గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్


Sun,December 9, 2018 11:12 PM

యూనివర్సిటీల నాణ్యత, నైపుణ్యాలు, రిక్రూట్లమెంట్ల ద్వారా లభించే ఉపాదిని బట్టి గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్‌ను ప్రతి ఏటా విడుదల చేస్తారు. ఈ జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రచురిస్తుంది. ఈ ఏడాది ర్యాంకింగ్ జాబితాను పరిశీలిద్దాం.
harward-univerity

ర్యాంకింగ్ ఎందుకు?

-ఈ ర్యాంకింగ్‌ను 2004లో ప్రారంభించారు. ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీల కచ్చితమైన జాబితాను అందిస్తుంది. బోధన, పరిశోధన, అంతర్జాతీయ దృక్పథం, ఉపాధి, కీర్తి వంటివాటిని విశ్లేషిస్తారు. ఇది విద్యార్థులకు ఒక ముఖ్యమైన వనరు. యూనివర్సిటీల్లోని ప్రమాణాలను పోల్చడానికి ఈ ర్యాంకింగ్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యార్థులు తమకు ఏ కాలేజీ బాగుంటుందో ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
-కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లినంత మాత్రాన భవిష్యత్తుకు బాటలు వేసుకున్నట్లు కాదు. మంచి విద్యాసంస్థ, కోర్సును ఎంచుకోవడం అత్యంత కీలకం. ఏయే యూనివర్సిటీలు టాప్ కంపెనీల్లో నిర్వహించాల్సిన విధులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయనే సమాచారం ఈ ర్యాంకింగ్ ద్వారా తెలుస్తుంది.

41 దేశాల్లోని యూనివర్సిటీలు

-అమెరికా మొదలుకుని జపాన్ వరకు ప్రపంచంలోని 41 దేశాలకు చెందిన యూనివర్సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫ్రాన్స్, చైనాతోపాటు యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, జర్మనీ, జపాన్ దేశాలు ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా, కెనడా దేశాలకు చెందిన యూనివర్సిటీలు కూడా ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాలు దక్కించుకున్నాయి.

భారత యూనివర్సిటీలు - ఎంప్లాయబిలిటీ

-ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్‌లో భారతదేశ యూనివర్సిటీలు చాలా వెనుకడి ఉన్నాయి. ప్రపంచ యూనివర్సిటీలు ముందుకు వెళ్తున్నాయి. కానీ మన వర్సిటీలు వనరులు, వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోతున్నాం. దీంతో కంపెనీలు కోరుకుంటున్న విషయజ్ఞానం, సాంకేతిక, సాఫ్ట్‌వేర్, పని నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడినాయి.
-రిసెర్చ్‌లో అధికంగా పెట్టుబడులతో పాటు అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీల బోధన, పాఠ్య ప్రణాళికలు మార్పులు తీసుకువచ్చి విద్యార్థులను పారిశ్రామికీకరణకు అవసరమయ్యేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదికవల్ల తెలుస్తుంది.

1. హార్వర్డ్ యూనివర్సిటీ

-ఇది అమెరికాలోని అతి పురాతన, ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ. ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ యూనివర్సిటీకి ఉంది.
-అమెరికాలోని దాదాపు 30 రాష్ర్టాల అధిపతులు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినవారే. అదేవిధంగా 48 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, 48 మంది పులిట్జర్ బహుమతి విజేతలు ఈ యూనివర్సీకి సంబంధించిన వారు ఉన్నారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఈ యూనివర్సిటీకి సుదీర్ఘ చరిత్ర ఉంది.
-ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, పరిశ్రమల వ్యవస్థాపన వంటి సహపాఠ్య కార్యక్రమాల్లో తర్ఫీదునిస్తారు. అందుకే ఇక్కడ చదివిన విద్యార్థులకు కంపెనీలు ఎర్రతివాచీ పరుస్తాయి.

2. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

-ఇది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటి. అంతర్జాతీయ స్థాయిలో అనేక కంపెనీలు ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకునేందుకు పోటీపడుతుంటాయి.
-విద్యార్థుల సంఖ్యాపరంగా చూస్తే ఇది చిన్న యూనివర్సిటీ. ఇందులో కేవలం 1000 మంది అండర్‌గ్రాడ్యుయేట్లు, 1200 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువ కాబట్టి ప్రొఫెసర్లు, విద్యార్థుల మధ్య మంచి రిలేషన్ కొనసాగుతున్నది.

3. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

-ఈ యూనివర్సిటీ ప్రపంచ ప్రాచుర్యం పొందిన అనేక కోర్సులతోపాటు అండర్ గ్రాడ్యుయేట్స్, ఇండస్ట్రీ లీడర్స్, సాధారణ ప్రజల కెరీర్ ఎదుగుదలకు అవసరమైన ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నది.
-చాలా కంపెనీలు ఈ యూనివర్సిటీతో మెరుగైన సంబంధాలు కలిగి ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్, బయోటెక్నాలజీ తదితర నూతన పారిశ్రామిక ఆవిష్కరణలు చేయడంలో ఈ యూనివర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపక బృందం కీలకపాత్ర పోషిస్తున్నారు.

4. కేంబ్రిడ్జి యూనివర్సిటీ

cambridge
-ఇది ప్రపంచంలోని ఉన్నత శ్రేణి యూనివర్సిటీల్లో ఒకటి.
-ఈ యూనివర్సిటీకి ఎనిమిది శతాబ్దాల (13వ శతాబ్దం నుంచి) చరిత్ర ఉంది. ఆక్స్‌ఫర్డ్ స్కాలర్స్ ఈ యూనివర్సిటీ వ్యవస్థాపకులు.
-అనేక ప్రపంచస్థాయి కంపెనీలు ఈ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

5. ది యూనివర్సిటీ ఆఫ్ టోక్యో

Tokyo
-దీన్ని జపాన్‌లోని టోక్యోలో 1877లో స్థాపించారు. ఈ యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా 450 అంతర్జాతీయ ఎక్స్‌చేంజ్ ఒప్పందాలు ఉన్నాయి.
-ఈ యూనివర్సిటీ నుంచి 8 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు. అంతేకాకుండా జపాన్ దేశ ప్రధాన మంత్రులుగా పనిచేసినవారిలో 15 మంది ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారే.

6. యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్

-దీన్ని మొదట రాయల్ బవేరియన్ పాలిటెక్నిక్ ఆఫ్ మ్యూనిచ్‌గా పిలిచేవారు. దీన్ని 1868లో స్థాపించారు.
-ఈ యూనివర్సిటీ నుంచి కూడా చాలామంది నోబెల్ బహుమతి గ్రహీతలున్నారు. అంతేకాకుండా 165 ఆవిష్కరణలు జరగగా, పేటెంట్ల కోసం 69 అంశాలను సమర్పించారు.

7. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ

princeton-university
-ఇది యూఎస్‌లోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. దీన్ని 1746లో కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీగా స్థాపించారు. 1896 నుంచి దీన్ని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీగా పిలుస్తున్నారు.
-ఈ కాలేజీ నుంచి నోబెల్ బహుమతులు, నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పొందినవారు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా అమెరికా ప్రెసిడెంట్‌లుగా పనిచేసిన జేమ్స్ మాడిసన్, ఉడ్రో విల్సన్‌లు ఈ యూనివర్సిటీ విద్యార్థులే.
-అమెజాన్ స్థాపకుడు జెఫ్ బెజోస్, అపోలో వ్యోమగామి పీట్ కాన్రాడ్ కూడా ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారే.

8. యేల్ యూనివర్సిటీ

-ఇది యూఎస్‌లోని మూడో అతిపురాతన యూనివర్సిటీ. దీన్ని 1701లో స్థాపించారు. 1718లో దీన్ని యేల్ యూనివర్సిటీగా పేరుమార్చారు.
-ఇది ప్రపంచంలోనే రెండో ధనిక యూనివర్సిటీ. దీనిలోని గ్రంథాలయంలో 15 మిలియన్ల పుస్తకాలు ఉన్నాయి.
-ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారిలో ఐదుగురు అమెరికా అధ్యక్షులు కూడా ఉన్నారు. అంతేకాకుడా ఈ యూనివర్సిటీ నుంచి నోబెల్ బహుమతులు, 32 పులిట్జర్ అవార్డులు అందుకున్నవారు ఉన్నారు.

9. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్

-ఇది ఆసియాలో ఒక ప్రముఖ యూనివర్సిటీ.
-ఇది అసోసియేషన్ ఆఫ్ పసిఫిక్ రిమ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ రిసర్చ్ యూనివర్సిటీస్ వంటి అంతర్జాతీయ విద్య, పరిశోధన నెట్‌వర్క్‌లలో చురుగ్గా పాల్గొంటుంది.

10. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ

-టెక్నాలజీ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో అద్భుతమైన శిక్షణ అందిస్తారు.
-ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఎంతో మంది పెద్దపెద్ద కంపెనీలు స్థాపించారు. గూగుల్, నైక్, నెట్‌ఫ్లిక్స్, సన్ మైక్రోసిస్టమ్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సంస్థలు ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు స్థాపించినవే.
-ఈ యూనివర్సిటీలో చదివే గ్రాడ్యుయేట్లు సైతం కివా (KIVA), సిరమ్ (SIRUM) వంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌ను స్థాపించారు.
IITDelhi_New
universities
-చాపల శ్రీ సత్యం

650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles