్వతాలు.
ఉదా: క్రాకటోవా (ఇండోనేషియా), వెసూవియస్ (ఇటలీ), స్ట్రంబోలి (సిసిలీ), మౌనలోవా (హవాయి దీవులు), బారెన్ (అండమాన్ నికోబార్ దీవులు)
-స్ట్రంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యదరా సముద్రపు దీప స్తంభం అంటారు.

నిద్రాణ అగ్నిపర్వతాలు

-చారిత్రక యుగంలో ఉద్భేదనం చెందిన దాఖలాలు ఉండి ఆధునిక కాలంలో ఉద్భేదనం చెందని అగ్నిపర్వతాలను నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు. లేదా చారిత్రక యుగం నుంచి ఇప్పటివరకు ఉద్భేదనం చెందనివి.
ఉదా: ప్యూజియామా (జపాన్), హెల్యకోలా (హవాయి దీవులు)
-నిద్రాణ అగ్నిపర్వతాలు కాలక్రమంలో క్రియాశీలక అగ్నిపర్వతాలుగా ఎప్పుడైనా మారవచ్చు.

విలుప్త అగ్నిపర్వతాలు

-చారిత్రక యుగంలో ఉద్భేదనం చెందని అగ్నిపర్వతాలను విలుప్త అగ్నిపర్వతాలు అంటారు.
ఉదా: నార్కొండమ్ (అండమాన్ దీవులు), కిలిమంజారో (టాంజానియా)
-విలుప్త అగ్నిపర్వతాలు కూడా క్రియాశీలక అగ్నిపర్వతాలుగా ఎప్పుడైనా మారవచ్చు.

అవక్షేప శిలలు-వర్గీకరణఅవక్షేప శిలలు (2 రకాలు)

1. ప్రక్రియ ఆధారంగా (3 రకాలు)


ఎ. భౌతిక ప్రక్రియవల్ల ఏర్పడినవి
బి. రసాయన ప్రక్రియవల్ల ఏర్పడినవి
సి. జీవ ప్రక్రియవల్ల ఏర్పడినవి

2. రవాణా చేసే ఏజెంట్ ఆధారంగా (3 రకాలు)


ఎ. నీటివల్ల ఏర్పడ్డ అవక్షేప శిలలు
బి. గాలివల్ల ఏర్పడ్డ అవక్షేప శిలలు
సి. హిమానీ నదాల వల్ల ఏర్పడ్డ అవక్షేప శిలలు

అగ్నిపర్వతాల ప్రపంచ విస్తరణ


-ప్రపంచంలో 500పైగా అగ్నిపర్వతాలున్నాయి.
-వీటి విస్తరణను భూపటలంలో బలహీనమైన ప్రాంతాల్లో మూడు మేఖలలుగా వర్గీకరించారు.

1. పసిఫిక్ పరివేష్టిత మేఖల


-అగ్నిపర్వతాల్లో 80 శాతం కంటే ఎక్కువగా ఈ మేఖలలోనే ఉన్నాయి.
-ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాల్లో ప్రతి నాలుగింటా మూడు ఈ పసిఫిక్ మహాసముద్ర అంచునే ఉన్నాయి. (ఇలా ఉండటానికి కారణాన్ని పలక చలనాల సిద్ధాంతం వివరించింది)
-పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా పలక సరిహద్దులు ఉన్నాయి. వీటి వద్దే అగ్నిపర్వతాలు, భూకంపాలు సంభవిస్తూ ఉండటంతో ఈ మేఖలను పసిఫిక్ అగ్నివలయం అంటారు.
-ఈ మేఖలలోనే ప్యూజియామా (జపాన్), కోటోపాక్సి (ఈక్వెడార్), మాయన్ (ఫిలిప్పైన్స్) ఉన్నాయి.

2. ప్రపంచ మధ్య పర్వత మేఖల


-ఎట్నా, స్ట్రాంబోలి అగ్నిపర్వతాలు (సిసిలీ ద్వీపానికి ఈశాన్య భాగంలో ఉన్నాయి).
-ఇటలీలోని వెసూవియస్ అగ్నిపర్వతం మొదలైనవి ఈ మేఖలకు చెందినవి.
-ఈ మేఖల పడమర నుంచి తూర్పునకు మధ్యదరా సముద్రం, హిందూ మహాసముద్రాలు పసిఫిక్ పరివేష్టిత మేఖల వరకు విస్తరించి ఉంది.

3. ఆఫ్రికా పగులు లోయ మేఖల


-గినియా తీరం నుంచి మధ్య ఆఫ్రికా ప్రాంతం మీదుగా ఎర్రసముద్రం వరకు ఈ మేఖల విస్తరించి ఉంది. టాంజానియాలోని కిలిమంజారో అగ్నిపర్వతం (విలుప్త అగ్నిపర్వతం) ఈ మేఖలలోనే ఉన్నది.
-మరికొన్ని అగ్నిపర్వతాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మారిషస్ దీవులు, బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో ఉన్నాయి.

శిలల లక్షణాలు

అగ్నిశిలలు


-ఇవి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడుతాయి.
-దీన్ని ప్రథమశిల/మాతృశిల అంటారు.
-ఇవి పొరలు పొరలుగా ఉండవు. కాబట్టి వీటిని అస్థరిత శిలలు అంటారు.
-ఇవి కఠినంగా, ముద్దగా ఉండి నీటిని తమలో నుంచి అంతతేలిగ్గా పారనీయవు. అందువల్ల ఇవి అంత తొందరగా శిథిలం కావు.
-వీటిలో శిలాజాలు ఉండవు. భూ పటలంలో 90 శాతం ఈ శిలలే ఉన్నాయి.

అవక్షేప శిలలు


-ఇవి అగ్ని, రూపాంతర శిలల అవక్షేపం వల్ల ఏర్పడుతాయి. వీటిని ద్వితీయ శిల అంటారు.
-ఇవి పొరలు పొరలుగా ఉంటాయి. కాబట్టి వీటిని స్థరిత శిలలు అంటారు.
-ఇవి నీటిని తమలో నుంచి పారనిస్తాయి. అందువల్ల తొందరగా శిథిలమవుతాయి.
-వీటిలో శిలాజాలు ఉంటాయి. శిలావరణంలో దాదాపు 80 శాతం ఈ శిలలే ఉన్నాయి.

రూపాంతర శిలలు


-ఇవి అగ్ని, అవక్షేప శిలలు.
-ఇవి ఉష్ణోగ్రత, పీడనం, రసాయన చర్య ప్రక్రియలవల్ల రూపాంతరం చెంది ఏర్పడ్డాయి.

Kasam

703
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles