కరెంట్ అఫైర్స్


Wed,September 19, 2018 12:17 AM

Telangana
Telangana

ఇంటింటా ఇన్నోవేటర్

విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సెప్టెంబర్ 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తున్నది.

నరేగా అవార్డులు

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) విజయవంతంగా అమలు చేసినందుకు తెలంగాణకు 7 అవార్డులు లభించాయి. సెప్టెంబర్ 11న ఢిల్లీలో తెలంగాణ అధికారులకు కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, రాంకృపాల్ యాదవ్ అవార్డులను అందజేశారు. పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనంలో మొదటిస్థానం, సుపరిపాలన అంశంలో రెండోస్థానం, అత్యుత్తమ పనితీరు కనబర్చిన జిల్లాల విభాగంలో వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు అవార్డులు లభించాయి.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నంబర్ -1

ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించినందుకుగాను శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నంబర్ వన్ ఎయిర్‌పోర్టు అవార్డు లభించింది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా సెప్టెంబర్ 12న కెనడాలోని హాలీఫాక్స్‌లో ఈ అవార్డు అందజేశారు.

National
National

పీఎస్‌ఎల్వీ-సీ42

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ42 రాకెట్‌ను సెప్టెంబర్ 16న విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి 16వ తేదీ రాత్రి 10.08 నిమిషాలకు ఈ ప్రయోగం నిర్వహించారు. దీనిద్వారా బ్రిటన్‌కు చెందిన భూ పర్యవేక్షిత ఉపగ్రహాలైన నోవా ఎస్‌ఏఆర్, ఎస్1-4లను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. నోవాఎస్‌ఏఆర్ బరువు 445 కిలోలు, ఎస్1-4 బరువు 444 కిలోలు

ఐసీజీఎస్ విజయ్

దేశీయంగా నిర్మించిన గస్తీ నౌక ఐసీజీఎస్ విజయ్ సెప్టెంబర్ 14న జల ప్రవేశం చేసింది. 98 మీటర్ల పొడవైన ఈ నౌకను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. చెన్నైలో జలప్రవేశం చేసిన ఈ నౌక ఒడిశాలోని పారాదీప్ కేంద్రంగా విధులు నిర్వహించనున్నది.

డాప్లర్ వెదర్ రాడార్

శ్రీహరికోటలోని షార్‌లో ఇస్రో పోలారిమెట్రీ డాప్లర్ వెదర్ రాడార్‌ను సెప్టెంబర్ 16న ఏర్పాటు చేసింది. 500 కి.మీ. పరిధిలో ఈ రాడార్ వాతావరణ మార్పులను ముందుగానే అంచనావేసి హెచ్చరికలు చేస్తుంది. ఈ వాతావరణ రాడార్‌ను ఇస్రో ట్రెయినింగ్ ఆఫ్ ట్రెయినర్స్ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థలో రూపొందించారు.

ఐరావ్ తన

భారతదేశంలో మొదటి జలాంతర్గత రొబోటిక్ డ్రోన్ (EyeROV TUNA) ను ప్రారంభించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లేబొరేటరీ (ఎన్‌పీఓఎల్)కు ఈ డ్రోన్‌ను అందజేశారు. కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న ఐరోవ్ సంస్థ దీనిని రూపొందించింది. సముద్రాల్లో 100 మీటర్ల లోతులోని వస్తువులను కూడా ఈ డ్రోన్ సాయంతో స్పష్టంగా గుర్తించవచ్చు.

అణు ధార్మిక రక్షణ కిట్

అణ్వాయుధ యుద్ధాలు, అణు ఇంధన ప్రమాదాల సమయంలో ప్రజలను కాపాడేందుకు ఉపయోగపడే యాంటి నూక్లియర్ మెడికల్ కిట్‌ను భారత్ సొంతంగా రూపొందించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ అల్లయిడ్ సైన్సెస్ (ఐఎన్‌ఎంఏఎస్) సంస్థ ఈ కిట్‌ను రూపొందించింది. ఈ కిట్‌లో 25 వస్తువులు ఉంటాయి.

ట్రైబల్ సర్క్యూట్

దేశంలోని గిరిజన ప్రాంతాల్లోని సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా ఛత్తీస్‌గఢ్‌లో స్వదేశ్ దర్శన్ పథకాన్ని ప్రారంభించారు.

జాతీయ హిందీ దినోత్సవం

జాతీయ హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2016-17 సంవత్సరానికిగాను రాజ్‌భాషా అవార్డులను ప్రదానం చేశారు.

Persons
Persons

సీజేఐగా గొగోయ్

సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ఈశాన్య రాష్ర్టాల నుంచి ఈ అత్యున్నత పదవిని చేపట్టనున్న మొదటివ్యక్తి గొగోయ్. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా అక్టోబర్ 2న పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో గొగోయ్ బాధ్యతలు చేపడుతారు.

ఏబీసీ చైర్మన్

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ముంబై సమాచార్ డెరెక్టర్ హొర్మూస్‌జీ కామా ఎన్నికయ్యారు. 2018-19 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా మధుకర్ కామత్ ఎన్నియయ్యారు.

Sports
Sports

షూటింగ్‌లో రజతం

దక్షిణకొరియాలోని చాంగ్‌వన్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారతకు చెందిన ఆయుష్ రుద్రరాజు, గుర్ నిహాల్‌సింగ్ గర్చా, నరూక అనంత్‌జీత్‌సింగ్ బృందం రజత పతకం సాధించింది. జూనియర్ పురుషుల స్కీట్ విభాగంలో వీరు పతకం గెలుచుకున్నారు.

టెస్టుల్లో నంబర్‌వన్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో భారత క్రికెట్ జట్టు నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ ఓటమి కారణంగా అంతకుముందు 125 పాయింట్లలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం 115 పాయింట్లకు పడిపోయింది. టెస్టు బ్యాట్స్‌మెన్లలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు.

సర్దార్‌సింగ్ వీడ్కోలు

భారత హాకీ దిగ్గజ ఆటగాడు సర్దార్‌సింగ్ అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. 12 ఏండ్లుగా భారత హాకీ జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2006లో ఆయన తొలిసారి భారత జాతీయ జట్టు తరఫున ఆడాడు. 2008 నుంచి 2016 వరకు భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సర్దార్‌సింగ్ మొత్తం 307 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. సర్దార్‌సింగ్‌ను భారత ప్రభుత్వం 2012లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.

బాక్సింగ్‌లో పతకాలు

న్యూఢిల్లీలో ఇటీవల ముగిసిన అంతర్జాతీయ సిలేషియన్ బాక్సింగ్ మహిళల చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 6 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్యపతకం సాధించారు. భారతి, టింగ్‌మిలాడౌన్‌జెల్, సందీప్‌కౌర్, నేహా, కోమల్, ఆర్షిలు బంగారు పతకాలు సాధించారు.

ఆసియాకప్ క్రికెట్

ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంటు సెప్టెంబర్ 16న దుబాయ్‌లో ప్రారంభమైంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. పూల్-ఏలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్ ఉండగా, పూల్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

జపాన్ ఓపెన్

జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ బాడ్మింటన్ ఆటగాడు, జపాన్‌కు చెందిన కెంటో మెమెటా గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 16న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ ఆటగాడు ఖోసిత్ పెట్‌ప్రధాన్‌పై మెమెటో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ చాంపియన్ కరొలినా మారిన్ గెలిచారు.

బెర్లిన్ మారథాన్

బెర్లిన్ మారథాన్‌లో కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కిప్‌చొగే ప్రపంచ రికార్డు సృష్టించాడు. సెప్టెంబర్ 16న జరిగిన ఈ 42.195 కిలోమీటర్ల మారథాన్ పరుగును రెండుగంటల ఒక నిమిషం 39 సెకండ్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు.

International
International

మానవాభివృద్ధి సూచీ

2017కుగాను సూచీలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 14న యూఎన్‌డీపీ విడుదల చేసిన ఈ సూచీలో నార్వే మొదటిస్థానంలో ఉండగా, స్విట్జర్లాండ్ రెండోస్థానం, ఆస్ట్రేలియా మూడోస్థానం, ఐర్లాండ్ నాలుగు, జర్మనీ 5వ స్థానం లో ఉన్నాయి. భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ 136, పాకిస్థాన్ 150 స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానంలో నైగర్ (189) ఉంది.

మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్స్

సెప్టెంబర్ 14న ప్రకటించిన ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ ర్యాంకుల్లో ఐఐఎం అహ్మదాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగళూరు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఐస్‌శాట్-2

భూగోళంపై గ్లోబల్ వార్మింగ్ కారణంగా కరిగిపోతున్న మంచును అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సెప్టెంబర్ 15న ఐస్‌శాట్ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి డెల్టా 2 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించారు. భూతాపం, సముద్ర నీటిమట్టాల పెరుగుదల తదితర మార్పులపై ఈ ఉపగ్ర హం కచ్చితమైన సమాచారం అందిస్తుంది.

ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16 ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఈ ఏడాది దినోత్సవం థీమ్‌గా keep cool and carry on: The Montreal Protocol ను తీసుకున్నారు. ఓజోన్ పొరను రక్షించేందుకు అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని 1994 డిసెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానించింది.
Vemula-Saidulu

2251
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles