సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్


Wed,June 19, 2019 12:56 AM

classroom
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకోసం చాలా చోట్ల ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కొన్ని కేంద్రాలు కొందరు వ్యక్తులు ఏర్పాటు చేయగా, ప్రభుత్వ పరంగా అప్పటికే ఉన్న బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లను పటిష్టపర్చి నాణ్యమైన కోచింగ్ సెంటర్లుగా మార్చారు. ఈ స్టడీ సర్కిళ్లు రాష్ట్రంలో చాలా ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ఉద్యోగాల కల్పనలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అందులో ఆణిముత్యంలా నిలుస్తున్నది ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్. ఇక్కడ కోచింగ్ తీసుకున్న చాలామంది ఉద్యోగాలు సంపాదించటం ఒక ఎత్తయితే పదుల సంఖ్యలో విద్యార్థులు ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలు సంపాదించడం మరో విశేషం.

- చుట్టూ పచ్చటి అడవులు, అనేక జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ పంజాబ్ అని పిలుస్తారు. అయితే రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండటంతో పోటీ పరీక్షల్లో శిక్షణ పొందాలంటే ఇక్కడి అభ్యర్థులు వ్యయప్రయాసలకు ఓర్చాల్సిందే. ఇలాంటివారికి చుక్కానిలా మారింది ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్. ఉద్యోగార్థులకు కోచింగ్‌తోపాటు వసతి కూడా ఉచితంగా అందిస్తూ యువతను సక్సెస్‌వైపు నడిపిస్తున్నది. అందమైన భవనం, సువిశాల ప్రాంగణం, ఆధునిక వసతులతో తరగతి గదులు, సకల సౌకర్యాలతో స్టడీ హాళ్లు, లైబ్రెరీ, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, పట్టుదల కలిగిన ఉద్యోగార్థులు, 13 నుంచి 140కి పెరిగిన ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సంఖ్య... వీటన్నింటికి నెలవు ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్. వేలల్లో డబ్బులు వెచ్చించి ప్రైవేట్ శిక్షణ సంస్థల్లో కోచింగ్ పొందలేని ఆర్థికంగా వెనుకబడినవారికి.. ఉచితంగా శిక్షణనిస్తూ ఆయా పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ఉద్యోగార్థులను తయారు చేస్తున్నది. దీంతో స్టడీ సర్కిల్‌లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రూప్-1, 2, 3, 4, టీఆర్‌టీ, గురుకుల, పంచాయతీ సెక్రెటరీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన శిక్షణ అందిస్తున్నది. 2010లో ప్రారంభమైన ఈ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌లకు చెందిన సుమారు 1500 నుంచి 2 వేల మంది నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందించింది. వీరిలో 140 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. గతేడాది ప్రభుత్వం నిర్వహించిన టీఆర్‌టీ, గురుకుల, జేపీఎస్, ఎఫ్‌బీఓ, వీఆర్‌ఓ, గ్రూప్-4 వంటి ఇరత పరీక్షలకు ఇక్కడ శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో మొత్తం 82 మంది ఎంపికయ్యారు. వీరిలో రెండు నుంచి ఐదు పోస్టులకు అర్హత సాధించినవారు తొమ్మిది మంది ఉన్నారు.

- ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం నెల రోజుల శిక్షణ పొందిన 140 మందిలో 76 మంది ప్రిలిమ్స్‌లో అర్హత సాధించగా, ఫైనల్ మెరిట్ జాబితాలో 40 మంది చోటు సంపాదించారు. అదేవిధంగా టీఆర్‌టీలో 14 మంది ఎస్‌జీటీలుగా, గురుకులాల్లో పీజీటీ, టీజీటీలుగా 19 మంది ఎంపికయ్యారు. గ్రూప్-1, గ్రూప్-2, 4లకు శిక్షణ పొందినవారు మెరిట్ జాబితాలో ఉన్నారు. వీటితోపాటు వివిధ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నది. మహిళలకు ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యుటీషియన్ వంటి కోర్సుల్లో శిక్షణనిస్తూ వారు స్వయంగా ఉపాధి పొందేలా తయారుచేస్తున్నది. విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతూ ఎలాంటి కోర్సులను ఎంపికచేసుకోవాలి, భవిష్యత్ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాలపై అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నది.

జాబ్‌మేళా

- ప్రతి ఏడాది టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి ఏడాది జాబ్‌మేళా నిర్వహిస్తున్నది. దీనిద్వారా అవసరమైన ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇప్పించి పలు ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కలిపస్తున్నది. ఇందులో భాగంగా గతేడాది చివర్లో నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా 500 మందిని ఎంపికచేసి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీ ణ్ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై), ప్రధాన్‌మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), టాస్క్, టాటా స్ట్రయివ్ (STRIVE)లలో వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించారు. కోర్సులో భాగంగా పారిశ్రామిక శిక్షణ (ఆన్ ద జాబ్ ట్రెయినింగ్-OJT) కూడా పొందుతున్నారు. ప్రస్తుతం వీరంతా వివిధ కంపెనీల్లో వేర్వేరు హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీటితోపాటు 37 రకాల ప్రైవేటు కంపెనీలు అభ్యర్థులను ఎంపికచేసుకుని శిక్షణ అందిస్తున్నాయి.

- హైదరాబాద్‌లోని టాటా Strive సెంటర్‌లో ఆటోమొబైల్ సేల్స్ కన్సల్టెంట్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, బీపీఓ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, బీఎఫ్‌ఎస్‌ఐలో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్ స్టివార్డ్, హౌజ్‌కీపింగ్ ఆపరేషన్స్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అసిస్టెంట్, రిటైల్ సేల్స్ అసోసియేట్ వంటి కోర్సుల్లో 4-17 వారాల పాటు శిక్షణనిస్తున్నారు.

- టాస్క్‌లో సాఫ్ట్‌స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్‌ను పెంపొందించడానికి వివిధ అంశాల్లో రెండు రోజుల నుంచి ఆరు నెలల వరకు వ్యవ ధి గల కోర్సులను అందించడంతోపాటు, కోర్సులో భాగంగా వివిధ కంపెనీల్లో ఓజేటీ కూడా అందిస్తున్నారు.

- పీఎంకేవీవైలో భాగంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసినవారికి కంప్యూటర్స్ బేసిక్స్, లాజిస్టిక్స్‌లో కన్‌సైన్‌మెంట్ ట్రాకింగ్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ రోడ్, ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్, సోలార్ టెక్నీషియన్, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, మైక్రో ఇరిగేషన్, డెయిరీ ఫార్మర్ అండ్ ఎంట్రప్రెన్యూర్, రిటైల్ సేల్స్ అసోసియేట్, జెమ్స్ అండ్ జువెల్లర్లీ, ఎలక్ట్రికల్ అసెంబ్లీ ఫిట్టర్ (ఐరన్ అండ్ స్టీల్), తదితర కోర్సుల్లో శిక్షణ అందిస్తారు.

- డీడీయూ జీకేవై పథకంలో భాగంగా 7వ తరగతి, పది, ఇంటర్, బీకామ్ అభ్యర్థులకు ఆటోమొబైల్ (2, 3 వీలర్ సర్వీసింగ్), ఎలక్ట్రానిక్ రిపేర్, ఎలక్ట్రీషియన్, డీటీపీ, అకౌంట్స్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్‌వేర్, సోలార్ సిస్టమ్ (ఇన్‌స్టాలేషన్, సర్వీస్), టైలరింగ్‌లలో శిక్షణ ఇచ్చి వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

మోటివేషన్ కార్యక్రమాలు

- సాఫ్ట్‌స్కిల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలి, డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నవారి కోసం కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆత్మన్యూనత నుంచి ఎలా బయటపడాలి, టైమ్ మేనేజ్‌మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజంటేషన్ స్కిల్స్, నైతిక విలువలను ఎలా పెంపొందించుకోవాలి వంటి 19 అంశాలతో విజయానికి మార్గం పుస్తకాన్ని రూపొందించింది. అదేవిధంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం అవగాహన సదస్సులను స్టడీ సర్కిల్‌లో నిర్వహిస్తున్నారు. దీనిద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును ఎలా రూపొందించుకోవాలనే అంశాల్లో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నది.
classroom1

ఐదు ఉద్యోగాలకు ఎంపిక

- ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నా చిన్ననాటి కోరిక. దీనికి అనుగుణంగా బీసీ స్టడీ సర్కిల్‌లో చేరాను. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగం కొట్టాలనే తపన. అయితే నా ప్రిపరేషన్‌కు అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, మార్గదర్శకత్వం తోడయ్యింది. దీంతో నేను టీఆర్‌టీ, పీజీటీ, టీజీటీ, హెచ్‌డబ్ల్యూఓ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యాను. స్టడీ సర్కిల్‌లో నేర్చుకున్న అంశాలను సమయానుకూలంగా సాధన చేయడంతో ఈ పరీక్షల్లో విజయం సాధించాను.
- జీ విజయలక్ష్మి
classroom2

సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్

- విద్యార్హతలు ఉండి, ఉద్యోగాలు చేయాలనే కోరిక ఉన్నా అవకాశాలు దొరకని వారికోసం, ముఖ్యంగా ఇంటివద్ద ఉండే మహిళల కోసం స్టడీ సర్కిల్ కోర్సులను రూపొందించింది. ఇందులో భాగంగా వారికి కార్‌డ్రైవింగ్, టైలరింగ్, మగ్గం వర్క్‌లలో 50 మంది చొప్పున 150 మందికి శిక్షణ ఇచ్చింది. వీరితోపాటు బ్యుటీషియన్ కోర్సును 45 రోజులపాటు నిపుణులతో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నది. ఇలా రెండు బ్యాచ్‌లుగా కోర్సు పూర్తిచేసిన సుమారు 50 మంది స్వయంగా ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు.

- సొంతంగా ఉపాధి పొందే అవకాశం ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌లో శిక్షణ అందిస్తున్నది. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నది.
classroom3

సొంతంగా పార్లర్

- బ్యుటీషియన్ కోర్సుకు సంబంధించి 45 రోజులు శిక్షణ ఇచ్చారు. బయట సుమారు 10 వేలు ఖర్చయ్యే దీన్ని స్టడీ సర్కిల్‌లో ఉచితంగా, ప్రత్యేక నిపుణులతో అందిచారు. ఇప్పుడు నేను సొంతంగా బ్యూటీపార్లర్‌ను ఏర్పాటు చేసుకున్నాను. ఈ కోర్సువల్ల నాతోపాటు మరో 50 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రస్తుతం నేను మరో యువతికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నా.
- స్వప్న, బ్యుటీషియన్
classroom4

ప్రణాళిక ప్రకారం...

- మా స్టడీ సర్కిల్‌లో కోచింగ్ పొందిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవ్వడం ఆనందంగా ఉన్నది. ప్రణాళికాబద్ధంగా, నిపుణులైన అధ్యాపక బృదంతో బోధన జరిపిస్తున్నాం. మంచి వసతులతోపాటు నిత్యం మోడల్ టెస్టులు, వారంతపు పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు తాము ఏ స్థాయిలో ఉన్నామనే అంచనావేసుకుని, తమ అభ్యసనను మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీంతో వారు ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు. స్టడీ సర్కిల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 20 బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇందులో సుమారు 2 వేల మంది శిక్షణ పొందారు. మాకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 1045 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో140 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. 450 మంది ప్రైవేటు కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా జాబ్ మేళా ద్వారా 500 మంది, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 200 మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన నియామకాల్లో 35 మంది పంచాయతీ సెక్రెటరీలుగా, ముగ్గురు ఎఫ్‌బీఓలుగా, మరో ముగ్గురు బీఆర్‌ఓలుగా, 19 మంది గురుకుల ఉపాధ్యాయులుగా, 14 మంది ఉపాధ్యాయులుగా, ఇద్దరు వీఆర్‌ఓలుగా ఎంపికయ్యారు. అలాగే ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెరిట్ జాబితాలో స్టడీ సర్కిల్‌కు చెందిన 40 మంది ఉన్నారు. ఇందులో ఐదుగురు ఎస్‌ఐలుగా, 35 మంది కానిస్టేబుళ్లుగా ఉద్యోగం పొందే అవకాశం ఉన్నది.
- జీ ప్రవీణ్ కుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్

- గణేష్ సుంకరి

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles