తెలంగాణకు రక్షణలతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం


Wed,July 31, 2019 01:38 AM

తెలంగాణ ఉద్యమ చరిత్ర


గతవారం తరువాయి

పెద్దమనుషుల ఒప్పందం

12. మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60 శాతం, తెలంగాణ నుంచి 40 శాతం మేరకు మంత్రులు ఉండాలి. అయితే తెలంగాణకు చెందిన వారిలో ఒకరు ముస్లిం ఉండాలి.
13. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందినవారైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణ నుంచి, తెలంగాణ వ్యక్తి సీఎం అయితే ఉపముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉండాలి. అదేవిధంగా హోం, ఆర్థికశాఖ, రెవెన్యూ, ప్రణాళికలు-అభివృద్ధి వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖల్లో రెండింటిని తెలంగాణ మంత్రులకు కేటాయించాలి,
-1962వరకు తెలంగాణకు ప్రత్యేకంగా ప్రదేశ్ కాంగ్రెస్ ఉండాలని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. దీనికి ఆంధ్రా కాంగ్రెస్ అభ్యంతరం తెలపలేదు.
-అయితే ఈ అంశాలన్నింటిని 1956, ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో ఇరు ప్రాంతాల పెద్దలు అంగీకరించారు. కానీ రెండు అంశాలపై అంగీకారం కుదరలేదు. అవి..
-కొత్త రాష్ర్టానికి పేరు: ముసాయిదా బిల్లులో ప్రస్తావించినట్లు ఆంధ్ర-తెలంగాణగా ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. సుయక్త సెలెక్ట్ సంఘం సవరించినట్లు ఆంధ్రప్రదేశ్‌గా ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు కోరారు.
-హైకోర్టు: హైదరాబాద్‌లో ప్రధానస్థానం ఉండి దాని ఒక బెంచి గుంటూరులో ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. గుంటూరులో బెంచి ఉండనక్కరలేదని మొత్తం హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు కోరారు.
Map

నివాస నిబంధనలు

-తాత్కాలికపు ఏర్పాటుగా ఐదేండ్ల కాలానికి తెలంగాణ ప్రాంత సబార్డినేట్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ విషయంలో తెలంగాణను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉత్పన్నమైన నివాసపు షరతులకు అనుగుణంగా ఉన్నవారితో భర్తీ చేయడానికి కేటాయించాలి.

ఉర్దూ భాష స్థాయి

-రాష్ట్రంలో పరిపాలనా న్యాయ వ్యవస్థల్లో ఉర్దూ భాషకు ఉన్న స్థానాన్ని ఐదేండ్లపాటు కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి.

కొత్త రాష్ట్రంలో అదనంగా ఉన్న ఉద్యోగాల రిట్రెంచ్‌మెంట్

-ఉద్యోగాల్లో ఉన్నవారిని తొలగించాల్సి వస్తుందని, రిట్రెంచ్‌మెంట్ అవసరమవుతుందని, భారత ప్రభుత్వం భావించడం లేదు. ఎటువంటి వడపోత కార్యక్రమాలు లేకుండానే హైదారబాద్ రాష్ట్ర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ఉద్యోగాల్లోకి సాధ్యమైనంత వరకు చేర్చుకోవాలన్నది ఉద్దేశం. ఒకవేళ రిట్రెంచ్‌మెంట్ అవసరమైతే యావత్ విశాల రాష్ట్ర ఉద్యోగులందరికి అది ఒకే తీరున వర్తించేట్లు చూడబతుంది.

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య ఖర్చు పంపిణీ

-రాష్ట్రంలోని ఆర్థిక వనరులను బట్టి ఖర్చును కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభల అధికారంలోని వ్యవహారం, అయితే కేంద్రీయ సాధారణ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి కొత్త రాష్ట్రపు ఖర్చులను రెండు ప్రాంతాల మధ్య నిష్పత్తి ప్రకారం భరించి తెలంగాణ ఆదాయంలో మిగులును ఆ ప్రాంతం అభివృద్ధికే కేటాయించాలని, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల ప్రతినిధులు అంగీకరించారు. కాబట్టి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం పాటించవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని భారత ప్రభుత్వం ఉద్దేశిస్తుంది. ఇది అమలుపర్చాలని కూడా భారత ప్రభుత్వం ఆశిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం

-1956, నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. (1956, ఆగస్టు 31న చేసిన ది స్టేట్స్ రీ-ఆర్గనైజేషన్ చట్టం-1956ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది) ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ప్రధాని నెహ్రూ శాసన సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
-ఇండియాలో జరుగుతున్న మార్పుల్లో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అత్యంత ప్రధానమైనది బొంబాయి, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ర్టాలు మరికొన్ని ఏర్పడిన మాట కూడా నిజమే. అవికూడా పెద్ద మార్పులే అయినా అన్నిటికంటే పెద్ద మార్పు రాజకీయంగానే కాకుండా మానసికంగా కూడా ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే అని నా అభిప్రాయం. అప్పటి ప్రధాన సంస్థానాల్లో పెద్దది భారతదేశ పటం నుంచి తొలగిపోయింది. దానిలో మూడు భాగాలు మూడు రాష్ర్టాల్లో చేరిపోయాయి. అన్నిటిలోకి పెద్దభాగం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన భాగంగా అంతర్లీనమైంది. (ఆంధ్రప్రభ 1956, నవంబర్ 3)

నెహ్రూ వ్యాఖ్యలపై విశ్లేషణ

-1956కు ముందు మనం చరిత్రను పరిశీలిస్తే, అనేక సందర్భాల్లో ప్రధాని నెహ్రూ హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషలు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలతో దక్కనీ సంస్కృతితో భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని, దీన్ని విచ్ఛిన్నం చేయడం తనకే మాత్రం ఇష్టం లేదని సమావేశాల్లో, పత్రికల వారితో, పార్లమెంటులో, నాయకులతో అన్నారు. దానికి భిన్నంగా హైదరాబాద్ విచ్ఛిన్నం హైదరాబాద్ పేరుతో మిగిలిన తెలంగాణ రాష్ట్రం ఉనికిని, అస్థిత్వాన్ని రూపుమాపి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం నెహ్రూకు మానసిక ఆనందాన్ని కలిగించింది ఎందుకు? దీనికి కారణం ఒక్కటే.. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో నిజాం ప్రభుత్వం 1948లో హైదరాబాద్‌పై భారత సైన్యాల దాడి, దురాక్రమణపై దాఖలు చేసిన ఫిర్యాదు 1956, నవంబర్ 1 నాటికి కూడా సజీవంగా ఎజెండాలో ఉండటమే. ఐక్యరాజ్య సమితి విధానాల పరిధిలో పరిశీలిస్తే 1948 నాటికి హైదరాబాద్ ఒక స్వతంత్రమైన దేశం.
-అప్పటి హైదరాబాద్ హైకోర్టు 12 మంది తెలంగాణ బిడ్డలకు ఉరిశిక్షలు ఖరారు చేయగా బాధితులు దానిపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ఆ కేసులో సుప్రీంకోర్టు హైకోర్టు శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పిన కాలంలో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో అంతర్భాగం కాదు. కాబట్టి రిపబ్లిక్ అవతరణకు ముందు కాలంలో ఇచ్చిన హైదరాబాద్ హైకోర్టు తీర్పులపై తమకు అప్పిలేట్ అధికారం లేదని కేసును కొట్టివేసింది.

తెలంగాణ రక్షణలు

-ఆగస్టు 10న హోంశాఖ సహాయమంత్రి బీఎన్ దాతర్ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఇదే అంశానికి సంబంధించి భారత ప్రభుత్వం పంపిన నోటు ఆంధ్ర అసెంబ్లీ సభ్యులకు కూడా ఇదే రోజున అందించారు. ఈ ప్రకటన నోటులోని అంశాలు..
-ఈ లోపు ఉభయ పక్షాల వారు పరస్పర ఆమోదంతో ఏదైనా మార్పులు చేసుకుంటే తప్ప ఈ ఒడంబడిక పదేండ్ల వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పునఃపరిశీలన జరుగుతుంది. తెలంగాణ ప్రాంతానికి ప్రతిపాదించిన రక్షణల పత్రం వివరాలతో...
-ప్రాంతీయ స్థాయి సంఘం: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి మొత్తం ఒక శాసనసభ ఉంటుంది. యావత్తు రాష్ర్టానికి అదే చట్టాలు చేసే వ్యవస్థగా ఉంటుంది. రాష్ర్టానికి ఒక గవర్నర్ ఉంటారు. మొత్తం పరిపాలనారంగంలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తున్న మంత్రుల మండలి గవర్నర్‌కు సలహాలిస్తూ సహాయపడుతుంది.
-కొన్ని ప్రత్యేక విషయాల్లో ప్రభుత్వం మరింత సులువుగా వ్యవహారాలు నిర్వహించడానికి తెలంగాణను ఒక ప్రాంతంగా పరిగణిస్తారు.
-తెలంగాణ ప్రాంతానికి గాను ఒక ప్రాంతీయ స్థాయి సంఘం ఉంటుంది. తెలంగాణ ప్రాంత మంత్రులతో సహా తెలంగాణ శాసన సభ్యులు అందులో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి అందులో సభ్యులు కారు.
-ప్రత్యేక విషయాలకు సంబంధించిన శాసనాలను ప్రాంతీయ సంఘానికి నివేదిస్తారు. ప్రత్యేక విషయాలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ శాసన చర్యకుగాను ప్రాంతీయ సంఘం సూచించవచ్చు. లేదా రోజువారి వ్యయానికి అవసర వ్యయానికి, సంబంధించినవి కాకుండా ఉన్న ఆర్థిక బాధ్యతలకు చెందిన సాధారణ ప్రభుత్వ విధానాల విషయాల్లో కూడా ప్రాంతీయ సంఘం ప్రతిపాదనలు చేయవచ్చు.
-ప్రాంతీయ సంఘం ఇచ్చిన సలహాలను మామూలుగా ప్రభుత్వం, రాష్ట్ర శాసన సభ ఆమోదిస్తాయి. అభిప్రాయ భేదం వస్తే గవర్నరుకు నివేదించాలి.
Kavulu

-ప్రాంతీయ సంఘం దిగువ అంశాలను పరిశీలిస్తుంది..
ఎ. రాష్ట్ర శాసనసభ సాధారణాభివృద్ధి ఫలితాలు, విధానాలకు సంబంధించి రూపొందించిన చట్టానికి లోబడిన అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక వ్యవహారాలు.
బి. స్థానిక స్వపరిపాలనా వ్యవహారాలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ల రాజ్యాంగాధికారాలు, అభివృద్ధి, ట్రస్టులు, జిల్లా బోర్డులు, స్థానిక స్వపరిపాలన లేదా గ్రామ పరిపాలనా వ్యవహారాలకు చెందిన ఇతర అధికారాలు.
సి. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక దవాఖానలు, చికిత్సశాలలు.
డి. ప్రాథమిక, మాధ్యమిక విద్య.
ఇ. తెలంగాణ ప్రాంతంలో విద్యాసంస్థలకు ప్రవేశాలను క్రమపరచడం.
ఎఫ్. మద్యనిషేధం
జి. వ్యవసాయ భూముల అమ్మకం.
హెచ్. కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు.
ఐ. వ్యవసాయ సహకార సంఘాలు, అంగళ్లు.

503
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles