కరెంట్ అఫైర్స్


Wed,November 14, 2018 03:19 AM

Telangana
Telangana

కపిలవాయి లింగమూర్తి మృతి

ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకులు, సాహితీ భీష్ముడు కపిలవాయి లింగమూర్తి హైదరాబాద్‌లో నవంబర్ 6న మరణించారు. ఆయన 1928, జనవరి 31న నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో వెంకటాచలం, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. తెలుగు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ను అందుకున్న తొలి వ్యక్తి ఆయనే. పండరినాథ విఠల శతకం, తిరుమలేశుని శతకం, ఆర్య శతకం, ఛత్రపతి, దుర్గ, భర్గ శతకాలు, జినుకుంట రామబంటు శతకం, పరమహంస శతకం, పాలమూరు జిల్లా దేవాలయాల చరిత్ర, మామిళ్లపల్లి స్థల చరిత్ర, భైరవకోన క్షేత్ర మహాత్యం, సోమేశ్వర మహాత్యం, గద్వాల హనుమద్వచనాలు, సౌధశిఖరం, చక్రతీర్థ మహాత్యం వంటి ఎన్నో రచనలు చేశారు. ఆయనకు కవితా కళానిధి, కవి కేసరి బిరుదులు ఉన్నాయి.

రచయిత జాతశ్రీ మృతి

ప్రముఖ రచయిత, కవి జాతశ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నవంబర్ 4న మృతిచెందారు. ఆయన అసలు పేరు చార్లెస్. ఆయన రచించిన కుట్ర అనే కథకు వట్టికోట ఆళ్వారు స్వామి అవార్డు, వెదురుపొదలు నినదించాయి నవలకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి.

ఎన్టీపీసీకి స్వర్ణశక్తి అవార్డు

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సంస్థకు మూడు స్వర్ణశక్తి అవార్డులు దక్కాయి. 2016-17, 2017-18కుగాను గ్రీన్‌ఫీల్డ్-థర్మల్ అవార్డు, ఉత్తమ ఆపరేటింగ్ విధానంలో సోలార్ ప్లాంటు, ఉత్పాదకత (బొగ్గు)లో రన్నరప్ అవార్డులు లభించాయి.

నందిని సిధారెడ్డికి పురస్కారం

తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సాహితీ పురస్కారం లభించింది. నవంబర్ 16న జరిగే సభలో పురస్కారంతో పాటు రూ. 5,116 నగదు, జ్ఞాపిక అందజేయనున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్తు తెలిపింది.

Sports
Sports

మను-సౌరభ్ జంటకు స్వర్ణం

ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్లు మను భాకర్-సౌరభ్ చౌదరి జంటకు స్వర్ణ పతకం దక్కింది. కువైట్‌లో నవంబర్ 9న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో మను-సౌరభ్ జంట 485.4 పాయింట్ల స్కోరు చేసి జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది.
-ఈ ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో సౌరభ చౌదరికి స్వర్ణం లభించింది.
-ఈ టోర్నీలో షాట్‌గన్ షూటింగ్‌లో భారత షూటర్ అంగద్‌వీర్ సింగ్ బాజ్వాకు స్వర్ణం దక్కింది.

Awards
Awards

లఢక్ రెస్టోరేషన్ ప్రాజెక్టు

జమ్ముకశ్మీర్‌లోని లఢక్‌లో వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం చేపట్టిన ప్రాజెక్టుకు 2018కి గాను యునెస్కో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ పురస్కారం లభించింది. లఢక్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ (లామో) సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది. యునెస్కో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డును 2000 సంవత్సరంలో ఏర్పాటుచేశారు.

జవహర్‌లాల్ సరిన్

ప్రముఖ ఫ్రెంచ్ భాషావేత్త జవహర్‌లాల్ సరిన్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం చెవలియర్ డీ లా ఎల్‌జియన్ డీ హానర్‌ను ప్రదానం చేసింది. ఫ్రెంచి భాషకు విస్తృత ప్రచారం కల్పించినందుకు, భారత్-ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం పెంపునకు కృషి చేసినందకు ఆయనకు ఈ పురస్కారం లభించింది.

స్వాతికి ప్రెస్ ఫ్రీడం అవార్డు

భారత్‌కు చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదికి లండన్ ప్రెస్ ఫ్రీడం అవార్డ్ ఫర్ కరేజ్-2018 లభించింది. లండన్‌లో నవంబర్ 8న జరిగిన ఓ కార్యక్రమంలో రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆమె ఐ యామ్ ఏ ట్రోల్: ఇన్‌సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ది బీజేపీ డిజిటల్ ఆర్మీ అనే పుస్తకాన్ని రాశారు.

రామ్‌కు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు

హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్‌కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్మోహన్‌రాయ్ అవార్డు లభించింది. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నవంబర్ 5న ప్రకటించింది. జాతీయ పత్రికా దినోత్సవమైన నవంబర్ 16న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

National
National

అయోధ్య దీపోత్సవ్‌కు గిన్నిస్ రికార్డు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నవంబర్ 6న జరిగిన దీపోత్సవ్ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. సరయూ నది ఒడ్డున 3,01,152 దీపాలను వెలిగించడంతో ఈ రికార్డ్ దక్కింది.

నేషనల్ లీగల్ సర్వీస్ డే

దేశంలోని పౌరులందరికీ సక్రమంగా న్యాయం జరిగేలా అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా నిర్వహించే నేషనల్ లీగల్ సర్వీస్ దినోత్సవాన్ని నవంబర్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించారు. పేద ప్రజలకు ఎలాంటి ఖర్చులేకుండా చట్టపరంగా న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర, సరైన న్యాయం జరిగేలా చూడటం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఎన్‌ఎల్‌ఎస్‌డీని భారత సుప్రీంకోర్టు 1995లో ప్రారంభించింది. ప్రతి ఏటా నవంబర్ 9న లోక్ అదాలత్‌లను నిర్వహించి పేదల పెండింగ్ కేసులను పరిష్కరిస్తుంటారు.

ఏపీలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటుచేసేందుకు కేంద్ర క్యాబినెట్ నంబర్ 9న ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీని విజయనగరం జిల్లాలోని రెల్లి గ్రామం వద్ద ఏర్పాటుచేయనున్నారు.

ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం

ఢిల్లీలో యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నవంబర్ 4న ప్రారంభించారు. ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఈ బ్రిడ్జి పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు, వెడల్పు 35 మీటర్లు.

ఏఆర్ రెహమాన్ బయోగ్రఫీ ఆవిష్కరణ

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ జీవితచరిత్రపై రాసిన నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్ పుస్తకాన్ని నవంబర్ 4న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత కృష్ణ త్రిలోక్ రచించారు.

International
International

భారత్- సింగపూర్ నౌకాదళ విన్యాసాలు

భారత్- సింగపూర్ మధ్య ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు (సింబెక్స్ 2018) నవంబర్ 10న బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు నవంబర్ 21 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య 1994 నుంచి ప్రతి ఏడాది ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకొంటున్నాయి.

స్మార్ట్ ఫోన్ల అమ్మకంలో భారత్ నంబర్ 2

స్మార్ట్ ఫోన్ల అమ్మకంలో అమెరికాను అధిగమించి భారత్ ప్రపంచ నంబర్ 2గా అవతరించింది. ఈ ఏడాది జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో 4.4 కోట్ల స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జరిగాయి. ఇదే కాలానికి అమెరికాలో 4 కోట్ల ఫోన్లే అమ్ముడుపోయాయి. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో మొదటి స్థానంలో చైనా నిలిచింది. ఆ దేశంలో జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో 10.6 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ వస్తున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఈసారి కూడా 7.2 శాతం తగ్గాయి.

ఐటీయూలోకి భారత్

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ కౌన్సిల్ (ఐటీయూ)లో భారత్ సభ్యురాలిగా ఎన్నికయ్యింది. ఈ హోదాలో భారత్ 2019 నుంచి 2022 వరకు కొనసాగుతుంది. నవంబర్ 8న దుబాయ్‌లో జరిగిన ఐటీయూ సమావేశంలో భారత్‌కు ఈ గౌరవం దక్కింది. సమాచార శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధికి ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఐటీయూలో 193 దేశాలతోపాటు 800 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.

తొలి ఏఐ యాంకర్

ప్రపంచంలోనే తొలిసారి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేసే సింథటిక్ వర్చువల్ యాంకర్‌ను చైనా రూపొందించింది. చైనాలో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌లో నవంబర్ 9న ఈ యాంకర్‌ను ఆవిష్కరించారు. చైనా ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ జిన్హువాలో ఈ కృత్రిమ మేధ యాంకర్ విధులు నిర్వహిస్తుంది.

పాకిస్థాన్-చైనాల మధ్య బస్సు

పాకిస్థాన్-చైనాల మధ్య బస్సు సర్వీసును పాకిస్థాన్ అధికారులు నవంబర్ 8న ప్రారంభించారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని గుల్బర్గ్ నుంచి చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో కష్గర్ నగరానికి ఈ బస్సు బయలుదేరింది. షూజా ఎక్స్‌ప్రెస్ అనే ప్రైవేటు సంస్థ ఈ మార్గంలో బస్సులను నడుపనుంది.

Persons
Persons

అశోక్ కుమార్ గుప్తా

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నూతన చైర్‌పర్సన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అశోక్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రధాని నేరేంద్రమోదీ నేతృత్వంలోని అపాయింట్‌మెంట్స్ క్యాబినెట్ కమిటీ నవంబర్ 9న ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. అశోక్ కుమార్ గుప్తా సీసీఐ చైర్‌పర్సన్‌గా 2022 అక్టోబర్ 25 వరకు లేదా ఆయనకు 65 ఏండ్లు నిండేవరకు ఉంటారు. ఈయన తమిళనాడు క్యాడర్‌కు చెందిన అధికారి. కాంపిటీషన్ యాక్ట్ 2002 ప్రకారం 2003లో ఏర్పాటుచేసిన సీసీఐ 2009 మే నుంచి పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తున్నది.

సీబీడీటీ సభ్యులు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సభ్యులుగా ముగ్గురు సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారులను కేంద్రం నవంబర్ 9న నియమించింది. పీకే దాష్, అఖిలేష్ రంజన్, నీనా కుమార్‌లను సీబీడీటీ సభ్యులుగా నియమిస్తూ కేంద్ర క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ (ఏసీసీ) నిర్ణయం తీసుకొంది. ఈ ముగ్గురు 1982 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారులు. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలో పనిచేసే సిబిటీడీ దేశంలో ఆదాయపు పన్నుకు సంబంధించిన పరిపాలనా సంస్థ. దీనిని కేంద్ర రెవిన్యూ బోర్డు చట్టం 1963 ఆధారంగా ఏర్పాటుచేశారు.
Vemula-Saidulu

633
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles