తెలంగాణ తగ్గి ఆంధ్రలో పెరిగిన ఆయకట్టు


Wed,October 16, 2019 01:45 AM

- తెలంగాణ ఉద్యమచరిత్ర

Sagar

గతసంచిక తరువాయి

-1954లోని జాయింట్ రిపోర్టులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాలువ కింద తెలంగాణలో మొదటి పంట 6.75 లక్షల ఎకరాలకు, రెండో పంట లక్షా ఇరవైవేల ఎకరాలకు మొత్తం 7.95 లక్షల ఎకరాల మాగాణికి సాగునీరందస్తామని ప్రకటించారు. 1967 డిసెంబర్ 28న నాగార్జునసాగర్ అభివృద్ధిపై విచారణ జరిపిన తెలంగాణ రీజనల్ కమిటీ నియమించిన సబ్‌కమిటీ నాగార్జునసాగర్ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన నోట్‌లో తెలంగాణ ఆయకట్టు 5.20లక్షల ఎకరాలకు కుదించినట్లు, అదే సమయంలో ఆంధ్ర ఆయకట్టు 3.10 లక్షల ఎకరాలు మాగాణి పెరిగినట్లు గమనించింది. తెలంగాణలో 1.20 లక్షల ఎకరాలు రెండో పంటకు ( మాగాణి) నీరిచ్చే అంశం కూడా చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన నోట్‌లో లేదు. లక్ష ఎకరాలు లిఫ్టుల కింద సాగుచేయాలనే విషయం కూడా ఈ నోట్‌లో ప్రస్తావించలేదు.

తగ్గిన ఎడమకాల్వ బెడ్ లెవల్

-ఎడమకాలువ బెడ్‌లెవల్‌ను తగ్గంచాల్సిన స్థాయికన్నా 4, 5 ఫీట్లు తగ్గించి నిర్మించడం, పాలేరుపై నుంచి వెళ్లాల్సిన కాలువ 5 ఫీట్లు తగ్గించి పాలేరు రిజర్వాయర్‌లో కలుపడం, మళ్లీ పాలేరు నుంచి ఖమ్మం జిల్లాలోకి వెళ్లే దగ్గర ఆఫ్‌టేక్ లెవల్‌ను 8 ఫీట్లు తగ్గించడం తదితర కారణాల వల్ల తెలంగాణ ఆయకట్టు బాగా తగ్గిందని అంచనాల కమిటీ గుర్తించింది. ముందుగా అంగీకరించిన ప్రకారం పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరిచ్చే విధంగా కాల్వను రీమోడలింగ్ చేయాలని అంచనాల కమిటీ సిఫారసు చేసింది.

కాలువను మలిపిన కేఎల్ రావు

-ఆంధ్రలోని నందిగామ ప్రాంతానికి ఎడమకాలువ 19వ డిస్ట్రిబ్యూటరీ నుంచి నీరందించాలని జాయింట్ ప్రాజెక్టు రిపోర్టులో ఉన్నది. అంటే తెలంగాణ ప్రాంతానికి పూర్తిస్థాయిలో నీరందించిన తర్వాతే చివరగా ఈ 19వ డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటిని ఆంధ్రకు మళ్లించాలి. కానీ ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్రనీటి పారుదల, విద్యుచ్ఛక్తిశాఖ మంత్రిగా పనిచేసిన కేఎల్ రావు తన సొంత నియోజకవర్గంలోని నందిగామ, జగ్గయ్యపేటకు త్వరితగతిన, ప్రాజెక్టు రిపోర్టులో అంగీకరించిన పరిమాణం కన్నా ఎక్కువ పరిమాణంలో నీటిని తరలించడానికి 16వ బ్రాంచ్ కెనాల్ నుంచి కాలువను నందిగామకు తీసుకెళ్లారు. దీంతో కాలువ నిర్మాణం కోసం పాలేరు రిజర్వాయర్ కింద రైతులు సుమారు 400 ఎకరాల ఆయకట్టును నష్టపోయారు.

వివక్షేతో పాలమూరు వలసలు

-కృష్ణానది, భీమానది, తుంగభద్ర నది ఈ మూడు నదులు ఏడాదిపాటు ప్రవహిస్తున్నా విస్తారమైన, సారవంతమైన భూములున్నా, కష్టపడే జనమున్నా ఎందుకు పాలమూరులో కరువు కాటకాలుండాలని ప్రశ్నించుకున్న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాంతంలో సాగునీటి కోసం కృష్ణా, భీమా నదులపై ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని, తుంగభద్ర జలాలను నడిగడ్డ అయిన గద్వాల, ఆలంపూర్‌కు తరలించే అవకాశాలను పరిశీలించాలని చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీజంగ్‌ను ఆదేశించారు.
-19 శతాబ్ధంలో 12 పర్యాయాలు తెలంగాణ, హైదరాబాద్ సంస్థానంలోని కన్నడ, మరఠ్వాడ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, కాటకాలు సంభవించినవి. నిజాం సంస్థానంలో 19వ శతాబ్ధపు మధ్యకాలంలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన కల్నల్ ఫిలిఫ్ మోడోస్ టేలర్ తను రచించిన ది స్టోరీ ఆఫ్‌మై లైఫ్ ఆత్మకథలో కరువు కాటకాల నుంచి రక్షణ కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నల్‌దుర్గ్‌కు కొన్ని మైళ్లకు ఎగువన కృష్ణా, భీమా నదులపై నీటిపారుదల కాలువలను నిర్మించాలని పేర్కొన్నారు. కరువు కాటకాలు ఎంత భయంకరంగా ఉంటాయో మోడోస్ టేలర్ నల్‌దుర్గ్‌లో కళ్లరా చూశాడు.

-ఆయన స్వప్నం నిజం చేయడానికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ కృష్ణానదిపై కనులదిన్నె (గుల్బర్గా) దగ్గర అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, కృష్ణానదిలో భీమా కలిసే స్థలానికి కొద్దిమైళ్ల ఎగువన తంగడి దగ్గర భీమా ప్రాజెక్టు నిర్మాణానికి నివేదికలను 1930-42 మధ్యకాలంలో సర్వే చేసి రూపొందించారు. కమలదిన్నె దగ్గర నిర్మింపతలపెట్టిన అప్పర్ కృష్ణా ప్రాజెక్టు 54.40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించి గద్వాల, ఆలంపురం తాలుకాలోని లక్షా యాబైవేల ఎకరాలకు ప్రవాహిక కాలువల ద్వారా సాగునీరందించాలని సంకల్పించింది నిజాం ప్రభుత్వం. ఈ రెండు ప్రణాళిక ప్రాజెక్టులకు (1951 జూలై 27, 28 తేదిల్లో ఢిల్లీలో కేంద్రప్రణాళికా సంఘం నిర్వహించిన అంతర్‌రాష్ట్ర నదీజలాల సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి వెల్లోడి స్వయంగా ఈ ప్రతిపాదనలను చర్చించి నీటి కేటాయింపులను సాధించారు. ఈ రెండు ప్రాజెక్టుల తో పాటు 1944లో నిజాం ప్రభుత్వం మద్రాసు, మైసూరు రాష్ర్టాలతో చేసుకున్న తుంగభద్రా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాయచూర్ జిల్లాలో నిజాం ప్రభుత్వం నిర్మిస్తున్న తుంగభద్ర ఎడమగట్టులో లెవల్ కెనాల్‌ను 127 మైళ్ల తర్వాత ఉత్తరగద్వాల్ కాలువగా 41మైళ్లు, దక్షిణ గద్వాల్ కాలువను కూడా నిర్మించాలని నిజాం ప్రభుత్వం నిర్ణయించింది.
-ఎప్పుడైతే అప్పర్ కృష్ణా ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారో పైన తెలిపిన తుంగభద్ర ఎడమగట్టు లో లెవల్ కెనాల్ ఉత్తర గద్వాల్ కాలువ కింది ఆలంపూర్, గద్వాల తాలుకా ఆయకట్టుకు అప్పర్ కృష్ణా కుడి కాలువ ద్వారా నీరందించాలని మార్పుచేశారు. దక్షిణ గద్వాల కాలువద్వారా 19.20 టీఎంసీల నీటితో అలంపూర్ గద్వాల ప్రాంతానికి సాగునీరందించాలని నిర్ణయించింది నిజాం ప్రభుత్వం.
-ఈ మూడు ప్రాజెక్టుల (భీమా, అప్పర్ కృష్ణా, తుంగభద్రా కాల్వ) నిర్మాణం పూర్తయివుంటే మహబూబ్‌నగర్ జిల్లా కరువు సమస్య తేలిపోయేది. ఆ జిల్లా ప్రజలకు వలసపోవాల్సిన గోస ఉండేది కాదు. కానీ ఆంధ్రతో తెలంగాణ విలీనమై రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ద్వారా తన ప్రాంతమైన రాయలసీమకు కృష్ణానీళ్లను మలుపుకుపోవాలన్న స్వార్థచింతనతో అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర కాల్వను తెలంగాణకు రాకుండా అడ్డుకున్నారు.

డెల్టా సాగుకు కిన్నెరసాని నీరు

-ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని యానంబైలు గ్రామం దగ్గర పూర్వపు హైదరాబాద్ ప్రభుత్వం 64వేల ఎకరాలకు సాగునీరవ్వడానికి నిర్మించతలపెట్టిన కిన్నెరసాని ప్రాజెక్టును 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ప్రాజెక్టు నివేదికలో దాన్ని నీటి పారుదల ప్రాజెక్టుగా చూపెట్టారు. 5కోట్ల 58లక్షల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టును నిర్మించారు.
-అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1963 మార్చి 4న శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా.. పాల్వంచలో నిర్మించనున్న ఫర్టిలైజర్ (యూరియా) కర్మాగారానికి కిన్నెరసాని నుంచి నీరివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కేవలం ఈ ఫ్యాక్టరీ కొరకు మాత్రమే కిన్నెరసాని ప్రాజెక్టు కట్టలేదు. దాని చుట్టప్రక్కల ఎన్నో ప్రాజెక్టులు రాబోతున్నవి వాటన్నింటి కోసం కలిపి కట్టాం. వాటికవసరమైన నీరివ్వగా, ఇంకా మిగులు నీరు ఉంటే ఇరిగేషన్‌కు సరఫరా చేయటానికి వీలవుతుందేమోనని అంటున్నారు. ఇరిగేషన్‌కు ఇప్పుడు కమిట్ కావడం మంచిది కాదేమోనని నేను అనుకుంటున్నాను అన్నారు. ముఖ్యంగా థర్మల్ ప్లాంట్‌కు ఎక్కువ నీరుకావాలి. అక్కడ విద్యుత్పత్తి బొగ్గుపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కిన్నెరసాని ప్రాజెక్టు కట్టడం అవసరం. పూర్వపు హైదరాబాద్ ప్రభుత్వం ఏలక్ష్యాల కోసం కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మించాలనుకున్నదో వాటికి నీలం సంజీవరెడ్డి తిలోదకాలిచ్చారు.
-నిజానికి విద్యుత్ ఉత్పత్తిగాని, యూరియా ఫ్యాక్టరీ, ఇతర ప్రతిపాదిత పరిశ్రమలకు గాని 64వేల ఎకరాలకు సరిపోయేంత నీరు అవసరం లేదు. అసలు ఉద్దేశ్యాన్ని అప్పటి చీఫ్ ఇంజినీర్ పీ.టీ. మల్లారెడ్డి స్పష్టంగానే వెల్లడించారు. వరుసగా రెండు సంవత్సరాలు వర్షభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడటానికి మొత్తం నీటిని (కిన్నెరసానిలో) నిల్వచేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎవరికి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందో, ఎవరికి కిన్నెరసాని నీరు ఉపయోగపడాలని నిల్వచేస్తున్నారో మల్లారెడ్డి మాటల్లో చెప్పకపోయినా చేతల్లో చూపించారు.
-తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఆయకట్టు రెండో పంటకు సరిపోయే నీరు గోదావరి నదిలో లభించని సందర్భాల్లో ధవళేశ్వరం ఆయకట్టు అవసరాల కోసం కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. అంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లా నిరుపేద గిరిజనులు, ఆదివాసీల భూముల్లో పారాల్సిన నీటిని ఆంధ్రపాంత సంపన్న భూములకు మళ్లించడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా తెలంగాణ నిధుల నుంచి కిన్నెరసాని ప్రాజెక్టును నిర్మించారని భావించాల్సిఉంటుంది.

ఎడమ కాలువపై వివక్ష

Sagarwater
-రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం కేంద్రప్రభుత్వం ఆంధ్ర, హైదరాబాద్ రాష్ర్టాల ప్రతినిధులను 1955 పిబ్రవరి 24న ఢిల్లీకి పిలిపించి చర్చించి నాగార్జునసాగర్ కంట్రోల్‌బోర్డు ఏర్పడాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 1955 జూన్ 17న బోర్డు ఏర్పాటైంది. ఈ కంట్రోల్‌బోర్డు అజమాయిషిలో ఎడమకాల్వ పనులు చురుగ్గానే నిర్వహించబడినవి. 1957 మే నెల నాటికి ఎడమకాలువపై రూ. 72, 225 ఖర్చు చేయగా కుడికాలువపై రూ. 50, 266 ఖర్చు చేశారు.
-అయితే నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎడమకాలువపై వివక్ష మొదలైంది. 1957 మే నుంచి 1958 ఏప్రిల్ మధ్యకాలంలో ఎడమకాలువపై కేవలం రూ.24, 375 ఖర్చుచేయగా, కుడికాలువపై రూ.1, 58, 427 ఖర్చు చేశారు. ఇక పనుల విషయం పరిశీలిస్తే మార్చి 1958 నాటికి కుడికాలువ ఇన్వెస్టిగేషన్ పనులు 135 కి.మీ. (100 శాతం) పూర్తి చేయగా ఎడమకాలువ కింద 84కి.మీ (75 శాతం) మాత్రమే పూర్తిచేశారు. బ్లాక్ లెవలింగ్ పనులు కూడికాలువ కింద 30 లక్షల ఎకరాలు లక్ష్యం కాగా అంచనాలను దాటి 37.27 లక్షల ఎకరాల్లో పూర్తిచేశారు. ఈ పనులు ఎడమకాలువ పరిధిలో మొత్తం 14.70 లక్షల ఎకరాల్లో పూర్తిచేయాల్సి ఉండగా కేవలం 2.86 లక్షల ఎకరాల్లో (19 శాతం) మాత్రమే పూర్తి చేశారు. నాగార్జున సాగర్ కాలువల కింద 1967-68 నాటికి 6.5లక్షల ఎకరాలలో ఇరిగేషన్ పొటెన్షియల్ కల్పించబడగా దానిలో 5.6లక్షల ఎకరాలు కుడికాలువ కింద, 90వేల ఎకరాలు మాత్రమే ఎడమకాలువ కింద కల్పించబడింది.
Mallikarjun

741
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles