బ్యాంకుల్లో ఆఫీసర్లు


Mon,August 12, 2019 01:46 AM

IBPS PO

ఐబీపీఎస్‌ ద్వారా వాణిజ్య బ్యాంకుల్లో 4336 పీవో పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (సీఆర్‌పీ) ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీలను ఎంపిక చేస్తారు. ఇది మూడంచెల ఎంపిక ప్రక్రియ. సాధారణ డిగ్రీ ఉన్న గ్రాడ్యుయేట్లంతా ఈ పరీక్ష రాయటానికి అర్హులు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఆఫీసర్లుగా స్థిరపడాలన్న ఆకాంక్ష ఉన్నవారికి ఇది చక్కటి అవకాశం. సేవారంగంలో వాణిజ్య బ్యాంకుల ప్రాముఖ్యం, ప్రజల ఆర్థిక అవసరాలను బట్టి పొదుపు, లోన్లు, ద్రవ్య బదిలీ వంటివి సాంకేతికతతో ముడిపడి ప్రజల నిత్యావసరాలను తీర్చడంలో బ్యాంకులు ముందున్నాయి. ప్రస్తుతం వెలువడిన ఐబీపీఎస్‌ పీవో -2019లో 9 బ్యాంకుల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Students-IT
-ఏటా జూన్‌- డిసెంబర్‌ మధ్యలో ఐబీపీఎస్‌- ఆర్‌ఆర్‌బీ, పీవో, క్లర్క్‌ అని మూడు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఇతర బ్యాంకులు (ఎస్‌బీఐ, ఆర్బీఐ, నాబార్డ్‌, మణిపాల్‌ పీజీడీబీఎఫ్‌) జనవరి నుంచి జూన్‌ వరకు ఖాళీలను భర్తీ చేస్తాయి. ఇలా ఏటా రెండులక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగాలు వస్తుంటాయి. ఆరు నెలల ప్రణాళికతో కఠిన సాధన చేస్తే అభ్యర్థి బ్యాంకు ఉద్యోగం సాధించవచ్చు. చక్కటి జీతభత్యాలు, ఉద్యోగ భద్రతతోపాటు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకొనే అవకాశం బ్యాంకు ఉద్యోగాలు కల్పిస్తాయి.

-ప్రస్తుతం వెలువడిన ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ పీవో-2019లో భర్తీ చేయనున్న పోస్టులు అసిస్టెంట్‌ మేనేజర్‌. కాబట్టి దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించేందుకు అభ్యర్థి సిద్ధంగా ఉండాలి. ఇక ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఈ నెల చివరలో నోటిఫికేషన్‌ విదులయ్యే అవకాశం ఉంది.
-ఇప్పటికే ఐబీపీఎస్‌- ఆర్‌ఆర్‌బీ గ్రామీణ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు పీవో నోటిఫికేషన్‌తో మరింత ఉత్సాహంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పరీక్ష విధానం


-పీవో పరీక్ష మూడంచెల విధానంలో ఉంటుంది.
-మొదటి దశ: ప్రిలిమినరీ
-రెండో దశ: మెయిన్స్‌
-మూడో దశ: ఇంటర్వ్యూ
-మొదటి రెండు దశలు ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష ఉంటుంది.

ప్రిలిమినరీ


-100 మార్కులకు ఉండే ఈ పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ). ఈ పరీక్ష సిలబస్‌లో మూడు భాగాలు ఉంటాయి.
నోట్‌: ఈ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
mark

మెయిన్స్‌


-ఈ పరీక్ష 155 ప్రశ్నలతో 200 మార్కులకు ఉంటుంది. ఇది కూడా సీబీటీ పరీక్షే. అయితే మెయిన్స్‌లో అభ్యర్థులు గమనించాల్సిన కీలక అంశం ఈ పరీక్షలో 25 మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానం ఉంటుంది. పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు కంప్యూటర్‌లోనే సమాధానాలు టైప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష సిలబస్‌లో నాలుగు విభాగాలు ఉన్నాయి.
-మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌: ఈ విభాగంలో ఒక వ్యాసం, ఒక లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. దీనికి 30 నిమిషాల సమయం కేటాయించారు. ఈ దశలో కూడా నెగెటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు తగ్గిస్తారు.
mark1

ఇంటర్వ్యూ


-మెయిన్స్‌లో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో మార్కులు ఉండవు కానీ అభ్యర్థికి ఉద్యోగ నిర్వహణకు అవసరమైన లక్షణాలు ఉన్నాయో లేదో అంచనావేస్తారు. అభ్యర్థి విద్యాభ్యాసం, జనరల్‌ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఉంటాయి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌


-ఈ విభాగం ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు దశల్లోనూ ఉంటుంది. దాంతోపాటు మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్‌లో కూడా ఇదే ఉంటుంది. కాబట్టి జనరల్‌ ఇంగ్లిష్‌తోపాటు ఎస్సే, లెటర్‌ రైటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఒకాబులరీ, సెంటెన్స్‌ కరెక్షన్‌, క్లోస్డ్‌ టెస్ట్‌, సెంటెన్స్‌ అరెంజ్‌మెంట్‌ వంటి కీలక విభాగాలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. వీటితోపాటు సినానిమ్స్‌, ఆంటనిమ్స్‌, ఇడియమ్స్‌, ఫ్రేజెస్‌, ప్రిపోజిషన్స్‌ వంటివాటిపై పట్టు ఉంటే మార్కులు చేజారకుండా చూసుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు ఇంగ్లిష్‌లోనే తప్పుతుంటారు. ప్రతి విభాగం, ప్రతి దశలో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి అని గ్రహించాలి.
-అభ్యర్థులు ఇంగ్లిష్‌ విభాగంపై పట్టు సాధించడానికి కొన్ని మెళకువలు పాటించాలి. రోజూ ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవాలి. ఇంగ్లిష్‌ వార్తలు వినడం, మ్యాగజీన్లు చదవడం ద్వారా ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకోవాలి.
-డిస్క్రిప్టివ్‌ పరీక్ష కోసం 15-20 టాపిక్స్‌ను ఎంపికచేసుకొని సాధన చేయాలి. గత ప్రశ్నపత్రాలను తిరిగేయటంవల్ల ఇంగ్లిష్‌ విభాగంలో ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు.

క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌, డాటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌


-ఇది పూర్తిగా అర్థమెటిక్‌ అంశాలతో ఉండే విభాగం. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు దశల్లో ఈ విభాగం నుంచి వేర్వేరు స్థాయి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్‌లో అప్టిట్యూడ్‌ స్థాయి ప్రశ్నలు అధికంగా అడుగుతారు. నంబర్‌ సిరీస్‌, సింప్లిఫికేషన్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డాటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ వంటి చాప్టర్ల నుంచి అధిక ప్రశ్నలు అడుగుతారు.
-మెయిన్స్‌లో డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, పట్టికలు, వెన్‌ డయాగ్రమ్స్‌, లైన్‌గ్రాఫ్‌లు, బార్‌గ్రాఫ్‌, డీఐ వంటివి 60శాతం ప్రశ్నలు ఉంటాయి.
-పర్సంటేజీ, యావరేజీ, భాగస్వామ్యం, శాతాలపై కూడా ప్రశ్నలు ఉంటాయి.
-అభ్యర్థులు పీవో స్థాయి ప్రశ్నలే ఎక్కువ సాధన చేయాలి. నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులు బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ స్థాయి వరకు ప్రశ్నలను సాధన చేయాలి. షార్ట్‌కట్‌ రూల్స్‌ పాటించాలి. ప్రతి అభ్యర్థి ప్రశ్నల స్థాయినిబట్టి సమయపాలన పాటించడం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు. గణితం, అర్థమెటిక్‌ విభాగాలకు ఆన్‌లైన్‌ టెస్టులు ఎక్కువగా సాధన చేయాలి.

రీజనింగ్‌ & కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌


-బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. సిలబస్‌ ఆధారంగా గత ప్రశ్నలు, మోడల్‌ పేపర్లు సాధన చెయడం ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ స్థాయిల్లో ప్రశ్నల కాఠిన్యతను అర్థం చేసుకొని ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ప్రిలిమ్స్‌లో అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది కాబట్టి అందుకు అవసరమైన అంశాలపై దృష్టి పెట్టాలి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సాధించగల విభాగాలైన పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, కోడింగ్‌- డీకోడింగ్‌, డైరెక్షన్‌, రిలేషన్స్‌, సిలాజిసమ్స్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, వెన్‌ డయాగ్రమ్స్‌ అంశాలను చదవాలి.
-మెయిన్స్‌ కోసం కఠినంగా ఉండే అంశాలను సాధన చేయాలి. పై విభాగాల్లో అడ్వాన్స్‌డ్‌ స్థాయి ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేస్తే మంచి స్కోర్‌ చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా స్టేట్‌మెంట్స్‌ సంబంధ ప్రశ్నలు, పజిల్స్‌ ప్రశ్నలు ఎక్కువ వస్తుంటాయి.
-అభ్యర్థులు ఈ విభాగాలపై పట్టు సాధించాలంటే రీజనింగ్‌తోపాటు ఇంగ్లిష్‌పై కూడా దృష్టి పెట్టాలి. ఇందులో చాలావరకు రీడింగ్‌, అనలైజింగ్‌తో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధిస్తే రీజనింగ్‌ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు గుర్తించవచ్చు. సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.

కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌


-ఇది రీజనింగ్‌తో కూడి ఉండి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న విభాగం. అభ్యర్థి పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగం నుంచి కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహనతోపాటు ఇంటర్నెట్‌, యూజర్‌ యాప్‌లు, బ్యాంకు యాప్‌లు, ఏటీఎం పనితీరు, డబ్బు బదలాయింపు, టచ్‌స్క్రీన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌


-బ్యాంకింగ్‌ సేవలు, ఆర్థిక అంశాలు, 15వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌ రిపోర్టులు, 2019 కేంద్ర బడ్జెట్‌, 2018-19 ఆర్థిక సర్వే, ద్వైపాక్షిక అంశాలు, ఆర్థిక సంస్థలు, సదస్సులు, ఆర్బీఐ నూతన పరపతి విధానం, ముఖ్యమైన పాలసీ రేట్లు, బ్యాంకు కార్యకలాపాలు, బాండ్లు వంటి అంశాలతోపాటు 2019 జనగణన, ఆర్టికల్‌ 370, 35ఏ అంశాలు, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు, స్వచ్ఛ భారత్‌, అవార్డులు, ముఖ్య తేదీలు, వార్తల్లో వ్యక్తులు, పుస్తకాలు, రచయితలు, ఇస్రో ప్రయోగాలు, చంద్రయాన్‌, మంగళయాన్‌, తాజా కమిటీలు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
-ఈ విభాగం కూడా అభ్యర్థికి ఎక్కువ మార్కులు సాధించడానికి వీలు కల్పిస్తుంది. అభ్యర్థి గత 5-6 నెలల కరంట్‌ అఫైర్స్‌ అంశాలను చదవాలి. ఇందుకోసం ఆంగ్ల దినపత్రికలు, మాస పత్రికలను చదివి సొంత నోట్స్‌ తయారు చేసుకోవాలి. ప్రతిరోజూ ఆన్‌లైన్‌ ప్రశ్నపత్రాలు సాధన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.

నోటిఫికేషన్‌ వివరాలు


-ఐబీపీఎస్‌ సీఆర్పీ పీవో/ఎంటీ 9-2019
-మొత్తం ఖాళీలు 4336 (పీవోలు)
-విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
-వయసు: 20- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100, ఇతరులకు రూ.600
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్ష కేంద్రాలు:


-ప్రిలిమ్స్‌: రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఏపీలో అన్ని జిల్లా కేంద్రాల్లో
-మెయిన్స్‌: హైదరాబాద్‌, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు
-ముఖ్య తేదీలు: దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 28
-ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 12, 13, 19, 20
-మెయిన్స్‌ : నవంబర్‌ 30
-ఇంటర్వ్యూ: 2020 జనవరి / ఫిబ్రవరి
-తుది ఎంపిక జాబితా విడుదల: 2020 మార్చి
-ఈ జాబితా వ్యాలిడిటీ కాలం: 2020 నుంచి 2021 వరకు
బ్యాంకుల వారీగా ఖాళీలు
-కెనరా బ్యాంకు 500
-ఇండియన్‌ బ్యాంకు- 493
-అలహాబాద్‌ బ్యాంకు- 500
-ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌- 300
-యూకో బ్యాంకు- 500
-యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 644
-బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర- 350
-బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 899
-కార్పొరేషన్‌ బ్యాంకు- 150

ఇలా సాధన చేయండి


Foundation
-బ్యాంకు ఉద్యోగాల ప్రకటనలు క్రమం తప్పకుండా జారీ అవుతుంటాయి. కాబట్టి ఈ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఒక కామన్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌ను పాటించాలి. తమకు అనువైన సమయాన్నిబట్టి చక్కటి ప్రణాళికతో సాధన చేయాలి. పీవో పరీక్ష కఠినంగా ఉంటుంది. అందువల్ల అభ్యర్థి సాధన కూడా అదే స్థాయిలో ఉండాలి. సిలబస్‌ను ఆకళింపు చేసుకున్న తర్వాత ముందుగా కఠిన విభాగాలు, చాప్టర్లపై దృష్టి పెట్టాలి. సొంతంగా ఒక ప్రిపరేషన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకొని దానిని అనుసరిస్తూ చదవాలి. అలా కష్టపడితే పీవో ఉద్యోగం సాధించడం తేలికవుతుంది. అన్ని బ్యాంకు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆయా పరీక్షలకు వేర్వేరుగా చదవకూడదు. దాదాపు కామన్‌ సిలబస్‌ ఉంటుంది కాబట్టి సమీకృతంగా సిద్ధమైతే సమయం కలిసి వస్తుంది. అయితే, ఆన్‌లైన్‌ టెస్టు సాధన సమయంలో ఆయా పరీక్షల్లో గత ప్రశ్నల సరళినిబట్టి మోడల్‌ పేపర్లు సాధన చేయాలి.

కొన్ని మెళకువలు


1. బ్యాంకు పరీక్షలు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించాలి.
2. ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం 8-10 గంటలు సాధన చేయాలి. 3. అర్థమెటిక్‌ అంశాల కోసం షార్ట్‌కట్స్‌ రూల్స్‌, స్కేర్స్‌, క్యూబ్స్‌, పర్సంటేజీ, యావరేజెస్‌పై పూర్తిగా పట్టు సాధించఢంవల్ల మిగతా చాప్టర్లు సులువుగా అర్థం చేసుకోవచ్చు.
Madhu-kiran

541
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles