ఫైనల్‌కు ప్రణాళిక


Sun,September 23, 2018 11:32 PM

సీఏ ఫైనల్
సీఏ కోర్సులోని చివరి దశ సీఏ ఫైనల్. సీఏ చదువుతున్న విద్యార్థి సీఏ ఫైనల్ పూర్తిచేసిన తర్వాత క్వాలిఫైడ్ సీఏగా పరిగణిస్తారు. ఐపీసీసీ తర్వాత రెండున్నరేండ్ల ఆర్టికల్‌షిప్ పూర్తిచేసిన విద్యార్థులు సీఏ ఫైనల్ రాయడానికి అర్హులు. సీఏ ఫైనల్‌లో మొత్తం ఎనిమిది పేపర్లను రెండు గ్రూపులుగా విభజించారు. 2018, మే నుంచి సీఏ ఫైనల్ పరీక్షలను కొత్త సిలబస్ ప్రకారం నిర్వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో (నవంబర్ 1 నుంచి) పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో సీఏ ఫైనల్ విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి? ఏ సబ్జెక్టులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ అంశాన్ని ఎలా పునశ్చరణ చేయాలి? పరీక్ష సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలి? వంటి అంశాలపై ప్రత్యేక ఫోకస్...
CA
-2017, జూలై 1 నుంచి సీఏ కోర్సులో నూతన విధానం అమల్లోకి వచ్చింది. భారత చార్టర్డ్ అకౌంటెంట్‌లకు ప్రపంచస్థాయిలో ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగవడంతోపాటు, మన సీఏలు విదేశాల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు.

సీఏ ఫైనల్ సబ్జెక్టులు - జాగ్రత్తలు

ఫైనాన్షియల్ రిపోర్టింగ్
-ఇండ్.అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇండ్.అకౌంటింగ్ స్టాండర్డ్స్‌తోపాటు చిన్నచిన్న చాప్టర్లయిన వ్యాల్యూ యాడెడ్, అకౌంటింగ్ ఫర్ షేర్ బేస్డ్ పేమెంట్, అకౌంటింగ్ ఫర్ కార్బన్ క్రెడిట్స్, హ్యూమన్ రిసోర్స్ రిపోర్టింగ్ వంటి చాప్టర్లకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలి.
-అవసరమైన ప్రతిచోట కంపెనీల చట్టం 2013 ఫార్మాట్‌లోని షెడ్యూల్ 3 ప్రకారం బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి.
-ఏదైనా ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని ఎంచుకుని చివరివరకూ అదే ప్రిపేర్ కావాలి. పుస్తకాలు మార్చడంవల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.
-ఇండ్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఆడిటింగ్ సబ్జెక్టుల్లో కూడా పునరావృతం అవుతాయి. కాబట్టి రెండు సబ్జెక్టులకు ఒకేసారి సన్నద్ధమైతే సమయం వృథా కాకుండా ఉంటుంది.
-మొదటి సన్నద్ధతలోనే తేలికపాటి లెక్కలను తీసివేస్తూ పోవాలి. ఇలా చేయడంవల్ల రెండో దశ సన్నద్ధత మరింత సులువు అవుతుంది.
-బిజినెస్ కాంబినేషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, కన్సాలిడేటెడ్ అండ్ సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ వంటి చాప్టర్ల సన్నద్ధత సమయంలో కష్టమైన అంశాలను హైలైట్ చేసుకోవాలి. దీనివల్ల మలి సన్నద్ధత సమయంలో లెక్క మొత్తం చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ముఖ్యాంశాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించవచ్చు.
-ఏదైనా ఒక రచయిత పుస్తకం, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకోవాలి.
-ప్రతి చాప్టర్‌లో ఏదో ఒక బేసిక్ ప్రాబ్లమ్ విధానాన్ని తెలుసుకొని, మిగతా ప్రాబ్లమ్స్‌లోని ముఖ్యమైన అంశాల (అడ్జెస్ట్‌మెంట్స్) వరకు ప్రాక్టీస్ చేస్తే చాలు.
-ప్రతి చాప్టర్‌లో కూడా కాన్సెప్ట్ మీద అవగాహన ఏర్పర్చుకోవాలి.
-సమయం అందుబాటులో ఉంటే కన్సాలిడేషన్ కూడా ప్రిపేర్ అవ్వాలి. లేదంటే తక్కువ ప్రాముఖ్యత ఇస్తే చాలు.

స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్

-ప్రత్యేకంగా ఒక నోట్ పుస్తకాన్ని ఫార్ములా కోసం ఏర్పాటు చేసుకొని దానిని ఆ పుస్తకంలో రాయాలి. ప్రత్యేకించి ఫారిన్ ఎక్సేంజ్ ఎక్స్‌పోజర్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ వంటి చాప్టర్లకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
-ఫారిన్ ఎక్సేంజ్ ఎక్స్‌పోజర్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ వంటి చాప్టర్లతోపాటు కొత్త చాప్టర్లయిన కార్పొరేట్ వ్యాల్యుయేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ అండ్ స్టార్టప్ ఫైనాన్స్ వంటి చాప్టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
-డెరివేటివ్స్‌లో చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు డెరివేటివ్స్‌కు తుది ప్రాధాన్యత ఇవ్వాలి.
-మెర్జర్స్ అండ్ అక్విజిషన్, బాండ్ వాల్యుయేషన్ వంటి చిన్నచిన్న అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభిస్తే మంచిది.
-పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ కేవలం ఫార్ములాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని త్వరగా పూర్తిచేయవచ్చు.
-ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్స్, చివరిగా డెరివేటివ్స్‌పై దృష్టి కేంద్రీకరించాలి.
-థియరీకి మాత్రం స్టడీ మెటీరియల్ చాలు.

ca3

అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్

-ఆడిటింగ్ స్టాండర్డ్స్‌కు సంబంధించి ఏదైనా స్టాండర్డ్ పుస్తకాన్ని చదవాలి. ఇన్‌స్టిట్యూట్ వారి మెటీరియల్‌లోని ప్రాక్టికల్ ప్రశ్నలు చదవాలి.
-పరీక్షల్లో ఆడిటింగ్ స్టాండర్డ్ మొత్తం రాయనవసరం లేదు. పరీక్షల్లో అడిగిన ప్రశ్నను బట్టి తగినంత సమాధానం రాస్తే సరిపోతుంది.
-స్టడీ మెటీరియల్ తప్పనిసరి.
-ముందుగా ప్రొఫెషనల్ ఎథిక్స్ పూర్తిచేయాలి.
-రోజుకో ఆడిటింగ్ స్టాండర్డ్ చొప్పున చదవాలి. వీలైతే ఫ్లో చార్ట్స్ వేసుకోవాలి.
-పరీక్షల్లో ప్రాక్టికల్ ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు కాబట్టి ప్రాక్టికల్ ప్రశ్నలపైనే దృష్టి కేంద్రీకరించాలి.
-కంపెనీ ఆడిట్, ఆడిట్ రిపోర్ట్ వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.

కార్పొరేట్ లాస్ (70 మా.), ఎకనామిక్ లాస్ (30 మా.)

-అపాయింట్‌మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డు మీటింగ్ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
-అపాయింట్‌మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ కీ మేనేజేరియల్ పర్సనల్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
-అన్ని లాస్‌లో చివరి ప్రొసీజర్స్ ఒకేలా ఉంటాయి. కాబట్టి ఒకటి చదివి మిగతావి చూసుకుంటే చాలు.
-లాస్‌లో మార్పులు జరిగేటప్పుడు పెనాల్టీ ప్రొవిజన్స్‌కే ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి పెనాల్టీ ప్రొవిజన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి.
-మీరు చదివిన రచయిత పుస్తకం, స్టడీ మెటీరియల్ రెండూ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఒక్కోసారి జవాబుల్లో నిర్ణయాలకు సంబంధించిన వ్యత్యాసాలు ఉండవచ్చు.
-కాబట్టి మీరు ఒక రచయిత పుస్తకం చదివాక స్టడీ మెటీరియల్ ద్వారా ప్రాక్టీస్ చేస్తే మంచిది.

CA2

స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్ & పర్‌ఫార్మెన్స్ ఎవల్యూషన్

-చాలా పొడవైన ప్రశ్నలుగల ప్రశ్నపత్రం ఇచ్చే అవకాశం ఉంది. పునశ్చరణ బాగా చేసినవారు మాత్రమే సమాధానాలు రాయగలరు.
-థియరీని అశ్రద్ధ చేయకూడదు. ఈ మధ్య కాలంలో జరిగిన పరీక్షల్లో థియరీకి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరగుతున్నది.
-20 నుంచి 30 శాతం మార్కులు వచ్చే కేస్ స్టడీ చాప్టర్లమీద ప్రత్యేక దృష్టి పెట్టాలి.
-మోడరన్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, డెసిషన్ మేకింగ్, ప్రైసింగ్ డెసిషన్స్, పర్‌ఫార్మెన్స్ మెజర్‌మెంట్ అండ్ ఎవల్యూషన్, డివిజనల్ ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ వంటి అంశాలు బాగా చదవాలి. పైన పేర్కొన్న అంశాల నుంచి 50 శాతం మార్కులు వచ్చే అవకాశం ఉంది.
-మోడరన్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ప్రైసింగ్ డెసిషన్స్ అండ్ పర్‌ఫార్మెన్స్ మెజర్‌మెంట్ అండ్ ఎవల్యూషన్ అంశాల్లో థియరీకి ప్రాధాన్యం ఇవ్వాలి.
-వీలైనంత వరకు మీరే సొంతంగా ఫార్ములాల కోసం నోట్స్ తయారు చేసుకోవడం మంచిది.
-ఈ సబ్జెక్టుకు సంబంధించినంత వరకు రచయిత పుస్తకాల కంటే మీరు చిన్న క్లాస్ నోట్స్, స్టడీ మెటీరియల్ మీద ఆధారపడితే మంచిది.
-స్టడీ మెటీరియల్‌లోని థియరీ చదివితే చాలు.
-సమయపాలన తప్పనిసరి.

ఎలక్టివ్ పేపర్

-రిస్క్ మేనేజ్‌మెంట్
-ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్
-ఎకనామిక్ లాస్
-ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్
-గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్
-మల్టీ డిసిప్లీనరీ కేస్‌స్టడీ
-ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఎకనామిక్ లాస్ వంటి పేపర్లకు ప్రాధాన్యమివ్వాలి.
-ఈ ఎలక్టివ్ పేపర్‌కు సంబంధించిన పరీక్షను ఓపెన్‌బుక్ విధానం ద్వారా నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు www.icai.org వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష 3 గంటలు కాకుండా 4 గంటలపాటు నిర్వహిస్తారు.

డైరెక్ట్ ట్యాక్స్ లాస్ (70 మార్కులు), ఇటర్నేషనల్ ట్యాక్సేషన్ (30 మార్కులు)

-స్టడీ మెటీరియల్ తప్పనిసరి. రివిజన్ సమయంలో సమ్మరీ మాడ్యూల్, స్టడీ మెటీరియల్‌ను తప్పనిసరిగా చదవాలి.
-కేస్ లాస్‌తోపాటు, Five Heads (అంశాలు) తప్పనిసరిగా చదవాలి.
-పరీక్షలో సెక్షన్ నంబర్లు తప్పుగా రాయకూడదు.
-సవరణలపై ప్రత్యేకంగా దృషిసారించాలి.
-ఈ పేపర్‌కు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ రూపొందించుకుని లేదా సేకరించుకుని సన్నద్ధమైతే సులభంగా, వేగంగా పునశ్చరణ చేయవచ్చు.

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (75 మా.), కస్టమ్స్ అండ్ ఎఫ్‌టీపీ (25 మా.)

-ఎఫ్‌టీపీ చాప్టర్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. ఇందులోనుంచి ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది.
-థియరీకి, ప్రాబ్లమ్స్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకించి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
-ల్యాండ్‌మార్క్ కేస్‌లాస్‌ను పరీక్షల్లో తప్పనిసరిగా ప్రస్తావించాలి. దీనివల్ల మార్కులు పెరిగే అవకాశం ఉంది.
-ఒకే రకమైన అంశాలను వ్యత్యాసపూర్వకంగా చదవాలి.
-ఈ పేపర్‌కు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ మెటీరియల్ రూపొందించుకుని లేదా సేకరించుకుని సన్నద్దమైతే సులభంగా పునశ్చరణ చేయవచ్చు.

సీఏ ఫైనల్ పరీక్షలు-సూచనలు

-అన్ని పేపర్లకు సమాన ప్రాధాన్యం, ప్రతి సబ్జెక్టులో అన్ని చాప్టర్లలోని ప్రశ్నలు క్షుణ్ణంగా చదవాలి.
-సీఏ కోర్సు చదివేటప్పుడు ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా)తోపాటు కాలేజీ వారు ఇచ్చే మెటీరియల్ చదవడం తప్పనిసరి.
-సీఏ ఇన్‌స్టిట్యూట్ స్టడీ మెటీరియల్, రివిజన్ టెస్ట్ పేపర్లు, మాక్ టెస్ట్ పేపర్లు తప్పనిసరిగా చదవాలి.
-సీఏ కోర్సు పూర్తయ్యేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సీఏలాంటి ప్రొఫెషనల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎంతో ఓపిక, శ్రమ, సమయపాలన చాలా అవసరం.
-ట్యాక్స్‌కి సంబంధించిన పేపర్లు చదివేటప్పుడు చట్టంలో వచ్చిన సవరణల గురించి పూర్తి అవగాహన అవసరం. సవరణలు, చట్టాల్లో వస్తున్న మార్పులను అప్‌డేట్ చేసుకుంటూ చదవాలి.
-కోచింగ్ సమయంలో ఏవైనా రెండు పేపర్లను రోజువారీ పద్ధతిలో రివైజ్ చేసుకోవాలి.
-ప్రాబ్లమ్స్ సాధన చేస్తున్పప్పుడు అనవసరం అనుకున్న లెక్కలను తీసివేయడంవల్ల రివిజన్ సులువుగా చేసుకోవచ్చు.
-ఫార్ములాలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. దీంతోపాటు ఫ్లోచార్ట్‌లు కూడా వేసుకుంటే మంచిది.
-ప్రాక్టీస్ మ్యాన్యువల్‌లోని ప్రాబ్లమ్స్ అన్ని సాధన చేయాలి.
-ఉన్న ఎనిమిది సబ్జెక్టుల్లో ఏవైనా నాలుగింటిపై ఎక్కువ శాతం దృష్టి కేంద్రీకరిస్తే ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించే వీలుంటుంది.
-ప్రాక్టీస్ మ్యాన్యువల్‌లోని ప్రశ్నలకు జవాబులు ఎలా సూచించారో సునిశితంగా పరిశీలించాలి.
-సిలబస్‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక కనీసం మూడుసార్లు దాన్ని రివిజన్ చేయాలి.
-సీఏ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏ అంశాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనే అంశాలపై దృష్టిసారించాలి.
-సిలబస్ వెయిటేజీ గమనించి దాని ప్రకారం చదవాలి.
-సొంతంగా ఒక ప్రణాళికను తయారుచేసుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలో పెన్నుతో రాసే అవకాశం, అవసరం పెద్దగా ఉండదు. దీంతో చాలా మంది రాసే అలవాటుకు దూరమవుతారు. అయితే సీఏ ఫైనల్ పరీక్ష పెన్నుతోనే రాయాలి కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఏదో ఒకటి రాస్తూ ఉండాలి.
-సీఏ ఫైనల్ సన్నద్ధత సమంయలో చాలామంది విద్యార్థులు సీఏ ఇన్‌స్టిట్యూట్ లేదా విద్యా సంస్థ నిర్వహించే పరీక్షలకు హాజరుకారు. కానీ అది సరైన విధానం కాదు. అయితే మనం ఎన్ని ఎక్కువ పరీక్షలు రాస్తే అంత ఎక్కువగా మన తప్పులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
-కొంత మంది విద్యార్థులు సన్నద్ధత సమయంలో ఆ మెటీరియల్ అని, ఈ పుస్తకం అని రకరకాలవి చదివి అనవరసరంగా ఆందోళనకు గురవుతారు. అందువల్ల మొదటి నుంచి ఏ పుస్తకం చదువుతున్నామో దాన్నే చివరిదాకా కొనసాగించాలి.

నమ్మకాన్ని కోల్పోకూడదు

-పరీక్షల గురించి భయపడి అనవసరంగా ఆందోళన చెందకూడదు. ఫలితంతో సంబంధం లేకుండా సామర్థ్యం మేరకు మనం ఇవ్వగలిగినంత సమాచారం పరీక్షలో ఇవ్వాలి.
-పరీక్షల ముందు చాలామంది అనేక సలహాలతో, నెగెటివ్ పదాలతో మనల్ని భయపెడుతూ ఉంటారు. అవేవీ పట్టించుకోకూడదు.
-ప్రిపరేషన్ సమయంలో రోజుకు 10 గంటలైనా కష్టపడాలి.
-సిలబస్ మొత్తం పూర్తిగా చదవలేకపోయామని భయపడకూడదు. కనీసం 70 నుంచి 80 శాతం సిలబస్ పూర్తిచేసినా మనం ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. ప్రాథమిక, ముఖ్యమైన అంశాలు చదవడం మర్చిపోకూడదు.
-పరీక్ష రాసే 3 గంటలు చాలా కీలకం. ఆ సమయంలో ఏ క్షణంలోనూ నమ్మకాన్ని కోల్పోకూడదు.
-పరీక్షలో ఏదైనా లెక్కగాని, ప్రశ్నగాని రానిది ఉన్నట్లయితే దానిగురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మిగిలిన వాటిని పూర్తిచేయాలి. ఒక్క ప్రశ్నకు సరిగా రాయడం కంటే 100 మార్కులకు జవాబులు రాయడం అవసరమని గుర్తించాలి.
-పరీక్ష పూర్తయ్యాక దాని గురించి ఆలోచించడం, ఎన్ని మార్కులు వస్తాయని బేరీజు వేసుకోవడం వంటివి చేయకూడదు. దీని ప్రభావం తరువాతి పరీక్షపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాసిన పరీక్ష గురించి మర్చిపోతే మంచిది.
-కొంతమంది విద్యార్థులు ఏదోఒక పేపర్ బాగా రాయలేదని మిగతా పరీక్షలు రాయరు. రాయని పరీక్ష గురించి నిరుత్సాహపడకుండా మిగతా పరీక్షలు బాగా రాయడానికి ప్రయత్నించాలి.
cs-subramaniam

-సీఏ ఫైనల్ పరీక్షల టైమ్ టేబుల్
-గ్రూప్-1 - నవంబర్ 1, 3, 5, 9 తేదీల్లో
-గ్రూప్-2 - నవంబర్ 11, 13, 15, 17 తేదీల్లో
mattapally-prakash

1760
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles