కరెంట్ అఫైర్స్


Wed,October 16, 2019 02:15 AM

Telangana
Telangana

నారాయణమూర్తికి సుద్దాల అవార్డు

సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తికి సుద్దాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది. అక్టోబర్‌ 13న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఐయాన్‌కాన్‌ సదస్సు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘ఐయాన్‌కాన్‌-2019’ 27వ వార్షిక సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్‌ 3న ప్రారంభించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ సదస్సును బ్రెయిన్‌ అండ్‌ స్పైన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ నిర్వహించింది. 18 దేశాలకు చెందిన న్యూరో ఫిజీషియన్లు, వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ న్యూరాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ విలియం కరోల్‌, ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ అధ్యక్షుడు సతీష్‌ ఖాదిల్కర్‌ ఈ సదస్సుకు హాజరయ్యారు.

ప్రపంచ స్మార్ట్‌ సిటీల్లో హైదరాబాద్‌

ప్రపంచ స్మార్ట్‌ సిటీ (ఆకర్షణీయ నగరాలు)లు-100 జాబితాలో హైదరాబాద్‌కు స్థానం లభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌, సింగపూర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ సంస్థలు 102 నగరాలపై అధ్యయనం చేసి ఈ జాబితాను అక్టోబర్‌ 4న విడుదల చేశాయి. ఈ జాబితాలో హైదరాబాద్‌కు 67వ స్థానం దక్కగా న్యూఢిల్లీ 68, ముంబై 78వ ర్యాంకులో నిలిచాయి.

ఈ జాబితాలో సింగపూర్‌ మొదటి స్థానంలో నిలువగా.. జూరిచ్‌ 2, ఓస్లో 3, జెనీవా 4, కొపెన్‌హెగెన్‌ 5వ స్థానాల్లో ఉన్నాయి.

కాయకల్ప అవార్డులు

మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల ప్రాతిపదికన ఆస్పత్రులకు కేంద్రం ఏటా ఇచ్చే కాయకల్ప అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్‌ 11న ఢిల్లీలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లా ఆస్పత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి మొదటి స్థానం దక్కింది. ద్వితీయ స్థానంలో సంగారెడ్డి, కొండాపూర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రులు నిలిచాయి. పీహెచ్‌సీ-సీహెచ్‌సీల విభాగంలో పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రథమ స్థానం దక్కింది.

National
National

విశ్వకవి సమ్మేళనం

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ యూనివర్సిటీలో 39వ విశ్వకవి సమ్మేళనాన్ని అక్టోబర్‌ 2న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రారంభించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ సమ్మేళనంలో 82 దేశాల నుంచి 1300 మంది కవులు పాల్గొన్నారు. అక్టోబర్‌ 6న జరిగిన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కవి సిద్ధార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్‌ వాటర్‌ (మల్లెల తీర్థం) ఆవిష్కరణ జరిగింది. ఈ విశ్వ కవుల వేదిక (వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయెట్స్‌) 1969లో ప్రారంభమైంది. ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా డాక్టర్‌ మారస్‌ యంగ్‌ వ్యవహరిస్తున్నారు.

ధ్రువ్‌ ప్రారంభం

ప్రధానమంత్రి సృజనాత్మక అభ్యసన కార్యక్రమం ధ్రువ్‌ను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యలయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ అక్టోబర్‌ 10న ప్రారంభించారు. ప్రతిభావంతులైన 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో 14 రోజులపాటు శిక్షణ అందిస్తారు.

మోదీ-జిన్‌పింగ్‌ భేటీ

తమిళనాడులోని మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, ప్రధాని మోదీల మధ్య రెండో అనధికార భేటీ అక్టోబర్‌ 11, 12 తేదీల్లో జరిగింది. జిన్‌పింగ్‌కు మహాబలిపురంలోని శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని మోదీ వివరించారు. భారత్‌-చైనా మధ్య సహకారం, పర్యాటక, వాణిజ్యం తదితర అంశాలపై మోదీ, జిన్‌పింగ్‌ చర్చించారు.

International
International

గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌ (అంతర్జాతీయ పోటీతత్వ సూచీ)ను అక్టోబర్‌ 8న విడుదల చేసింది. మొత్తం 141 దేశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ సూచీలో మొదటి స్థానంలో సింగపూర్‌ నిలిచింది. అమెరికా 2, హాంకాంగ్‌ 3, నెదర్లాండ్స్‌ 4, స్విట్జర్లాండ్‌ 5వ స్థానాల్లో నిలిచాయి.

ఈ సూచీలో భారత్‌ 68వ స్థానంలో నిలువగా.. చైనా 28, వియత్నాం 67, బ్రెజిల్‌ 71, శ్రీలంక 84, బంగ్లాదేశ్‌ 105వ స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచ సంపన్న నగరాలు

నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ న్యూ వరల్డ్‌ వెల్త్‌ రిపోర్ట్‌ (ప్రపంచ సంపన్న నగరాల జాబితా)ను అక్టోబర్‌ 11న విడుదల చేసింది. ఈ జాబితాలో న్యూయార్క్‌ 3 ట్రిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది. టోక్యో (2.50 ట్రి.డా.) 2, శాన్‌ఫ్రాన్సిస్కో (2.50 ట్రి.డా.) 3, లండన్‌ (2.40 ట్రి.డా.) 4, బీజింగ్‌ (2.10 ట్రి.డా) 5వ స్థానాల్లో నిలిచాయి.

భారతదేశ వాణిజ్య రాజధాని ముంబై (0.90 ట్రి.డా.) 12వ ర్యాంక్‌లో నిలిచింది. 90 దేశాల్లోని 100 నగరాల్లో వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు తదితర అంశాలను అధ్యయనం చేసి టాప్‌-20 సంపన్న నగరాల జాబితాను నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసింది.

నోబెల్‌

కెమిస్ట్రీలో.. జాన్‌ గుడెనఫ్‌ (జర్మనీ), ఎం స్టాన్లీ విట్టింగమ్‌ (బ్రిటిష్‌-అమెరికన్‌), అకిరా యోషినో (జపాన్‌)లకు సంయుక్తంగా లభించింది.
ఫిజిక్స్‌లో.. జేమ్స్‌ పీబుల్స్‌ (కెనడియన్‌ అమెరికన్‌), మేఖేల్‌ మేయర్‌, డిడియర్‌ క్యులోజ్‌ (స్విట్జర్లాండ్‌)లకు లభించింది.
వైద్యరంగంలో.. డాక్టర్‌ విలియమ్‌ జీ కెలీన్‌ జూనియర్‌, డాక్టర్‌ గ్రెగ్‌ ఎల్‌ సమెన్జా (అమెరికా), డాక్టర్‌ పీటర్‌ జే రాట్‌క్లిఫ్‌ (బ్రిటన్‌)లకు లభించింది.
లిటరేచర్‌లో.. పీటర్‌ హండ్కే (ఆస్ట్రియా)కు 2019, ఓల్గా టొకార్క్‌జుక్‌ (పోలెండ్‌)కు 2018కుగాను నోబెల్‌ లభించింది.
నోబెల్‌ శాంతి బహుమతి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ అలీని వరించింది.
ఆర్థికరంగంలో.. అభిజిత్‌ బెనర్జీ (ప్రవాస భారతీయుడు) ఎస్తర్‌ డుఫ్లో దంపతులు, మైఖేల్‌ క్రెమెర్‌లకు లభించింది.

ఇంగ్లండ్‌ క్రికెట్‌ కోచ్‌గా క్రిస్‌

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు నూతన హెడ్‌ కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌ఉడ్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అక్టోబర్‌ 7న నియమించింది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఉన్న ట్రెవర్‌ బేలిస్‌ ఒప్పందం ముగియడంతో పదవి నుంచి తప్పుకున్నారు.

Sports
Sports

అథ్లెట్‌ నిర్మలపై నిషేధం

భారత అథ్లెట్‌ నిర్మల షెరాన్‌పై నాలుగేండ్ల నిషేధం విధిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) అక్టోబర్‌ 9న ప్రకటించింది. 2018, జూన్‌లో నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో నిర్మల నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆమెపై 2016, ఆగస్టు నుంచి నాలుగేండ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు ఏఐయూ తెలిపింది. దీనివల్ల 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో 400 మీటర్లు, 4X400 మీటర్ల రిలేలో గెలిచిన స్వర్ణాలను ఆమె కోల్పోయింది.

బాక్సింగ్‌లో హుసామ్‌కు స్వర్ణం

జాతీయ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌కు స్వర్ణ పతకం లభించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డిలో అక్టోబర్‌ 10న జరిగిన 57 కేజీల విభాగం ఫైనల్లో హుసాముద్దీన్‌ (సర్వీసెస్‌) 3-2తో సచిన్‌ సివాచ్‌ (రైల్వేస్‌)పై విజయం సాధించాడు. అంతేకాకుండా స్టార్‌ బాక్సర్‌ శివ థాపా (63 కేజీలు), పీఎల్‌ ప్రసాద్‌ (52 కేజీలు), అంకిత్‌ (75 కేజీలు), సుమిత్‌ (91 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు.

Persons
Persons

ఉపరాష్ట్రపతికి కామొరోస్‌ పురస్కారం

ఆఫ్రికాలోని కామొరోస్‌ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆ దేశ ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ది గ్రీన్‌ క్రెసెంట్‌'ను అక్టోబర్‌ 11న ప్రదానం చేసింది. ఆ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని దీన్ని అందజేశారు.

చండీప్రసాద్‌కు ఇందిరాగాంధీ అవార్డు

ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు చండీప్రసాద్‌ భట్‌కు 2017-18కు గాను ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు అక్టోబర్‌ 11న లభించింది. అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేదల అభివృదిక్ధి ఆయన చేస్తున్న కృషికిగాను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు అందిస్తారు.

భారత సంపన్నుడు ముకేశ్‌

2019కు గాను భారత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ మేగజైన్‌ అక్టోబర్‌ 11న విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వరుసగా 12వ సారి మొదటి స్థానంలో నిలిచారు. గౌతమ్‌ అదానీ (అదానీ గ్రూప్‌) 2, హిందూజా సోదరులు (అశోక్‌ లేల్యాండ్‌) 3, పల్లోంజీ మిస్త్రీ (షాపూర్‌ పల్లోంజీ) 4, ఉదయ్‌ కొటక్‌ (కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌) 5, శివ్‌ నాడార్‌ (హెచ్‌పీసీల్‌) 6, రాధాకిషన్‌ దమానీ (అవెన్యూ సూపర్‌మార్ట్స్‌) 7, గోద్రెజ్‌ కుటుంబం (గోద్రెజ్‌ గ్రూప్‌) 8, లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ (ఆర్సెలర్‌ మిట్టల్‌) 9, కుమార మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్‌) 10వ స్థానాల్లో నిలిచారు.

ఈ జాబితాలో తెలుగువారు మురళి దివి (దివీస్‌ ల్యాబ్‌) 37, పీపీ రెడ్డి (మేఘా ఇంజినీరింగ్‌) 39, పీవీ రాంప్రసాద్‌ రెడ్డి (అరబిందో ఫార్మా) 59, సతీష్‌ రెడ్డి (డాక్టర్‌ రెడ్డీస్‌) 82వ స్థానాల్లో నిలిచారు.

గోపాల్‌నాథ్‌ మృతి

ప్రముఖ శాక్సాఫోన్‌ సంగీత విద్వాంసుడు, పద్మశ్రీ కదిరి గోపాల్‌నాథ్‌ అక్టోబర్‌ 11న మరణించారు. భారత్‌లోనే కాకుండా అమెరికా, యూరప్‌, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పశ్చిమాసియా దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్లో కచేరీ చేసిన అతికొద్దిమంది కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ఈయనొకరు.

తొలి స్పేస్‌వాకర్‌ అలెక్సి మృతి

తొలిసారిగా స్పేస్‌వాక్‌ చేసి రికార్డులకెక్కిన సోవియట్‌ యూనియన్‌ వ్యోమగామి అలెక్సి లియనోవ్‌ అక్టోబర్‌ 11న మరణించారు. 1965లో వాస్కోడ్‌-2 మిషన్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి 12 నిమిషాల 9 సెకండ్లపాటు స్పేస్‌వాక్‌ చేసి రికార్డు సృష్టించారు.

థ్రెసియాకు సెయింట్‌ హుడ్‌

భారతదేశంలోని కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం థ్రెసియాకు పోప్‌ ఫ్రాన్సిస్‌ అక్టోబర్‌ 13న ‘సెయింట్‌ హుడ్‌'ను ప్రకటించారు. ఈమెతోపాటు జాన్‌హెన్నీ న్యూమన్‌ (బ్రిటన్‌), మార్గరైట్‌ బేస్‌ (స్విట్జర్లాండ్‌), డుల్సీ లోపెస్‌ (బ్రెజిల్‌), గ్యూసెప్పీనా వన్నినీ (ఇటలీ)లకు కూడా సెయింట్‌ హుడ్‌ లభించింది.
Vemula-Saidulu

719
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles