సమాజసేవ ఉపాధికి తోవ


Mon,December 10, 2018 01:12 AM

కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సాయం చేయాలనే తపన మీలో ఉందా? తోటివారు సమస్యల్లో ఉంటే తోడ్పాటు అందించడం మీ నైజమా? సంపాదనతోపాటు సంతృప్తిని ఇచ్చే కెరీర్ కోసం అన్వేషిస్తున్నారా? వృత్తిపరమైన తృప్తి కావాలని భావిస్తున్నారా? అయితే మీ లాంటి వారికి అద్భుత వేదిక సమాజసేవ (సోషల్‌వర్క్). సోషల్‌వర్క్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్న పాఠకుల కోసం నిపుణ ప్రత్యేక కథనం...
social

సోషల్‌వర్క్ అంటే?

-సోషల్‌వర్క్ అంటే సమాజానికి సాయపడే వృత్తి. సమాజంలో అందరూ.. ప్రత్యేకించి నిస్సహాయులైనవారు సంతోషంగా జీవించేలా చూడటం సమాజసేవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలో ఎంతోమంది సమాజసేవ చేస్తూ సంతృప్తి చెందుతున్నారు. కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి సాయం చేయడం, మనోధైర్యం కల్పించడం సోషల్‌వర్కర్లకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

ఉండాల్సిన లక్షణాలు

-సోషల్‌వర్క్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కష్టాల్లో ఉన్నవారితో మాట్లాడి, వారి సమస్యను గుర్తించి తగిన సాయం అందించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.
-చాలా ఓపిక ఉండాలి. సోషల్‌వర్కర్లు కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలంటే సహనం తప్పనిసరి.
-నలుగురితో కలిసిపోయే మనస్తత్వం ఉండాలి. రకరకాల గ్రూప్‌లు, సహోద్యోగులు, క్లయింట్లతో సోషల్‌వర్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. అందువల్ల రకరకాల వ్యక్తులతో కమ్యూనికేట్ చేయాలంటే కలుపుగోలు స్వభావం అవసరం.
-చురుకుదనం, సమయస్ఫూర్తి ముఖ్యం. ఎందుకంటే మల్టిపుల్ క్లయింట్స్‌కు ఒకేసారి సాయం అందించాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో అందరితో చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించడానికి సమయస్ఫూర్తితోపాటు చురుకుదనం కూడా తప్పనిసరి.
-మంచి విలువలతోపాటు సమస్యను ఓపికగా విని అర్థం చేసుకునే విశాల దృక్పథం ఉండాలి. సమాజాన్ని అవగాహన చేసుకోవాలి. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలి.
-నిర్ణయాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, ప్రశ్నించే తత్వం ఉండాలి. పై లక్షణాలన్నీ మీ సొంతమైతే మీరు సమాజసేవకులుగా కెరీర్ ప్రారంభించవచ్చు.

హోదాలు

-సోషల్‌వర్క్ కోర్సులు చదివిన వారు వెల్ఫేర్ ఆఫీసర్, లేబర్ వెల్ఫేర్ స్పెషలిస్ట్, క్రిమినాలజీ స్పెషలిస్ట్, ప్రొఫెసర్, టీచర్, సోషల్ వర్కర్, కన్సల్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ట్రెయినీ ఆఫీసర్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ తదితర హోదాల్లో పనిచేయవచ్చు.

సోషల్‌వర్కర్ల విధులు

-సాయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు, గ్రూప్‌లను గుర్తించి సాయపడటం.
-తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి తోడ్పాటు అందించడం.
-చిన్నారులపై రోజురోజుకు పెరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేస్తూ వారి సంరక్షణకు కృషి చేయడం.
-మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సైకోథెరపీ లాంటి సేవలు అందించడం.
-మురికివాడల్లో నివసించే ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, విద్య ఆవశ్యకత గురించి తెలియజెప్పి ఆయా కమ్యూనిటీల అభివృద్ధికి తోడ్పడటం.
-వైకల్యం కలిగిన చిన్నారులకు చేయూతనందించడం.
-ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, నిరుద్యోగం తదితర సమస్యల కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లినవారికి కౌన్సిలింగ్ ఇచ్చి మనోధైర్యం కల్పించడం.
-మాదకద్రవ్యాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటికి బానిసలైన వారిని వాటి బారినుంచి కాపాడేందుకు కృషిచేయడం.
-గ్రామాలు, బస్తీల్లోని పేదలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న వివిధ పనుల్లో శిక్షణ ఇప్పించి పేదరిక నిర్మూలనకు సాయపడటం.

వేతనాలు

-సోషల్‌వర్కర్లుగా కెరీర్ ప్రారంభించినవారికి ఇతర రంగాలతో పోల్చితే వేతనాలు తక్కువగానే ఉంటాయి. మొదట్లో ఏడాదికి రూ.1,50,000 నుంచి 3,00,000 వరకు వేతన ప్యాకేజీలు లభించవచ్చు. రెండుమూడేండ్ల అనుభవంతో ఇంకా ఎక్కువ వేతనాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం డిగ్రీ చదివిన వారికంటే పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి మెరుగైన హోదా, వేతనం లభిస్తాయి. అదేవిధంగా పనిచేస్తున్న కంపెనీల స్థాయి, అనుభవం ఆధారంగా కూడా వేతనాలు, హోదాల్లో వ్యత్యాసాలు ఉంటాయి.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

-సోషల్‌వర్క్‌ను కేరీర్‌గా ఎంచుకునే వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చైల్డ్, విమెన్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రత్యేక అవసరాలుగల పిల్లల విద్యాసంస్థలు, ఆస్పత్రులు, మెడికల్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు, మెంటల్ హెల్త్ ఏజెన్సీలు, గ్రామీణాభివృద్ధి సంస్థలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, హ్యూమన్ రిసోర్స్ ఏజెన్సీలు, ఓల్డేజ్ హోమ్‌లు, అనాథ శరణాలయాలు, కారాగారాలు, కౌన్సిలింగ్ సెంటర్లు వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, సీనియర్ మేనేజర్-హ్యూమన్ రిసోర్స్, సబ్‌రీజినల్ ట్రెయినింగ్ కో-ఆర్డినేటర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో, యునిసెఫ్ వంటి వాటిలోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా కూడా స్థిరపడవచ్చు.
తోట నాగరాజు

సోషల్‌వర్క్‌కు సంబంధించి దేశంలోని పలు యూనివర్సిటీలు వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. డిగ్రీ స్థాయిలో BSW (బ్యాచిలర్ ఆఫ్ సోషల్‌వర్క్), పీజీ స్థాయిలో MSW (మాస్టర్ ఆఫ్ సోషల్‌వర్క్) కోర్సులు చదువవచ్చు. మాస్టర్ ఆఫ్ సోషల్‌వర్క్ పూర్తిచేసిన వారు పీహెచ్‌డీ చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీలు సోషల్‌వర్క్‌లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

కోర్సులు?

బ్యాచిలర్ ఆఫ్ సోషల్‌వర్క్ (BSW)
-ఇది మూడేండ్ల కాలవ్యవధిగల కోర్సు.
-ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు.
-కొన్ని యూనివర్సిటీలు దూరవిద్యా విధానంలో కూడా ఈ కోర్సును ఆఫర్‌చేస్తున్నాయి. విద్యార్థి వీలునుబట్టి రెగ్యులర్ లేదా దూరవిద్యా విధానంలో కోర్సు పూర్తిచేయవచ్చు.

మాస్టర్ ఆఫ్ సోషల్‌వర్క్ (MSW)

-ఇది రెండేండ్ల కాలవ్యవధిగల కోర్సు.
-బీఎస్‌డబ్ల్యూ పూర్తిచేసిన వారితోపాటు ఇతర గ్రాడ్యుయేట్‌లు కూడా ఈ కోర్సులో చేరడానికి అర్హులు. అయితే అడ్మిషన్ సమయంలో బీఎస్‌డబ్ల్యూ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.
-ఈ కోర్సును కూడా కొన్ని సంస్థలు దూరవిద్యా విధానంలో అందిస్తున్నాయి.

స్పెషలైజేషన్లు

-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
-పర్సనల్ మేనేజ్‌మెంట్
-క్రిమినాలజీ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్
-ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్
-అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్
-ఇండస్ట్రియల్ రిలేషన్ అండ్ లేబర్ వెల్ఫేర్
-మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్‌వర్క్
-స్కూల్స్ సోషల్‌వర్క్ ఎంఫిల్ ఇన్ సోషల్‌వర్క్
-ఇది రెండేండ్ల కోర్సు.
-MSW పూర్తిచేసిన వారు ఈ కోర్సు చేయడానికి అర్హులు. అయితే కొన్ని యూనివర్సిటీలు ఎంఎస్‌డబ్ల్యూలో 55 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) సాధించిన వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నాయి.

పీహెచ్‌డీ ఇన్ సోషల్‌వర్క్

-మాస్టర్ ఆఫ్ సోషల్‌వర్క్‌లో 50 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు లేదా ఎంఫిల్ ఇన్ సోషల్ వర్క్ చదివిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు.

సర్టిఫికెట్ కోర్సులు

-సర్టిఫికెట్ ఇన్ సోషల్‌వర్క్,
-సర్టిఫికెట్ ఇన్ రిహాబిలిటేషన్ కౌన్సిలింగ్
-అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్
-పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్
-వీటిలో మూడు నెలలు, ఆరు నెలల కాలవ్యవధిగల కోర్సులు ఉన్నాయి. కనీసం మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైనవారు పై కోర్సుల్లో చేరడానికి అర్హులు.
social1

డిప్లొమా కోర్సులు

-పీజీ డిప్లొమా ఇన్ సోషల్‌వర్క్
-డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్
-డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
-ఇవి ఏడాది కాలవ్యవధిగల కోర్సులు. సోషల్‌వర్క్‌లో డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ కోర్సులు చేయడానికి అర్హులు.

యూనివర్సిటీలు దేశంలో

-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) - హైదరాబాద్, గువాహటి, తుల్జాపూర్
-యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ - ఢిల్లీ
-పంజాబ్ యూనివర్సిటీ - చండీగఢ్
-మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్‌వర్క్ - చెన్నై
-జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ (JMI) - న్యూఢిల్లీ
-అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ- (AMU) అలీగఢ్

రాష్ట్రంలో

-ఉస్మానియా యూనివర్సిటీ - హైదరాబాద్
-పీజీ కాలేజీ - సికింద్రాబాద్
-కాకతీయ యూనివర్సిటీ - వరంగల్
-మహాత్మాగాంధీ యూనివర్సిటీ - నల్లగొండ
-పాలమూరు యూనివర్సిటీ - మహబూబ్‌నగర్
-శాతవాహన యూనివర్సిటీ - కరీంనగర్
-తెలంగాణ యూనివర్సిటీ - నిజామాబాద్
గమనిక: పై యూనివర్సిటీల్లో కొన్ని డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు ఆఫర్‌చేస్తుండగా.. కొన్ని యూజీ కోర్సులను, మరికొన్ని పీజీ కోర్సులను అందిస్తున్నాయి.

ప్రవేశాలు ఎలా?

-ప్రవేశాల ప్రక్రియ ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇగ్నో, దిబ్రూగఢ్ లాంటి కొన్ని యూనివర్సిటీలు క్వాలిఫైయింగ్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండగా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ), జేఎంఐ లాంటి కొన్ని యూనివర్సిటీలు సొంతంగా ఎంట్రన్స్‌లు నిర్వహిస్తున్నాయి. ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

907
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles