జాతీయోద్యమం-హింసావాదం


Sun,June 17, 2018 11:34 PM

హోంరూల్ ఉద్యమం (1916-18)
freedom-fighters
-అతివాదులు, మితవాదుల చీలికను ఆసరాగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం బాలగంగాధర్ తిలక్‌ను లక్ష్యంగా చేసుకుంది. 1908లో రాజద్రోహ నేరం కింద అరెస్టు చేసి ఆరేండ్లు మాండలే జైలుకి పంపింది. 1914లో తిలక్ జైలు నుంచి విడుదల కావడంతో తిరిగి ప్రజా ఉద్యమం కొనసాగించడానికి మార్గం ఏర్పడింది. 1915 నుంచి అనిబిసెంట్ దేశ రాజకీయాలపై ఆసక్తి చూపడంవల్ల కూడా ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. అనిబిసెంట్ కృషివల్ల కాంగ్రెస్‌లో మితవాద- అతివాద వర్గాల మధ్య ఏర్పడిన ఐక్యత, కాంగ్రెస్-ముస్లింల మధ్య ఏర్పడిన సఖ్యత మరొక ఉద్యమం జరగడానికి దోహదపడింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపై విధించిన ఆంక్షలు, కఠిన విధానాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ప్రారంభం కావడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1916లో ప్రారంభమైన ప్రజా ఉద్యమమే హోంరూల్ ఉద్యమం. ఈ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్.
-బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూ భారతదేశానికి స్వపరిపాలన సాధించడం ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి తిలక్ 1916 ఏప్రిల్‌లో పూనాలో హోంరూల్ లీగ్‌ను స్థాపించారు. జాతీయవాదమైన స్వరాజ్‌ను హోంరూల్ ఉద్యమ లక్ష్యంగా ప్రకటించారు. ఈ ఉద్యమ సందర్భంగానే తిలక్ స్వాతంత్య్రం నా జన్మహక్కు, దానిని నేను పొందుతాను అన్నారు. తిలక్ తన మరాఠా, కేసరి పత్రికల ద్వారా ఉద్యమభావాలను ప్రచారం చేశారు. తిలక్ దేశ ఉత్తరప్రాంతాల్లో పర్యటించడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.
-అదే ఏడాది సెప్టెంబర్‌లో అనిబిసెంట్ మద్రాస్‌లో హోంరూల్ లీగ్‌ను స్థాపించారు. మద్రాస్ తదితర ప్రాంతాల్లో అనిబిసెంట్ పర్యటించి, ఉద్యమాన్ని ప్రచారం చేశారు. అనిబిసెంట్ చాలా ప్రాంతాల్లో పర్యటించి నిద్రానమైన భారతీయులను మేల్కొలిపారు.
-వారి మనసుల్లో ఆమె జాతీయభావాన్ని నింపారు. అనిబిసెంట్ న్యూ ఇండియా, కామన్‌వీల్ అనే పత్రికల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమంలో యువకులు, విద్యార్థులు ఎక్కువగా పాల్గొన్నారు. ఈ ఉద్యమకాలంలోనే అనిబిసెంట్ జాతీయ విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. విద్యార్థుల్లో జాతీయభావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యమనే ఉద్దేశంతో మదనపల్లిలో కళాశాలను, వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కృషి చేశారు.
-1917 నాటికి అనిబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను జూన్‌లో ఉదకమండలంలో నిర్బంధించింది. అంతేకాకుండా ఆమె అనుచరులైన వాడియా, అరుండేల్‌లను అరెస్టు చేశారు. అయితే, ప్రజలు ఆందోళన చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం 1917, సెప్టెంబర్‌లో అనిబిసెంట్‌ను విడుదల చేసింది. ఆమె కాంగ్రెస్ ప్రతినిధులు 1917లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలిగా అనిబిసెంట్‌ను ఎన్నుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనిబిసెంట్.
-హోంరూల్ ఉద్యమం భారత స్వాతంత్రోద్యమంలో ఒక ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు. ఈ ఉద్యమం దేశమంతటా కొనసాగి, ప్రజల్లో రాజకీయ చైతన్యం, జాతీయ దృక్పథం పెంపొందింపజేసింది. ఈ ఉద్యమ ప్రభావంవల్ల జాతీయవాదులను సంతృప్తిపర్చడానికి ప్రభుత్వం 1919లో మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు చేపట్టింది. గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలకు ఇది పునాది అయింది.

మహారాష్ట్ర

-మహారాష్ట్ర ప్రాంతం విప్లవ జాతీయోద్యమ ప్రథమ కేంద్రం.
-1897లో పూనాలో ప్లేగు నివారణ చర్యలను అమానుషంగా అమలుపరిచిన కారణంగా విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవం నాడు రాంట్, ఐరిష్ట్ అనే అధికారులను చాపేకర్ సోదరులుగా ప్రసిద్ధిగాచిన దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్‌లు హత్య చేశారు. తర్వాత వీరిద్దరిని ప్రభుత్వం ఉరితీసింది.
-మహారాష్ట్రలో విప్లవకారుల్లో ప్రధానమైన వ్యక్తి వినాయక దామోదర్ సావర్కర్. తన సోదరుడైన గణేష్ సావర్కర్‌తో కలిసి మిత్రమేలా అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థే 1904లో అభినవ భారత్ సంస్థగా రూపొందింది. ఈ సంస్థ కార్యక్రమాలను గణేష్ సావర్కర్ నిర్వహించారు.
-దామోదర్ సావర్కర్ లండన్ వెళ్లి శ్యామ్‌జీ కృష్ణవర్మతో కలిసి అక్కడ ఇండియా హౌస్‌ను ఏర్పాటు చేశారు.
-దామోదర్ సావర్కర్ సోదరుడు గణేష్ సావర్కర్ కూడా మహారాష్ట్రలో విప్లవ కార్యక్రమాలు నిర్వహించేవారు. అందుకోసం ఆయనకు జాక్సన్ అనే నాసిక్ జడ్జి ద్వీపాంతరవాస శిక్ష విధించారు.
-దీనికి ఆగ్రహించిన అనంత్ లక్ష్మణ్ నాసిక్ జడ్జి జాక్సన్‌ను కాల్చి చంపారు. ఇది నాసిక్ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది. ఈ కుట్ర కేసులో దామోదర్ సావర్కర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించి, అండమాన్ జైలుకు పంపించారు.

బెంగాల్

-హింసావాదానికి బెంగాల్ ప్రధాన కేంద్రమైంది.
-స్వదేశీ ఉద్యమాన్ని అణచివేయడంతో సమరశీల జాతీయవాదులు ప్రవాసంలోకి వెళ్లి, తమ కార్యక్రమాలను కొనసాగించారు.
-బెంగాల్‌లో మొదటి తీవ్రవాది జ్ఞానేందర్‌నాథ్ బసు. తన కార్యకలాపాలను మిడ్నాపూర్ ప్రాంతంలో చేపట్టారు.
-బెంగాల్‌లో మొదటి విప్లవ సంఘమైన అనుశీలన సమితిని 1902లో కలకత్తాలో ప్రమోద్‌మిత్ర, బరీంద్రకుమార్ ఘోష్‌లు స్థాపించారు. వీరు యుగాంతర్ అనే వారపత్రికను నడిపారు.
-ఈ సంస్థ సభ్యుడైన హేమచంద్ర కనుంగో యూరప్ వెళ్లి బాంబులు తయారు చేయడం నేర్చుకొని, తిరిగి వచ్చి కలకత్తా సమీపంలోని మాణిక్‌తలాలో బాంబుల ఫ్యాక్టరీలు స్థాపించాడు.
-ఢాకాలో అనుశీలన్ సమితిని పులిందాస్ స్థాపించాడు. ఇది బెంగాల్ విప్లవ కార్యక్రమాలకు కేంద్రమైంది. ఆనాటి బెంగాల్ యువ ఉగ్రవాదుల్లో ముఖ్యమైనవారు ఖుదీరామ్ బోస్, ప్రపుల్ల చౌకీ.
-ముజఫర్ న్యాయాధికారి కింగ్స్ ఫోర్డ్ హత్యా పథకాన్ని ఖుదీరామ్‌బోస్, ప్రపుల్ల చౌకీలు రూపొందించారు. ఇది విఫలమై ప్రపుల్ల చౌకీ ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఏండ్ల బాలుడు ఖుదీరామ్‌బోస్‌ను ఉరితీశారు.
-ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారులపై అలీపూర్ బాంబు కేసును నడిపి అరవిందఘోష్, హరీంద్రగోశాయిన్‌తో సహా 39 మందిని నిర్బంధించింది.
-ఈ కేసులో అరవిందఘోష్, అతని సోదరుడు బరీంద్రనాథ్ ఘోష్, స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్ దత్తాలను కూడా ప్రభుత్వం నిందితులుగా పేర్కొంది.
-ఈ క్రమంలో హరీంద్రనాథ్‌గోశాయిన్‌ను హత్య చేశారు. మరో ఇద్దరికి ఉరిశిక్ష విధించారు. 36 మందిని కఠినంగా శిక్షించారు. వారు బెంగాల్‌లో యుగంధర్ పత్రక ద్వారా తమ సందేశాలు తెలిపారు.
-అలీపూర్ కుట్రకేసులో అరవిందఘోష్ పక్షాన బిపిన్‌చంద్రపాల్ వాదించాడు. దీనికారణంగా అరవిందఘోష్‌కు శిక్ష పడకుండా విడుదల కాగా, అతని సోదరుడైన బరీంద్రనాత్ ఘోష్ కఠిన శిక్షకు గురయ్యాడు.
-బెంగాల్‌లో వందేమాతరం, సంధ్య, నవశక్తి వంటి పత్రికలు విప్లవోద్యమాన్ని ప్రచారం చేశాయి.

పంజాబ్

-పంజాబ్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రచారం జరిగింది. దీనికోసం 1904లో జేఎం ఛటర్జీ పంజాబ్‌లో ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు.
-అజిత్‌సింగ్, లాలా హరిదయాల్, లాలా లజపతిరాయ్ ఈ ప్రచారాన్ని ప్రత్యక్షంగా బలపరిచారు.
-పంజాబ్‌లో ఉగ్రవాద ఉద్యమానికి అజిత్‌సింగ్ నాయకత్వం వహించాడు. ఇతనికి ఆగా హైదర్, సయ్యద్ హైదర్ రజాలు సహాయం చేశారు.
-లాలాలజపతిరాయ్, అజిత్‌సింగ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం బహిష్కరించడంతో ఈ ఆందోళన తాత్కాలికంగా తగ్గింది.
-1912లో వైస్రాయ్ రెండో హార్డింజ్‌ను హత్య చేయడానికి రాస్‌బిహారి బోస్, సచిన్ సన్యాల్‌లు పథకం వేశారు. కానీ అది ఫలించలేదు.

హింసావాదం - విప్లవోద్యమం

-దేశ స్వాతంత్రోద్యమంలో ఆత్మార్పణ చేసి, చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న కొంతమంది యువకులు స్వదేశీ ఉద్యమం విఫలమైన తర్వాత బాంబు వాదాన్ని అనుసరించారు. రహస్య సంఘాలు స్థాపించి, ప్రజా వ్యతిరేక బ్రిటిష్ అధికారులను హత్య చేసే పద్ధతులను చేపట్టారు. భారతీయ విప్లవకారులు రష్యాలో చక్రవర్తికి వ్యతిరేకంగా కొనసాగించిన శూన్యవాదం లాగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఐర్లాండ్‌లోని జాతీయ ఉద్యమం లాగా భారతదేశంలో కూడా విప్లవాత్మక ఉగ్రవాదాన్ని అనుసరించారు.
-భారతదేశ తూర్పు ప్రాంతంలో అనుశీలన్, జుగంతర్ సంస్థలను, దేశ పశ్చిమ ప్రాంతంలో అభినవ భారత్ సంస్థను స్థాపించడంతో విప్లవోద్యమ కార్యక్రమాలు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగాయి. నాడు ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా బెంగాల్, బొంబాయి ప్రాంతాల్లో ఉండేది. విదేశాల్లో కూడా ఈ ఉగ్రవాద కార్యక్రమాలు విస్తరించాయి. బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర ప్రాంతాలు విప్లవోద్యమ హింసావాద కార్యక్రమాలకు కేంద్రాలయ్యాయి.
sasala-mallikarjun

1386
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles