కరెంట్ అఫైర్స్


Wed,November 7, 2018 01:16 AM

Telangana
Telangana

శాంసంగ్ ఇన్నోవేషన్ అవార్డులు

8వ ఎడిషన్ శాంసంగ్ ఇన్నోవేషన్ అవార్డ్స్-2018 ప్రదానోత్సవం నవంబర్ 2న ఐఐఐటీ హైదరాబాద్‌లో జరిగింది. అతి తక్కువ సమయంలో డేటాను అర్థం చేసుకోవడంతోపాటు క్షణాల్లో కోరుకున్న భాషలో అనువాదం చేసే అప్లికేషన్‌ను రూపొందించిన కన్నన్ చంద్రశేఖర్‌కు మొదటిస్థానం లభించింది. కొద్దిపాటి ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ ఎలా కొనసాగించవచ్చనే అప్లికేషన్‌ను రూపొందించిన వీ సుష్మిత, ఆనంద్, సుష్మీ బదులికలు రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో స్మార్ట్‌ఫోన్ ఆధారంగా నోరు, గొంతు తదితర క్యాన్సర్లను గుర్తించే అప్లికేషన్‌ను రూపొందించిన జీ హనుఫణిరామ్, ప్రవీణ్‌కుమార్‌లకు లభించింది.

హైదరాబాద్ మెట్రోకు అవార్డు

హైదరాబాద్ మెట్రోలో పర్యావరణ హితంగా ఉన్న రసూల్‌పుర, ప్యారడైజ్, ప్రకాశ్‌నగర్ స్టేషన్లను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ ప్లాటినం అవార్డుకు ఎంపికచేసింది. హెచ్‌ఐసీసీలో నవంబర్ 1న జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి ఈ అవార్డును మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి అందజేశారు.

National
National

ఐక్యతా విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)గా పిలిచే దీన్ని గుజరాత్‌లోని నర్మదానది తీరంలో నిర్మించారు. 182 మీటర్ల (సుమారు 600 అడుగులు) ఎత్తున్న ఈ విగ్రహాన్ని 36 నెలల్లో పూర్తిచేశారు. ఇప్పటివరకు చైనాలోని స్ప్రింగ్ టెంపుల్‌లోని బుద్ధ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా ఉంది.

సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న యారాడ డాల్ఫిన్ కొండపై నిర్మించనున్న నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్, ట్రెయినింగ్ అండ్ ఫెసిలిటీ కేంద్రానికి కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నవంబర్ 2న శంకుస్థాపన చేశారు. రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే తీరప్రాంత కోత, రక్షణ, సముద్ర కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఆపతి మృతి

భారత సైన్యంలో వైస్ అడ్మిరల్‌గా పనిచేసి రిటైరైన ఎంపీ ఆపతి (91) మహారాష్ట్రలోని సతారాలో నవంబర్ 4న మరణించారు. ఆయన 1971లో జరిగిన యుద్ధంలో సబ్‌మెరైన్‌పై దాడిచేసి విజయం సాధించారు. కేంద్రం వీర్‌చక్ర అవార్డుతో ఆయనను సత్కరించింది.

అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం

ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం వీలర్స్ ఐలాండ్ నుంచి అక్టోబర్ 31న అగ్ని-1 క్షిపణిని వియవంతంగా పరీక్షించారు. దీని పరిధి 700 కి.మీ.. 1000 కిలోల పేలోడ్ సామర్థ్యంగల ఈ క్షిపణిని 2014, ఏప్రిల్ 12 తర్వాత దీన్ని పరీక్షించడం ఇది రెండోసారి.

International
International

కెప్లర్ టెలిస్కోప్

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోప్ (కే2) జీవితకాలం అక్టోబర్ 31న ముగిసింది. 2009, మార్చి 6న ప్రయోగించిన ఈ టెలిస్కోప్ ఇప్పటివరకు 2600కు పైగా కొత్త గ్రహాలను గుర్తించింది. కెప్లర్ మిషన్ వ్యవస్థాపకులు విలియం బ్రూకీ.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ప్రపంచ బ్యాంకు 190 దేశాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం) నివేదికను అక్టోబర్ 31న విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌కు 77వ ర్యాంకు దక్కింది. న్యూజీలాండ్ మొదటి స్థానంలో నిలవగా సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

శక్తిమంతమైన పాస్‌పోర్ట్

వీసా ఫ్రీస్కోర్ ఆధారంగా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లు కలిగిన165 దేశాల జాబితాను అక్టోబర్ 30న విడుదల చేశారు. ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 66వ స్థానంలో నిలవగా జర్మనీ 2, డెన్మార్క్ 3, స్వీడన్ 4వ స్థానాల్లో ఉన్నాయి.

13వ గ్లోబల్ ఎక్స్‌పో

బోట్సువానా దేశంలో 13వ గ్లోబల్ ఎక్స్‌పో బోట్సువానా-2018 కార్యక్రమాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నవంబర్ 2న ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోలో భారత్ నుంచి 25 కంపెనీలు పాల్గొన్నాయి. ఇండియా-బోట్సువానాల మధ్య వాణిజ్య సంబంధాలు 2015 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది.

విదేశీ చిత్రాలపై పోల్

బీబీసీ చానల్ 43 దేశాలకు చెందిన 209 మంది సినీ విమర్శకులతో ప్రపంచంలో ఉత్తమ విదేశీ చిత్రాలపై పోల్ నిర్వహించింది. దీనిలో జపాన్‌కు చెందిన సెవెన్ సమురాయ్ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా దర్శకుడు అకిరా కురసోవా. భారత్ నుంచి పథేర్ పాంచాలి చిత్రం 15వ స్థానంలో నిలిచింది.

భారత పర్యటనలో ఇటలీ ప్రధాని

ఇటలీ ప్రధాని గిసెప్ కాంటే అక్టోబర్ 30న భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రక్షణ, వాణిజ్యం, ఇంధనం, మౌలిక రంగా ల్లో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఆయన న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ ఇండియా-ఇటలీ టెక్నాలజీ సమ్మిట్‌లో పాల్గొన్నారు.

సూర్యుడికి దగ్గరిగా పార్కర్

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ అంతరిక్ష నౌక సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లి రికార్డు సృష్టించింది. మానవుడు తయారుచేసిన ఒక వస్తువు సూర్యుడికి చాలా సమీపానికి వెళ్లడం ఇదే తొలిసారి. అంతరిక్ష వాతావరణంపై సూర్యుడి ఉపరితల వాతావరణం చూపే ప్రభావం వంటి రహస్యాలను కనుక్కోవడానికి ఆగస్టు 12న ఈ ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించింది. ఇది అక్టోబర్ 29 నాటికి సూర్యునికి 4.2 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. 1976 ఏప్రిల్‌లో జర్మన్-అమెరికన్ హీలియోస్- 2 అంతరిక్ష నౌక సూర్యుడికి సమీపంలోకి వెళ్లింది.

రాయబార కార్యాలయానికి శంకుస్థాపన

జింబాబ్వేలో భారత రాయబార కార్యాలయానికి నవంబర్ 4న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ నన్‌గాగ్వా, ఉపాధ్యక్షుడు కెంటో మెహదీతో అంతర్జాతీయ సౌరశక్తి సంకీర్ణ నిబంధనావళి (సోలార్ అలయన్స్ ఫ్రేమ్‌వర్క్) ఒప్పందంపై చర్చించారు.

Sports
Sports

భారత్‌కు ఐదు వన్డేల సిరీస్

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో నవంబర్ 1న జరిగిన చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.

పంకజ్‌దే ఆసియా స్నూకర్

ఆసియా స్నూకర్ టూర్ రెండో అంచె విజేతగా పంకజ్ అద్వానీ (కర్ణాటక) నిలిచాడు. అక్టోబర్ 31న జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన జు రెతిని ఓడించాడు. దీంతో ఈ ఈవెంట్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. మొత్తం 19 సార్లు ప్రపంచ స్నూకర్ విజేతగా నిలిచాడు.

వాలీబాల్ లీగ్ అంబాసిడర్‌గా పీవీ సింధు

2019, ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్-1కు బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, అమెరికన్ స్టార్ స్పైకర్ డేవిడ్ లీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు నవంబర్ 2న తెలిపారు.

హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రవిడ్

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. కేరళలోని తిరువనంతపురంలో నవంబర్ 1న జరిగిన కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ ఇందుకు సంబంధించిన జ్ఞాపికను ద్రవిడ్‌కు అందజేశాడు. దీంతో బిషన్ సింగ్ బేడీ, గవాస్కర్, కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే తర్వాత భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్ ద్రవిడ్.

ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్

మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఐదోసారి ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచాడు. మెక్సికన్ గ్రాండ్ ప్రిలో నాలుగో స్థానంలో నిలిచిన అతను ఫార్ములావన్ డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు ఫార్ములావన్‌ని అత్యధికంగా ఏడుసార్లు గెలుచుకున్నది మైఖేల్ షుమాకర్.

అమెరికా క్రికెట్ కెప్టెన్‌గా భారత వ్యక్తి

అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ నేత్రవల్కర్ ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ అర్హతా టోర్నీ అయిన ఐసీసీ ప్రపంచ క్రికెట్ లీగ్ డివిజన్-3 టోర్నీకి ఆయన నాయకత్వం వహించనున్నారు. ఆయన 2010 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Persons
Persons

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్‌రెడ్డి

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామానికి చెందిన జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి నవంబర్ 1న నియమితులయ్యారు. ఈయనతోపాటు జస్టిస్ హేమంత్ గుప్తా (మధ్యప్రదేశ్ హైకో ర్టు), జస్టిస్ అజయ్ రస్తోగి (త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా (పట్నా హైకోర్టు)లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుభాష్ రెడ్డి ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో 24గా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది.
Vemula-Saidulu

709
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles