ఎన్నికల ఫలితాలను ముందుగానే ఊహించడం?


Wed,September 11, 2019 02:17 AM

election-progress

వైఖరులు-తరగతిగది అన్వయం

-ఏదైనా ఒక భావన లేదా విషయంపై సుముఖత, విముఖతలను తెలిపే సామాన్యీకరణ స్పందనే వైఖరి.
-వైఖరులను మాటల ద్వారా తెలిపేతే అవి వారి ఉద్దేశాలుగా భావించవచ్చు.
-వైఖరులు అనేవి వ్యక్తుల పట్ల, మనుషులు, సిద్ధాంతాలు, దేశాలు, సంఘటనలు, ప్రదేశాలపై ఒక వ్యక్తి ప్రత్యేకంగా కలిగి ఉండే అభిప్రాయాలు.
-ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి- కట్జ్
-ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థపై వ్యక్తి అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రతిస్పందించే ధోరణే వైఖరి- అనస్తాసి
-ఒకానొక పరిస్థితిపై వ్యక్తికి ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతే వైఖరి- ఫ్రీమన్
-వైఖరి అంటే సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రవర్తించే తయారీ లేదా సంసిద్ధత- మెహ్రన్స్
-వైఖరులను పెంపొందించుకోవడంలో వ్యక్తులు, కుటుంబం, సమాజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
-వైఖరుల అభ్యసనానికి వ్యక్తుల్లోని పద్ధతులు, కుటుంబ ఆచార సంప్రదాయాలు, నియమాలు, నమ్మకాలు, ఆచారాలు, కట్టుబాట్లు, జీవన విధానం, నాయకత్వం మొదలైన అంశాలు దోహదం చేస్తాయి.

లక్షణాలు

-వైఖరులు అనువంశికంగా సంక్రమించవచ్చు. అవి అభ్యసనం వల్ల ఏర్పడుతాయి.
-ఒక వైఖరిని అతని బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు.
-వైఖరులు వ్యక్తిలో స్వతంత్రంగా ఉండకుండా, అతని మానసిక శక్తులు, ఉద్వేగాలతో కలిసి పనిచేస్తాయి.
-ఇవి అస్థిరమైనవి. దిశ, తీవ్రత, వ్యాప్తి అనే లక్షణాల ద్వారా ప్రకటితమవుతాయి.
-దిశ: ఎవరైనా ఒక వ్యక్తి ఒక విషయంపై చూపించే సుముఖత లేదా విముఖతే దిశ.
ఉదా: పాశ్చాత్య సంగీతంపై ఒక వ్యక్తికి గల ఇష్టం లేదా అయిష్టం సంగీతంపై అతని వైఖరి దిశను తెలుపుతుంది.
-తీవ్రత: ఏదైనా ఒక విషయంపై వైఖరులు ఎంత బలంగా ఉన్నాయో వైఖరి తీవ్రత నిర్ణయిస్తుంది.
-కెరటం నాకు ఆదర్శం. లేచి, లేచి పడుతున్నందకు కాదు. పడినా మళ్లీ లేస్తున్నందుకు అనే వైఖరిలోని దృఢత్వాన్ని తెలుపుతుంది.
ఉదా : ప్రజాసేవ చేయాలనే దృఢమైన సంకల్పం కలిగిన యువకుడు ఎన్నిసార్లు ఓడినా మళ్లీ ప్రయత్నించి చివరకు విజయం సాధించి తన సొంత జిల్లాకు కలెక్టర్ కావడమనే విషయం అతని వైఖరి తీవ్రతను తెలుపుతుంది.
-వ్యాప్తి: ఒక విషయంపై వివిధ వ్యక్తుల వైఖరుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సూచించేదే వ్యాప్తి.
ఉదా: వర్తమానకాలంలో వెలువడుతున్న సినిమాల ప్రభావం యువతపై ఏ విధంగా ఉంది? అనే అంశంపై పలువురు వెలిబుచ్చిన అభిప్రాయాల అంతరమే ఆ వ్యక్తుల వైఖరుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది.
గమనిక: వ్యాప్తి ద్వారా ఎక్కువ మంది వ్యక్తుల వైఖరులను తక్కువ సమయంలో తెలుసుకోవచ్చు.
-వ్యక్తి విజయం ధనాత్మకత కలిగిన వైఖరి తీవ్రతపైనే ఆధారపడుతుంది.

వైఖరి మాపనులు

-వైఖరులను ముఖ్యంగా మూడు పద్ధతుల ద్వారా మాపనం చేస్తారు. అవి..
1. వైఖరి మాపనులు
ఎ. థర్‌స్టన్ వైఖరి మాపని
(ఈక్వల్లి అప్పియరింగ్ ఇంటర్వెల్ స్కేల్)
బి. లైకర్ట్ వైఖరి మాపని (రేటింగ్ స్కేల్)
సి. బొగార్టస్ సోషల్ డిస్టెన్స్ స్కేలు
డి. గట్‌మన్ స్కేలు (క్యుమిలేటివ్ స్కేల్)
2. సాంఘికమితి (సోషియోమెట్రి లేదా సోషియోగ్రామ్)
3. ప్రజాభిప్రాయ సేకరణ

1. వైఖరి మాపనులు


థర్‌స్టన్ వైఖరి మాపని (తుల్యప్రత్యక్ష విరామాల మాపని)

-1928లో లూయిస్ థర్‌స్టన్ కనుగొన్న పద్ధతి సమానగోచర లేదా తుల్య ప్రత్యక్ష విరామాల మాపని పద్ధతి. 1929లో థర్‌స్టన్, ఈజే కేవ్ కలిసి వైఖరి మాపనాన్ని రూపొందించారు.
-థర్‌స్టన్ స్కేలులో దాదాపు 200 అంశాలు రాసి ఉంటాయి. ఇవి వైఖరుల్లో వివిధ స్థాయిలను మాపనం చేసేవిగా ఉంటాయి.
-ఒక విషయంపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలను సేకరించిన తరువాత వాటిని అనుభవం గల నిర్ణేతలకు ఇస్తారు. వాటిని పూర్తి అనుకూల అంశాల నుంచి పూర్తి ప్రతికూల అంశాలు అనే రెండు వర్గాలుగా ఏర్పరచి మిగిలిన ప్రవచనాలను వాటి నుంచి తొలగిస్తారు. వీటిని 11 ప్రవచనాలుగా మాపనిలో పొందుపరుస్తారు.
-ఈ మాపని సహాయంతో వైఖరులను గణన చేయవచ్చు.
గమనిక: ఈ మాపని ద్వారా వైఖరులను కొలవడం శ్రమతో కూడిన పని.
-మాపనిలో అంశాలు ద్వంద్వార్థం లేనివిధంగా, సంక్షిప్తంగా ఉండాలి.

లైకర్ట్ వైఖరి మాపని

ఈ మాపనిని రెన్సిస్ లైకర్ట్ 1932లో రూపొందించారు. దీన్ని సంకలన నిర్ధారణ మాపని అంటారు.
-వైఖరులను మాపనం చేయడంలో ఇవి విస్తారంగా, విజయవంతంగా వాడుకలో ఉన్నాయి.
-లైకర్ట్ మాపనిలో అంగీకారాన్ని లేదా వ్యతిరేకతను తెలిపే 5 ఐచ్ఛికాలు నిర్దేశితమై ఉంటాయి. అంతర్గతంగా అంశాలు అమర్చి ఉంటాయి. ఇవి వైఖరుల భేదాలను తెలుపుతాయి.
example
-ఈ పద్ధతిలో సులభంగా అంశాలను విశ్లేషణ చేయవచ్చు.
-అభ్యర్థి ఈ ఐదు ఐచ్ఛికాలలో ఏదో ఒకటి ఎంచుకోవాలి.

బొగార్టస్ సోషల్ డిస్టెన్స్ స్కేలు

-ఈఎస్ బొగార్టస్ 1925లో రూపొందించారు.
-ఒక వ్యక్తితో కానీ సమూహంతోకానీ ఒక విషయం ఏ స్థాయివరకు అంగీకారం పొందిందో లేదా తిరస్కరించబడిందో మాపనం చేయడానికి ఈ స్కేలు ఉపయోగపడుతుంది.
-అంగీకారం నుంచి నిరంగీకారం వరకు స్కేలు మీద గణన విలువలు నిర్దేశించి ఉంటాయి.

గట్‌మన్ స్కేలు

-దీన్ని గట్‌మన్ రూపొందించారు. దీన్ని సంచిత నిర్ధారణ మాపని లేదా క్యుమిలేటివ్ స్కేలు అంటారు. ఇది దాదాపు వైఖరి మాపనిని పోలి ఉంటుంది. ప్రస్తుతం ఇది ఎక్కువగా వాడుకలో లేదు. దీన్నే క్యుమిలేటివ్ పద్ధతి అంటారు.

2. సాంఘికమితి

-సాంఘికమితి సాధనాన్ని జేఎల్ మొరినో ప్రతిపాదించారు. అయితే తరగతిగది సన్నివేశంలో విద్యార్థులను అధ్యయనం చేయడానికి జెన్నింగ్ దీన్ని వాడారు.
-ఇతరులపై ఒక వ్యక్తికి గల వైఖరిని తెలుసుకోవడానికి ఈ సాధనాలను వాడుతారు.
-ఒక సమూహంలోని వ్యక్తుల మధ్య ఉండే సాంఘిక సంబంధాలను వర్ణించడానికి ఉపయోగించే సాధనమే సాంఘికమితి- జాన్ డబ్ల్యూ బెస్ట్
-ఇది ఒక సమూహంలో ఆకర్షణ, వికర్షణ, సాంఘిక సంబంధాలను చిత్రరూపంలో చూపించే పద్ధతి. దీన్నే సోషియోగ్రామ్ అంటారు.
ఉదా : ఒక తరగతి విద్యార్థులను ఉదాహరణగా తీసుకుంటే వారిలో ఎక్కువమంది ఇష్టపడే వ్యక్తిని స్టార్ అని, ఎక్కువ మంది వ్యతిరేకించే వ్యక్తిని ఏకాకి (ఐసోలేట్) అని అంటారు.
గమనిక:
-వైఖరుల వల్ల వ్యక్తుల అభిప్రాయాలు తెలుస్తాయి. కాబట్టి వ్యక్తులపై, సమాజంపై ధనాత్మక వైకరులను విద్యార్థుల్లో పెంపొందించాలి.
-పాఠశాల స్థాయిలో విద్యార్థుల వైఖరిలో సత్వర మార్పులను తీసుకురావచ్చు.
-మంచి వైఖరులను పెంపొందించడానికి ఆదర్శవంతులైనవారి జీవిత చరిత్రలను చదివించడం, సమూహంలో తాను కూడా ఒకడిననే భావనను కలిగించడం, ఉపాధ్యాయుడు తాను స్వయంగా సత్ప్రవర్తన కలిగి విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా నిలవడం ముఖ్యమైనవి.

3. ప్రజాభిప్రాయ సేకరణ

-ఈ సేకరణలో భాగంగా ప్రజల అభిప్రాయాలను ప్రశ్నలు అడగడం ద్వారా లేదా ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటారు.
ఉదా: ఎన్నికల ఫలితాలను ముందుగానే ఊహించడం
గమనిక: ఏదైనా ఒక కృత్యాన్ని సాధించడానికి అవసరమయ్యే శక్తిని..
ఇచ్చేది- సహజ సామర్ధ్యాలు
కదిలించేది- అభిరుచులు
వికసింపచేసేది- వైఖరులు.

ప్రాక్టీస్ బిట్స్


1. ఒక ఉపాధ్యాయుడిగా నీ దృష్టిలో వైఖరి అంటే?

1) విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో ఉన్నత స్థాయిని చేరుకోగలిగిన కౌశలం
2) శిక్షణ ద్వారా విద్యార్థిలో వచ్చే ప్రవర్తనా మార్పు
3) ఉపాధ్యాయుని బోధనపై విద్యార్థి ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణి
4) ఇంగ్లిష్ బోధనా తరగతిలో కూర్చోవడానికి విద్యార్థి అభిరుచి చూపడం

2. వైఖరుల పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయుడిగా వైఖరుల లక్షణం కానిదాన్ని గుర్తించండి.

1) అనుకరణ ద్వారా ఏర్పడుతుంది
2) గతిశీలమైనది
3) పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది
4) బాహ్య ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు

3. వైఖరి మాపనుల్లో సరికాని ప్రవచనం?

1) గట్‌మన్- 11 ఐచ్ఛికాలు నిర్దేశితమై ఉంటాయి
2) లైకర్ట్ మాపని- 5 ఐచ్ఛికాలు నిర్దేశితమై ఉంటాయి
3) బొగార్డస్ మాపని- సోషల్ డిస్టెన్స్ స్కేల్
4) థర్‌స్టన్ మాపని- తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి

4. మధు అనే విద్యార్థి ఆంగ్ల బోధనా తరగతిలో కూర్చోవడానికి ఉత్సాహపడటంలో గల అనుకూల ప్రవర్తనకు కారణం?

1) అభిరుచులు 2) వైఖరులు
3) అలవాట్లు 4) సృజనాత్మకత

5. వైఖరులు అంటే?

1) అనిర్దేశకాలు 2) శాశ్వతాలు
3) స్తబ్ధాలు 4) గతిశీలాలు

6. కిందివాటిలో వైఖరి లక్షణం కానిది?

1) వైఖరి నేర్చుకోవాల్సింది 2) శాశ్వతమైనది
3) తీవ్రత ఉంటుంది 4) వైఖరికి దిశ ఉంటుంది

7. సాకేత్ అధిక ప్రజ్ఞావంతుడు. అయినప్పటికీ సాకేత్‌కు సాధన పరీక్షల్లో తక్కువ మార్కులు రావడానికి కారణమైన ఒక సాంఘిక కారకం ఏది?

1) విషయాలపై అభిరుచి లేకపోవడం
2) పాఠశాలపై రుణాత్మక వైఖరి
3) అహంకార భావం
4) నేను సాధించలేను అనే భావన

8. భవ్య అనే అమ్మాయి తన స్నేహితులతో నాకు కూచిపూడి నాట్యం అంటే ప్రాణంకన్నా మిన్న అని చెప్పడంలో ఉన్న వైఖరి లక్షణం ఏది?

1) దిశ 2) తీవ్రత 3) వ్యాప్తి 4) ఆలోచన

9. కింది వాటిని పరిశీలించండి.

ఎ. ఒక విషయం లేదా వ్యక్తి లేదా వస్తువులపై అవధానంను ఎక్కువ కాలం నిలిపే వైఖరి
బి. ఒక విషయంలో ఏదో కృత్యం వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక మానసిక అనుభూతి
సి. వ్యక్తి ప్రవర్తనను ఒక గమ్యానికి నడిపించే ప్రేరణా స్థితిని ఏమంటారు.
1) వైఖరులు 2) అలవాట్లు
3) అభిరుచులు 4) సృజనాత్మకం
answers

siva-palli

564
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles