కరెంట్ అఫైర్స్


Wed,June 20, 2018 02:42 AM

Telangana
SecunderabadRailway

ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ మృతి

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జూన్ 16న మృతిచెందారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జనపరిషత్‌కు కన్వీనర్‌గా వ్యవహరించారు. మ్యాన్‌కైండ్, యువతరం పేరుతో పత్రికలను నడిపారు. ఆయన పుస్తకాలు భాషా సమస్య (సురమౌలితో కలిసి), మార్క్స్-గాంధీ-సోషలిజం (ఇంగ్లిష్), లోహియా ఇన్ పార్లమెంట్.

మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం

రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో ప్లాస్టిక్, టెట్రా బాటిళ్లలో తాగునీరు, వాడిపడేసే స్ట్రాలు, ప్లాస్టిక్, ైస్టెరోఫోమ్ టీ కప్పులు, 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై నిషేధం విధించారు.

అందుబాటులోకి టీ వెబ్

పథకాలు, సేవలకు సంబంధించిన సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం టీవెబ్ వెబ్ డిక్షనరీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గైడెన్స్ ఫర్ ఇండియన్ గౌట్ వెబ్‌సైట్స్ (జీఐజీడబ్ల్యూ) నిబంధనలను రాష్ర్టానికి అనుగుణంగా గైడెన్స్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ (జీటీజీడబ్ల్యూ)గా మార్చి దీనిని రూపొందించారు.

జర్నలిస్ట్ ఆదిరాజు మృతిప్రముఖ జర్నలిస్ట్ ఆదిరాజు వెంకటేశ్వరరావు మృతిచెందారు. ఇటీవల రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన విశిష్ఠ పురస్కారం అందుకున్నారు.

పోలీసుల కాప్ కనెక్ట్ యాప్

తెలంగాణ పోలీస్‌శాఖ వాట్సప్ తరహాలో సరికొత్త యాప్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకురానుంది. డీజీపీ మొదలుకుని కానిస్టేబుల్ వరకు అందిరికీ ఒకేసారి ఆదేశాలు పంపడానికి కాప్ కనెక్ట్ పేరుతో కొత్తయాప్‌ను రూపొందిస్తుంది. ఈ యాప్ పోలీస్ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉండనుంది.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అవార్డు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు జూన్ 13న జెమ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అవార్డు లభించింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అవార్డు

కార్పోరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు జూన్ 16న గ్రీన్ రేటింగ్ ఆఫ్ ప్లాటినం అవార్డు లభించింది.

National
Modi

106వ సైన్స్ కాంగ్రెస్

106వ జాతీయ కాంగ్రెస్‌ను జలంధర్‌లోని లివ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో నిర్వహించనున్నారు. 2019, జనవరి 3 నుంచి 7 వరకు జరిగే సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ అనే థీమ్‌తో జరిగే ఈ సదస్సులో నోబెల్ గ్రహీతలు, 300 మంది శాస్త్రవేత్తలు, 15 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. ప్రస్తుతం ఎల్‌పీయూ చాన్స్‌లర్‌గా అశోక్ మిట్టల్ ఉన్నారు.

ఢిల్లీలో నీతి ఆయోగ్ 4వ సమావేశం

ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జూన్ 17న నీతి ఆయోగ్ 4వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 30 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరిగింది.

బిందేశ్వర్ పాఠక్‌కు నిక్కీ ఏషియా అవార్డు

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు జూన్ 14న అంతర్జాతీయ అవార్డు లభించింది. అపరిశుభ్రతను, మహిళలపై వివక్షను రూపుమాపడంలో పాఠక్ చేసిన కృషికి గుర్తింపుగా జపాన్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ కల్చర్ అండ్ కమ్యూనిటీ విభాగంలో నిక్కీ ఏషియా అవార్డును అందజేసింది.

విదేశీ పర్యటనలో రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూన్ 16న తన సతీమణి సవితా కోవింద్‌తో కలిసి మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. తొమ్మది రోజులపాటు గ్రీస్, సురినామ్, క్యూబా దేశాల్లో వారు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రీస్ అధ్యక్షుడు ప్రొకోపీస్ పావ్‌లోపౌలోస్, సురినామ్ అధ్యక్షుడు డెసీ బౌటెర్సె, క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్‌లతో రాష్ట్రపతి బేటీ కానున్నారు. వైద్యం, ఆరోగ్యం, ఎన్నికలు, ఐటీ, ఆయుర్వేదం తదితర అంశాలపై చర్చించనున్నారు.

నాలుగు దేశాల పర్యటనలో కేంద్రమంత్రి సుష్మా

విదేశీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించడానికి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ జూన్ 17న నాలుగు దేశాల పర్యటనకు వెళ్లారు. ఏడు రోజులపాటు ఇటలీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, బెల్జియం దేశాల్లో ఆమె పర్యటించనున్నారు.

ఆధ్యాత్మిక గురువు భయ్యూ ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భయ్యూ మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు సన్యాసులకు సహాయ మంత్రి హోదా ప్రకటించింది. వారిలో భయ్యూ కూడా ఉన్నారు. కానీ, ఆ హోదాను స్వీకరించలేదు.

కశ్మీరి జర్నలిస్ట్ హత్య

రైజింగ్ కశ్మీర్ దినపత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారిని ఉగ్రవాదులు హత్యచేశారు. ఆయన గతంలో హిందూ దినపత్రికలో కశ్మీర్ కరస్పాండెంట్‌గా పనిచేశారు.

రక్షణదళంలో చేరిన రోష్మణి

భారత తీర ప్రాంత రక్షణదళంలోకి రాణి రోష్మణి నౌక చేరింది. మేకిన్ ఇండియాలో భాగంగా 51 మీటర్ల పొడవైన ఈ నౌకను హిందుస్థాన్ షిప్ యార్డు తయారు చేశారు. బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన రాణి రోష్మణి దేవి ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ నౌకకు ఆ పేరు పెట్టారు.

International
Donald-Trump

ట్రంప్, ఉన్ సమావేశం

జూన్ 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ సింగపూర్ సెంటోసా దీవిలోని కేపెల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. 1950-53 కొరియా యుద్ధం తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడుకోవడం, సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇక అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని ఉత్తరకొరియా ప్రకటించింది. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ విన్యాసాలను నిలిపివేస్తున్నట్లు, త్వరలోనే సైన్యాన్ని వెనక్కి పిలువనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ప్రపంచంలో శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్‌ను అమెరికా ఆవిష్కరించింది. దీనికి సమిట్ అని నామకరణం చేసింది. ఇది సెకనుకు 2 లక్షల గణనలు చేయగలదు. దీంతో చైనాకు చెందిన సూపర్ కంప్యూటర్ సన్‌వే తైహులైట్ స్పీడ్‌ను (సెకనుకు 93 వేల గణనలు) ఇది అధిగమించింది. అమెరికా గత సూపర్ కంప్యూటర్ ట్రిటాన్ కంటే సమిట్ వేగం ఏడు రెట్లు ఎక్కువ. దీన్ని ఓక్‌రిడ్జ్ నేషనల్ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు.

యాక్సెంచర్ ఎండీగా భారత సంతతి వ్యక్తి

అంతర్జాతీయ ప్రొఫెషనల్ సేవల కంపెనీ యాక్సెంచర్.. తమ సెక్యూరిటీ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన సైబర్‌భద్రత నిపుణుడు అనూప్ ఘోష్‌ను నియమించింది.

పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ ఫజ్లుల్లా హతం

బాలికల విద్య కోసం కృషిచేస్తున్న కారణంగా మలాలా యూసఫ్‌జాయ్ హత్యకు ఆదేశాలిచ్చిన పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజ్లుల్లా ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు కునార్ ప్రావిన్స్‌లో అమెరికా భద్రతా దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో మృతిచెందాడు.

వాషింగ్టన్‌లో తానా మహాసభలు

2019 జూలై 4 నుంచి 3 రోజులు వాషింగ్టన్‌లో తానా 22వ ద్వైవార్షిక మహాసభలను నిర్వహించనున్నారు.

Sports
federer

ఫెదరర్ ఖాతాలో 98వ టైటిల్

స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ జర్మనీలో జరిగిన స్టట్‌గార్ట్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. జూన్ 17న జరిగిన ఫైనల్‌లో కెనడా ఆటగాడు మిలోస్ రోనిక్‌ను 6-4, 7-6 తేడాతో ఓడించి 98వ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

వన్డే క్రికెట్‌లో రికార్డు స్కోరు

న్యూజిలాండ్ మహిళల జట్టు 47 ఏండ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదుచేసి రికార్డు సృష్టించింది. జూన్ 9న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 490 పరుగులు చేసి గతంలో తమదేశం పేరిటే ఉన్న రికార్డును తిరగరాసింది. 1997లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ పురుషుల జట్టు సాధించిన 455 పరుగులే ఇప్పటివరకు వన్డేల్లో రికార్డు స్కోర్‌గా ఉంది.

మొరాకోకు 5వ సారీ నిరాశే

ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ నిర్వహణకు సంబంధించిన హక్కులు సాధించడంలో మొరాకోకు మరోసారి నిరాశే ఎదురైంది. 2026 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ నిర్వహణ కోసం మొరాకో పెట్టుకున్న అభ్యర్థనను ఫిఫా తిరస్కరించింది. అమెరికా, మెక్సికో, కెనడా ఉమ్మడిగా 2026 వరల్డ్‌కప్ నిర్వహించనున్నాయి.

21వ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ప్రారంభం

సాకర్ ప్రపంచకప్ జూన్ 14న రష్యాలో ప్రారంభమైంది. 88 ఏండ్ల ఫిఫా చరిత్రలో ఇది 21వ ప్రపంచకప్. ప్రారంభ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించగా, పిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌పాంటీనో అధికారికంగా ప్రారంభించారు. టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్ రష్యా, సౌదీఅరేబియాల మధ్య జరిగింది.

ఆఫ్ఘనిస్థాన్ తొలి టెస్టు మ్యాచ్

ఐసీసీ టెస్ట్ హోదా ఇచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ తొలి మ్యాచ్ భారత్‌తో ఆడింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.
sydulu

1195
Tags

More News

VIRAL NEWS

Featured Articles