బడ్జెట్‌ 2019-20


Wed,September 18, 2019 12:47 AM

budget2019-20
ముఖ్యమంత్రి హోదాలో కే చంద్రశేఖర్‌ రావు వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను సెప్టెంబర్‌ 10న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2014-15 ఆర్థిక ఏడాది నుంచి రాష్ట్ర రాబడులతోపాటు బడ్జెట్‌ను పెంచుకుంటూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం దాని పరిమాణాన్ని తగ్గించింది. ఇది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే 20 శాతం మేర తక్కువ. 2018-19 ఆర్థిక సంవత్సర వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకుని గత నాలుగు నెలల పన్ను రాబడులను విశ్లేషించి రూ. 1,46,492.30 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడిన నేపథ్యంలో అంచనాలువేసి వాస్తవ లెక్కల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. అన్నదాతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. అమలులో ఉన్న ప్రధాన పథకాలైన ఆసరా, రైతుబంధు, రైతు బీమా, విద్యుత్‌ రాయితీలు, బియ్యం సబ్సిడీ, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు, రైతులకు 24 గం. నిరంతర విద్యుత్‌కు ఎలాంటి కోత విధించలేదు. మార్చిలో ఆమోదం పొందిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కాలపరిమితి సెప్టెంబర్‌తో ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
budget2019-201
- దేశ ఆర్థిక పరిస్థితి మాంద్యం ప్రభావానికి గురైంది. 2018-19లో సుమారు 6.85 శాతంగా ఉన్న జాతీయ వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5 శాతంగానే నమోదైంది. మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం, అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి. దీంతో వాహనాల అమ్మకంతో వచ్చే పన్ను తగ్గడంతోపాటు పెట్రోల్‌, డీజిల్‌, టైర్లు తదితర విభాగాల అమ్మకాలు కూడా పడిపోయి, వాటి ద్వారా వచ్చే వ్యాట్‌.... ఆదాయం తగ్గింది. పన్నుల ఆదాయంలో 22.69 శాతం వృద్ధి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేయగా మొదటి త్రైమాసికంలో అది 1.36 శాతం మాత్రమే నమోదైంది. అదేవిధంగా రాష్ట్ర ఆదాయాభివృద్ధి 15 శాతం ఉంటుందని అచనావేయగా వాస్తవంలో అది 5.46 శాతం మాత్రమే నమోదైంది. గత ఐదేండ్లలో రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయ సగటు వార్షిక వృద్ధిరేటు 13.6 శాతం ఉంటే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 6.61 శాతం మాత్రమే ఉన్నది. ఎక్సైజ్‌ ఆదాయం 2.59 శాతం మాత్రమే పెరిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయవృద్ధిరేటు గత ఏడాది 19.8 శాతం ఉంటే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 17.5 శాతానికి చేరింది. వాహన పన్ను ఆదాయం 19 నుంచి -2.06కు పడిపోయింది. మొత్తం పన్నేతర ఆదాయం 29 శాతం తగ్గుదల నమోదైంది. పన్నుల వాటా చెల్లించడం, నిధుల బదలాయింపులో కేంద్రం 4.19 శాతం కోత పెట్టింది. జీఎస్టీ రాబడుల్లో ఏటా సగటున 17 శాతం వృద్ధిరేటు కొనసాగుతుండగా ప్రస్తుతం 12-14 శాతం మాత్రమే నమోదైంది.


ప్రధానాంశాలు

- ఓటాన్‌ అకౌంట్‌ కంటే తాజా బడ్జెట్‌ పరిమాణం- 20 శాతం తక్కువ
budget2019-202
- రెవెన్యూ మిగులు- రూ.2044 కోట్లు
- రాష్ట్ర తలసరి ఆదాయం- రూ.2,05,696
- ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే తాజాగా నిర్వహణ పద్దులో రూ. 3,486 కోట్లు తగ్గింది
- ప్రగతి పద్దులో రూ. 32,039 కోట్లకు తగ్గింది
- మొత్తం 32 శాఖల పద్దుల్లో 18 శాఖలకు ప్రగతి పద్దుకంటే నిర్వహణ పద్దు ఎక్కువగా ఉంది.
- శాసన మండలిలో మొదటిసారిగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
budget2019-203
budget2019-204

ప్రగతి పద్దు

- ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు వెచ్చించే కేటాయింపులు ప్రగతి పద్దులో ఉంటాయి. ప్రగతి పద్దులో గ్రాంట్లు, వివిధ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు, వ్యయాలు ఉంటాయి.

నిర్వహణ పద్దు

- ప్రభుత్వం విధిగా చెల్లించాల్సిన ఖర్చులన్నింటిని నిర్వహణ పద్దు కింద చూపుతారు. నిర్వహణ పద్దులో జీతాలు, నిర్వహణ వ్యయాలు, అప్పులపై వడ్డీలు, ఇతర వ్యయాలు ఉంటాయి.

ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు-కేటాయింపులు (కోట్లలో)

- ఆసరా - రూ.9,402
- రైతు రుణమాఫీ- రూ.6,000
- రైతు బీమా- రూ.1,137
- విద్యుత్‌ రాయితీ- రూ.8,000
- బియ్యం రాయితీ- రూ.12,000
- రైతుబంధు- రూ.550
- ఉపకార వేతనాలు- రూ.3,257
- ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌- రూ.1,336
- కళ్యాణ లక్ష్మి- రూ.1540
- అడవుల రక్షణ, విస్తరణ- రూ.510
- పురపాలిక, పట్టణాభివృద్ధి- రూ.3,284.03
- గృహనిర్మాణం- రూ.1,005.69
- పరిశ్రమలు- రూ.397
- మహిళాశిశు సంక్షేమం- 1,507.70
budget2019-205
budget2019-206

గ్రాస్‌ వ్యాల్యూయాడెడ్‌ (జీవీఏ)లో అనుబంధరంగాల వారీగా వాటా (శాతంలో)

- వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం- 9.6
- గనులు, యంత్రాలు- 27
- తయారీ రంగం- 10.5
- విద్యుత్‌, గ్యాస్‌ నీటి సరఫరా- 14.2
- నిర్మాణరంగం- 8.2
- వ్యాపారం, హోటళ్లు- 19.6
- రవాణ, గోదాములు- 11.7
- ఆర్థిక సేవలు- 10.3
- స్థిరాస్తి, నైపుణ్య సేవలు- 17.3
- ప్రభుత్వ పరిపాలన- 8.5
- ఇతర సేవలు- 16.5
budget2019-207
budget2019-208

వ్యవసాయ రంగం

- ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, రైతుల సంక్షేమమే ప్రధానంగా భావించిన ప్రభుత్వం అధిక భాగం నిధులను వారికి కేటాయించింది. ప్రణాళికా వ్యయం కేటాయింపుల్లో వ్యవసాయశాఖ అధిక భాగం రూ.19741 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయరంగానికి గతేడాది కంటే రూ.3340 కోట్లు అధికంగా అంటే రూ. 20566.36 కోట్లు కేటాయించారు. ఇందులో అధికశాతం రైతుబంధుకు రూ. 12వేల కోట్లు, రుణమాఫీ రూ. 6వేల కోట్లు, రైతు బీమాకు రూ. 1137 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీలకు 304 కోట్లు, వ్యవసాయ అనుబంధరంగాలైన మత్స్య, పశుసంవర్ధక నిధులు పెరిగాయి. అయితే సహకార రంగం కేటాయింపులో మాత్రం సుమారు రూ. 15కోట్లు తగ్గించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యసాయం, అనుబంధరంగాల వాటా సుమారు 11.4 శాత ఉంది.
budget2019-209
- రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకు 10 వేల చొప్పున 54 లక్షల మంది రైతులకు అదిస్తారు. ఈ బడ్జెట్‌లో 12వేల కోట్లు కేటాయించారు.
budget2019-2010
- రైతు బీమా పథకం ద్వారా రైతు ఏ కారణంతోనైనా మృతి చెందితే రూ.5లక్షలు అందిస్తారు. దీనిద్వారా 31 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయి. ఈ బడ్జెట్‌లో రూ.1137 కోట్లు కేటాయించారు.
- రుణమాఫీ: ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ. లక్ష మాఫీచేయాలని నిర్ణయించారు. దీనిద్వారా 40 లక్షలమంది రైతులు లబ్ధిపొందుతారు. దీనికోసం 24వేల కోట్లు అవసరంకాగా తొలి విడుతలో భాగంగా బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించారు.
budget2019-2011

వైద్య, ఆరోగ్యశాఖ

- గత బడ్జెట్‌తో పోల్చితే రూ.198 కోట్లు తక్కువగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ. 3705.36 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.1988.81 కోట్లు కేటాయించారు. ఐదేండ్ల బడ్జెట్‌ కేటాయింపుతో పోల్చితే ఈ ఏడాది మాత్రమే కేటాయింపులు తగ్గించారు. వైద్యసేవల్లో కేరళ, తమిళనాడు తరువాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కేసీఆర్‌ కిట్‌ పథకం కారణం వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల శాతం
budget2019-2012
33 నుంచి 60కు పెరిగింది. శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి మంది జననాలకు) 39-29కు, బాలింత మరణాల (ప్రతి లక్ష కాన్పులకు) 91-81కి తగ్గాయి. సర్కార్‌ దవాఖానల్లో ఓపీ, ఐపీ 23 శాతం పెరిగింది.
budget2019-2013

విద్యారంగం

- ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులో విద్యారంగంపై కోత విధించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్‌లో విద్యారంగం వాటా 7.6 శాతం కాగా, తాజాగా అది 6.75 శాతానికి తగ్గింది. గతేడాది రూ. 13,278.19 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.9899.82 కోట్లు కేటాయించారు. అంటే రూ.2923.75 కోట్ల మేర కోతపడింది. గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గాయి. సమగ్ర శిక్షా అభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, సివిల్‌వర్క్స్‌ వంటి వాటిలో కేటాయింపులను తగ్గించారు. ఈ పథకాలకోసం రూ.491.56 కోట్లు మాత్రమే ప్రకటించారు.
budget2019-2014

సాగునీటి రంగం

- ఆర్థికమాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన నిధుల ప్రభావం సాగునీటిరంగంపై గణనీయంగా పడింది. గతంలో ప్రవేశపెట్టిన మూడు పూర్తిస్థాయి బడ్జెట్లలో రూ.25వేల కోట్లకు పైగా కేటాయించిన ప్రభుత్వం, ఈసారి రూ.8,476.17 కోట్లకు పరిమితమైంది. ఈసారి రాష్ట్రంలో 1.25కోట్ల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం మూలధనవాటాతోపాటు ఆర్థిక సంస్థల నుంచి రుణాల సమీకరణతో ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని నిర్ణయించింది. కానీ ఎంతమొత్తం నిధులు సేకరిస్తారనే విషయాన్ని బడ్జెట్‌లో పేర్కొనలేదు.
budget2019-2015
budget2019-2016
budget2019-2017
ఆదాయ వనరులను బట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యాలను నిర్ణయించుకుంటూ, సవరించుకుంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. అన్ని శాఖల్లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లిస్తాం. తర్వాతే కొత్త పనులు చేపట్టాలనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం’
- సీఎం కేసీఆర్‌

budget2019-2018

సాగునీటి ప్రాజెక్టులు-సమగ్ర స్వరూపం

- మొత్తం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు- 38
- ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన మొత్తం- రూ.219593.9 కోట్లు
- ఇప్పటివరకు చేసిన ఖర్చు మొత్తం- రూ.115417.72 కోట్లు
- ఖర్చు చేయాల్సిన మొత్తం- రూ.104096.18 కోట్లు
- రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ. 80 వేల కోట్లు
- ప్రాజెక్టులతో సాగులోకి రావాల్సిన ఆయకట్టు- 70.1 లక్షల ఎకరాలు
- ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయకట్టు- 16.77 లక్షల ఎకరాలు
budget2019-2019
- సాగులోకి రావాల్సింది- 53.33 ఎకరాలు
budget2019-2020

ఆసరా

- తాజా బడ్జెట్‌లో ఆసరా పథకానికి రూ. 9,402 కోట్లు కేటాయించారు. ఇందులో కొంతమొత్తం కేంద్రం అందిస్తుంది. రాష్ట్రంలో 39 లక్షల మందికి పైగా ఆసరా పెన్షన్‌దారులున్నారు. ఎన్నికల హామీ మేరకు జూన్‌ నుంచి వికలాంగులకు రూ. 3016, ఇతరులకు రూ. 2016 ప్రతి నెలా ఇస్తున్నారు. వృద్ధాప్య పింఛన్‌ వయస్సును 65 నుంచి 57కు తగ్గించడంతో పెన్షనర్ల సంఖ్య 7 లక్షలు పెరిగింది. త్వరలో వీరికి పింఛన్‌ అందిస్తామని సీఎం ప్రకటించారు.
budget2019-2021

విద్యుత్‌రంగం


budget2019-2022
- అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఎప్పటికప్పుడు తగిన ఆర్థిక సహకారం అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో విద్యుత్‌ రాయితీలకు రూ.8289.77 కోట్లు కేటాయించింది. గతేడాది తొలుత రూ.4393.50 కోట్లు కేటాయించినప్పటికీ రూ.5338.40 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది దానికంటే ఎక్కువగా రూ.8వేల కోట్లు కేటాయించింది. విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో కరెంట్‌ కొనుగోలు వ్యయం అధికమవుతున్నది.
- గత ఐదేండ్లలో విద్యుత్‌ సంస్థలకు మొత్తం రూ.42632 కోట్లు కేటాయించింది. రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం గత ఐదేండ్లలో రూ. 20925 కోట్లు కేటాయించింది. ఉదయ్‌ పథకం ద్వారా డిస్కంలకు ఉన్న రుణాలు రూ.9695 కోట్లు, సింగరేణికి విద్యుత్‌ సంస్థలు బకాయిపడ్డ రూ.5772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది.
budget2019-2023

సంక్షేమ విభాగం

- పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికంగా, సామాజికంగా ఏండ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమాభివృద్ధికి రూ.7919.96 కోట్లు కేటాయించింది. ఇందులో ఉపకార వేతనాల కోసం రూ.3257 కోట్లు, కళ్యాణలక్ష్మికి రూ.1540 కోట్లు కేటాయించింది.
budget2019-2024
budget2019-2025

రాష్ట్ర రుణభారం

- సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగానికి, విద్యుచ్ఛక్తి రంగాలకు విస్తృత ప్రాధాన్యత ఇస్తుండటంతో రాష్ట్ర రుణభారం భారీగా పెరిగింది. 2015-16లో రూ.93,115 కోట్లు ఉంటే 2019-20లో అవి రూ.2,03,730.10 కోట్లకు చేరుతాయని అంచనావేశారు. ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 21.38 శాతం. దీంతో తలసరి అప్పు రూ.38 వేలు.

పెండింగులో ఉన్న బిల్లులు (కోట్లలో)

- నీటిపారుదల శాఖ 10,000
- వ్యవసాయ శాఖ
రైతుబంధు పథకం 2000
వడ్డీలేని రుణాలు 800
బిందుసేద్యం రుణాలు 200
వ్యవసాయ యంత్రాలు 300
- సంక్షేమశాఖలు
కళ్యాణ లక్ష్మి 800
రాయితీ రుణాల పథకం 253
ఉపకార వేతనాలు 2400
- వైద్యశాఖ 500
- పరిశ్రమల శాఖ 1500
- రోడ్లు భవనాలు 2300
- ఎంఎంటీఎస్‌ రైళ్ల విస్తరణ 350
budget2019-2026
budget2019-2027
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను వరుసగా ఐదుసార్లు ప్రవేశపెట్టారు. రెండోసారి ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఆర్థికమంత్రి లేకపోవడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బడ్జెట్‌కు ఒకరోజు ముందు ఆర్థిక మంత్రిగా టీ హరీష్‌ రావు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

బడ్జెట్‌ పదజాలం

- బడ్జెట్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ, వ్యయాల వివరాలను తెలిపే ద్రవ్య సంబంధ నివేదికను బడ్జెట్‌ అంటారు. పన్ను విధింపు పరిధి, ప్రభుత్వ వ్యయ పరిమాణం, వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు ఇచ్చిన ప్రాముఖ్యతలు, వనరుల కేటాయింపులు, ఆర్థిక వ్యవస్థ స్థితి, కోశ విధానం ద్వారా ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను బడ్జెట్‌ ప్రతిబింబిస్తుంది.
budget2019-2028
- లోటు బడ్జెట్‌: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా చూపే ఆర్థిక నివేదికను లోటు బడ్జెట్‌ అంటారు.
- మిగులు బడ్జెట్‌: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా చూపే ఆర్థిక నివేదికను మిగులు బడ్జెట్‌ అంటారు.
- సంతులిత బడ్జెట్‌: ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, వ్యయాలు సమానంగా ఉండే ఆర్థిక నివేదికను సంతులిత బడ్జెట్‌ అంటారు.
- ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌: బడ్జెట్‌లోని వివిధ పద్దులను పరిశీలించి ఆమోదించడానికి కొంత వ్యవధి అవసరం. కాబట్టి ప్రభుత్వం గ్రాంట్లను ముందుగా పొందే అవకాశాన్ని ఓటాన్‌ అకౌంట్‌ అంటారు.
- శూన్య (జీరో) బడ్జెట్‌: గత సంవత్సర బడ్జెట్‌ అంశాలతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కొత్తగా ఆ ఏడాది అంచనాల ప్రకారం తయారు చేసే బడ్జెట్‌. దీన్ని అమెరికాకు చెందిన పీటర్‌ పైర్‌ ప్రతిపాదించారు. మన దేశంలో 1985-87లో ప్రవేశపెట్టినా అది కొనసాగలేదు.

రాబడులు-చెల్లింపులు వసూళ్లు (కోట్లలో)

- రుణ వసూళ్లు 44.86
- రుణాలు 32,900
- ప్రజా పద్దు 500
- రెవెన్యూ వసూళ్లు 1,13,099.92 ఖర్చులు (కోట్లలో)
- ప్రభుత్వ రుణాల చెల్లింపులు 9,265.77
- అప్పులు, అడ్వాన్సులు 8,896.02
- మూలధన వ్యయం 17,274.67
- రెవెన్యూ వ్యయం 1,11,078.8

ఆదాయ వ్యయ వివరాలు

రెవెన్యూ రాబడి
- రాష్ట్ర పన్నులు, సుంకాలు- 69,328.57
- వడ్డీ వసూళ్లు- 117.98
- పన్నేతర ఆదాయం- 23,934.80
- కేంద్ర పన్నుల్లో వాటా- 19,718.57

రెవెన్యూ వ్యయం
- అభివృద్ధి వ్యయం- 78,027.35
- రుణ సేవలు- 14,584.73
- పాలనా సేవలు- 6,621.67
- పన్ను వసూలు చార్జీలు- 743.43
- ఇతర వ్యయాలు-11,078.86
budget2019-2029
- ప్రభుత్వ రాబడి: పౌరుల ఖర్చు కోసం, పరిపాలన కోసం, పౌరుల నుంచి గ్రహించిన మొత్తాన్ని ప్రభుత్వ రాబడి అంటారు.
- ప్రభుత్వ వ్యయం: దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం, పౌర శ్రేయస్సును రక్షించడం కోసం, అభివృద్ధి చేయడానికి పెట్టిన ఖర్చులను ప్రభుత్వ వ్యయం అంటారు.
- మూలధన వ్యయం: నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యుత్‌ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల వంటి వాటి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు.
- రెవెన్యూ లోటు: రెవెన్యూ వసూళ్లకు రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్న తేడా
- ద్రవ్యలోటు: ప్రభుత్వ ఖర్చులకు రుణేతర రెవెన్యూ మార్గాల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య ఉండే తేడాను ద్రవ్యలోటు అంటారు.
- రెవెన్యూ లోటు: రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే రెవెన్యూలోటు అంటారు.

budget2019-2030

904
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles