సరికొత్తగా మెడిసిన్


Wed,November 14, 2018 03:14 AM

MBBS-Students
- దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యవిద్యలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) మార్పులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 21 ఏండ్ల తర్వాత దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎంబీబీఎస్ పాఠ్యప్రణాళికను కొత్తగా రూపొందించింది. ఈ నూతన పాఠ్యప్రణాళిక 2019-20 విద్యాసంవత్సరంలో భాగంగా ఆగస్టులో ప్రారంభమయ్యే ఎంబీబీఎస్ మొదటి ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ప్రధానంగా వైద్యవృత్తిపై దృక్పథంలో మార్పు, నైపుణ్యాలు, స్నేహప్రవృత్తితో కూడిన నైతిక విలువలు పెంపొందించడం, ఫలిత ఆధారిత అభ్యసనం, అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం మెరుగుపరచడం వంటి అంశాలతో కూడిన వైద్యవిద్యను అందించాలనే లక్ష్యంతో కాంపిటెన్సీ బేస్డ్ అండర్ గ్రాడ్యుయేట్ కరికులమ్ ఫర్ ద ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పేరుతో కొత్త పాఠ్యప్రణాళికను ఎంసీఐ రూపొందించింది.
ఇవీ మార్పులు
- ప్రస్తుతం విద్యావ్యవస్థ ప్రయోగాత్మక జ్ఞానం, విజ్ఞాన వ్యవస్థల ఏకీకరణ వైపు మార్పు చెందుతున్నది. అందువల్ల కోర్సు పూర్తయిన తర్వాత కాకుండా, కోర్సుతోపాటే వృత్తిపరమైన శిక్షణ అందిచేలా కొన్ని మార్పులు, చేర్పులతో ఎంబీబీఎస్ నూతన కరికులమ్‌ను రూపొందించారు.
- మొదటి ఏడాది నుంచే క్లినికల్ ఎక్స్‌పోజర్ ఉంటుంది. గతంలో ఇది ఎంబీబీఎస్ రెండో ఏడాదిలో భాగంగా ఉండేది. కానీ కొత్త సిలబస్ ప్రకారం మొదటి ఏడాది నుంచే క్లినికల్ తరగతులు, బెడ్‌సైడ్ టీచింగ్ నిర్వహిస్తారు. దీనిద్వారా దవాఖానల్లో రోగులకు ఏవిధంగా చికిత్స అందించాలో ప్రత్యక్షంగా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.

- కోర్సు ప్రారంభంలోనే నెల రోజులపాటు ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఇందులో నైతిక నియమావళి, భావవ్యక్తీకరణ సామర్థ్యం, ఆరోగ్యరంగం, వృత్తి నైపుణ్యం వంటి పలు అంశాలను బోధిస్తారు. దీంతో వివిధ నేపథ్యాలు, పరిసరాల నుంచి వచ్చే విద్యార్థుల ఆలోచనా విధానాలను మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యార్థులు ఎంబీబీఎస్‌కు సన్నద్ధమై విజయవంతంగా కోర్సును పూర్తిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
- కొత్తగా ఎలెక్టివ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిద్వారా విద్యార్థులు వారికి అవసరమైన సబ్జెక్టులను వారే ఎంపికచేసుకోవచ్చు. తద్వారా స్వీయ నిర్దేశిత అభ్యసనం, కో కరికులర్ యాక్టివిటీస్ కోసం పూర్తి సమయాన్ని కేటాయించవచ్చు.
- తొలి ఏడాది నుంచే సబ్జెక్టులవారీగా పాఠ్యబోధన విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
- రోగులతో సమర్థవంతంగా ఎలా కమ్యూనికేట్ చేయాలి, అవయవ దానంపై ఎలా వ్యవహరించాలి, అత్యవసర పరిస్థితుల్లో రోగి బంధువులతో ఎలా ఉండాలి, రోగి చనిపోతే కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవిస్తూ ఎలా వివరించాలి, క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలి, వంటివాటిపై శిక్షణ ఇస్తారు.
- కోర్సులో భాగంగా క్రమం తప్పకుండా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఉదాహరణకు సున్నితమైన పరిస్థితుల్లో రోగులతో ఎలా సంబంధాలను నిర్వహిస్తారు, వారి సంరక్షణ, వైద్యానికి సంబంధించి వారి నుంచి సమ్మతి ఎలా పొందుతారు వంటి విషయాలపై నిరంతరం అసెస్‌మెంట్ కొనసాగుతుంది. ఇవన్నీ వారి సామర్థ్యాలు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతాయి.

- నైతిక విలువలపై ప్రత్యేక బోధన ఉంటుంది.
- కొత్తగా రూపొందించిన పాఠ్యప్రణాళిక వైద్య నమూనాలు ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. శరీర భాగాలను గురించి తెలుసుకోవడం కోసం పార్థివ దేహాలు ఉపయోగించడం, ఇతర విషయాలను అధ్యయనం చేయడానికి మరికొన్ని నమూనాలు ఉపయోగించడం మెడికల్ ప్రాక్టీస్‌లో భాగంగా కొనసాగుతాయి.
- ప్రజారోగ్యం, మానసిక ఆరోగ్యం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల ఈ అంశాలకు పాఠ్యప్రణాళికలో మొదటి ఏడాది నుంచే చోటు కల్పించారు.
- దీనిద్వారా రోగులకు వైద్యసేవలు నేరుగా ఎలా అందిచాలనే అంశాలను స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- కొత్తగా తీసుకువచ్చిన ఈ మార్పుల ద్వారా ఎంబీబీఎస్ కోర్సు అనుకరణ, మార్గనిర్దేశకత్వంలో కొనసాగుతుంది.

ఎంబీబీఎస్ సీటు సాధించడం ఎలా...

- మెడిసిన్‌లో సీటు సాధించాలంటే దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్, ఎయిమ్స్ ఎంబీబీఎస్, జిప్‌మర్ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్షలు రాయాలి.
- దేశంలో అత్యుత్తమ వైద్య సంస్థ అయిన ఎయిమ్స్, జిప్‌మర్ రెండూ ప్రత్యేక ప్రతిపత్తి కలిగినవి. ఇవి ఎంబీబీఎస్ ప్రవేశానికి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్, ఆయుష్ సీట్లను నింపడానికి నీట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నది.
- ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సంస్థల్లో మొత్తం 800 సీట్లు ఉన్నాయి.
- జిప్‌మర్ (జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్)కు చెందిన మెడికల్ విద్యాసంస్థలు పుదుచ్చేరి, కరైకల్‌లో ఉన్నాయి. వీటిలో 200 ఎంబీబీఎస్ సీట్ల్లు ఉంటాయి. అంటే పుదుచ్చేరిలో 150 సీట్లు, కరైకల్‌లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

- ఎయిమ్స్, జిప్‌మర్ ప్రవేశపరీక్షకు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. రెండూ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే. అందువల్ల రెండింటికి ఉమ్మడిగా ప్రిపేర్ అయితే సులభంగా ఎంబీబీఎస్ సీటు సాధించవచ్చు. వీటిలో ఏదైనా తేడా ఉందంటే అది పరీక్ష సమయం మాత్రమే. ఎయిమ్స్‌కు 3.30 గంటలు, జిప్‌మర్ పరీక్షకు 2.30 గంటలు సమయం కేటాయించారు. ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష 2019, మే 25, 26 తేదీల్లో రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి 12.30 గం. వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6.30 గం. వరకు) ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నపత్రంలో ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, ప్రతి తప్పు జవాబుకు 1/3 వంతు మార్కులను కోత విధిస్తారు.
- ఎయిమ్స్ ఎంబీబీఎస్ అప్లికేషన్లు 2019, ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

నీట్

- దేశంలో మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేయడానికి నిర్వహించే అతిపెద్ద ప్రవేశపరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్). దీనిద్వారా సుమారు 90 వేల ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నీట్‌లో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురానప్పటికీ, పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి అప్పజెప్పింది. ఇప్పటివరకు ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహించింది. దీంతోపాటు పరీక్షను ఏడాదికి ఒకేసారి ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే పెన్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ఆధార్ తప్పనిసరి అనే నిబంధనను ఈసారి ఎత్తివేశారు. దీంతోపాటు పరీక్షవేళల్లో కూడా మార్పులు చేసి మధ్యాహ్నం 2 గం. నుంచి 5 గంటల వరకు దేశవ్యాప్తంగా సుమారు 154 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
- నీట్ నోటిఫికేషన్ గతంలో ఫిబ్రవరిలో విడుదల అయ్యేది. కానీ ఈసారి నవంబర్‌లోనే విడుదలై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది నవంబర్ 30తో ముగియనుంది.

పరీక్ష విధానం

- మొత్తం 720 మార్కులకు ఉండే ఈ ప్రవేశపరీక్షలో ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, బోటనీ 45, జువాలజీ 45 ప్రశ్నల చొప్పున మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. అంటే ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు (180x4= 720). ఇందులో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
- పెన్‌పేపర్ విధానంలో ఉండే ఈ పరీక్షకు 3 గంటలు సమయం కేటాయించారు.
- ప్రవేశ పరీక్షను 2019, మే 5న నిర్వహించనున్నారు.
AIMS
- దేశంలో ఎయిమ్స్ సంస్థలు మొత్తం తొమ్మిది.. ఢిల్లీ, భువనేశ్వర్, భోపాల్, జోధ్‌పూర్, పట్నా, రిషికేష్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, గుంటూరులో ఉన్నాయి. వీటిలో ఎయిమ్స్ ఢిల్లీకి ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తారు.

ఎయిమ్స్, జిప్‌మర్ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
ఇందులో ఫిజిక్స్ నుంచి 60 ప్రశ్నలు,
కెమిస్ట్రీ నుంచి 60, బయాలజీ నుంచి 60,
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 10,
లాజికల్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నల చొప్పున వస్తాయి.

JIPMER
జిప్‌మర్ ఎంబీబీఎస్‌కు సంబంధించిన అప్లికేషన్లు 2019, మార్చి 6న ప్రారంభమై, ఏప్రిల్ 12న
ముగుస్తాయి. పరీక్షను జూన్ 2న నిర్వహిస్తారు.

- గణేశ్ సుంకరి

659
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles