విశ్లేషణ కీలకం


Mon,November 4, 2019 01:25 AM

కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్
అంశం-1: బాలల పరిస్థితిపై నివేదిక
నేపథ్యం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలల స్థితిగతులపై యునిసెఫ్ ఒక నివేదికను ప్రచురించింది.
ప్రశ్నల సరళి: ఈ అంశం నుంచి అటు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కూడా ప్రశ్నలు రావచ్చు. ప్రిలిమ్స్‌లో ప్రస్తుతం ఇచ్చిన నివేదికలోని వివిధ గణాంకాలకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు కింది ప్రశ్నలను పరిశీలించండి..
1. యునిసెఫ్ నివేదిక ప్రకారం.. భారత దేశంలో పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు ఏవి-పేదరికం, పర్యావరణం, పట్టణీకరణ
2. సరైన పోషణ లేక ఎంత శాతం మంది చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు- 35%
3. ఐదేండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు ఏ విటమిన్ లోపంతో బాధ పడుతున్నారు- ఎ విటమిన్
UNICEF
ఈ తరహా గణాంకాలతోపాటు స్టాక్ జికేపై కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. యునిసెఫ్ నివేదిక ఇచ్చింది కాబట్టి..
-యునిసెఫ్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది-న్యూయార్క్
-యునిసెఫ్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం- 1946
-ఏ సంవత్సరంలో యునిసెఫ్ నోబెల్ బహుమతిని గెలుచుకుంది-1989
-భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే ఇందిరాగాంధీ ప్రైజ్‌ను యునిసెఫ్‌కు ఏ సంవత్సరంలో ఇచ్చారు-1989


మెయిన్స్‌లో అడగదగ్గ ప్రశ్నలు

చిన్నారుల్లో పోషణకు సంబంధించి భారత్ అమలు చేస్తున్న వివిధ పథకాలను తెలిపి, అవి అమలవుతున్న తీరును పరిశీలించండి?
పథకాలు-పోషణ అభియాన్, రక్తహీనత రహిత భారతదేశం (అనీమియా ముక్త్ భారత్), ప్రధాన మంత్రి మాతృత్వ సురక్షిత్ అభియాన్, జాతీయ ఆహార భద్రత మిషన్ తదితర పతకాలను ప్రస్తావించాలి. మెయిన్ పరీక్షలో జవాబులు రాసేటప్పుడు కేవలం పథకం ఎప్పటి నుంచి అమలవుతుంది, లబ్ధిదారులు తదితర గణాంకాల కంటే పథకం అమలు తీరు, దానిని మెరుగుపరిచేందుకు తగిన సూచనలు ఇచ్చేలా ఉండాలి.
అంశం 2: మందగమనంలో ప్రపపంచ ఆర్థిక వ్యవస్థ
నేపథ్యం: ఐఎంఎఫ్ నివేదిక (వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్)
ప్రశ్నల సరళి: ఇలాంటి అంశాలపై ప్రిలిమ్స్‌కు సంబంధించి మూడు రకాలుగా సిద్ధం కావాలి. 1. కరెంట్ అఫైర్స్ 2. జనరల్ స్టడీస్ 3. స్టాక్ జీకే
1. ఐఎంఎఫ్ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు ఎంత ఉండనుంది- 6.1%
2. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం- భారత్
పై రెండు ప్రశ్నలు కరెంట్ అఫైర్స్‌కు సంబంధించినవి, ఇదే అంశాన్ని తీసుకుని ఎకానమీలో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిద్ధం కావాలి. ఈ అంశానికి సంబంధించి సిద్ధం కావాల్సిన అంశాలు-
1. జీడీపీ అంటే ఏమిటి?
2. జాతీయ ఆదాయం అంటే?
3. జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు
4. జాతీయ ఆదాయ ధోరణులు
5. జాతీయ ఆదాయ భావనలు
6. ప్రస్తుత ఆధార సంవత్సరం, గతంలో భారత్‌లోని ఆధార సంవత్సరాలు
7. 2015 నుంచి అమల్లోకి వచ్చిన జీపీఏ (స్థూల కలపబడిన విలువ)
8. స్థూల, నికర ఆదాయాల మధ్య తేడా
9. ఉత్పత్తి కారకాలు, మార్కెట్ ధరల మధ్య తేడా
పై ప్రశ్నలన్నీ జనరల్ స్టడీస్‌లో భాగంగా వస్తాయి. ఏ తరహా పోటీ పరీక్ష రాసినా జాతీయ ఆదాయం నుంచి కీలక ప్రశ్నలు వస్తాయి. నిజానికి ఎకానమీ చదవాల్సిన పద్ధతి, కరెంట్ అఫైర్స్‌తోటే ఉండాలి. రోజువారీగా ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, ఆ పదాలను పరిశీలించి, వాటి ప్రాథమిక అంశాలతో పాటు, ఇతరత్రా ఏమన్నా ఉంటే వాటిని కూడా అధ్యయనం చేయాలి.

ఇదే అంశానికి సంబంధించి స్టాక్ జీకేను పరిశీలిస్తే...

1. ఐఎంఎఫ్ ఎప్పుడు ఏర్పడింది-1945
2. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది- వాషింగ్టన్ డీసీ, యూఎస్
3. ప్రస్తుతం ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్- క్రిస్టలీనా జార్జీవా
4. ఐఎంఎఫ్ ప్రస్తుత చీఫ్ ఎకనామిస్ట్- గీతా గోపీనాథ్ (భారతీయ-అమెరికన్)
5. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌ను ఇచ్చే సంస్థ ఏది- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
ఇలా స్టాక్ జీకే అంశాలు కూడా చదవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మెయిన్స్‌లో ప్రశ్నలు ఎలా వస్తాయో పరిశీలిస్తే..
1. వరుసగా వృద్ధి రేటు తగ్గుతున్న దృష్ట్యా, పురోగతి దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేవి (కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఆటోమొబైల్ సెక్టార్‌కు రాయితీలను చర్చించాలి)
2. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది, ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా, కేవలం పారిశ్రామిక వర్గాలకు రాయితీలు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలమా? చర్చించండి?
3. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తృతం చేయడం ద్వారా, ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చా, విశ్లేషించండి?

అంశం 3: పేదరికం

నేపథ్యం: పేదరికంపై ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక, అలాగే పేదరికం తగ్గింపుపై పరిశోధనకుగాను ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి రావడం.
ఈ అంశం, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్, మెయిన్స్ లో ముందుగా ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్‌లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే..
1. ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 1990 నుంచి ఇప్పటివరకు పేదరిక శాతం ఎంతమేర తగ్గింది- 50%
2. మహిళ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు భారత్‌లో ఎంత శాతం ఉంది-27%
3. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన 15 సంవత్సరాలలో భారత్ ఏటా ఎంత వృద్ధిరేటు సాధిస్తూ వచ్చింది-7%

స్టాక్ జీకేకు సంబంధించిన ప్రశ్నలు

1. వరల్డ్ బ్యాంక్‌ను ఎప్పుడు స్థాపించారు- 1945
2. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది- వాషింగ్టన్ డీసీ
ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో రాదగిన ప్రశ్నలు
ఇక్కడ కేవలం కరెంట్ అఫైర్స్ కోణంలోనే కాకుండా, ఎకానమీ కోణంలో వివిధ అంశాలను అధ్యయనం చేయాలి. పేదరికం నిర్వచనాలు, పేదరికం అంచనాలు, దారిద్య్రరేఖ-వివిధ కమిటీలు, పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలు.. ఇలా పూర్తి స్థాయిలో పేదరికం అన్న అంశాన్ని చదవాలి. అన్ని పోటీ పరీక్షల్లో రాదగ్గ ప్రశ్నలను పరిశీలిస్తే..
1. భారతదేశంలో ఏ తరహా పేదరికం ఉంది- నిరపేక్ష పేదరికం (అభివృద్ధి చెందిన దేశాల్లో సాపేక్ష పేదరికం ఉంటుంది)
2. భారతదేశంలో పేదరికాన్ని కొలిచే పద్ధతి- తలలు లెక్కించే పద్ధతి (హెడ్ కౌంట్ రేషియో)
3. స్వాతంత్య్రానికి పూర్వం తొలిసారిగా పేదరికాన్ని కొలిచిందెవరు- దాదాభాయ్ నౌరోజీ
4. దారిద్య్రరేఖకు సంబంధించి వివిధ కమిటీల నిర్వచనాలు- కమిటీలు-వైకే అలాఘ్, లక్డావాలా, సురేశ్ టెండుల్కర్, రంగరాజన్, అరవింద్ పనగరియా
5. పేదరిక నిర్మూలనకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలు, పథకాల లక్షిత వర్గాలు
ఇదే అంశానికి సంబంధించి మెయిన్స్‌లో రాదగిన ప్రశ్నలు
1. భారతదేశంలో పేదరిక శాతం తగ్గినా, పేదల సంఖ్య మాత్రం తగ్గలేదు, చర్చించండి?
2. భారతదేశ పేదరిక అంచనాలకు సంబంధించి వివిధ కమిటీలను పోల్చండి?
3. పేదరిక నిర్మూలన కాకుండా, శ్రేయస్సు లక్ష్యంగా ఉండాలిచర్చించండి
4. పేదరిక నిర్మూలన పథకాలను విశ్లేషించండి?
5. లక్షిత వర్గాలకు పేదరిక నిర్మూలన పథకాలు చేరుతున్నాయా? పరిశీలించండి
అలాగే పేదరికం అంశం ప్రధానంగా అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి వచ్చింది (ఆర్థికశాస్త్రంలో, ఈ నేపథ్యంలో ఇందులో నుంచి రాదగిన ప్రశ్నలు)
1. ఆర్థికశాస్త్రంలో ఇప్పటి వరకు నోబెల్ బహుమతి వచ్చిన భారతీయుడు ఎవరు- అమర్త్యసేన్
2. అర్థశాస్త్రంలోని ఏ అంశం ఆధారంగా అమర్త్యసేన్‌కు నోబెల్ బహుమతి వచ్చింది- సంక్షేమ ఆర్థిక రంగం
3. ఇప్పటి వరకు నోబెల్ బహుమతి పొందిన భారతీయులు- రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, తొలి ఆసియావాసి, సాహిత్యం), సీవీ రామన్ (1930, భౌతిక శాస్త్రం), హరగోబింద్ ఖురానా (1926, వైద్యం), మదర్ థెరిస్సా (1979-శాంతి), సుబ్రమణ్య చంద్రశేఖర్- (1983, ఫిజిక్స్), అమర్త్యసేన్ (1998-అర్థశాస్త్రం), వెంకటరామన్ రామకృష్ణన్-(2009, రసాయన శాస్త్రం), కైలాశ్ సత్యార్థి (2014, శాంతి), అభిజిత్ బెనర్జీ (2019-అర్థశాస్త్రం)

వి.రాజేంద్రశర్మ, ఫ్యాకల్టీ
9849212411

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles