కరెంట్ అఫైర్స్


Wed,June 19, 2019 01:12 AM

Telangana
Telangana

సెప్టిక్ ట్యాంకర్ మహిళా ఆపరేటర్

రాష్ట్రంలో మొదటి సెప్టిక్ ట్యాంకర్ మహిళా ఆపరేటర్‌గా, దేశంలోనే రెండో మహిళా ఆపరేటర్‌గా వరంగల్ జిల్లాలోని దాసరి శ్రావణి నిలిచారు. ఈమెకు వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ జూన్ 11న లైసెన్స్ జారీచేసింది.

హైదరాబాద్ సైంటిస్ట్‌కు ఫెలోషిప్

హైదరాబాద్‌లోని భారత వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్-రాజేంద్రనగర్)లో బయోటెక్నాలజీ విభాగం ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ ఆర్‌ఎం సుందరం జాతీయ వ్యవసాయ శాస్త్ర అకాడమీ (ఎన్‌ఏఏఎస్)లో ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ జూన్ 14న ప్రకటించింది. సాంబ మసూరి వరి వంగడాన్ని మరింత అభివృద్ధి చేసిన ఆయన ఎండు తెగులు నియంత్రణపై విస్తృత పరిశోధన జరిపారు.

చుక్కాని పుస్తకావిష్కరణ

రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం రూపొందించిన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరుపై రచించిన చుక్కాని పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జూన్ 11న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రచించారు.

National
National

సాహిత్య అకాడమీ అవార్డులు

కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్-2019, యువ పురస్కార్-2019లను ప్రకటించింది. త్రిపుర రాజధాని అగర్తలాలో జూన్ 14న అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర కంబారా అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషలకు సంబంధించి 22 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలకు, 23 మందిని యువ పురస్కారాలకు ఎంపిక చేసింది.

తెలుగులో కొంగవాలు కత్తి నవల రచించిన గడ్డం మోహన్‌రావుకు యువ పురస్కార్-2019 దక్కింది. తాత మాట వరాల మూట అనే చిన్న కథల పుస్తక రచయిత బెలగం భీమేశ్వరరావుకు బాల సాహిత్య పురస్కార్-2019 లభించింది.
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ ఏ కృష్ణారావుకు అనువాద పురస్కారం లభించింది. ఆయన అనువాదం చేసిన గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు కవితాసంపుటికి ఈ అవార్డు దక్కింది.
అవార్డులకు ఎంపికైన విజేతలకు రూ.50 వేల నగదుతోపాటు తామ్రపత్రం ప్రదానం చేస్తారు.

అక్షయపాత్రకు అవార్డు

బెంగళూరుకు చెందిన అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ చాంపియన్ అవార్డు లభించింది. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో జూన్ 14న జరిగిన కార్యక్రమంలో బీబీసీ వరల్డ్ సర్వీస్ విభాగం ఈ అవార్డును అక్షయపాత్రకు ప్రదానం చేసింది. దేశంలోని వేలాది పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తున్నందుకుగాను అక్షయపాత్రకు ఈ అవార్డు దక్కింది. 2000 సంవత్సరంలో మధు పండిట్ దాస ఈ సంస్థను స్థాపించారు. దీనికి ప్రస్తుతం శ్రీధర్ వెంకట్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

బీహార్‌లో యూనివర్సల్ ఓల్డేజ్ పింఛన్

బీహార్‌లో ముఖ్యమంత్రి వృద్ధజన్ పెన్షన్ యోజన పేరుతో యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం నితీశ్ కుమార్ జూన్ 14న ప్రకటించారు. 2019, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా 60 ఏండ్లు పైబడిన ప్రతి వ్యక్తి తన ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం, కులాలకు అతీతంగా పెన్షన్‌ను అందుకుంటారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.500, 60 నుంచి 80 ఏండ్ల మధ్య ఉన్న వారి ఖాతాల్లో రూ.400 జమచేస్తారు.

International
International

ప్రపంచ శాంతి సూచీ

ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ 163 దేశాలతో రూపొందించిన ప్రపంచ శాంతి సూచీ-2019 (జీపీఐ)ను జూన్ 12న విడుదల చేసింది. ఈ సూచీలో వరుసగా 12వ సారి ఐస్‌ల్యాండ్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ (2), ఆస్ట్రియా (3), పోర్చుగల్ (4), డెన్మార్క్ (5) ఉన్నాయి. భారత్ 141, పాకిస్థాన్ 153వ స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. భారత్ గతేడాది 136వ స్థానంలో ఉంది.

ఇంటర్నెట్ వినియోగం

ఇంటర్నెట్ ట్రెండ్స్‌పై 2019 మారీ మీకర్ రిపోర్ట్ జూన్ 12న వెల్లడైంది. దీని ప్రకారం యూజర్ బేస్‌లో ప్రపంచవ్యాప్తంగా 21 శాతం వాటాతో చైనా మొదటి స్థానంలో, 12 శాతం వాటాతో భారత్ 2వ స్థానంలో, 8 శాతం వాటాతో అమెరికా 3వ స్థానంలో నిలిచాయి. అమెరికా వెలుపల జరిగిన అత్యంత వినూత్నమైన ఇంటర్నెట్ కంపెనీగా రిలయన్స్ జియో నిలిచింది.

అత్యంత విలువైన బ్రాండ్ల జాబితా

ఇంటర్నేషనల్ మార్కెట్ రిసెర్చ్ ఏజెన్సీ కంటార్ 2019కుగాను టాప్ 100 బ్రాండ్స్ జాబితాను జూన్ 12న విడుదల చేసింది. ఈ జాబితాలో తొలిసారి అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ కంపెనీ 2వ, గూగుల్ 3వ, మైక్రోసాఫ్ట్ 4వ, వీసా 5వ, ఫేస్‌బుక్ 6వ, అలీబాబా 7వ, టెన్సెంట్ 8వ, మెక్ డొనాల్డ్స్ 9వ, ఏటీ అండ్ టీ 10వ స్థానాల్లో నిలిచాయి.

ఈ జాబితాలో భారత్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (60), ఎల్‌ఐసీ (68), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (97) కంపెనీలకు చోటు దక్కింది.

షాంఘై సదస్సు

షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13, 14 తేదీల్లో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న మోదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని అన్నారు. ఎసీఓ సభ్యదేశాల మధ్య HEALTH అంశాల్లో సహకారం ఉండాలని మోదీ కోరారు. H-హెల్త్ (ఆరోగ్యం), E-ఎకానిమిక్ (ఆర్థికం), A-ఆల్టర్నేటివ్ (ప్రత్యామ్నాయ ఇంధనం), L-లిటరేచర్ (సాహిత్యం, సంస్కృతి), T-టెర్రరిజం ఫ్రీ సొసైటీ (ఉగ్రవాద రహిత సమాజం), H-హ్యుమానిటేరియన్ (మానవీయ సహకారం) అని వివరించారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఏర్పాటైన ఈ ఎస్‌సీఓలో 2017లో భారత్, పాకిస్థాన్లకు సభ్యత్వం లభించింది.

ఈ సదస్సులో కిర్గిజిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం అయిన మనాస్ ఆర్డర్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ అవార్డును చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆ దేశ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్ ప్రదానం చేశారు.

ఫోర్బ్స్ జాబితాలో భారత కంపెనీలు

ఫోర్బ్స్ మ్యాగజీన్ రూపొందించిన ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీలు-2000 జాబితాను జూన్ 13న విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) వరుసగా ఏడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేపీ మోర్గాన్ (2), చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ (3), అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా (4), బ్యాంక్ ఆఫ్ అమెరికా (5), యాపిల్ (6), పింగ్ యాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ (7), బ్యాంక్ ఆఫ్ చైనా (8), రాయల్ డచ్ షెల్ (9), వెల్స్ ఫార్గో (10) ఉన్నాయి.

దీనిలో 57 భారత కంపెనీలకు చోటు లభించింది. చమురు రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 11వ స్థానం లభించగా.. రాయల్ డచ్ షెల్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. భారతీయ సంస్థల్లో తొలి ర్యాంకులో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా 71వ స్థానంలో నిలిచింది.

వినియోగదారుల ఆర్థిక రంగం (కన్జ్యూమర్ ఫైనాన్స్)లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తొలి స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ ఏడో ర్యాంకులో నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ మొత్తం జాబితాలో 332వ స్థానంలో నిలిచింది.

Persons
Persons

ఏపీ ఎన్నికల అధికారిగా విజయానంద్

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)గా కే విజయానంద్‌ను నియమిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జూన్ 13న ఉత్తర్వులు జారీచేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ కేడర్‌కు చెందిన ఈయన ప్రస్తుతం ఏపీ జెన్‌కో సీఎండీగా ఉన్నారు.

మహమ్మద్ మునీర్‌కు పాలస్తీనా అవార్డు

భారత సంతతికి చెందిన షేక్ మహమ్మద్ మునీర్ అన్సారీకి పాలస్తీనా విదేశీ అత్యున్నత పురస్కారం స్టార్ ఆఫ్ జెరూసలేం లభించింది. జెరూసలేంలో జూన్ 14న జరిగిన కార్యక్రమంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఈ అవార్డును అన్సారీకి ప్రదానం చేశారు. భారత్-పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. జెరూసలేంలోని భారత ధర్మశాలకు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

గిన్నిస్‌లోకి లెక్సి ఆల్ఫ్రెడ్

ప్రపంచ దేశాలను చుట్టివచ్చిన అత్యంత పిన్న వయస్కురాలిగా అమెరికాకు చెందిన, 21 ఏండ్ల లెక్సి ఆల్ఫ్రెడ్ జూన్ 14న గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన ఆమె చిన్న వయస్సులోనే 196 దేశాలు చుట్టి రావాలన్న తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకుంది.

మిస్ ఇండియా వరల్డ్

మిస్ ఇండియా వరల్డ్-2019 కిరీటాన్ని రాజస్థాన్ అందగత్తె, సీఏ విద్యార్థిని సుమన్‌రావు గెలుచుకున్నారు. ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జూన్ 16న ఈ పోటీ జరిగింది. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇంజినీర్ శివానీ జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియా-2019గా, బిహార్‌కు చెందిన మేనేజ్‌మెంట్ విద్యార్థిని శ్రియా శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్ కిరీటాలను దక్కించుకున్నారు.

Sports


Sports
ఫోర్బ్స్ ధనిక క్రీడాకారుల జాబితా

ఫోర్బ్స్ 2018కుగాను అత్యంత ధనిక క్రీడాకారులు-100 జాబితాను జూన్ 12న విడుదల చేసింది. ఈ జాబితాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ 127 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్ డాలర్లతో 2వ, బ్రెజిల్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ 105 మిలియన్ డాలర్లతో 3వ స్థానంలో ఉన్నారు. రోజర్ ఫెదరర్ 93.4 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉండగా.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ 2.5 డాలర్ల (సుమారు రూ.173 కోట్లు)తో 100వ స్థానంలో నిలిచాడు.

బ్యాడ్మింటన్‌కు లీ చోంగ్ వీడ్కోలు

బ్యాడ్మింటన్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు మలేషియా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రపంచ మాజీ నంబర్ వన్ లీ చోంగ్ వీ జూన్ 13న ప్రకటించాడు. లీ చోంగ్ మూడు ప్రపంచ చాంపియన్‌షిప్ (2011, 2013, 2015)లలో, మూడు సార్లు ఒలింపిక్స్ (2008, 2012, 2016)లో రజత పతకాలు గెలుచుకున్నాడు. ఆయన తన కెరీర్‌లో 69 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.

ఆసియా చెస్ బ్లిట్జ్ విజేత నిహాల్

భారత యువ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో టైటిల్ సాధించాడు. చైనాలో జూన్ 15న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో నిహాల్ ఎనిమిది పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు.

Vemula-Saidulu

1005
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles