పక్కా ప్రణాళికే విజయానికి కీలకం


Mon,November 11, 2019 01:10 AM

IBPS
దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 1163 స్పెషలిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి ఇండియన్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇది ఉత్తీర్ణులైన వారికి మెయిన్‌ పరీక్షకు అర్హత లభిస్తుంది. మెయిన్‌లో స్పెషలిస్ట్‌ అధికారికి సంబంధించిన ఒక పేపర్‌ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్‌ సిలబస్‌ను ఒకసారి పరిశీలిస్తే...
IBPS1

ప్రిపరేషన్‌ ఎలా..

- రాజ్‌భాష అధికారి పోస్టుకు సంబంధించిన పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌ ఉండగా, మిగతా పోస్టులకు దాని స్థానంలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఉంది. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్‌ 28, 29 తేదీల్లో జరుగుతుంది. నవంబర్‌ 10 నుంచి లెక్కిస్తే సుమారు 50 రోజుల వ్యవధి అందుబాటులో ఉంది. సరైన ప్రణాళికతో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.

రీజనింగ్‌

- ఇందులో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, ర్యాంకింగ్‌, ఆల్ఫాబెట్‌ టెస్ట్‌, సిలాజిసం, ఇన్‌పుట్‌-ఔట్‌పుట్‌, కోడింగ్‌-డికోడింగ్‌, కోడెడ్‌ ఇనీక్వాలిటీస్‌ తదితర అంశాల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 40 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. ఇంత తక్కువ సమయంలో ప్రశ్న చదివి, అర్థం చేసుకుని, జవాబు కనుక్కొని మరో ప్రశ్నకు వెళ్లాలి. అందువల్ల వేగం అవసరం. ఎంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేశామనేదానిపైనే వేగం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌ ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఎక్కువ డాటా ఇచ్చి, దానికి సంబంధించి ఐదు ప్రశ్నలు అడుగుతారు. డేటాను అర్థం చేసుకుని, డీకోడ్‌ చేయగలిగితేనే సరైన సమాధానాలు వస్తాయి. ఒక వాక్యం చదువుతూనే భిన్న రకాలుగా డీకోడ్‌ చేసుకుంటూ వెళ్లగలగాలి. ఉదాహరణకు.. ప్రశ్నలో ఒక చిన్న వాక్యం ‘In a seating Arrangement, A is sitting adjacent to B’ అని ఉంది. ఇందులో ‘ఎ’ అనే వ్యక్తి ‘బి’ అనే వ్యక్తి పక్కన కూర్చున్నాడని అర్థం. అయితే ఎడమ వైపా లేదా కుడి వైపా ఇవ్వలేదు. కాబట్టి రెండు సంభావ్యతలు ఉంటాయి. ఈ రెండు సంభావ్యతల్లో మిగిలిన డేటా ఆధారంగా సమాధానాలను రాబట్టాలి. ఇలా ప్రతి వాక్యాన్ని అనుసరిస్తూ వెళ్లాలి. గతకొంత కాలంగా పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌పైన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. అందువల్ల ఎంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే అంత మంచిది. వీటికి ప్రాథమిక అంశాలు అంటూ ఉండవు. అభ్యర్థి నేరుగా ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయడమే. మిగతా అంశాలను తేలికగా చేయొచ్చు. అయితే వీటికి కూడా ప్రాక్టీస్‌ తప్పనిసరి. ర్యాంకింగ్‌, ఆల్ఫాబెట్‌ టెస్ట్‌, కోడింగ్‌-డికోడింగ్‌లకు దాదాపు ఒకే తరహా లాజిక్‌ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే సులభంగా సమాధానాలు దొరుకుతాయి. అధ్యాయాలవారీగా ప్రాక్టీస్‌ చేసి, మాక్‌ పరీక్షలు రాయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

- రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ చాలా కీలకం. ఆఫీసర్‌ స్థాయి పరీక్షలు కాబట్టి రెండు కాంప్రహెన్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక, శాస్త్ర-సాంకేతిక అంశాలకు సంబంధించిన కాంప్రహెన్షన్లను ప్రాక్టీస్‌ చేయాలి. దీనికి గ్రామర్‌ అవసరం లేదు. అయితే వేగంగా చదువుతూ అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లలో వచ్చే వ్యాసాలను, సంపాదకీయాలను చదవాలి. వాక్యాలు పెద్దవిగా ఉంటే వాటిని చిన్నవిగా విభజించుకుని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు.. The protectionist policies of the trump administration have started impacting several areas, the key among them is the issuance of work permit visas for foreign skilled workers. ఈ వాక్యం సుదీర్ఘంగా ఉంది. ఇందులో అంశాలను వేగంగా బ్రేకప్‌ చేస్తూ ప్రశ్నలు రాదగ్గ అంశాలను పసిగట్టగలగాలి.

ఉదాహరణకు..

1. Trump administration is following protectionist policies.
2. Protectionist policies impacts several areas
3. The policies are causing trouble to skilled workers.
ఇలా డీకోడ్‌ చేస్తూ వెళ్లాలి. ప్రశ్నలు కూడా వీటిపైనే ఉంటాయి. ప్రాక్టీస్‌ చేయడం ద్వారా వేగంగా ప్రతి లైన్‌ను డీకోడ్‌ చేసే సామర్థ్యం వస్తుంది. కాంప్రహెన్షన్‌తో పాటు ఎర్రర్స్‌ ఉంటాయి. వీటికి గ్రామర్‌ రూల్స్‌ ప్రధానం. వాక్య నిర్మాణం, వివిధ భాషాభాగాలను ఉపయోగించుకునే తీరును అర్థం చేసుకుంటే ఇది సులభమవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే క్లోజ్‌ టెస్ట్‌ ఉంటుంది. వొకాబులరీ పైన ఇది ఆధారపడి ఉంటుంది. కాంప్రహెన్షన్‌ చదివేటప్పుడు అభ్యర్థులు కొత్త పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అలాగే కొత్త పదాల అర్థాలు, వ్యతిరేక పదాలతో పాటు, ఆ పదానికి సంబంధించి ఏవైనా పదబంధాలు, సామెతలు, నుడికారాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉంటే వాటిని ఉపయోగించిన తీరును పరిశీలించాలి. ఉదాహరణకు come across అనేది ఒక ఫ్రేజల్‌ వెర్బ్‌ (పదబంధం). అకస్మాతుగా దక్కించుకోవడం అని దీని అర్థం. కానీ డిక్షనరీ ప్రకారం come, across అర్థాలు వేరుగా ఉంటాయి. I come across, two old friends, when i was going to office.. అంటే నేను ఆఫీసుకు వెళ్తుండగా అనుకోకుండా ఇద్దరు పాత మిత్రులను కలిశాను అని అర్థం. ఇలా పదాల వాడకాన్ని తెలుసుకుంటే ఇంగ్లిష్‌లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

- తార్కిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తేలికగా సమాధానాన్ని రాబట్టే విధానం గురించి తెలుసుకోవాలి. దీనికోసం వివిధ అంశాల ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం తప్పనిసరి. ఉదాహరణకు కాలం-పని అనే అంశం నుంచి ఎన్ని కోణాల్లో ప్రశ్నలు వస్తాయో తెలుసుకోవాలి.

- ‘ఎ’ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో, ‘బి’ అనే వ్యక్తి అదే పనిని 12 రోజుల్లో చేస్తే ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడగవచ్చు. ఇదే అంశంపై భిన్నంగా... ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తారో ఇచ్చి ఆ తర్వాత ‘ఎ’ అనే వ్యక్తి మాత్రమే ఎన్ని రోజుల్లో పని పూర్తిచేస్తాడో కూడా లెక్కలో ఇచ్చి, ‘బి’కి ఎన్ని రోజులు అవసరమవుతాయి అని అడిగే అవకాశం ఉంది. లేదా ‘ఎ’ సగం రోజులు పని పూర్తిచేసి వెళ్లాడు, మిగిలిన సగం పనిని ‘బి’ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? అని అడగొచ్చు. లేదా ఒక రోజు ‘ఎ’, తర్వాత రోజు ‘బి’, మళ్లీ ఎ, తర్వాత బి ఇలా ఒకరి తర్వాత ఒకరు పని చేసుకుంటూ వెళ్తే, ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని ప్రశ్నించవచ్చు. ఇలా ఒక్క అంశానికి మాత్రమే కాకుండా అర్థమెటిక్‌లోని ప్రతి అధ్యాయానికి సిద్ధం కావాలి. బ్యాంకింగ్‌ పరీక్షలకు ప్రత్యేకించి రాసిన అర్థమెటిక్‌ పుస్తకాలను ఎంపికచేసుకుని వారం వ్యవధిలో బేసిక్స్‌ను పూర్తిచేసి, ఆ తర్వాత మాక్‌ పరీక్షలు అధ్యాయాలవారీగా రాయడం మంచిది.

- కేవలం రాజ్‌భాష పరీక్ష రాసే వాళ్లకు మాత్రమే ఈ అంశం ఉంది. బ్యాంకింగ్‌ రంగానికి ప్రాధాన్యం అని ప్రత్యేకంగా ఇచ్చారు. కాబట్టి ఇటీవల చోటుచేసుకున్న బ్యాంకు విలీనాలు, బ్యాంకింగ్‌ రంగంలో వచ్చిన సంస్కరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఇటీవల బ్యాంక్‌ నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన సెక్షన్‌-7, బిమల్‌ జలాన్‌ కమిటీ, ఆర్‌బీఐ గవర్నర్‌, డిప్యూటీ గవర్నర్‌ రాజీనామాలు, నేపథ్యం.. ఇలా సుమారు ఏడాది కాలంగా బ్యాంకింగ్‌ రంగంలో జరిగిన పరిణామాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, ద్వైపాక్షిక, ఆర్థిక, శాస్త్ర-సాంకేతిక అంశాలను చదవాలి.
- ప్రతి విభాగానికి ప్రత్యేకించి సమయాన్ని కేటాయించారు. అందువల్ల ఆ సమయంలో వేరే విభాగానికి వెళ్లే వీలుండదు.
- క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ కూడా ముఖ్యమైనదే. ఇందులో ఇటీవలి కాలంలో సూక్ష్మీకరణాల ప్రాధాన్యం కూడా పెరిగింది. వేగంగా సింప్లిఫికేషన్‌ చేసేందుకు నిత్యం 100 నుంచి 200 వరకు కేవలం సింప్లిఫికేషన్‌ ఆధారిత లెక్కలు చేయడం మంచిది.

ముఖ్య తేదీలు

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 26
- హాల్‌టెకెట్లు డౌన్‌లోడ్‌ (ప్రిలిమ్స్‌): డిసెంబర్‌ 28, 29
- ఫలితాలు: 2020 జనవరి
- మెయిన్‌ పరీక్ష: జనవరి 25
- ఇంటర్వ్యూలు: 2020, ఫిబ్రవరి
- తుది ఫలితం: 2020, ఏప్రిల్‌

విభాగాలవారీగా పోస్టులు:

- అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1)- 670
- మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1)- 310
- ఐటీ ఆఫీసర్‌ (స్కేల్‌-1)- 76
- లా ఆఫీసర్‌ (స్కేల్‌-1)- 60
- హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1)- 20
- రాజ్‌భాష అధికారి (స్కేల్‌-1)- 27
IBPS2

568
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles