కరెంట్ అఫైర్స్


Wed,September 4, 2019 02:08 AM

Telangana
Telangana

వన్‌ ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

ప్రీమియం మొబైల్‌ ఫోన్ల తయారీలో ఉన్న చైనాకు చెందిన వన్‌ ప్లస్‌ సంస్థ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌)ను ఆగస్టు 26న ప్రారంభించింది. 1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఐటీ శాఖ మాజీ మంత్రి కే తారకరామారావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. వన్‌ ప్లస్‌ ఫౌండర్‌, సీఈవో పీట్‌ లావ్‌.

టీఎస్‌ఆర్టీసీకి అవార్డు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు క్వాలిటీ సర్కిల్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) అవార్డు లభించింది. హైదరాబాద్‌లో ఆగస్టు 29న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు యాదగిరి, టీవీ రావులకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు టీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది.

National
National

పాఠశాలల కోసం షగున్‌ వెబ్‌సైట్‌

పాఠశాల స్థాయి విద్యను మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన ‘షగున్‌' అనే వెబ్‌సైట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ఆగస్టు 28న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్‌ దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల పాఠశాలలను అనుసంధానం చేశారు. విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఈ పోర్టల్‌ ద్వారా ఆ పాఠశాలలకు అందిస్తారు. వెబ్‌సైట్‌ http://seshagun.gov.in/

ఫిట్‌ ఇండియా ఉద్యమం

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టిపెట్టేందుకు, ఫిట్‌ ఇండియా నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫిట్‌ ఇండియాతోపాటు పసిపిల్లల కోసం ‘పౌష్టికాహార ఉద్యమం’, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ వ్యర్థాల వ్యతిరేక ఉద్యమం’ నిర్వహించనున్నట్లు ఆగస్టు 25న మన్‌కీ బాత్‌లో మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

కిసాన్‌-జవాన్‌ విజ్ఞాన్‌ మేళా

జమ్ముకశ్మీర్‌లోని లేహ్‌లో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఆగస్టు 29న ‘కిసాన్‌-జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’ను నిర్వహించారు. ఈ మేళాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు.

ప్రధానితో ఏడీబీ అధ్యక్షుడు భేటీ

ప్రధాని మోదీతో ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అధ్యక్షుడు టకెహికో నకావో ఆగస్టు 29న భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఏడీబీ అంగీకరించింది.

ఫిరోజ్‌ షా కోట్లాకు అరుణ్‌ జైట్లీ పేరు

ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియానికి దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పేరు పెట్టనున్నట్లు ఢిల్లీ క్రికెట్‌ సంఘం ఆగస్టు 27న నిర్ణయిచింది. ఆయన ఢిల్లీ క్రికెట్‌ సంఘానికి 1999 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు.

International
International

జీ-7 దేశాల సదస్సు

ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి 26 వరకు జీ-7 దేశాల 45వ శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చును ఆర్పడానికి అన్నివిధాలా సాయపడటానికి జీ-7 దేశాలు ముందుకొచ్చాయి. 2.2 కోట్ల అమెరికా డాలర్ల సాయం చేస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. జీ-7లో అమెరికా, ఫ్రాన్స్‌, యూకే, జర్మనీ, జపాన్‌, ఇటలీ, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ ఈ కూటమిలో సభ్యదేశం కానప్పటికీ సమావేశాలకు హాజరవుతుంది. జీ-7 45వ సమావేశానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాని మోదీ హాజరయ్యారు.

ఐఎస్‌ఎస్‌లోకి హ్యూమనాయిడ్‌ రోబో

రోదసిలోకి రష్యా పంపిన తొలి హ్యూమనాయిడ్‌ రోబో ఫెడోర్‌ ఆగస్టు 27న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి విజయవంతంగా ప్రవేశించిందని రష్యా స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రోబోను కజకిస్థాన్‌లోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి సోయజ్‌ ఎంఎస్‌-14 రాకెట్‌ ద్వారా ఆగస్టు 22న రోదసిలోకి పంపారు. సెప్టెంబర్‌ 7 వరకు ఐఎస్‌ఎస్‌లోనే ఈ రోబో ఉంటుంది.

సురక్షిత నగరాల జాబితా

ప్రపంచంలోని 60 సురక్షితమైన నగరాల జాబితా-2019 నివేదికను ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఆగస్టు 29న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం టోక్యో (జపాన్‌) వరుసరగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్‌ 2, ఒసాకా (జపాన్‌) 3, అమస్టర్‌డ్యామ్‌ (నెదర్లాండ్స్‌) 4, సిడ్నీ (ఆస్ట్రేలియా) 5, టొరంటో (కెనడా) 6, వాషింగ్టన్‌ (అమెరికా) 7, కోపెన్‌హెగెన్‌ (డెన్మార్క్‌) 8, సియోల్‌ (దక్షిణ కొరియా) 9, మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా) 10వ స్థానాల్లో నిలిచాయి. భారత్‌లోని ముంబై 45, న్యూఢిల్లీ 52 స్థానాలు దక్కించుకున్నాయి. ఢాకా (బంగ్లాదేశ్‌) 56, కరాచీ (పాకిస్థాన్‌) 57, యాంగూన్‌ (మయన్మార్‌) 58 స్థానాల్లో నిలిచాయి. ఆయా నగరాల్లో సైబర్‌భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతుల వంటి అంశాలపై ఈ ర్యాంకులను ప్రకటించించారు.

పాకిస్థాన్‌ అణు క్షిపణి పరీక్ష

అణు వార్‌హెడ్లను (అత్యధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లే సామర్థ్యమున్న ‘ఘజనవి’ అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆగస్టు 29న పాకిస్థాన్‌ ప్రకటించిది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 290 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని పాకిస్థాన్‌ మిలిటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ తెలిపాడు. పాకిస్థాన్‌ ఈ ఏడాది జనవరిలో ‘నాజర్‌', మేలో ‘షహీన్‌-2’ అనే బాలిస్టిక్‌ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది.

Persons
Persons

పీఎంఎల్‌ఏ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌

నగదు అక్రమ చెలామణి చట్టం (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌-పీఎంఎల్‌ఏ) అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా ఢిల్లీ హైకోర్టు మాజీ జస్టిస్‌ సునీల్‌ గౌర్‌ ఆగస్టు 28న నియమితులయ్యారు. సెప్టెంబర్‌ 23న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

తొలి మహిళా ఫ్లైట్‌ కమాండర్‌

వింగ్‌ కమాండ్‌ షలీజా ధామీ భారత వాయుసేనలో ఫ్లయింగ్‌ యూనిట్‌ ఫ్లైట్‌ కమాండ్‌ హోదాను ఆగస్టు 28న పొందారు. దీంతో ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా కమాండర్‌గా ధామీ నిలిచారు. హెలకాప్టర్లను నడపటంలో 15 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ధామీ తొలి మహిళా ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా గుర్తింపు పొందారు.

‘ఆఫ్ఘన్‌' బ్యాంక్‌ సీఈవోగా హఫీజ్‌

ఆప్ఘనిస్థాన్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా హైదరాబాద్‌ పాతబస్తీ చంచల్‌గూడ్‌కు చెందిన హఫీజ్‌ సయ్యద్‌ మూసా కలీం ఫలాహి ఆగస్టు 28న ఎంపికయ్యారు. ఈ బ్యాంక్‌ ఆఫ్ఘనిస్థాన్‌ దేశవ్యాప్తంగా 58 శాఖల్లో లావాదేవీలు జరుపుతుంది.

తొలి మహిళా డీజీపీ కంచన్‌ మృతి

దేశంలోనే తొలి మహిళా డీజీపీ కాంచన్‌ చౌదరి భట్టాచార్య ఆగస్టు 26న ముంబైలో మరణించారు. 1973 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి అయిన కాంచన్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో జన్మించారు. 2004 నుంచ 2007 అక్టోబర్‌ 31 వరకు ఉత్తరాఖండ్‌ డీజీపీగా పనిచేసి దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. దేశంలో కిరణ్‌ బేడీ తర్వాత రెండో మహిళా ఐపీఎస్‌ అధికారిగా అమె నిలిచారు.

ఏపీ హైకోర్టు సీజే

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి ఆగస్టు 30న సిఫారసు చేసింది. ఆయన ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

Sports
Sports

ఇలవేనిల్‌కు స్వర్ణం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా షూటర్‌ ఇలవేనిల్‌ వలరివాన్‌కు స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఆగస్టు 28న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో ఇలవేనిల్‌ విజేతగా నిలిచింది. సియోనైడ్‌ (బ్రిటన్‌) రజతం,
యింగ్‌ షిన్‌ లిన్‌ (చైనీస్‌) కాంస్యం సాధించారు.

ఆగస్టు 29న జరిగిన పురుషుల 10 మీ. ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ స్వర్ణం సాధించాడు. ఇదే విభాగంలో సౌరభ్‌ చౌదురికి కాంస్యం లభించింది. 50 మీ. త్రీ పొజిషన్‌ విభాగంలో సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజతం సాధించాడు.

ప్రపంచ నైపుణ్య పోటీలు

రష్యాలోని కజన్‌లో ఆగస్టు 22 నుంచి 27 వరకు నిర్వహించిన 45వ ప్రపంచ నైపుణ్య పోటీలను నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో 16 స్వర్ణాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. రష్యా 14 బంగారు పతకాలను సాధించింది. ఈ పోటీల్లో జల సాంకేతికత విభాగంలో ఎస్‌ అశ్వత్థ నారాయణ స్వర్ణం, వెబ్‌ సాంకేతికత విభాగంలో నూతలపాటి ప్రణవ్‌ రజతం, ఆభరణాల విభాగంలో సంజయ్‌ ప్రామాణిక్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో శ్వేత రతనపుర కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో భారత్‌ 2007 నుంచి పాల్గొంటుంది.

అజంతా మెండిస్‌ వీడ్కోలు

శ్రీలంక స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ ఆగస్టు 28న క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక తరఫున 2015లో చివరి మ్యాచ్‌ ఆడాడు. 19 టెస్టుల్లో 70 వికెట్లు, 87 వన్డేల్లో 152 వికెట్లు, 39 టీ20ల్లో 66 వికెట్లు తీశాడు.

Vemula-Saidulu

518
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles