ఎడ్యుకేషన్ హబ్ సాటిలేని విద్య మేటి విద్యాసంస్థలు హైదరాబాద్


Wed,September 12, 2018 12:47 AM

Hyderabad
భాగ్యనగరం.. దక్షిణాదిన విద్యాకేంద్రంగా అనేక రంగాల్లో అగ్రపథాన పయనిస్తున్నది. నిజాం పాలనలో ప్రారంభమైన విశ్వవిద్యాలయాల నుంచి నేటి వరకు అనేక సంస్థలతో అలరారుతూ ఉత్తర, దక్షిణ విద్యార్థులకు, విదేశీ విద్యార్థులకు నెలవుగా మారుతుంది. హైదారబాద్‌లోని విద్యాకేంద్రాలు, సంస్థలు వాటిలో అందించే కోర్సులు, వాటి సంక్షిప్త సమాచారం నిపుణ పాఠకుల కోసం..

జేఎన్‌టీయూ హైదరాబాద్

- 1965లో నాగార్జునసాగర్ ఇంజినీరింగ్ కాలేజీగా ప్రారంభమై తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీగా 1972, అక్టోబర్ 2న ప్రస్థానం ప్రారంభమైంది. దేశంలో మొట్టమొదటి టెక్నలాజికల్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. 37 ఏండ్ల తర్వాత జేఎన్‌టీయూని నాలుగు భాగాలుగా చేశారు. జేఎన్‌టీయూహెచ్, జేఎన్‌టీయూఏ, జేఎన్‌టీయూకే, జేఎన్‌ఎఫ్‌ఏయూగా 2008లో విభజించారు. జేఎన్‌టీయూహెచ్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం కింది యూనిట్లు/స్కూల్స్‌తో విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది.
- జేఎన్‌టీయూ హైదరాబాద్ (అటానమస్), కూకట్‌పల్లి
- జేఎన్‌టీయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాల
- జేఎన్‌టీయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, మంథని
- జేఎన్‌టీయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ సుల్తాన్‌పూర్, మెదక్
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, కూకట్‌పల్లి
- స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కూకట్‌పల్లి,
- స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, కూకట్‌పల్లి,
- స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కూకట్‌పల్లి
- యూనివర్సిటీ బీటెక్‌లో 21 అండర్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రా మ్స్, ఎంటెక్‌లో 47 రకాల పీజీ పోగ్రామ్‌లు, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ ఐదేండ్ల డ్యూయ ల్ డిగ్రీ, మాస్టర్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటెక్/ఎంబీఏ/ఎం.ఎస్ అందిస్తుంది. ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్‌డీ పోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది.
- ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2017లో 63వ ర్యాంక్, ఆల్ ఇండియా గవర్నమెంట్ యూనివర్సిటీల్లో 30వ ర్యాంక్, ఆల్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీల్లో 38వ ర్యాంక్‌తో ఇంజినీరింగ్ విద్యలో అగ్రభాగాన నిలిచింది.
- టీఎస్‌జెన్‌కో, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వంటి వాటికి పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తూ రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయంగా ఘనత సాధించింది.
- ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీలో స్వీడన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియాకు చెందిన యూనివర్సిటీలతో ఒప్పందాలను కుదుర్చుకుని పలు కోర్సులను అందిస్తుంది.

ఐఐటీ హైదరాబాద్

- దేశంలోని ఐఐటీల్లో రెండో జనరేషన్‌లో దీన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు.
- అప్‌కమింగ్ ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ టాప్ 10లో ఉంది. రిసెర్చ్ కోసం సుమారు రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా ఐఐటీలోని 80 శాతం ఫ్యాకల్టీలకు స్పాన్సర్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి. 50 పరిశ్రమలతో అనుసంధానం కావడమే కాకుండా కేంద్రం విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో పదోస్థానంలో ఉంది. క్యూస్ ఆసియా బ్రిక్స్ ర్యాంకింగ్‌లో 100వ స్థానంలో ఉంది. జపాన్‌తో ఫ్యాకల్టీ, యూనివర్సిటీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందాలతో ఐఐటీ ముందుకు దూసుకుపోతుంది. ఐఐటీ నుంచి సుమారు 85 పేటెంట్ల కోసం దరఖాస్తులు నమోదయ్యాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పాత ఐఐటీలకు దీటుగా హైదరాబాద్ ఐఐటీ ముందుకెళ్తుంది.
- ఇక్కడ బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌ను ఐఐటీహెచ్ ఆఫర్ చేస్తుంది. వివరాల కోసం..https://www.iith.ac.in
osmania

ఉస్మానియా యూనివర్సిటీ

- ఇది 1918లో ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటి విశ్వవిద్యాలయమే కాకుండా దేశ, విదేశాల్లో ఉస్మానియా ప్రఖ్యాతి గాంచింది. ముఖ్యంగా ప్రశాంత వాతావరణం, విశాల ప్రాంగణాలు, అద్భుతంగా నిర్మించిన ఆర్ట్స్ కాలేజీ భవనం తదితరాలతో సరస్వతి నిలయంగా అలరారుతున్నది. ఎందరో మేధావులను దేశానికి అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది.
- అందించే కోర్సులు: యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, సర్టిఫికెట్ కోర్సులు,
- ప్రవేశాలు: ఓయూ సెట్ ద్వారా పీజీ కోర్సులు అందిస్తుంది. దూరవిద్యా విధానంలో సీడీఈ పలు కోర్సులను అందిస్తుంది.
- ప్రవేశాల కోసం సంబంధించిన వివరాలు: admissions@osmania.ac.in +91-40-27682284, +91-40-27682284
- వెబ్‌సైట్: http://www.osmania.ac.in

బిట్స్ హైదరాబాద్

- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ప్రముఖ టెక్నికల్, సైన్స్ ఇన్‌స్టిట్యూట్. బిట్స్ పిలానీకి అనుబంధంగా హైదరాబాద్ క్యాంపస్‌ను 2008లో ప్రారంభించారు. దేశంలో ఉత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో బిట్స్ ఒకటి. పిలానీ క్యాంపస్‌లో ఉపయోగించే బోధనా పద్ధతులు, కరికులం, తదితరాలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఐఐటీల తర్వాత అంతే క్రేజ్ ఉన్న విద్యాసంస్థగా బిట్స్ పేరుగాంచింది.
- 12 డిపార్ట్‌మెంట్లతో 3200 మంది విద్యార్థులకు ఫుల్ రెసిడెన్షియల్ విధానంలో విద్యను అందిస్తున్నారు. 200 ఎకరాల విస్తీర్ణంలో బిట్స్‌ను ఏర్పాటుచేశారు.
- న్యాక్ ఏ గ్రేడ్ అక్రెడిటేషన్ కలిగి ఉంది.
- బీఈ (ఆనర్స్), బీఫార్మా (ఆనర్స్), ఎమ్మెస్సీ (ఆనర్స్), ఎమ్మెస్సీ (టెక్నాలజీ). పీజీలో ఎంఈ, ఎంఫార్మా, ఎంఫిల్ కోర్సులు ఉన్నాయి. పరిశోధనలో (డాక్టోరల్ ప్రోగ్రామ్స్) ఆన్ క్యాంపస్ పీహెచ్‌డీ, ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీ అందుబాటులో ఉన్నాయి.
- వెబ్‌సైట్: http://www.bits-pilani.ac.in/Hyderabad
hcu

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

- 1974లో ప్రారంభించారు. గచ్చిబౌలిలో ఉంది. యూనివర్సిటీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్సీగా యూజీసీ గుర్తించి ప్రత్యేక నిధులను విడుదల చేసింది. న్యాక్ ఫైవ్ పాయింట్ స్కేల్‌లో A***** ర్యాంక్‌ను సాధించింది. ఈ యూనివర్సిటీలో ప్రవేశాలకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని డిపార్ట్‌మెంట్లు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రఖ్యాతిగాంచాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రకటించిన విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో 5వ స్థానంలో ఉంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్‌లలో ఇంగ్లిష్ & లిటరేచర్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో ఉత్తమ స్థానాల్లో నిలిచింది.
- ఇక్కడ ఇంటిగ్రేటెడ్ పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎఫ్‌ఏ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మే-జూన్‌లలో ఎంట్రెన్స్ టెస్ట్‌లను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో పలు కోర్సులను అందిస్తున్నది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.uohyd.ac.in చూడవచ్చు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ

- 2014లో దీన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీగా ఉండేది. 1964లో ఏర్పాటుచేయగా 1965లో నాటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ప్రారంభించారు.
- ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 82వ స్థానంలో నిలిచింది.
- అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చరల్ సంబంధ పాలిటెక్నిక్ కాలేజీలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, డీఏఏటీటీసీఎస్, ఈఈఐ, ఏఐ అండ్ సీసీ, ఏటీఐసీ వంటి సంస్థలు ఈ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నాయి.
- ఐసీఏఆర్ విడుదల చేసిన 2016-17 అగ్రికల్చరల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో నిలిచింది.
- ఈ విశ్వవిద్యాలయం పరిధిలో పాలిటెక్నిక్ (అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), యూజీ (బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (సీఏ అండ్ బీఎం) బీఎస్సీ హోంసైన్స్, బీఎస్సీ ఆనర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఆనర్స్ ఫ్యాషన్ టెక్నాలజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.
- ఈ విశ్వవిద్యాలయం దేశ, విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని పరిశోధన, విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంది.
- వెబ్‌సైట్: http://www.pjtsau.ac.in

ఐఐఐటీ హైదరాబాద్

- ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ). ఇది అటానమస్ యూనివర్సిటీ. నాట్ ఫర్ ప్రాఫిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద 1998లో ఏర్పాటుచేశారు. నాసా వంటి సంస్థలు నిర్వహించిన కాంపిటీషన్‌లో పలు అవార్డులను పొందింది. అంతేకాకుండా భారతీయ భాషల అనువాదానికి సంబంధించిన పరిశోధనలో ఐఐఐటీ కన్‌స్టోరియం విశేష కృషి చేసింది. పలు స్టార్టప్‌లను ప్రోత్సహించడమే కాకుండా నూతన ఒరవడితో ఐఐఐటీహెచ్ ముందుకుపోతుంది.
- అందిస్తున్న కోర్సులు: బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్, ఎంఫిల్ ఇన్ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ ఫర్ ఎంఏ (లాంగ్వేజెస్) విద్యార్థులకు, డ్యూయల్ డిగ్రీ (బీటెక్, ఎంటెక్), పార్ట్ టైం ప్రోగ్రామ్స్, పీజీఎస్‌ఎస్‌పీ, మిస్ట్.
- వివరాల కోసం Phone: +91 (40) 6653 1250,+91 (40) 6653 1337
- వెబ్‌సైట్: https://www.iiit.ac.in
osmania-medical

ఉస్మానియా మెడికల్ కాలేజీ

- ఉస్మానియా మెడికల్ కాలేజీని మొదట్లో హైదరాబాద్ మెడికల్ స్కూల్‌గా వ్యవహరించేవారు. దీన్ని 1846లో ప్రారంభించారు. మొదట్లో ఉర్దూ మీడియంలో కోర్సులు అందించేవారు. కాలక్రమేణా ఈ కాలేజీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ డాక్టర్ విద్య అభ్యసించడం ఒక గౌరవంగా, ఉన్నతంగా భావిస్తారు.
- అందిస్తున్న కోర్సులు: యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు
- వెబ్‌సైట్: http://osmaniamedicalcollege.org

ఇఫ్లూ

- ది ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ). దీన్ని 1958లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (సీఫెల్)గా ప్రారంభించారు. 2007లో సెంట్రల్ యూనివర్సిటీ హోదాను కల్పించారు. ఇఫ్లూకు హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్‌తోపాటు లక్నో, షిల్లాంగ్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఇంగ్లిష్ టీచింగ్, ప్రొఫిషియన్సీతోపాటు విదేశీ భాషల్లో ప్రావీణ్యం కోసం ఈ సంస్థను ఏర్పాటుచేశారు.
- అందించే కోర్సులు: బీఏ (ఆనర్స్), బీఏ (ఆనర్స్ ఫారెన్ లాంగ్వేజెస్)లో అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్. బీఏ (ఆనర్స్) ఇంగ్లిష్. వీటితోపాటు పీజీ, పీజీడిప్లొమా, పీహెచ్‌డీ, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను, పార్ట్‌టైం కోర్సులను ఇఫ్లూ అందిస్తుంది.
- పూర్తి సమాచారం కోసం: +91 40 27689000,
- వెబ్‌సైట్: http://www.efluniversity.ac.in

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా

- నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ (నల్సార్)ను 1998లో ప్రారంభిచారు. దేశంలో రెండో లా యూనివర్సిటీ.
- అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ తదితర కోర్సులతోపాటు పలు ఆన్‌లైన్, సర్టిఫికెట్ కోర్సులను ఇక్కడ అందిస్తున్నారు.
- సైబర్ లా, మీడియా లా, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా వంటి విభిన్నమైనకోర్సులతో నాణ్యమైన విద్యకు నల్సార్ పేరుగాంచింది.
- ఏవియేషన్ స్పేస్, టెలీకమ్యూనికేషన్, జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ వంటి విభిన్నమైన కోర్సులను ఇక్కడ అందిస్తున్నారు.
- నల్సార్‌లో పలు రిసెర్చ్ సెంటర్లు ఉన్నాయి.
- వివరాల కోసం వెబ్‌సైట్: https://www.nalsar.ac.in

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

- ఇంటివద్దకే విద్య అనే నినాదంతో ప్రారంభించిన దూరవిద్యా విశ్వవిద్యాలయం. 1982లో దీన్ని ప్రారంభించారు. 1991, అక్టోబర్ 24న ఓపెన్ యూనివర్సిటీని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా పేరు మార్చారు.
- ఎటువంటి అర్హత లేనివారికి సైతం డిగ్రీ చేసే అవకాశాన్ని కల్పించడం ఈ విశ్వవిద్యాలయ ప్రత్యేకత. అంతేకాకుండా పనిచేసుకుంటూ, ఇంట్లో ఉంటూ చదువుకోవాలనుకునే వారికి ఈ యూనివర్సిటీ పలు కోర్సులను అందిస్తుంది.
- యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి.
- సుమారు 117కు పైగా స్టడీసెంటర్ల ద్వారా విద్యాబోధన, పరీక్షలను ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. కేవలం వారాంతపు బోధనే కాకుండా మీడియా, రేడియో, టీవీ, ఫిల్మ్, ఆడియో, ప్రింటింగ్ స్టడీ మెటీరియల్ ద్వారా కోర్సులను అందిస్తుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం ఒక వరం లాంటిది.
- వెబ్‌సైట్: https://braou.ac.in

తెలుగు విశ్వవిద్యాలయం

- పొట్టి శ్రీరామలు తెలుగు యూనివర్సిటీ 1985, డిసెంబర్ 2న ప్రారంభిచారు. తెలుగు భాష కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం ఇది. సంస్కృతి, భాష పరిరక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. 7 స్కూల్స్, 16 డిపార్ట్‌మెంట్లు, 5 కేంద్రాలతో తెలుగు విశ్వవిద్యాలయం సేవలు అందిస్తుంది.
- స్కూల్ ఆఫ్ ఫోక్ అండ్ ట్రైబల్-లోర్- వరంగల్
- నన్నయ సాహిత్య పీఠం- రాజమండ్రి, శ్రీ సిద్ధేంద్ర యోగి కళా పీఠం- కూచిపూడి, స్కూల్ ఆఫ్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ- శ్రీశైలం.
- ప్రత్యేక కోర్సులు: దేశంలో మొదటిసారిగా ఎంఏ ఆస్ట్రాలజీ ప్రవేశపెట్టిన యూనివర్సిటీ. అదేవిధంగా ఎంసీజేను తెలుగు మీడియంలో ప్రవేశపెట్టింది. ఫిల్మ్‌స్క్రిప్ట్ తదితర ప్రత్యేక కోర్సులు ఇక్కడ ఉన్నాయి.
కోర్సులు:
- భాషాభివృద్ధి పీఠం: ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ
- లలితాకళా పీఠం: ఎంఏ- కర్ణాటక సంగీతం (గాత్రం, మృదంగం, వీణ, వయోలిన్) తదితర కోర్సులు
- రంగస్థల కళాశాఖ, శిల్పం-చిత్రలేఖనంశాఖ, నృత్యశాఖ, జానపద కళలశాఖ, తెలుగు సాహిత్యశాఖ, కమ్యూనికేషన్, జర్నలిజం శాఖ, జ్యోతిషం-వాస్తుశాఖ,
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://teluguuniversity.ac.in
TISS

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)

- టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌ను 1936లో ప్రారంభించారు. దీన్ని 1944లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)గా పేరు మార్చారు. 1964లో డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించారు. ముంబై, తుల్జాపూర్, హైదరాబాద్, గువాహటిల్లో టిస్ క్యాంపస్‌లు ఉన్నాయి.
- కోర్సులు: బీఏ సోషల్ సైన్సెస్ (అజీం ప్రేమ్‌జీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్), ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్), ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్), ఎంఏ (నేచురల్ రిసోర్సెస్ & గవర్నెన్స్), ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్ అండ్ గవర్నెన్స్), ఎంఏ (ఉమెన్ స్టడీస్), ఎంఏ (ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్, ఛేంజ్ అండ్ లీడర్‌షిప్).
- పీహెచ్‌డీ: సోషల్ సైన్సెస్, ఉమెన్ స్టడీస్, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్-పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషన్.
- ప్రత్యేకతలు: దేశ, విదేశాల్లో 100కు పైగా యూనివర్సిటీలతో పరస్పర అవగాహన చేసుకుంది. అంతేకాకుండా దేశంలోని జ్యుడీషియరీ పాలసీ, సిస్టమ్స్‌లలో అనేక సందర్భాల్లో అమికస్ క్యూరీగా పనిచేసింది. 2005లో మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు తదితరాల కోసం, 2015లో యూపీలో పిల్లలు, మహిళల రక్షణ కోసం సంబంధించిన పరిశోధన చేసి వాస్తవ స్థితులు, తీసుకోవాల్సిన చర్యలను కోర్టులకు సమర్పించింది. సుమారు 50 రకాల పీజీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నది.
Address: S.R Sankaran Block, Telangana State Institute of Panchayat Raj and Rural Development (TSIPARD) Campus, Rajendranagar, Hyderabad, Telangana -500 030 Telephone: 91-40-24017701 / 02 / 03 / 9713
- వెబ్‌సైట్: https://www.tiss.edu

అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్ (ఏఎండీ)

- దీన్ని 1948లో న్యూఢిల్లీలో ప్రారంభించారు. 1974లో దీన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంస్థకు 7 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా జియలాజికల్ ఎక్స్‌ప్లోరేషన్ ద్వారా న్యూక్లియర్ పవర్‌కు సంబంధించిన ఖనిజ అన్వేషణ దీని ప్రధాన లక్ష్యం.
- ట్రెయినింగ్ స్కూల్: ఏఎండీ హైదరాబాద్ క్యాంపస్‌లో 2010లో ట్రెయినింగ్ స్కూల్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏడాది ఓరియంటేషన్ కోర్సు అయిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఇంజినీరింగ్, పీజీ చదివిన వారికి ఈ కోర్సు అందిస్తారు. ముఖ్యంగా న్యూక్లియర్ రంగంలో అభ్యర్థులను ప్రోత్సహించడానికి దీన్ని స్థాపించారు. జియోసైన్సెస్ (జియాలజీ, జియోఫిజిక్స్) యంగ్ సైంటిస్ట్/ఇంజినీర్స్ కోసం ఏఎండీ కోర్సులను అందిస్తుంది.
- వెబ్‌సైట్: http://www.amd.gov.in

ఐఎస్‌బీ

- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)ని 2001లో ప్రారంభించారు. దీన్ని 1996లో వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు కలిసి ఏర్పాటుచేశారు. ప్రపంచస్థాయి బిజినెస్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా దీన్ని స్థాపించారు. నాట్ - ఫర్- ప్రాఫిట్ సంస్థగా దీన్ని స్థాపించారు. దీనికి ఏఐసీటీఈ గుర్తింపు లేదు. సంస్థ కూడా ఎటువంటి అక్రెడిటేషన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ ఈ సంస్థకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచిపేరు ఉంది.
- ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ), స్వల్పకాలిక వ్యవధి కలిగిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. పార్ట్‌టైం పీజీపీ ఇన్ మేనేజ్‌మెంట్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు), అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్‌కేర్, అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్, ఐఎస్‌బీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్, మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ, వీటితోపాటు షార్ట్‌టర్మ్‌కోర్సులు, ఆన్‌లైన్ కోర్సులు ఉన్నాయి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.isb.edu

నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)

- నిజామ్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌ను నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)గా 1961లో మార్చారు. దీనికి ఎంసీఐ గుర్తింపు ఉంది. 27 డిపార్ట్‌మెంట్లతో 14 సూపర్‌స్పెషాలిటీస్‌ను ఈ సంస్థ నిర్వహిస్తుంది.
- ఆర్థోపెడిక్ విభాగంలో దేశవ్యాప్తంగా పేరుగాంచింది ఈ సంస్థ. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ సంస్థగా మారిన తర్వాత వైద్యసేవలు మరింత విస్తృతమయ్యాయి.
నిమ్స్ ఆఫర్ చేస్తున్న కోర్సులు:
- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంపీటీ, ఎంహెచ్‌ఎం, పీజీ డిప్లొమా (పారా మెడికల్ కోర్సులు), ఎమ్మెస్సీ (జెనెటిక్ కౌన్సిలింగ్), ఎండీ/ఎంఎస్, డీఎం/ఎంసీహెచ్.
- వెబ్‌సైట్: https://nims.edu.in

మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ

- మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) ఇది సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 200 ఎకరాల్లో దీన్ని 1998లో ఏర్పాటుచేశారు. సెంట్రల్ యూనివర్సిటీ అయిన దీన్ని ఉర్దూ భాష ప్రచారంతోపాటు విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రారంభించారు.
మనూకు ప్రస్తుతం 7 స్కూల్స్ ఉన్నాయి. అవి...
- స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, లింగ్విస్టిక్ & ఇండాలజీ
- స్కూల్ ఆఫ్ కామర్స్ & బిజినెస్ మేనేజ్‌మెంట్
- స్కూల్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్
- స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్
- స్కూల్ ఆఫ్ సైన్సెస్
- స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ & ట్రెయినింగ్
- స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఈ ఏడు స్కూల్స్‌లో 24 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఇవి అందిస్తున్నాయి.
అందిస్తున్న కోర్సులు:
- పీహెచ్‌డీ, పీజీ - ఎంబీఏ, ఎంఏ (అరబిక్), ఎంసీఏ, ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఈడీ.
- అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు- బీఈడీ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సర్టిఫికెట్ కోర్సులు, టీచర్ ఎడ్యుకేషన్, పాలిటెక్నిక్ కోర్సులు.
- ప్రవేశాలను ఎంట్రెన్స్ టెస్ట్, మెరిట్ ద్వారా కల్పిస్తారు. ఈ యూనివర్సిటీకి లక్నో, శ్రీనగర్, నౌ, దర్భంగా, భోపాల్, బీదర్, సంబాల్, అసన్‌సోల్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి.
- వెబ్‌సైట్: http://manuucoe.in

మహేంద్ర ఇకోల్ సెంత్రలే

- మహేంద్ర ఇకోలే సంస్థను 2014లో ప్రారంభించారు. టెక్ మహేంద్ర, ఇకోల్ సెంత్రలే పారిస్, జేఎన్‌టీయూహెచ్ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి.
- ప్రత్యేక కరికులం ఏర్పాటుచేసుకుని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో దీన్ని ఏర్పాటు చేశారు.
- కోర్సులు: బీటెక్ (సీఎస్‌ఈ, సివిల్, ఈఈఈ, మెకానికల్)
- జేఈఈ మెయిన్ స్కోర్ లేదా శాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.mahindraecolecentrale.edu.in

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ)

- 1956లో ఆస్కీ సొసైటీగా రిజస్టర్ అయ్యింది. అకడమిక్ సంబంధించిన తొలి ప్రకటనను 1957 డిసెంబర్ 6న ఆస్కీ విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగింది. పబ్లిక్ పర్పస్ ఇన్‌స్టిట్యూషన్‌గా ప్రభుత్వం, ఇండస్ట్రీ కలిసి ఏర్పాటుచేసిన స్వతంత్ర సంస్థ.
- ఆస్కీలో ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులు పలు ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తారు. ఆస్కీ సుమారు 100 రంగాలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్‌కు సలహాదారుగా వ్యవహరిస్తుంది. హెల్త్‌కేర్, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, హ్యూమన్‌డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ స్టడీస్, పావర్టీ స్టడీస్, రూరల్ డెవలప్‌మెంట్, పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ అండ్ పర్‌ఫార్మెన్స్ వంటి రంగాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను, మేనేజ్‌మెంట్ స్టడీస్, రిసెర్చ్ స్టడీస్‌తోపాటు పీజీ డిప్లొమాను ఆస్కీ అందిస్తుంది.
- పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్. దీన్ని 1998లో ప్రారంభించారు. జాతీయస్థాయి పరీక్షలైన క్యాట్/ఎక్స్‌ఏటీ తదితర ఎగ్జామ్స్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
- వెబ్‌సైట్: http://ascipgdhm.in

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)

- హైదరాబాద్‌లో సీఐటీడీని 1968లో యూఎన్‌డీపీ, ఐఎల్‌వో సహాయంతో ప్రారంభించారు. టూల్ ఇంజినీరింగ్‌లో దేశంలోనే మార్గదర్శకమైన సంస్థగా సీఐటీడీ గుర్తింపు పొందింది. టూల్స్, డైస్, మౌల్డ్స్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో శిక్షణ, తయారుచేయడం, చిన్నతరహా పరిశ్రమలకు సలహాలు, సాంకేతికత అందించటం, డిప్లొమా నుంచి పీజీ కోర్సుల నిర్వహణ దీని ప్రధాన కర్తవ్యం.
- కోర్సులు: ఎంఈ, డిప్లొమా కోర్సులు. సామ్‌సంగ్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న టెక్నికల్ కోర్సులు. క్యాడ్/క్యామ్ కోర్సులు, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్ తదితర కోర్సులను ఎంఎస్‌ఎంఈ-సీఐటీడీ నిర్వహిస్తుంది.
- వెబ్‌సైట్: https://www.citdindia.org

సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)

- కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ. డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్‌తోపాటు లైఫ్‌సైన్సెస్ రంగాల్లో విస్తృత పరిశోధనలకు ఇది కేంద్రం.
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
- పీహెచ్‌డీ: ఏటా 10-20 మంది విద్యార్థులకు రిసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. దీనికోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మణిపాల్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
- సీడీఎఫ్‌డీ మెడికల్ జెనెటిక్స్ శిక్షణ ఇవ్వడానికి నిమ్స్‌తో, పరిశోధనలకు బిట్స్ పిలానీలతో ఒప్పందం చేసుకుంది.
- వెబ్‌సైట్: http://www.cdfd.org.in

1543
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles